• facebook
  • whatsapp
  • telegram

శివాజీ పరిపాలనా విధానం

  శివాజీ మధ్యయుగ భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. తన తండ్రి నుంచి వారసత్వంగా పొందిన పూనా జాగీరు అధిపతిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. శివాజీ ఆత్మస్థైర్యం, పట్టుదల, ధైర్యసాహసాలతో తన అధికారాన్ని పెంపొందించుకున్నాడు. చివరకు స్వరాజ్యం పేరుతో మహారాష్ట్రుల కోసం సొంత రాజ్యాన్ని స్థాపించాడు. మరాఠా రాజ్య ప్రధాన లక్ష్యం హిందూ ధర్మ పరిరక్షణ.

  శివాజీకి 1674 లో రాయ్‌గఢ్‌లో ఛత్రపతిగా పట్టాభిషేకం జరిగింది. ఇతడు కేంద్రీకృత పరిపాలనను ప్రవేశపెట్టాడు. ఇతడు ప్రవేశపెట్టిన పరిపాలనా వ్యవస్థ స్వరాజ్యానికే పరిమితమైంది. ఇతడి రాజ్యంలో వంశపారంపర్య, నిరంకుశ రాజరికం అమలులో ఉన్నప్పటికీ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పాలించాడు. శివాజీ ధర్మశాస్త్రాలకు అనుగుణంగా పరిపాలించి, ప్రజల మన్ననలను పొందాడు. శివాజీకి పరిపాలనలో సహాయపడడానికి ఎనిమిదిమంది మంత్రులతో కూడిన అష్ట ప్రధానులు ఉండేవారు. అయితే మంత్రి మండలి సలహాలను తప్పకుండా పాటించాలనే నిబంధన లేదు.

 

అష్ట ప్రధానుల విధులు

i) పీష్వా లేదా ముఖ్య ప్రధాన్ - ప్రధానమంత్రి: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల పనితీరును పర్యవేక్షించడం.

ii) అమాత్యుడు లేదా మజుందార్ - ఆర్థిక మంత్రి: ఆదాయ, వ్యయాల పట్టికను తయారు చేయడం.

iii) మంత్రి లేదా వకియానావిస్ - హోంమంత్రి: శాంతిభద్రతలను పరిరక్షించడం.

iv) సుమంత లేదా గబీర్: విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించడం.

v) సచివుడు లేదా సుర్‌నావిస్: అంతరంగిక వ్యవహారాల మంత్రి.

vi) పండిత్‌రావ్ లేదా దానాధ్యక్షుడు: దానధర్మాలు, విద్యాపోషణ, ధార్మిక సంస్థల నిర్వహణ.

vii) సేనాపతి లేదా సర్ ఇ నౌబత్ - ముఖ్య సేనాధిపతి: సైన్యాన్ని సమీకరించడం, యుద్ధంలో సైన్యాన్ని నడిపించడం.

viii) న్యాయాధీశ్ - ప్రధాన న్యాయమూర్తి: సివిల్, క్రిమినల్, సైనిక, రెవెన్యూ కేసులలో తీర్పులు ఇవ్వడం.

* పండిత్‌రావు, న్యాయాధీశ్‌లు తప్ప మిగిలిన మంత్రులు అవసరమైన సమయంలో యుద్ధంలో పాల్గొనాలి. శివాజీ కాలంనాటి మరాఠా పరిపాలనా విధానంలో పౌర, సైనిక శాఖల మధ్య వ్యత్యాసం ఉండేది కాదు. ఇది శివాజీ పాలనలో ప్రధాన లోపం. 

* తన శాఖాపరమైన బాధ్యతలను నిర్వహించడంలో ప్రతి మంత్రికి సహాయ పడటానికి 8 మంది సహాయకులు ఉండేవారు. వారు దివాన్, మజుందార్, ఫత్నిస్, సబ్నిస్ లేదా దఫ్తార్‌దార్, కార్ఖానీస్, చిట్నిస్, జందార్, పొట్నిస్ - వీరందరినీ రాజే స్వయంగా నియమించేవాడు. రాజ్యంలో పద్దెనిమిది శాఖలు ఉండేవి. వీటిని మంత్రులు రాజు సలహామేరకు పర్యవేక్షించేవారు.

 

రాష్ట్ర, స్థానిక పరిపాలన:

శివాజీ తన స్వరాజ్యాన్ని మూడు రాష్ట్రాలుగా విభజించి, వాటిని వైస్రాయిల ఆధీనంలో ఉంచాడు. రాష్ట్రాలను కొన్ని జిల్లాలతో కూడిన ప్రాంతాలుగా విభజించి, వాటిని ముఖ్య దేశాధికారి ఆధీనంలో ఉంచాడు. ప్రాంతాలను తరఫ్‌లుగా విభజించి, వాటిని హవాల్దార్ లేదా తరఫ్‌దార్ ఆధీనంలో ఉంచాడు. తరఫ్‌లను గ్రామాలుగా విభజించాడు. గ్రామాలకు అధిపతి పాటిల్. ఇతడికి సహాయపడటానికి ఒక పంచాయతీ ఉండేది. పట్టణాలకు అధిపతి కొత్వాల్. ఈ పరిపాలన విధానం కొద్ది మార్పులతో మరాఠా యుగం అంతా కొనసాగింది.

 

రెవెన్యూ విధానం: 

*అహ్మద్‌నగర్ రాజ్యంలో మాలిక్ అంబర్ అనుసరించిన రెవెన్యూ విధానాన్నే శివాజీ అనుసరించాడు. స్వరాజ్యంలోని రాష్ట్రాలను శిస్తు వసూలుకోసం ప్రాంతాలుగా విభజించాడు. ఒక ప్రాంతంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలు ఉండేవి. సాహు కాలంలో ఈ ప్రాంతాల సంఖ్య 37 గా ఉండేది. జిల్లాల్లో వారసత్వ రెవెన్యూ అధికారులైన పాటిల్, కులకర్ణి, దేశ్‌ముఖ్, దేశ్‌పాండేల వ్యవస్థను శివాజీ రద్దు చేశాడు. శిస్తు వసూలు చేసే బాధ్యతను తాను స్వయంగా నియమించిన అధికారులకు అప్పగించాడు. ప్రాంతానికి బాధ్యుడైన అధికారిని సుబేదార్, కర్కూన్ లేదా ముఖ్య దేశాధికారి అని పిలిచేవారు. కొన్ని సందర్భాల్లో అనేక ప్రాంతాల పర్యవేక్షణ కోసం సర్ సుబేదార్‌లను నియమించేవారు.

* భూమిని కతి అనే కొలబద్దతో సర్వే చేసి, భూమికి సంబంధించిన రికార్డులను జాగ్రత్తగా నిర్వహించేవారు. భూమిశిస్తు పండిన పంటలో 30% గా నిర్ణయించారు. ఇతర పనులన్నీ రద్దుచేసిన తర్వాత దాన్ని 40% కు పెంచారు. రైతులు భూమి శిస్తును ధన రూపంలో లేదా ధాన్య రూపంలో చెల్లించే అవకాశం ఉండేది. తాను ఎంత శిస్తు చెల్లించాలో రైతుకు ముందే తెలుసు కాబట్టి చెల్లింపులకు సంబంధించి రైతుల్లో సందిగ్ధత ఉండేది కాదు. 

* శివాజీ వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహించాడు. కరవు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ధాన్యం, విత్తనాల కొనుగోలుకు అవసరమైన ధనాన్ని ప్రభుత్వమే ఇచ్చి, వారి చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి కంతుల వారీగా తిరిగి చెల్లించమని కోరేవాడు.

 

చౌత్, సర్దేశ్‌ముఖి: 

మరాఠాల శిస్తు విధానంలో చౌత్, సర్దేశ్‌ముఖిలు రెండు ముఖ్యమైన పన్నులు. రనడే అభిప్రాయంలో చౌత్ అనేది ఇతరుల దాడుల నుంచి ప్రజలను కాపాడేందుకు వారు చెల్లించే సైనిక పన్ను. ఇది మొత్తం రెవెన్యూలో 1/4 వ వంతుగా ఉండేది.

*  సర్దేశ్‌ముఖి అనేది మహారాష్ట్ర వారసత్వ సర్దేశ్‌ముఖ్ హోదాలో శివాజీ ప్రజల నుంచి అదనంగా వసూలు చేసిన 10% పన్ను. చౌత్, సర్దేశ్‌ముఖి అనే రెండు పన్నులను శివాజీ తన స్వరాజ్య వెలుపలి భూభాగాల నుంచి వసూలు చేసినట్టు తెలుస్తుంది.

 

న్యాయ పాలన: 

శివాజీ కాలంలో న్యాయపాలన నిష్పక్షపాతంగా ఉండేది. మధ్యవర్తిత్వం ద్వారా కొన్ని కేసులను పరిష్కరించేవారు. గ్రామాల్లో న్యాయ పరిపాలనను గ్రామ పంచాయతీల ద్వారా నిర్వహించేవారు. 

*  గ్రామ పంచాయతీల్లో అన్ని కులాలు, వృత్తులవారికి ప్రాతినిధ్యం ఉండేది. ఆచారాలు, సాంప్రదాయాల ఆధారంగా తీర్పులు ఇచ్చేవారు. అనాగరికమైన శీల పరీక్ష (trail by ordeal) అమల్లో ఉండేది. రాజకీయ ఖైదీలను చాలా క్రూరంగా శిక్షించేవారు. మిగతా కేసుల్లో శిక్షలు సాధారణంగా ఉండేవి. మరణశిక్ష అమల్లో లేదు.

 

సంక్షేమ కార్యక్రమాలు

శివాజీ ప్రజల స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాడు.

 

వాటిలో ముఖ్యమైనవి...

* రోడ్లను నిర్మించి, బావులను తవ్వించాడు. ప్రజల సంక్షేమం కోసం వంతెనలు నిర్మించాడు.

*  బలవంతపు పెళ్లిళ్లు చట్టబద్ధమైనవి కావని పేర్కొన్నాడు.

* వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాడు.

* వరకట్నం, పెళ్లి సమయంలో ఎక్కువ మొత్తంలో ధనాన్ని వసూలు చేయడాన్ని నిషేధించాడు.

* మద్యపాన నిషేధాన్ని అమలు చేశాడు.

* వడ్డీ వ్యాపారులు తక్కువ వడ్డీ వసూలు చేసేలా చర్యలు తీసుకున్నాడు.

* వెట్టిచాకిరిని నిషేధించాడు.

ఈ విధంగా శివాజీ మహారాష్ట్ర చరిత్రలో గొప్ప పాలకుడిగా, మధ్యయుగ భారతదేశ చరిత్రలో గొప్ప పాలకుల్లో ఒకడిగా స్థానం సంపాదించాడు. శివాజీ గొప్ప యుద్ధ వీరుడిగా, మంచి పరిపాలనాదక్షుడిగా పేరుపొందాడు. 

 

సైనిక వ్యవస్థ

శివాజీ సైనిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపాడు. అశ్వక దళానికి అధిపతిగా సర్-ఇ-నౌబత్ వ్యవహరించేవాడు. 

* అశ్వక దళాన్ని రెండు భాగాలుగా విభజించారు. 1) బర్గిస్, 2) సిలాదార్లు. మొదటి రకం సైనికులకు కావలసిన ఆయుధాలు, జీతం ప్రభుత్వమే చెల్లించేది. రెండో రకం సైనికులకు కావలసిన ఆయుధాలను వారే సమకూర్చుకోవాలి. అయితే సర్వీసుకు ప్రతిఫలంగా ప్రభుత్వం ఒక నిర్ణయించిన మొత్తాన్ని వారికి చెల్లిస్తుంది.

* శివాజీ సైన్యంలో 1260 ఏనుగులు, 1500 ఒంటెలు ఉండేవి. వీటిని సైనికులకు కావలసిన వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగించినట్లు తెలుస్తోంది. సరకులు, ఆయుధాల రవాణా శివాజీ ప్రత్యక్ష నియంత్రణలో జరిగేది. శివాజీ సైన్యంలో ఫిరంగి దళం కూడా ఉండేది. శివాజీ కొలాబ కేంద్రంగా శక్తిమంతమైన నావికాదళాన్ని ఏర్పాటు చేశాడు. కోటల నిర్వహణలో కూడా శివాజీ ప్రత్యేక శ్రద్ధ వహించాడు.

 

సైనిక వ్యవస్థలో ముఖ్య అంశాలు:

* శివాజీ గొరిల్లా యుద్ధ విద్యలను అనుసరించాడు. మరాఠా ప్రాంతం భౌగోళిక పరిస్థితులు దీనికి తోడ్పడ్డాయి. అఫ్జల్‌ఖాన్, షయిస్తఖాన్‌పై విజయాన్ని సాధించడానికి గొరిల్లా యుద్ధం శివాజీకి ఎంతగానో ఉపయోగపడింది.

* ఎలాంటి తారతమ్యం చూపకుండా హిందు, ముస్లింలకు సైన్యంలో ఉద్యోగాలు కల్పించాడు.

* సైనికులకు జీతాలు ధన రూపంలో చెల్లించాడు. జాగీర్దారీ విధానాన్ని రద్దు చేశాడు.

* సైనిక శిబిరంలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చాడు. స్త్రీలు, స్త్రీ సేవకులు, నాట్యగత్తెలు, సంగీత విద్యాంసులను యుద్ధ సమయాల్లో సైనిక శిబిరంలోకి అనుమతించేవారు కాదు. శత్రురాజ్యాల స్త్రీలకు, పిల్లలకు శివాజీ రక్షణ కల్పించాడు.

* శివాజీ స్వరాజ్య స్థాపన ద్వారా స్వాతంత్య్రం, జాతీయత అనే సందేశాన్ని భారతదేశంలో ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చేశాడు. శివాజీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అతడి సమానత్వ భావనలు, పోరాట పటిమ, పరిపాలన సంస్కరణలు అతడికి ఎంతో కీర్తిని సంపాదించి పెట్టాయి.

Posted Date : 14-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌