• facebook
  • whatsapp
  • telegram

విజయం.. ఇలా సాధ్యం!

ఏపీ-ఈఏపీసెట్‌ టాప్‌ ర్యాంకర్ల ప్రిపరేషన్‌ విధానాలు

ప్రవేశపరీక్షల్లో ఒక్కో విద్యార్థిదీ ఒక్కో విధమైన సన్నద్ధతా సరళి. దాన్ని ప్రణాళికాబద్ధంగా అమలుచేసిన వారే విజయతీరాలకు చేరగలరు. అలాంటి క్రమశిక్షణ, పట్టుదలతో ఈఏపీసెట్‌లో సత్తాచాటారు ఈ విద్యార్థులు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌ ఫార్మసీ విభాగాల్లో రాష్ట్రస్థాయిలో తొలి ర్యాంకులు కైవసం చేసుకున్నారు బోయ హరేన్‌ సాత్విక్, వజ్రాల దినేష్‌ కార్తిక్‌లు. ఈ విజయానికి కారణాలేంటో, పరీక్షల్లో తాము పాటించిన మెలకువలేంటో, వారి మాటల్లోనే...

రోజుకు 15 గంటలు చదివా...

ఈఏపీసెట్‌లో 155.57 మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ వచ్చిందని తెలియగానే చాలా సంతోషం కలిగింది. ఈ విజయం కోసం నేను చాలా కష్టపడి చదివాను. గుంటూరులోని భాష్యం కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేశాను. ఈఏపీసెట్, నీట్‌ కోసం కాలేజీలో శిక్షణ ఇచ్చేవారు. మా అధ్యాపకుల మార్గనిర్దేశకత్వంలో నా సన్నద్ధత కొనసాగింది. సగటున రోజుకు 13 నుంచి 15 గంటలు చదివాను.

ఈ పరీక్షకు సంబంధించి అకాడెమీ పుస్తకాలను పూర్తిగా చదువుకున్నాను. కొన్ని టాపిక్స్‌కు అదనంగా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అవసరాన్ని బట్టి రిఫర్‌ చేశాను. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అంటే ఎక్కువగా చదివి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలుంటాయి కాబట్టి మర్చిపోకుండా ఎప్పటికప్పుడు రివిజన్‌ చేశాను. అలా చేయకపోతే రోజులు గడిచేకొద్దీ పాత టాపిక్స్‌ గుర్తుండవు. రెండో ఏడాది పరీక్షలు అయిపోగానే ప్రవేశపరీక్షలకు సన్నద్ధం కావడం మొదలుపెట్టాను. సిలబస్‌ అదే కావడం వల్ల ఎక్కువగా నమూనా పరీక్షలు రాయడానికే ప్రాధాన్యం ఇచ్చాను. ఒక్కోసారి రోజుకు 4 పరీక్షలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి! ఏ ప్రశ్నకైనా తప్పు జవాబు రాస్తే అలా ఎందుకు జరిగిందో మళ్లీ ఒకసారి పరిశీలించుకుని సరిచేసుకునేవాడిని.

ఫిజిక్స్‌ ఇలా...

ఫిజిక్స్‌ కోసం పాఠ్యపుస్తకాలతోపాటు వివిధ విద్యాసంస్థల మెటీరియల్‌ కూడా చూశాను. సాధారణంగా ఈ సబ్జెక్టులో ఎప్పుడూ సిలబస్‌ దాటి ప్రశ్నలు అడగరు. కానీ సిలబస్‌లో ఉన్న అంశాలపై ఎంత లోతుగా అయినా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దానికి తగినట్టే టాపిక్‌ను బాగా అర్థం చేసుకుని చదువుకోవాలి. అప్పుడే ఫిజిక్స్‌ సరిగ్గా గుర్తుంటుంది.

కెమిస్ట్రీ కోసం...

కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇన్‌ ఆర్గానిక్‌ ప్రశ్నలు చాలావరకూ పాఠ్యపుస్తకాల నుంచే వస్తాయి. కానీ ఫిజికల్‌ కెమిస్ట్రీ కోసం మాత్రం బయటి మెటీరియల్స్‌ నుంచి సంబంధిత టాపిక్స్‌కు అనుసంధానంగా ఉన్న విషయాల గురించి తెలుసుకున్నాను. లేదంటే స్కోర్‌ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. లెక్కలు చేసేటప్పుడు కేవలం పాఠ్య పుస్తకాల్లో ఉన్న మాదిరి ప్రశ్నలు చేస్తే సరిపోదు. అంతకంటే భిన్నంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల వివిధ విద్యాసంస్థల మెటీరియల్స్‌ చూసి సాధన చేశాను. ఎన్ని రకాలైన మోడల్స్‌లో ప్రశ్నలు ఇస్తున్నారో అన్నీ చదివాను.

బోటనీ, జువాలజీ ప్రశ్నలు ఎప్పుడూ కొంత బయటనుంచి వస్తుంటాయి. నాకు వచ్చిన ఈఏపీసెట్‌ ప్రశ్నపత్రంలో 4 ప్రశ్నలు ఇలా సిలబస్‌లో, పుస్తకాల్లో లేనివి వచ్చాయి. ఇలాంటి వాటికి సమాధానాలు రాయాలంటే కచ్చితంగా పాఠ్యపుస్తకాలు పూర్తిగా, అనుబంధంగా మెటీరియల్స్‌ చదవాలి. నేనైతే టెక్స్ట్‌ బుక్‌లో చాప్టర్‌కు ముందు ఇచ్చే పరిచయం, శాస్త్రవేత్తల గురించి సమాచారం, చివర్లో ఇచ్చే సమ్మరీ కూడా చదివాను. బొమ్మలు బాగా చూసుకోవాలి. జువాలజీలో సిలబస్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా వీలైనంత వరకూ పూర్తిచేయాలి. తగిన ప్రిపరేషన్‌తో వెళ్తే మంచి మార్కులు పొందడం అంత కష్టమేం కాదు.

ప్రణాళికకు కట్టుబడి ఉండాలి

158.62 మార్కులతో ఇంజినీరింగ్‌ విభాగంలో స్టేట్‌ ఫస్ట్‌ వచ్చాను. దీనికి కారణం ఏళ్లుగా ఈ ప్రిపరేషన్‌లో ఉండటమే. విజయవాడలోని నారాయణ పాఠశాలలో 8, 9, 10 తరగతుల్లో జేఈఈ ప్రాథమిక అంశాలు నేర్చుకున్నాను. ఇంటర్‌లో మళ్లీ చదవడం వల్ల రివిజన్‌లా ఉపయోగపడింది. పరీక్షలైపోగానే జేఈఈకి పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడం మొదలుపెట్టాను. అదే ప్రిపరేషన్‌తో ఈఏపీˆసెట్‌ రాశాను. 

చాలామంది విద్యార్థులు నాలాగే లాంగ్‌టర్మ్‌లో చదువుతుంటారు. వారందరికీ సిలబస్‌పై ఎంత పట్టున్నా, పరీక్షలో దాన్ని ఎలా ఉపయోగిస్తామనేదే విజయాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల వీలైనన్ని ఎక్కువ మాక్‌ టెస్టులు రాయడం తప్పనిసరి. అలాగే ఇతర ప్రవేశ పరీక్షలు కూడా రాయాలి. అప్పుడే అసలైన పోటీలో మనం ఏ స్థాయిలో ఉన్నామో అర్థమవుతుంది.

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలే...

నాది సీబీఎస్‌ఈ సిలబస్‌ కావడంతో చాలావరకూ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలపైనే ఆధారపడ్డాను. ఎక్కువగా గుర్తుంచుకుని సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలకు వాటినే అనుసరించాను. అదనంగా కాలేజీలో ఇచ్చిన నోట్సు చదువుకున్నాను. అంతకుమించి వేరే మెటీరియల్స్‌ జోలికిపోలేదు. బోర్డ్‌ ఎగ్జామ్స్‌ అయిపోయిన వెంటనే దీనికి చదవడం మొదలుపెట్టాను. అప్పటినుంచి రోజూ పరీక్షలు రాసేవాడిని.

వేరే వ్యాపకాలు లేవు..

రోజుకు 10 గంటలపాటు చదివేవాడిని. హాస్టల్‌లో ఉండటం వల్ల మొబైల్‌ వంటి వ్యాపకాలు ఏవీ లేకపోవడం కలిసొచ్చింది. ప్రవేశ పరీక్షల్లో ఒక లక్ష్యం నిర్దేశించుకున్నాక దాన్నుంచి పక్కకు వెళ్లకూడదు. ఒక్కసారి ఫ్లో తప్పితే మళ్లీ తిరిగి చక్కదిద్దుకోవడం కష్టమవుతుంది. దానివల్ల మొత్తం మార్కులు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. మన ప్రణాళికకు కట్టుబడి ఉండాలి. పరీక్ష రాసేటప్పుడు కూల్‌గా ఉండాలి. నేను చాలా ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో రాశాను. ఏ టాపిక్‌ అయినా సరే బిట్లు ఎంత సాధన చేస్తే అంత మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు.

మ్యాథమెటిక్స్‌ నాకు చాలా చాలా ఇష్టమైన సబ్జెక్ట్‌. నేను రాసిన పేపర్‌లో నిజానికి ఈ విభాగం నుంచి ప్రశ్నలు కఠినంగా వచ్చాయి. అయినా నేను భయపడకుండా విశ్వాసంతో సమాధానాలు ఇవ్వగలగడమే ర్యాంకు రావడానికి దోహదపడింది అనుకుంటున్నాను. గణితం ఎంత సాధన చేస్తే అంత సులువైపోతుంది. లెక్క చదవడంలో పొరపాట్లు చేయకుండా, సాల్వ్‌ చేసేటప్పుడు ఈక్వేషన్స్‌ తప్పు లేకుండా చూసుకోవడం ప్రధానం. 

ఫిజిక్స్‌ ఒక్కో టాపిక్‌ను బాగా చదివి అర్థం చేసుకుని, దాన్నుంచి ఎన్ని రకాల ప్రశ్నలు రాగలవో అన్నీ సాధన చేశాను. కొత్త కొత్త ప్రశ్నపత్రాలు చూడటం ద్వారా ఎలాంటి ప్రశ్నకైనా జవాబు ఇవ్వగలమనే నమ్మకం ఏర్పడుతుంది. కెమిస్ట్రీలో జ్ఞాపకశక్తిని పరిశీలించే ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పదే పదే రివిజన్‌ చేస్తూ వచ్చాను.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ GATE: గెలుద్దాం.. గేట్‌!

‣ ఉరుముతున్న ఆర్థిక సంక్షోభం

‣ ‘సీపెక్‌’కు నిధుల కటకట

‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!

Posted Date : 02-08-2022

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌