• facebook
  • whatsapp
  • telegram

ఐసెట్‌ ర్యాంకు సాధనకు మెలకువలు

పరీక్ష సిలబస్‌, సన్నద్ధత వివరాలురెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి రాయాల్సిన ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఐసెట్‌) ప్రకటనలు వెలువడ్డాయి. ఈ పరీక్ష ర్యాంకుతో ఏదో ఓ కళాశాలలో సీటు పొందడం సులువే. కానీ పేరున్న కాలేజీల్లో ఈ కోర్సులు చేస్తే సబ్జెక్టుపై పట్టు, ప్లేస్‌మెంట్లు లభిస్తాయి. అందుకని ఐసెట్‌లో మంచి ర్యాంకు సాధించటం తప్పనిసరి. ఇందుకు ఏయే మెలకువలు పాటించాలో తెలుసుకుందాం! 


ఆంధ్రప్రదేశ్‌లో మే 6, 7 తేదీల్లోనూ, తెలంగాణలో జూన్‌ 4, 5 తేదీల్లోనూ ఐసెట్‌ను నిర్వహిస్తారు. రెండు సెట్‌ల పరీక్ష స్వరూపం దాదాపు ఒకటే. మొత్తం ప్రశ్నలు 200. కామన్‌గా మూడు సెక్షన్లు ఉంటాయి. (అనలిటికల్‌ ఎబిలిటీ, మ్యాథమెటికల్‌ ఎబిలిటీ, కమ్యూనికేషన్‌ ఎబిలిటీ). రెండింటి మధ్య తేడా మొత్తం ప్రశ్నల సంఖ్యలోనే ఉంటుంది. మ్యాథమెటికల్‌ ఎబిలిటీలో ఏపీ ఐసెట్‌లో 55 ప్రశ్నలు, తెలంగాణ ఐసెట్‌లో 75 ప్రశ్నలు ఇస్తున్నారు. కమ్యూనికేషన్‌ ఎబిలిటీలో ఏపీ ఐసెట్‌లో 70 ప్రశ్నలు, తెలంగాణ ఐసెట్‌లో 50 ప్రశ్నలు ఇస్తున్నారు. 


ఆసక్తి ఉన్నవారు ఒకే సన్నద్ధతతో రెండు పరీక్షలూ రాయవచ్చు. రెండు రాష్ట్రాల ఐసెట్‌లు రాయాలంటే కనీసం 50 శాతం (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 శాతం) మార్కులతో డిగ్రీ ఉండాలి. ప్రస్తుతం డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాస్తున్నవారూ అర్హులే. ఎంసీఏకి డిగ్రీ లేదా ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.       ఏ విభాగం ఎలా?        


అనలిటికల్‌ ఎబిలిటీ


మొదటి పార్ట్‌ డేటా సఫిషియన్సీ సబ్జెక్టులోని ప్రశ్నలు తార్కిక, విశ్లేషణాత్మక, సమస్యా పరిష్కార సామర్థ్యాలతో పాటు ప్రాథమిక గణిత నైపుణ్యాన్నీ పరీక్షిస్తాయి. ప్రతి ప్రశ్న రెండు స్టేట్‌మెంట్‌లతో ఉంటుంది. సమాధానం ఇవ్వడానికి స్టేట్‌మెంట్లలో ఇచ్చిన సమాచారం సరిపోతుందో లేదో నిర్ణయించుకోవాలి. ఈ ప్రశ్నలను దశలవారీగా విశ్లేషిస్తూ పరిష్కరించాలి. తొందర పడకూడదు. కొన్నిసార్లు రెండు స్టేట్‌మెంట్‌లతో విడివిడిగా సమాధానాన్ని కనుగొనే ఎంపిక కూడా ఉంటుంది.      


రెండో పార్ట్‌.. ప్రాబ్ల్లమ్‌ సాల్వింగ్‌ పూర్తిగా లాజికల్‌ రీజనింగ్‌కు సంబంధించినది. ప్రశ్నలు అభ్యర్థి తార్కిక ఆలోచన, విశ్లేషణ సామర్థ్యాలను పరీక్షిస్తాయి. రెగ్యులర్‌గా సుడోకు పజిల్స్‌ లాంటి ప్రశ్నలను ఛేదించే అలవాటు చేసుకుంటే మంచి పునాది అవుతుంది. దీని ద్వారా త్వరితగతిన ఆలోచించే శక్తీ పెరుగుతుంది. గణిత నేపథ్యం లేని విద్యార్థులకు ఈ సబ్జెక్టు మంచి వరం. ఇలాంటి విద్యార్థులు ఈ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. కామన్‌ సెన్స్‌కు పదునుపెడితే ఈ విభాగంలో మంచి స్కోరు సులువుగా తెచ్చుకోవచ్చు. మ్యాథమెటికల్‌ ఎబిలిటీ

ఈ విభాగంలో రెండు ఐసెట్‌ల ప్రశ్నల సంఖ్యలో తేడా గమనించాలి. అరిథ్‌మెటికల్‌ ఎబిలిటీ రెండు ఐసెట్‌లలో 35 మార్కులతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అరిథ్‌మెటిక్‌ పూర్తి గణితం కాదు. నిత్యజీవితంలో ఉపయోగపడే సులువైన లెక్కలు. ఇక్కడ నాన్‌-మ్యాథ్స్‌ విద్యార్థులు దీన్ని సౌలభ్యంగా తీసుకుని స్కోరు పెంచుకోవాలి.  వేద గణిత ప్రాథమిక భావనలనూ, 30 వరకు క్యూబ్స్, స్క్వేర్‌లను నేర్చుకోవడంతో మొదలు పెట్టండి. దీని ద్వారా కూడికలు, తీసివేతలు, భాగహారాలు లాంటివి  సంప్రదాయ పద్ధతితో కాకుండా వేగంగా గణన చెయ్యవచ్చు. 


ఐసెట్‌ కేవలం నైపుణ్య ఆధారిత పరీక్ష కాదు; ఇది వేగానికి కూడా పరీక్ష. బేసిక్స్‌పై గట్టి పట్టు సాధించాక వేగాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. రెండోది- జామెట్రీ, ఆల్జీబ్రా లాంటి గణిత అంశాలపై పట్టు పెంచుకోవాలి. ప్రతి టాపిక్‌లోని భావనలపై స్పష్టత తెచ్చుకోవాలి, ఆపై పునశ్చరణ చేసుకోవాలి. ప్రతి ప్రాబ్ల్లమ్‌ను వివిధ దృక్కోణాలతో పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఫార్ములాలు బట్టీ పట్టకుండా షార్ట్‌కట్స్‌తో సమస్యలను ఛేదించాలి. సరళంగా చెప్పాలంటే, LAR మెథడ్‌ అంటే- లెర్న్‌ (L)- నేర్చుకోవటం, అప్లై (A)- అనువర్తించటం…, రివైజ్‌ (R)- పునశ్చరణ చేసుకోవటం. మొదట సులువైన చాప్టర్‌లు పూర్తిచేస్తే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. తర్వాత కొద్దిగా కష్టం అనిపించే చాప్టర్లు సాధన చెయ్యండి. వేగాన్ని క్రమంగా పెంచుకుంటూ అధిక స్థాయి కచ్చితత్వాన్ని కొనసాగించడంపై దృష్టి పెట్టండి. కమ్యూనికేషన్‌ ఎబిలిటీ

ప్రశ్నలు ఏపీ ఐసెట్‌లో 70, తెలంగాణ ఐసెట్‌లో 50 ఉన్నాయని గమనించండి. ఈ విభాగం బేసిక్‌ ఇంగ్లిష్‌పైనే ఉంటుంది. ఎందుకంటే వివిధ చాప్టర్లలో అడిగే ప్రశ్నలు సులభంగానే ఉంటున్నాయి. ప్యాసేజీల్లో కూడా ట్విస్ట్‌లేమీ లేకుండా డైరెక్ట్‌ ప్రశ్నలనే అడుగుతున్నారు. మొదటగా రెన్‌ అండ్‌ మార్టిన్‌ లాంటి ఒక మంచి పుస్తకం ద్వారా గ్రామర్‌ నేర్చుకోవాలి. ఇక రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లో ఫ్యాక్ట్‌ ఆధారిత ప్రశ్నలు సులువైనవి. ప్రశ్నల్లో పదాలు తీసుకుని ప్యాసేజీలో అవే పదాలు వెతికితే జవాబులు దొరుకుతాయి. అయితే రెండో రకం (ఇన్ఫÄరెన్స్‌) ప్రశ్నలకు జవాబులు పైపై పఠనంతో దొరకవు. ఇవి అంతర్లీనంగా ఉంటాయి. కానీ ఐసెట్‌లో మొదటి రకం ప్రశ్నలే అడుగుతున్నారు కాబట్టి ఈ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లో సులభంగా మార్కులు సాధించవచ్చు. రీడింగ్‌ కాంప్రహెన్షన్, వొకాబ్యులరీల్లో మంచి స్కోరు కోసం ప్రతి రోజూ ఆంగ్ల దినపత్రికను చదవటం మేలు. వార్తా కథనాలు చదువుతున్నపుడు కొత్త పదాలు ఎదురైతే సందర్భానికి అనుగుణంగా వాటిని అర్థం చేసుకోగలగాలి. పఠనం పూర్తయ్యాక డిక్షనరీ ద్వారా అర్థాలు, యూసేజీ నోట్‌ చేసుకొని కఠిన పదాలను నేర్చుకోవాలి. రెండు ఐసెట్‌ల్లో ఆంగ్ల పదాలకు సంబంధించి సులభం నుంచి మధ్యరకపు ప్రశ్నలు తప్ప క్లిష్టతరమైన ప్రశ్నలు ఇవ్వటం లేదు. 


ఈ విభాగంలో చివరి టాపిక్‌ ‘బిజినెస్, కంప్యూటర్‌ టెర్మినాలజీ’. వీటిలో చాలా ప్రాథమిక స్థాయి ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నారు. కంప్యూటర్‌కి సంబంధించి గత ఏడాది ఐసెట్‌ల్లో ఈ-మెయిల్, రామ్, బైట్, ఆపరేటింగ్‌ సిస్టమ్, కుకీస్‌ లాంటి పదాల అర్థాన్ని అడిగారు. బిజినెస్‌ టెర్మినాలజీలో ‘ఫాదర్‌ అఫ్‌ సైంటిఫిక్‌ మేనేజ్‌మెంట్‌ ఎవరు?, డీప్‌ డైవ్‌ అర్థం?’..ఇలాంటి ప్రశ్నలు అడిగారు. కాబట్టి వీటి బేసిక్స్‌ చదివితే చాలు. లోతైన అధ్యయనం అవసరం లేదు.  సన్నద్ధత వ్యూహం 

ఇప్పుడున్న వ్యవధిలో సరైన ప్రణాళికతో సన్నద్ధమయితే ఐసెట్‌లో మంచి ర్యాంకు రావడం సాధ్యమే. సిలబస్‌ అంశాలు దాదాపుగా పరిచయమైనవే. ఒక్క రీజనింగ్‌ మాత్రం నేరుగా పాఠ్యాంశాల నుంచి లేకపోయినా కామన్‌ సెన్స్‌తో ముడిపడి ఉంటుంది. అరిథ్‌మెటిక్‌ అనేది మ్యాథ్స్‌ నుంచి పుట్టుకొచ్చిందే. ఏ పోటీ పరీక్ష అయినా మొదట సిలబస్‌ను పూర్తిగా అధ్యయనం చేయాలి. ఏ విభాగానికి, ఏ చాప్టర్‌కు ఎన్ని మార్కులు కేటాయిస్తున్నారో పూర్తి స్పష్టత అవసరం. దాని ప్రకారం సన్నద్ధతను మలచుకోవాలి. ఎక్కువ ప్రశ్నలు వచ్చే విభాగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 


ఉదాహరణకు తెలంగాణ ఐసెట్‌లో మ్యాథమెటికల్‌ ఎబిలిటీలో ఆల్జీబ్రా, జామెట్రీలకు 30 మార్కులున్నాయి. అంటే ఈ రెండు చాప్టర్లు తొలుత పూర్తి చేస్తే మన అకౌంట్‌లో 30 మార్కులు ఉన్నట్లే. ఏపీ ఐసెట్‌లోని కమ్యూనికేషన్‌ ఎబిలిటీలో ఒక్క గ్రామర్‌కే 20 మార్కులు కేటాయించారు. దీన్ని మొదటే చదవాలి. ఇలా తక్కువ సమయంలో పరిమిత సిలబస్‌ ఉన్న అంశాలను పూర్తి చేసుకొని, ఆపై విస్తృతి కలిగిన చాప్టర్ల పని పట్టాలి. పూర్తి అవగాహనకు ఐసెట్‌ వెబ్‌సైట్లలో గత సంవత్సరపు ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకొని అధ్యయనం చేయాలి. ఈ వెబ్‌సైట్లలోనే ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు ఉంచారు. వాటిని రాసి, ఎక్కడ తప్పులు జరిగాయో సరిచూసుకోవాలి. మాక్‌ టెస్ట్‌ ఫలితాలు విశ్లేషించుకుని, స్కోరు తక్కువగా వస్తున్న అంశాలను ఎక్కువ సాధన చేయాలి. ఐసెట్‌లో సెక్షనల్‌ కటాఫ్‌లు లేవు. ఏదైనా విభాగంలో బలహీనంగా ఉన్నప్పటికీ బాగా వచ్చిన విభాగాల్లో ఎక్కువ స్కోరు తెచ్చుకుని మొత్తం మార్కుల విషయంలో సమతూకం పాటించవచ్చు.   


 ప్రధాన సవాలు సమయపాలనే 

ఐసెట్‌లో 200 ప్రశ్నలకు ఉన్నది 150 నిమిషాలు మాత్రమే. అంటే ప్రతి ప్రశ్నకూ 45 సెకన్లు మాత్రమే. సాధారణంగా అనలిటికల్, మ్యాథమెటికల్‌ ఎబిలిటీ ప్రశ్నలకు ఈ వ్యవధి సరిపోదు. కాబట్టి ఈ విభాగాల్లో వీలైనన్ని ఎక్కువ మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే ఉన్న వ్యవధిలోనే జవాబు గుర్తించగలిగే నైపుణ్యం సొంతమవుతుంది. షార్ట్‌కట్‌ పద్ధతి అనుసరించడంలో మెలకువ అవసరం. పరీక్షలో జవాబు గుర్తించడానికి ఎక్కువ సమయం అవసరమయ్యే ప్రశ్నలను చివరలో ప్రయత్నించడమే మంచిది. కఠిన ప్రశ్నలతో మొదట్లోనే కుస్తీ పడితే విలువైన సమయం వృథా అవుతుంది. 


ఐసెట్‌ గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే- కనీసం సగం ప్రశ్నలు తేలిగ్గానే ఉంటాయి. అందువల్ల అర్హత సాధించడం కష్టమేమీ కాదు. 20 శాతం ప్రశ్నలు మాత్రమే  కఠినంగా ఉంటున్నాయి. సగటు విద్యార్థులు సైతం 120 మార్కులపైనే స్కోరు చేయొచ్చు. పరీక్షలో అర్హత సాధించడానికి 25 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీలకు ఈ నిబంధన వర్తించదు. 2023 తెలంగాణ ఐసెట్‌ను దాదాపు 71,000 మంది రాయగా టాప్‌ ఫైవ్‌ టాపర్ల మార్కులు 149-161 మధ్య ఉన్నాయి. 2023 ఏపీ 


ఐసెట్‌ను దాదాపు 44,000 మంది రాయగా టాప్‌ ఫైవ్‌ టాపర్ల మార్కులు 161-169 మధ్య ఉన్నాయి. పైన చెప్పిన సూచనలు పాటిస్తే ఐసెట్‌లో మంచి ర్యాంకు సొంతమవుతుంది. యూనివర్సిటీ క్యాంపస్‌లోనో, కోరుకున్న కాలేజీలోనో ఎంబీఏ/ ఎంసీఏ సీటు ఖాయం చేసుకోవచ్చు.       - శ్రీధర్, 

డైరెక్టర్, కౌటిల్య, తిరుపతి 

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!

‣ ఆఫర్‌ అందాక.. ఆరు సూత్రాల ప్రణాళిక!

Posted Date : 14-03-2024

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌