• facebook
  • whatsapp
  • telegram

పరిధి దాటకుండా.. సాధన ఆపకుండా..!

జేఈఈ మెయిన్‌-2022 సెషన్‌-1 మెరుగైన ర్యాంకు సాధనకు సూచనలు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న జేఈఈ-మెయిన్‌-2022 నోటిఫికేషన్‌ రానేవచ్చింది. జాతీయస్థాయి ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో చేరటానికి ఈ పరీక్ష స్కోరు ఉపయోగపడుతుంది. అత్యధిక మార్కుల సాధనకు ఫిజిక్స్, కెమిస్ట్రీల సన్నద్ధతలో ఎన్‌సీఈఆర్‌టీ పరిధిని దాటిపోవద్దనీ, పునశ్చరణ కీలకమనీ నిపుణులు సూచిస్తున్నారు!  

తాజా జేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌ జారీ.. గతంతో పోలిస్తే చాలా ఆలస్యమైందనే చెప్పాలి. గత సంవత్సరాల మాదిరిగా జేఈఈ-మెయిన్‌ను నిర్వహించి ఉంటే ఈపాటికి మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జేఈఈ-మెయిన్‌ మొదటి దఫా పరీక్షను ముగించుకుని, ఇప్పుడు ఇంటర్‌ బోర్డు పరీక్షల సన్నద్ధతలో నిమగ్నమై ఉండేవాళ్లు.

ఈ ప్రకటనల జాప్యానికి తోడు తెలుగు రాష్ట్రాలు బోర్డు పరీక్షల తేదీలను ప్రకటించడంతో చాలామంది విద్యార్థులు ‘అసలీ ఏడాది జేఈఈ-మెయిన్‌ నిర్వహిస్తారా? ఒకవేళ నిర్వహిస్తే.. 2020, 2021లో మాదిరిగా 4 సార్లు నిర్వహిస్తారా? కరోనా నేపథ్యంలో గత రెండు సంవత్సరాలు నిర్వహించిన ఈ పరీక్ష చివరి దఫా ఆగస్టు వరకు వెళ్లింది. అలా ఈ సంవత్సరమూ జరుగుతుందా’ లాంటి ప్రశ్నలతో సతమతమయ్యారు. ఇంతలో జేఈఈ- అడ్వాన్స్‌డ్‌-2022 నోటిఫికేషన్‌ వచ్చి విద్యార్థులను మరింత అయోమయ పరిస్థితుల్లో పడేసింది.

ఎందుకంటే- జేఈఈ-అడ్వాన్స్‌డ్‌-2022 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జాన్‌ 8 నుంచి ప్రారంభమవుతుంది. పరీక్షను జులై 3వ తేదీన ఐఐటీ బాంబేవారి నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరగాలంటే ముందుగా జేఈఈ-మెయిన్‌ పూర్తవ్వాలి కదా!  ఎట్టకేలకు ఈ తికమక పరిస్థితులకు తెరదించుతూ జేఈఈ-మెయిన్‌-2022 పరీక్షను పోయినసారిలా 4 విడతలుగా కాకుండా, రెండు విడతలుగానే నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా జేఈఈ-మెయిన్‌-2022 మొదటి విడతగా, ఏప్రిల్‌-16 నుంచి 21 వరకు, రెండో విడత మే-24 నుంచి 29 వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 3 గంల నుంచి 6 వరకు ఉంటుంది.

బలాలు, బలహీనతలు

జేఈఈ-మెయిన్‌లో మొదటగా కావాల్సింది మొత్తం స్కోరు. దీన్ని పెంచే విధంగా సన్నద్ధత ఉండాలి. దానికి మీ సబ్జెక్టుల్లోని బలాలు, బలహీనతలను తెలుసుకుని, పరీక్షా సమయంలో స్కోరు సాధించడానికి ఏ సబ్జెక్టును ముందుగా రాయాలో నిర్ణయించుకోవాలి. కష్టమైన సబ్జెక్టు ప్రభావం రెండోదానిపై పడకుండా జాగ్రత్తగా ఉండాలి. దీని కోసం మీ సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులతో నివృత్తి చేసుకోవాలి.

మాక్‌టెస్ట్‌లు, గత పేపర్లు

జేఈఈ-మెయిన్‌-2020, 2021లో నిర్వహించిన పాత పేపర్లు చాలానే ఉన్నాయి. ప్రతి పేపర్‌నూ క్షుణ్ణంగా సాధన చేయడం ఎంతో ముఖ్యం. ఎన్‌టీఏ నిర్వహించిన పాత పేపర్లను యథాతథంగా ఒక పరీక్షలా పెట్టుకుని వేగం, కచ్చితత్వం వచ్చేలా కృషి చేయాలి. ఏయే ప్రశ్నలను సరిగా రాయలేకపోయారో వాటిని మరింత అధ్యయనం చేయాలి.

గతంలో మాదిరిగానే ఈ పరీక్షను బెంగాలీ, కన్నడ, మలయాళ, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళ, తెలుగు, ఉర్దూలలో అదనంగా హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో నిర్వహిస్తున్నారు.

ఈ పేపర్లన్నిటినీ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలుగానే నిర్వహిస్తారు. (ఒక్క బీ ఆర్క్‌ డ్రాయింగ్‌ టెస్ట్‌ మాత్రం ఆఫ్‌లైన్‌లో పేపర్‌ అండ్‌ పెన్‌ పద్ధతిలో జరుగుతుంది).

పట్టికలో సెక్షన్‌-ఎలోని ప్రశ్నలన్నీ బహుళైచ్ఛిక ప్రశ్నలు. సరైన సమాధానం గుర్తించిన ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నకు ‘-1’ మార్కు. సెక్షన్‌-బిలోనివన్నీ సంఖ్యాత్మక సమాధాన ప్రశ్నలు. ఇందులో 10 ప్రశ్నలు ఇచ్చినప్పటికీ విద్యార్థి వాటి నుంచి ఏవైనా 5 ప్రశ్నలను మాత్రమే ఎంచుకుని సమాధానం రాయాలి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ సెక్షన్‌లో కూడా తప్పుగా రాసిన ప్రశ్నకు -1 మార్కు ఇవ్వడం గమనించాల్సిన విషయం. సరైన సమాధానం రాసిన ప్రశ్నకు ‘4’ మార్కులు ఇచ్చారు. విద్యార్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం... సెక్షన్‌-బిలోని సంఖ్యాత్మక సమాధాన ప్రశ్నలన్నింటికీ సమాధానానికి దగ్గరలోని పూర్ణాంక సమాధానమే (నియరెస్ట్‌ ఇంటిజర్‌) రాయాలి.

రాబోయే 5 వారాల్లో...

మొదటి దఫా జేఈఈ-మెయిన్‌-2022 నిర్వహించే సమయానికి నెల రోజులకు పైగా వ్యవధి ఉంది. ఈ 5 వారాల్లో జేఈఈ-మెయిన్‌లో మంచి మార్కుల శాతంతోపాటు మెరుగైన ర్యాంకు సాధించాలంటే..

జేఈఈ-మెయిన్‌ అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు అత్యుత్తమమైన పుస్తకాలను ఎంచుకోవాలి.

అందులో భాగంగా ముందు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ఎన్‌సీఈఆర్‌టీ పరిధిని దాటిపోవద్దు.

పుస్తకాల్లోని అప్లికేషన్‌ ఆధారిత అంశాలపై ఎక్కువ దృఫ్టి పెట్టాలి.

వీటితోపాటు మీరు కోచింగ్‌ తీసుకుంటోన్న విద్యాసంస్థల మెటీరియల్‌ చూడాలి.

పరీక్షకు ముందు చివరి రోజుల్లో చదివినవాటిని బాగా రివైజ్‌ చేయాలి.

ఫార్ములాలన్నీ ఒకచోటకు తెచ్చుకుని పునశ్చరణ (రివిజన్‌) ద్వారా పట్టు సాధించాలి.

ప్రిపేరైన అంశాల్లో దొర్లిన తప్పులను గమనించి వాటిని సవరించుకోవటం ఎంతో ముఖ్యం.

వేగాన్ని పెంచుకోవడానికి ప్రతిరోజూ ప్రతి సబ్జెక్టులో గంటకు 25 నుంచి 30 ప్రశ్నలను సాధన చేయాలి

పరీక్ష సమయంలో తేలిక, మధ్యస్థం, క్లిష్ట స్థాయుల ఆధారంగా ప్రాబ్లమ్స్‌ను ఎంచుకోవాలి. అందులో మధ్యస్థ, క్లిష్ట ప్రశ్నలకు ఎందుకు సమాధానం చేయలేకపోతున్నారో కారణం తెలుసుకుని సన్నద్ధతను మల్చుకోవాలి.

తెలిసిన ప్రశ్నల్లో ఏ పరిస్థితుల్లోనూ తప్పు చేయకూడదు.

కనీసం 3 గంటల సమయం ప్రతి సబ్జెక్టుకూ కేటాయించాలి.

రోజు విడిచి రోజు చదివిన అంశాలపై ఫైనల్‌ పరీక్ష తరహాలో పరీక్ష నిర్వహించుకోవాలి.

గమనించండి

ఆన్‌లైన్‌ విధానంలో జేఈఈ-మెయిన్‌ 2022కు దరఖాస్తు గడువు: 31.03.2022

ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష రుసుమును కట్టేందుకు గడువు: 31.03.2022

జేఈఈ-మెయిన్‌-2022లో నిర్వహించే రెండు విడతల పరీక్షలను ఒకేసారి రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం కుదరదు. అదే 4 విడతలుగా నిర్వహించిన జేఈఈ-మెయిన్‌-2021కు ఒకేసారి దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. కానీ ఈసారి అలా వీలులేదు.

దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష సమయం 3 గంటలకు బదులు 4 గంటలు ఇచ్చారు.

ఒకేమాదిరి మార్కులు వచ్చిన విద్యార్థుల విషయంలో ర్యాంకును నిర్ణయించేది మ్యాథ్స్‌ అన్న విషయం మర్చిపోవద్దు.

ఈసారి సెక్షన్‌-బిలోని ‘సంఖ్యాత్మక సమాధాన ప్రశ్నలకు’ రుణాత్మక మార్కులు (-1) ఇచ్చారు. అంతేకాకుండా సమాధానానికి దగ్గరలోని పూర్ణాంక సంఖ్య (నియరెస్ట్‌ ఇంటిజర్‌)ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.

జేఈఈ-మెయిన్‌ సమాచారం కోసం: https://jeemain.nta.nic.in/

సలహాలు, సందేహ నివృత్తి కోసం: jeemain@nta.ac.in


స్టడీమెటీరియల్
 

రసాయన శాస్త్రం
భౌతికశాస్త్రం
గణితశాస్త్రం

T.M
T.M
T.M

E.M
E.M
E.M

పాత ప్రశ్నప‌త్రాలు
నమూనా ప్రశ్నపత్రాలు

T.M
T.M 

E.M
E.M 


 


మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆన్‌లైన్‌ ఆటలు... కొలువులు కొల్లలు

‣ పొరపాట్లు సవరిస్తూ... ఒత్తిడిని ఓడిస్తూ!

‣ ఇంట‌ర్‌లో మంచి మార్కుల‌కు ఇవిగో మెల‌కువ‌లు!

‣ పరిధి పెద్దదైనా పట్టు పట్టొచ్చు!

‣ ఐటీఐతో నౌకాదళంలోకి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-03-2022

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌