• facebook
  • whatsapp
  • telegram

మాక్‌టెస్ట్‌ల సాధనతో మెరుగైన స్కోరు!

నీట్‌-2023 ప్రిపరేషన్‌ విధానం

దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునేవాళ్లు రాయాల్సిన పరీక్ష నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) యూజీ. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దీన్ని మే 7న నిర్వహిస్తామని ప్రకటించింది. అధికారిక ప్రకటన మార్చి తొలివారంలో వెలువడుతుంది. పూర్తి సమాచారం https://neet.nta.nic.in/ నుంచి పొందవచ్చు. పరీక్షార్థులు ఈ పరీక్షలో మేటి స్కోరు సాధించి, ప్రసిద్ధ సంస్థల్లో సీటు పొందడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలో తెలుసుకుందాం! 


నీట్‌ పరీక్షకు అభ్యర్థి కనీస వయసు డిసెంబరు 31కి 17 ఏళ్లుండాలి. ఇంటర్మీడియట్‌లో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఉత్తీర్ణులవ్వాలి లేదా ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారై ఉండాలి. 2020 వరకు నీట్‌ ప్రశ్నపత్రంలో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్కో సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నలు వచ్చేవి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు. మొత్తం 180 ప్రశ్నలు అడిగేవారు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గించేవారు. 2021, 2022 నీట్‌ ప్రశ్నపత్రాల్లో కొన్ని మార్పులు చేశారు. గతంలో పరీక్ష వ్యవధి 3 గంటలు ఉండేది. ఇప్పుడు దాన్ని 3 గంటల 20 నిమిషాలకు పెంచారు. ప్రశ్నల సంఖ్య పెరిగింది. ప్రతి సబ్జెక్టునూ సెక్షన్‌ ఎ, సెక్షన్‌ బిగా విడదీశారు. సెక్షన్‌ ఏలో 35, సెక్షన్‌ బీలో 15 ప్రశ్నలు ఉంటాయి. గతంలో ఉన్నట్లే అన్నీ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలే. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఇస్తారు. సెక్షన్‌ బీలో చాయిస్‌ ఉంది. 15 ప్రశ్నల్లో పదింటికి సమాధానమిస్తే చాలు. సమాధానాలను ఓఎంఆర్‌ పత్రంపై గుర్తించాలి. ఈ విభాగంలో చాయిస్‌ ఉండటం అభ్యర్థులకు ఎంతో సానుకూలం. 15లో తెలిసిన 10కి సమాధానం గుర్తిస్తే సరిపోతుంది కాబట్టి రుణాత్మక మార్కుల ఇబ్బంది చాలా వరకు ఉండకపోవచ్చు. పది కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానమిచ్చినప్పటికీ.. మొదటి పదింటికి ఇచ్చిన జవాబులనే పరిగణనలోకి తీసుకంటారు. ఈ సంవత్సరం కూడా 200 ప్రశ్నలు 200 నిమిషాల వ్యవధితో ఉంటాయనే భావించవచ్చు. పరీక్ష గరిష్ఠ మార్కుల్లో మార్పు లేదు. ఎప్పటిలాగే 720కే నీట్‌ యూజీ ఉంటుంది.


నీట్‌-2022ను 17.64 లక్షల మంది రాశారు. గత ఐదేళ్ల నుంచి పరీక్ష రాసేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ ఏడాదీ సుమారు 18 లక్షల మంది రాయవచ్చని అంచనా. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మార్చి మొత్తం ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్, పరీక్షల హడావిడి ఉంటుంది. అందువల్ల ఏప్రిల్‌ మొత్తం ప్రిపరేషన్‌కు కేటాయించవచ్చు. పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నప్పుడే సీనియర్‌ ఇంటర్‌ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో ప్రాథమిక భావనలపై తగిన పట్టు సాధించాలి. ముఖ్యంగా ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశాలను శ్రద్ధగా చదివి, వాటిలోని కీలకాంశాలను అవగాహన చేసుకోవాలి. దీంతో ఏప్రిల్‌ మొత్తం 12వ తరగతి సిలబస్‌ పునశ్చరణ చేసుకోవడంతోపాటు 11వ తరగతి పాఠ్యాంశాలను తగిన వ్యవధితో అధ్యయనం చేయడానికి వీలవుతుంది. 


 

ప్రశ్నపత్రాల తీరు- సబ్జెక్టుల ప్రాధాన్యం


ప్రతి సంవత్సరం నీట్‌ అభ్యర్థుల సంఖ్య, పోటీ పెరుగుతున్నాయి. గతంలో ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉండేది. ఇప్పుడు 13 ప్రాంతీయ భాషల్లో ఇస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు మాధ్యమంలో ఈ పరీక్షను రాసే అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువే. 


నీట్‌-2022 పరీక్షలో ఫిజిక్స్‌ కష్టమని చాలామంది విద్యార్థులు భావించారు. కానీ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మాత్రం ఈ సబ్జెక్టు తేలిక అనిపించింది. ఫిజిక్స్‌ ప్రశ్నల్లో ఫార్ములా (సూత్రం) ఆధారంగా సమాధానం గుర్తించేవే ఎక్కువ ఉన్నాయి. కెమిస్ట్రీలో అధిక శాతం ఎన్‌సీఈఆర్‌టీ ఆధారిత ప్రశ్నలే అడిగారు. బయాలజీ తేలికగా ఉన్నట్లు అనిపించింది. దీనిలో జువాలజీ కంటే బోటనీ కష్టతరంగా ఉన్నట్లు భావించారు. బోటనీ ప్రశ్నల నిడివి గతంతో పోలిస్తే అధికంగా ఉండటమే దీనికి కారణం. చాలా ప్రశ్నల్లో  స్టేట్‌మెంట్ల రూపంలో సమాచారం ఇవ్వడంతో అభ్యర్థులు అధిక సమయం కేటాయించవలసి వచ్చింది. బయాలజీ ప్రశ్నలన్నీ ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లోని వాక్యాలు, ఇతర అంశాల నుంచే ఇంచుమించు నేరుగా వచ్చాయి. రెండు ప్రశ్నలు మాత్రం ఎన్‌సీఈఆర్‌టీ పరిధి దాటి అడిగారు. ప్రశ్నపత్రం స్థాయిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ 720 మార్కులకు 700, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు తక్కువగా లేరు. 


నీట్‌- 2023 ప్రశ్నపత్రం తేలికగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా అనేది కేవలం సాపేక్ష అంశమే. 2022 ప్రశ్నపత్రం స్థాయిని బట్టి దీన్ని అంచనా వేయలేం. ఎన్‌టీఏ ద్వారా గతంలో ఇచ్చిన ప్రశ్నల స్థాయిని గమనిస్తే.. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశాలపై పూర్తిగా పట్టు సాధించిన విద్యార్థులు నీట్‌- 2023లో గరిష్ఠ మార్కులతో మంచి ర్యాంకు సాధించగలరని కచ్చితంగా చెప్పవచ్చు. ప్రశ్నపత్రంలో 11, 12 తరగతుల/ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అన్ని సబ్జెక్టుల నుంచీ ఇంచుమించు సమాన సంఖ్యలో ప్రశ్నలు వస్తున్నాయి. 


ఫిజిక్స్‌లో.. మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్‌ మ్యాగ్నటిజం, మోడరన్‌ ఫిజిక్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్‌ విభాగాల నుంచి దాదాపు 80 శాతం ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో ఆర్గానిక్‌ విభాగం నుంచి దాదాపు 18 ప్రశ్నలు రావచ్చు. ఇంచుమించు ఇదే స్థాయిలో ఇనార్గానిక్, ఫిజికల్‌ విభాగాల నుంచీ అడగవచ్చు. బయాలజీలో.. బయో మాలిక్యూల్స్, బయోటెక్నాలజీ, ప్లాంట్‌ ఫిజియాలజీ, హ్యూమన్‌ ఫిజియాలజీ, ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ విభాగాలు చాలా ముఖ్యమైనవి. 


ప్రణాళికతో ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశాలు చదవటం, బలహీనంగా ఉన్న అంశాలను మాక్‌ టెస్టుల సాయంతో గుర్తించటం, పునశ్చరణ ద్వారా ఆ విభాగాల్లో అంతరాలను సరిచేసుకోవటం.. ఇవి చాలా అవసరం. ఈ విధంగా సన్నద్ధతను కొనసాగిస్తే నీట్‌లో మంచి ర్యాంకు సాధించి, పేరున్న వైద్య కళాశాలలో సీటు పొందడం తేలికే!  


 

సన్నద్ధత మెలకువలు


ఏప్రిల్‌ నెల మొత్తం కనీసం 20 మాదిరి (మాక్‌) ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. 

ప్రతి మాక్‌ టెస్టులోనూ ఒక్కో సబ్జెక్టుకూ ఎంత సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది, ఎన్ని సరైన సమాధానాలు, ఎన్ని తప్పు సమాధానాలు గుర్తించారో రాసుకోవాలి. ఈ సమాచారం తర్వాత రాసే మాక్‌ టెస్టును మెరుగ్గా, నేర్పుగా రాయడానికి ఉపయోగపడుతుంది. 

ప్రతి మాక్‌ టెస్టులోనూ ఏ తరహా పొరపాట్లు చేస్తున్నారో తెలుసుకోవాలి. ఉదాహరణకు 1) ప్రశ్నలోని సమాచారం లేదా డేటా సరిగా గమనించకపోవడం 2) ప్రశ్న చివరిలో ఏ అంశం లేదా ఏ విలువ అడిగారో చూసుకోకపోవడం 3) ప్రశ్నలకు ఇచ్చిన 4 ఆప్షన్లూ సరిగా పట్టించుకోకపోవడం 4) ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లోని ప్రశ్నల కింద ఇచ్చిన ఆప్షన్లలో డెసిమల్‌ లేదా సంఖ్యాత్మకంగా ఒకే రకంగా అనిపించే సమాధానాల వల్ల సరైన జవాబుని విస్మరించడం 5) కొన్ని సందర్భాల్లో ఇచ్చిన స్టేట్‌మెంట్ల నుంచి సరైన దానికి బదులుగా తప్పుగా ఉన్న స్టేట్‌మెంట్‌ గుర్తించమని అడిగితే తొందరలో సరైన స్టేట్‌మెంట్‌ని గుర్తించడం.

‣ కొన్ని సందర్భాల్లో ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఎన్‌సీఈఆర్‌టీలో ఇచ్చిన సమాధానానికి పూర్తి విరుద్ధంగా ఉండవచ్చు. కానీ ఎన్‌సీఈఆర్‌టీలో ఇచ్చిన వివరణనే ఎన్‌టీఏ పరిగణనలోకి తీసుకుంటుంది. 

గ్రాఫ్‌ ఆధారిత ప్రశ్నల విషయంలోనూ పొరపాట్లకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్స్, వై అక్షాలపై ఏ విలువలు గుర్తించారో గమనించాలి. గ్రాఫ్‌ వాలు, విస్తీర్ణం వంటివాటి ద్వారా జవాబు రాబట్టడం తేలికే. కాకపోతే ఇలాంటప్పుడు ఎక్స్, వై అక్షాలపై గుర్తించిన విలువల యూనిట్లను బాగా గమనించాలి. 


‣ ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశాలపై పూర్తిగా పట్టు సాధిస్తే నీట్‌- 2023లో గరిష్ఠ మార్కులతో మంచి ర్యాంకు తెచ్చుకోవచ్చు 


ప్రశ్నల స్థాయి 


గత రెండేళ్ల నీట్‌ ప్రశ్నపత్రాల్లో విద్యార్థుల అంచనా ప్రకారం ఒక్కో స్థాయిలో ఉన్న ప్రశ్నల సంఖ్య సబ్జెక్టుల వారీ పట్టికలో గమనించవచ్చు. ఇది విద్యార్థుల సౌలభ్యం కోసమే. దీన్ని బట్టి 2023 పేప ర్‌ స్థాయిని అంచనా వేయరాదు. 

పట్టికలోని వివరాలు గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో నీట్‌ రాస్తున్న విద్యార్థుల్లో అవగాహన పెరుగుతోందని అర్థం చేసుకోవచ్చు. ప్రవేశార్హత పొందుతున్న విద్యార్థుల సంఖ్య పెరగడమే దీనికి ప్రత్యక్ష తార్కాణం. దీంతోపాటు ఏటా నీట్‌తో.. ఎయిమ్స్, జిప్‌మర్, ఇతర జాతీయ ప్రముఖ వైద్య కళాశాలల్లో చేరుతోన్న తెలుగు విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.


- కొండముది రవీంద్రకుమార్‌

శ్రీ చైతన్య విద్యాసంస్థలు 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మేటి స్కోరుకు ఇదిగో రూటు!

‣ డిజిట‌ల్ ఉప‌వాసం ఉంటే మేలు!

‣ మాన‌సికంగా దృఢంగా ఉన్నారా?

‣ కేంద్రీయ సంస్థ‌ల్లో యూజీ.. పీజీ!

‣ ప్రాంగణ ఎంపికలకు.. పక్కా సంసిద్ధత

‣ మీ లెర్నింగ్‌ స్టైల్‌ ఏంటి?

Posted Date : 02-03-2023

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌