• facebook
  • whatsapp
  • telegram

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు ఎలా చ‌ద‌వాలి?

నిపుణుల సూచ‌న‌లు

ఏపీపీఎస్సీ ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నుంచి 92 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వెలువడింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు అక్టోబర్‌ 13 నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. అభ్యర్థులు నవంబర్‌ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్ష అయిన ప్రిలిమినరీని డిసెంబర్‌ 18న నిర్వహించబోతున్నారు. ఈ పరీక్ష సమగ్ర సన్నద్ధతకు ఉపకరించే మెలకువలు ఇవిగో..! 

జనరల్‌ స్టడీస్‌లో సాధారణంగా ఆధునిక భారతదేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమం వరకే చరిత్ర పరంగా సిలబస్‌ ఉంటుంది. ఈ పరీక్షకు ఇచ్చిన సిలబస్‌లో ప్రాచీన, మధ్య, ఆధునిక భారతదేశ చరిత్రలు ఉన్నాయి. ఈ సూక్ష్మమైన తేడా గమనించటం చాలా అవసరం! 

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను మార్చి 2023లో నిర్వహించే అవకాశాలున్నాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీంతో ప్రిలిమ్స్‌ తర్వాత మూడు నెలల వ్యవధిలో మెయిన్స్‌కు సన్నద్ధమవటం సాధ్యమా అనే సందిగ్ధతతో అభ్యర్థులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లుంటాయి. మొత్తం మార్కులు 240.

పేపర్‌ 1

సిలబస్‌లో భారతదేశ చరిత్ర సంస్కృతి, భారత రాజ్యాంగం, గవర్నెన్స్, అంతర్జాతీయ సంబంధాలు, భారతదేశ- ప్రాంతీయ భౌగోళిక అంశాలు, భారతదేశ- ప్రాంతీయ ఆర్థిక అంశాలను నిర్దేశించారు. పోటీ పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌లో ఉండే సిలబస్‌కు చాలా అదనపు అంశాలు జోడించడం వల్ల అభ్యర్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. పైగా సమయం కూడా తక్కువగా ఉంది. 

జనరల్‌ స్టడీస్‌లో సాధారణంగా ఆధునిక భారతదేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమం వరకే చరిత్ర పరంగా సిలబస్‌ ఉంటుంది. ఈ పరీక్షకు ఇచ్చిన సిలబస్‌లో ప్రాచీన, మధ్య, ఆధునిక భారతదేశ    చరిత్రలు ఉన్నాయి. ఈ సూక్ష్మమైన తేడా గమనించకపోతే సీనియర్‌ అభ్యర్థులు కూడా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. అదేవిధంగా ఒక చాప్టర్లో ఏకంగా దక్షిణ భారతదేశ చరిత్రను కూడా చేర్చడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ చారిత్రక అంశాలను కూడా చదవాల్సివుంటుంది.

జనరల్‌ స్టడీస్‌లో పాలిటీ కింద రాజ్యాంగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ పరీక్షకు సంబంధించిన అదనపు భారమేమిటంటే గవర్నెన్స్‌తో పాటు అంతర్జాతీయ సంబంధాలను కూడా చదవాల్సి రావటం.

‣ సాధారణంగా భారతదేశ- ప్రాంతీయ భౌగోళిక అంశాలు ఎక్కువ సందర్భాల్లో జనరల్‌ స్టడీస్‌లో ఉంటాయి. పేపర్‌-1లో సౌర కుటుంబంతో పాటు మరికొన్ని ప్రపంచ విషయాలు కూడా చేర్చారు. 

జీఎస్‌లో సాధారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ సిలబస్‌గా ఉంటుంది. కానీ ఈ పరీక్షలో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ కూడా సిలబస్‌గా చేర్చడంతో అభ్యర్థులకు లభ్యమవుతున్న సమయం దృష్ట్యా సంకట పరిస్థితి ఏర్పడుతోంది.

ఇలా చదవండి

సీనియర్‌ అభ్యర్థులు ఇంత సిలబస్‌ను ఈ తక్కువ సమయంలో కొంతవరకు ఎదుర్కొంటారు. కానీ కొత్తవాళ్లకు అంత సాధ్యమయ్యే అవకాశం లేదు. అయితే ఇది అర్హత పరీక్ష కాబట్టి వీరు నిర్దిష్ట విభాగాలను ఎంచుకుని చదివితే ఫలితం ఉంటుంది. 

చారిత్రక విభాగంలో ప్రాచీన ఆధునిక చరిత్రలకు పరిమితమవ్వటం మంచిది. దక్షిణ భారతదేశ చరిత్రలో ప్రముఖ రాజవంశాలకు పరిమితమైతే తక్కువ కాలంలో ప్రిపేర్‌ అవటానికి అవకాశం ఉంటుంది.

గవర్నెన్స్, అంతర్జాతీయ సంబంధాలకు ప్రస్తుతం ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఉత్తమం. రాజ్యాంగ అంశాలను క్షుణ్ణంగా చదవటం సముచితం. 

భారతదేశ భౌగోళిక అంశాలపై దృష్టి పెడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలకు సమయం కేటాయిస్తే ప్రస్తుత పరిస్థితులకు సరిపోతుంది.

భారతదేశ ఆర్థిక అంశాలన్నీ చదవకుండా, సర్వే 2021-22, బడ్జెట్‌ 2022-23లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆపై ఆర్థిక సంస్కరణల అనంతరం వచ్చిన నిర్మాణాత్మక మార్పులపై దృష్టి పెట్టండి. బ్యాంకింగ్, విత్తవ్యవస్థ, ఎగుమతులు- దిగుమతులు మొదలైన వాటిపై స్థూల అవగాహన పెంచుకోండి. సాంఘిక ఆర్థిక సమస్యలైన నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత, జనాభా మొదలైన అంశాలపై కూడా సాధారణ స్థాయిలో ప్రశ్నలు వస్తాయి. వాటిపైనా దృష్టి నిలపండి. ఆంధ్రప్రదేశ్‌ నవరత్నాలు, సర్వే 2021-22, బడ్జెట్‌ 2022-23 మొదలైనవాటిపై అవగాహన పెంచుకోవాలి.

ఒక్కొక్క విభాగం నుంచి 30 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉన్నందున అభ్యర్థులు సగటు కఠినత్వ స్థాయితో విస్తృతంగా చదివితే అధిక ప్రయోజనాలు సమకూరే అవకాశం ఉంది.

పేపర్‌ 2 

ఈ పేపర్లో మొత్తం మూడు విభాగాలు ఇచ్చారు. 

మెంటల్, సైకలాజికల్‌ ఎబిలిటీస్‌ 

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 

కరెంట్‌ అఫైర్స్‌.

ఈ పేపర్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ప్రిలిమ్స్‌లో అర్హులు అయ్యేందుకు సులభ మార్గం ఏర్పడుతుంది. పేపర్‌-1లోని సబ్జెక్టులన్నీ విస్తృతితో ఉంటాయి. కానీ, పేపర్‌ 2 లోని సబ్జెక్టులు నిర్దిష్టంగా ఉన్నాయి. స్కోరింగ్‌ కూడా మెరుగ్గా సాధించవచ్చు.

ముఖ్యంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నేపథ్యం ఉన్న అభ్యర్థులు పేపర్‌-1 లోని విషయాలపై పట్టు సాధించేందుకు చాలా కష్టపడాలి. అదే సమయంలో తక్కువ శ్రమతో పేపర్‌-2 లోని అంశాలపై అవగాహన సాధించడమే కాకుండా మంచి స్కోరింగ్‌ కూడా రాబట్టవచ్చు.

ఇటీవలి పోటీ పరీక్షల్లో అత్యధిక శాతం బీటెక్‌ అభ్యర్థులు ఉంటున్నారు. మెంటల్, సైకలాజికల్‌ ఎబిలిటీస్‌లో 40 మార్కులకు 30-35 మార్కులు తేలిగ్గా సాధించవచ్చు. ప్రతిరోజూ ఒక గంట సమయం సాధనకు వినియోగించి అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు.

టెకీలకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కూడా సులభమే. కొద్దిపాటి ప్రయత్నంతో 30 మార్కులు ఈ విభాగంలో సాధించవచ్చు.

ఇక కరెంట్‌ అఫైర్స్‌ విభాగంపై ప్రతిరోజూ గంట సమయాన్ని కేటాయిస్తే 30- 35 మార్కులు సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.

హేతుబద్ధంగా సన్నద్ధత ఉంటే ఈ పేపర్‌ నుంచి 100 మార్కుల వరకు సాధించే అవకాశం ఉంటుంది. ఇలాంటి నిర్దిష్ట పరిస్థితి పేపర్‌-1 లో కనిపించదు.

ఆర్ట్స్‌ సబ్జెక్టుల నేపథ్యమున్న అభ్యర్థులు ఈ పేపర్‌లోని అంశాలపై అదనపు సమయాన్ని వెచ్చించడం ద్వారా మాత్రమే మెయిన్స్‌కు అర్హులయ్యే అవకాశం ఉంటుంది.

ఎన్ని గంటలు చదివామన్నది కాదు- హేతుబద్ధంగా ప్రిపేర్‌ అయ్యామా లేదా అన్నదే ముఖ్యం. మెలకువలను పాటిస్తే గ్రూప్‌-1 మెయిన్స్‌కి అర్హత సాధించడం సులభమే...ఇంత తక్కువ సమయంలో కూడా! 

ఇవి గమనించండి 

ఎంపిక: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ (స్క్రీనింగ్‌), మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ) ఆధారంగా.

అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. డివిజనల్‌/ డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులకు బీఈ (ఫైర్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 01.07.2022 నాటికి డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (సివిల్‌) ఖాళీలకు 21-30 ఏళ్లు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్‌ (మెన్‌) ఖాళీలకు 18-30 ఏళ్లు, డివిజనల్‌/ డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ ఖాళీలకు 21-28 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01.11.2022.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02.11.2022.

ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్‌): 18.12.2022.

మెయిన్స్‌- రాత పరీక్ష (డిస్క్రిప్టివ్‌): మార్చి ద్వితీయార్థం, 2023.

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సృజ‌నాత్మ‌క‌త‌కు స్వాగ‌తం!

‣ సైన్స్‌తో సైకాలజీ.. ఫిజిక్స్‌తో మ్యూజిక్‌!

‣ విదేశీ విద్యకు కొన్ని నైపుణ్యాలు

‣ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 1,00,000 స్కాలర్‌షిప్‌లు

‣ వేగంగా నేర్చుకోవాలంటే!

Posted Date : 10-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు