• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వేగంగా నేర్చుకోవాలంటే!

కొంతమందికి ఏదైనా విషయం చెప్పగానే అర్థమైపోతుంది, బాగా గుర్తుంటుంది కూడా. కొందరేమో కాస్త శ్రద్ధపెట్టి చదివితే జ్ఞాపకం ఉంచుకోగలుగుతారు. కానీ కొద్దిమందికి తరగతిలో చెప్పే పాఠాలు ఓ పట్టాన అర్థం కావు. అర్థమైనా అంత త్వరగా గుర్తుండవు...  వీరే స్లో లెర్నర్స్‌. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వీరు చదువుల్లో వెనకబడకుండా మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు.

‘ఎంత చదివినా గుర్తుండటం లేదు... నేనే వెనుకబడిపోతున్నాను..’ అనే భయం, ఆందోళనను ముందు పక్కకి పెట్టేయాలి. అందరూ అన్నింటిలోనూ ముందుండలేరనే విషయాన్ని గ్రహించాలి. ఒత్తిడి పెరిగితే మెదడు కలిగి ఉండే రీకాల్, రికగ్నిషన్‌ సామర్థ్యాలపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే వీలైనంత వరకూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. చదవడంలో ఇబ్బంది ఎదురై చిరాగ్గా అనిపించినప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుని విడవటం, కాసేపు అలా నడవటం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.

నెమ్మదిగా నేర్చుకునే స్వభావం కలిగిన వారు ఏమాత్రం చిన్న అంతరాయం కలిగినా మళ్లీ ఏకాగ్రత పెట్టలేరు. అందుకే ముందే వీలైనంత నిశ్శబ్దంగా ఉన్నచోట చదివేందుకు కూర్చోవడం, మొబైల్‌ను వేరే గదిలో పెట్టేయడం వల్ల ఏకాగ్రతకు భంగం వాటిల్లకుండా ఉంటుంది. 

వీరికి స్పేస్డ్‌ రిపిటీషన్‌ పద్ధతి బాగా నప్పుతుంది. ఇందులో మనకు కష్టంగా అనిపించిన అంశాలను పదేపదే పునశ్చరణ చేస్తూ.. సులభంగా అనిపించిన పాఠాలను అప్పుడప్పుడూ చదువుతామన్న మాట. దీనివల్ల అన్ని అంశాలూ  త్వరగా ఒంటపట్టడమే కాక, ఎక్కువకాలం గుర్తుంటాయని పరిశోధనల్లో తేలింది.

ఎప్పుడూ ఉత్సాహంగా, కొత్త విషయాల అధ్యయనంపై ఆసక్తిగా ఉండటం వల్ల దేన్నయినా త్వరగా నేర్చుకోగలుగుతారు. తప్పులకు భయపడకుండా, ధైర్యంగా ముందడుగు వేస్తే... మెల్లగా అన్ని విషయాలనూ అందరిలాగే నేర్చుకోవచ్చు.

మెమరీ టెక్నిక్స్‌ను ఉపయోగించడం, చదివిన దానిపై తిరిగి ప్రశ్నలు వేసుకుని సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయడం, మైండ్‌ మ్యాప్స్‌ సాయంతో చదవడం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. 

నెమ్మదిగా మాత్రమే నేర్చుకునే తత్వం ఉన్నవారికి ఇతరుల సాయం ఎంతోకొంత అవసరమవుతుంది. బాగా చదివే స్నేహితులతో కలిసి చదువుకోవడం, కాలేజీలో అధ్యాపకుల సహకారం తీసుకోవడం వల్ల కొత్త అంశాలను వీలైనంత వేగంగా నేర్చుకోగలుగుతారు. 

సమతులాహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం, మెదడు చురుగ్గా ఉంటాయి. పోషకాలతో నిండిన తాజా పండ్లు, కూరగాయలను భోజనంలో భాగం చేయాలి. సరైన మోతాదులో తీసుకునే ఫ్యాటీ యాసిడ్లు మెదడుకు గుర్తుంచుకునే సామర్థ్యాన్ని పెంచుతాయని రుజువైంది. అందుకే వాటిని విస్మరించకూడదు. 

మెలకువగా ఉన్నప్పుడు తెలుసుకున్న సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునేందుకు మెదడుకు విశ్రాంతినివ్వాలి. దానికి తగిన నిద్ర తప్పనిసరి. వయసుకు తగ్గట్టు హాయిగా నిద్రపోవాలి. పడుకునేముందు ఒకసారి రివిజన్‌ చేసుకోవడం వల్ల నిద్రలో ఆ పాఠాలను మెదడు లాంగ్‌టర్మ్‌ మెమరీగా మారుస్తుందట.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 1,00,000 స్కాలర్‌షిప్‌లు

‣ ఏఐ - ఎంఎల్‌ ఎందుకు నేర్చుకోవాలి?

‣ వాతావరణశాఖలో నాన్‌-గెజిటెడ్‌ ఉద్యోగాలు

‣ నొప్పి నివారణలో నేర్పరులు!

‣ ఇప్పుడు ట్రెండింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌!

‣ ఔషధ మొక్కల నిపుణులకు డిమాండ్‌!

Posted Date : 04-10-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.