• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఔషధ మొక్కల నిపుణులకు డిమాండ్‌!

అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలకు మన దేశం నెలవు. వేల ఏళ్లుగా ప్రకృతి వైద్యంలోనూ ఆహార పదార్థాల్లోనూ వీటిని ఉపయోగిస్తున్నారు. ఆధునిక వైద్య విధానాలు ఎంత పురోగతి సాధించినప్పటికీ... ఈ ఔషధ మొక్కలతో చేసే చికిత్సలకు ఇప్పటికీ తగిన ఆదరణ ఉంది. విషతుల్యమైన రసాయనాలు, శరీరానికి హాని చేసే నకిలీ ఉత్పత్తులు పోటెత్తుతున్న ఈ తరుణంలో... స్వచ్ఛమైన హెర్బల్‌ ఉత్పత్తులు, చికిత్సలు ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారిని ఆకర్షిస్తున్నాయి. వృత్తిగా హెర్బలిజం ఎలా ఉంటుందో, హెర్బలిస్ట్‌లకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో విశ్లేషిస్తే...

మొక్కల్లోని ఔషధ గుణాలను గుర్తించి... వ్యాధుల నియంత్రణకు,  వివిధ ఆహార పదార్థాలు - నూనెల తయారీకి, మెరుగైన జీవన విధానాలను ప్రోత్సహించేలా మనోల్లాస చికిత్సలకు వాటిని ఉపయోగించేవారిని హెర్బలిస్ట్‌లు అంటున్నాం. వీరికి ప్రతి మొక్కలోనూ ఉండే మంచి చెడులు, మనుషులపై అవి చూపించే ప్రభావం... క్షుణ్ణంగా తెలుస్తాయి. వివిధ రకాలైన ఆరోగ్య, మానసిక సమస్యలను పరిష్కరించేందుకు వీరు ఈ మొక్కలను ఉపయోగిస్తారు, హెర్బల్‌ పద్ధతులనూ అవలంబిస్తారు.

ఇది ఆయుర్వేదం కంటే భిన్నమైన రంగం. హెర్బల్‌ విధానాల్లో పూర్తిగా మొక్కలు, వాటి భాగాల (ఆకు, కాండం, వేరు, పుష్పం తదితరాలు)  ఉపయోగం మాత్రమే ఉంటుంది. ఇందులో ఇతర ఏ పదార్థాలకూ చోటు లేదు. ప్రత్యామ్నాయ వైద్య విధానాలను అనుసరించే హెల్త్‌ సెంటర్లలో హెర్బలిస్ట్‌ల అవసరం బాగా ఉంటుంది. విదేశాల్లో ఈ విధానాలకు అధిక డిమాండ్‌ ఉంది. బాగా అనుభవం సంపాదించిన వారు బోధన, శిక్షణ, పరిశోధనలవైపు అడుగేయొచ్చు.

సొంతంగా సాగు, తయారీ

ఇటీవల కొందరు హెర్బలిస్ట్‌లు సొంతంగా ఔషధ మొక్కలు సాగు చేసి ఎగుమతి చేయడం, హెర్బల్‌ ఉత్పత్తులు తయారుచేసి విక్రయించడం ద్వారా లాభాలు గడిస్తున్నారు. ఈ-ఛరక్‌ వంటి వెబ్‌సైట్లు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఇందులో మొక్క పేరు, వివరాలు, ఉన్న మొత్తం సరకు సమాచారం తెలియజేయడం ద్వారా ఆర్డర్లు తీసుకుని సరఫరా చేస్తున్నారు. ఇక ఉత్పత్తులకైతే బోలెడంత డిమాండ్‌ ఉంది. ఆన్‌లైన్‌లోనూ రిటైల్‌ స్టోర్లలోనూ వీటిని అమ్మకాలు చేస్తున్నారు. అయితే దీనికి తగిన ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి.

ఇది పోటీ తక్కువగా ఉండే రంగం మాత్రమే కాదు, మార్కెట్‌ను విస్తరించేందుకు అవకాశం ఉన్న రంగం కూడా. 2019లో ఈ ఔషధ మొక్కల మార్కెట్‌ విలువ రూ.420 కోట్లు ఉండగా... 2026 నాటికి 38.5 శాతం వృద్ధి రేటుతో ఇది రూ.1400 కోట్లకు చేరుతుందని ఐబీఈఎఫ్‌ (ఇండియా బ్రాండ్‌ ఈక్విటీ ఫౌండేషన్‌) అంచనా వేసింది. ఈ రంగంపై మరింత ఆసక్తి, అవగాహన పెంచేందుకు ఇటీవల బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ‘వర్చువల్‌ హెర్బేరియమ్‌’ను ప్రారంభించారు. ఇప్పటివరకూ మన దేశంలో గుర్తించిన ఔషధ మొక్కల పూర్తి వివరాలు, ఎండిన శాంపిల్స్‌ను ఈ డేటాబేస్‌లో ఉంచుతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఆ వివరాలు చూసే వీలుంది.

కోర్సులు ఇవీ...

ఈ రంగంలో ప్రవేశించేందుకు కనీసం ఇంటర్మీడియట్‌ అర్హత ఉండాలి. బోటనీ సబ్జెక్ట్‌ చదువుకున్నవారికి కాస్త సులభం అయినా... ఏ స్ట్రీమ్‌ వారైనా ఆసక్తి ఉంటే ప్రయత్నించవచ్చు. వివిధ రకాలైన సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సర్టిఫికెట్‌ ఇన్‌ హెర్బల్‌ హోమ్‌ రెమిడీస్, డిప్లొమా ఇన్‌ హెర్బల్‌ మెడిసిన్, డిప్లొమా ఇన్‌ హెర్బల్‌ ప్రొడక్ట్స్‌ లాంటి కోర్సుల్లో పదోతరగతి, ఇంటర్‌ అర్హతతో చేరే వీలుంది. స్టాండర్‌డైజేషన్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ ప్లాంట్‌ మెటీరియల్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద), ఎగ్జిక్యూటివ్‌ డిప్లొమా ఇన్‌ హెర్బల్‌ డ్రగ్‌ టెక్నాలజీ ఫ్రమ్‌ ఐజీఎంపీఐ, హెర్బలిజం (యుడెమీ), ఆయుర్వేద హెర్బాలజీ, సర్టిఫికేషన్‌ కోర్స్‌ ఇన్‌ ఆయుర్వేద హెర్బలిజం అండ్‌ ఫార్మకాలజీ, హెర్బల్‌ మెడిసిన్‌ కోర్స్‌ (కోర్సెరా), హెర్బల్‌ అండ్‌ హోమ్‌ రెమిడీస్‌ లాంటి వాటినీ ప్రయత్నించవచ్చు.

ఎమ్మెస్సీ హెర్బల్‌ సైన్స్, పీజీ డిప్లొమా ఇన్‌ హెర్బల్‌ సైన్స్‌ లాంటి కోర్సులను దేశంలో పేరొందిన విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. పూర్తిస్థాయిలో దీనిపై అధ్యయనం చేయాలి అనుకునేవారు ఇండియన్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ (కోల్‌కతా), ఛత్తీస్‌గడ్‌ యూనివర్సిటీ (రాయ్‌పూర్‌), ద్రవిడియన్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ హెర్బల్‌ స్టడీస్‌ అండ్‌ నాచురో సైన్సెస్‌ (చిత్తూరు) లాంటి కళాశాలల్లో పీజీ కోర్సుల్లో చేరే వీలుంది.

అయితే ఇవన్నీ అవగాహన కల్పించే చదువులు మాత్రమే. ఇందులో పట్టు సాధించాలంటే నిరంతర శ్రమ, పరిశోధన, ప్రకృతితో మమేకం కావడం ముఖ్యం. ఎంతగా పరిశోధించి అవగాహన పెంచుకుంటే అంతగా రాణించే వీలుంటుంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విద్యుత్‌ వాహన పరిశ్రమల్లో విస్తృత అవకాశాలు!

‣ జియోసైంటిస్ట్‌ కొలువులు

‣ ఉద్యోగం.. స్వయం ఉపాధి.. ఫ్రీలాన్సింగ్‌!

‣ పీఓ కొలువుకు ఎస్‌బీఐ పిలుపు

Posted Date : 28-09-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌