• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జియోసైంటిస్ట్‌ కొలువులు

యూపీఎస్‌సీ 285 జియో సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వీటికి ఎంపికైనవారు గ్రూప్‌ ఎ హోదాతో జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ), మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్‌ వాటర్‌ రిసోర్సెస్‌... తదితర విభాగాల్లో ఆకర్షణీయ వేతనంతో విధులు నిర్వర్తించవచ్చు. జియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనుబంధ కోర్సుల్లో పీజీ విద్యార్హతతో పోటీ పడవచ్చు. మూడు దశల్లో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను ఉద్యోగంలోకి తీసుకుంటారు.

జియోసైంటిస్ట్‌ పోస్టులను యూపీఎస్‌సీ ఏటా క్యాలెండర్‌ ప్రకారం భర్తీ చేస్తోంది. వీటికి ఎంపికైనవారు లెవెల్‌-10 వేతనాలు అందుకోవచ్చు. ఉన్నత హోదాతోపాటు మొదటి నెల నుంచే రూ.లక్షకుపైగా వేతనం పొందవచ్చు. స్టేజ్‌-1 ప్రిలిమినరీ, స్టేజ్‌-2 మెయిన్స్, స్టేజ్‌-3 ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడతారు. పీజీ స్థాయిలో సంబంధిత సబ్జెక్టులపై గట్టి పట్టు ఉన్నవారు పరీక్షలో విజయం సాధించవచ్చు. జియో సైంటిస్ట్‌ పాత ప్రశ్నపత్రాలు, ఆ సబ్జెక్టుల్లో నెట్‌ ప్రశ్నపత్రాలు సాధనలో ఎంతగానో ఉపయోగపడతాయి. యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌ నుంచి గత ప్రశ్నపత్రాలు సేకరించవచ్చు.  

స్టేజ్‌-1

ప్రిలిమినరీ (స్టేజ్‌-1) ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ఓఎంఆర్‌ పత్రంపై సమాధానాలు గుర్తించాలి. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. మొత్తం 400 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌కు వంద మార్కులు. ఈ పేపర్‌ అభ్యర్థులందరికీ ఉమ్మడిగా నిర్వహిస్తారు. పేపర్‌-2 దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మారుతుంది. జియాలజిస్ట్, హైడ్రో జియాలజిస్ట్‌ పోస్టులకు జియాలజీ/ హైడ్రో జియాలజీ విభాగం నుంచి ప్రశ్నలు వస్తాయి. జియో ఫిజిసిస్ట్, జియోఫిజిక్స్‌ పోస్టులకు జియో ఫిజిక్స్‌ నుంచి వీటిని అడుగుతారు. కెమిస్ట్, కెమికల్‌ పోస్టులకు కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్‌-2 ఆయా సబ్జెక్టుల్లో 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌-1, పేపర్‌-2 ఒక్కో ప్రశ్నపత్రం వ్యవధి 2 గంటలు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి మూడో వంతు తగ్గిస్తారు. ప్రిలిమినరీ రెండు పేపర్లలోనూ అర్హత మార్కులు సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఆయా విభాగాల వారీ ఖాళీలకు 6 లేదా 7 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తారు.

స్టేజ్‌-2 

ఈ ప్రశ్నపత్రం డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రశ్నలు ఆంగ్ల మాధ్యమంలో వస్తాయి. సమాధానాలూ ఆ భాషలోనే రాయాలి. మెయిన్స్‌లో అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న విభాగం నుంచి 3 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కూ 200 చొప్పున 600 మార్కులకు స్టేజ్‌-2 నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కూ 3 గంటల వ్యవధి కేటాయించారు. స్టేజ్‌-2లో అర్హత సాధించినవారిని స్టేజ్‌-3 (ఇంటర్వ్యూ)కి ఎంపిక చేస్తారు. ఆయా విభాగాలవారీ ఉన్న మొత్తం ఖాళీలకు రెట్టింపు సంఖ్యలో అభ్యర్థులను స్టేజ్‌-3కి  ఆహ్వానిస్తారు.

స్టేజ్‌-3 

ఇంటర్వ్యూకు 200 మార్కులు కేటాయించారు. కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. అభ్యర్థులు సంబంధిత పోస్టులకు తగినవారా లేదా గమనిస్తారు. నాయకత్వ లక్షణాలతోపాటు ఇతర సామర్థ్యాలనూ అంచనావేసి మార్కులు కేటాయిస్తారు. అభ్యర్థులు అన్ని దశల్లోనూ సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం తుది నియామకాలు చేపడతారు.

మొత్తం ఖాళీలు: 285. 

వీటిలో కేటగిరీ 1 జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో... జియాలజిస్ట్‌ 216, జియోఫిజిసిస్ట్‌ 21, కెమిస్ట్‌ 19 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ 2 సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డులో.. హైడ్రో జియాలజిస్టు 26, కెమికల్‌ 1, జియో ఫిజిక్స్‌ 2 ఖాళీలు ఉన్నాయి. 

అర్హత: జియాలజిస్ట్‌ పోస్టులకు పీజీలో జియాలజీ/ అప్లయిడ్‌ జియాలజీ/ ఇంజినీరింగ్‌ జియాలజీ/ మెరైన్‌ జియాలజీ/ ఎర్త్‌ సైన్స్‌/ ఓషనోగ్రఫీ/ జియోకెమిస్ట్రీ... తదితర కోర్సులు చదువుకున్నవారు అర్హులు. కెమిస్ట్, కెమికల్‌ పోస్టులకు ఎమ్మెస్సీ కెమిస్ట్రీ/ అప్లయిడ్‌ కెమిస్ట్రీ/ ఎనలిటికల్‌ కెమిస్ట్రీ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. హైడ్రో జియాలజీ ఖాళీలకు పీజీలో జియాలజీ/ అప్లయిడ్‌ జియాలజీ/ మెరైన్‌ జియాలజీ/ హైడ్రో జియాలజీ చదివినవారు అర్హులు. జియో ఫిజిక్స్, జియో ఫిజిసిస్ట్‌ పోస్టులకు ఎమ్మెస్సీ అప్లయిడ్‌ ఫిజిక్స్‌/ జియో ఫిజిక్స్‌/ అప్లయిడ్‌ జియోఫిజిక్స్‌/ మెరైన్‌ జియోఫిజిక్స్‌ కోర్సులవారు అర్హులు.  

వయసు: జనవరి 1, 2023 నాటికి గరిష్ఠంగా 32 ఏళ్లు మించరాదు. అంటే జనవరి 2, 1991 - జనవరి 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: అక్టోబరు 11 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు.

ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రుసుము చెల్లించనవసరం లేదు. మిగిలినవారికి రూ.200.

ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 19

మెయిన్‌ పరీక్ష: జూన్‌ 24, 25 తేదీల్లో  

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌ 

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉద్యోగం.. స్వయం ఉపాధి.. ఫ్రీలాన్సింగ్‌!

‣ పీఓ కొలువుకు ఎస్‌బీఐ పిలుపు

‣ పారిశ్రామిక భద్రతా దళంలోకి స్వాగతం!

‣ డెవాప్స్‌ నిపుణుల‌కు డిమాండ్‌!

‣ కోస్టుగార్డు కొలువుల్లోకి ఆహ్వానం!

‣ 20,000 కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు

Posted Date : 28-09-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌