• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డెవాప్స్‌నిపుణుల‌కు డిమాండ్‌!

కోర్సులు, ఉద్యోగ‌వ‌కాశాల వివ‌రాలు


గత కొన్నేళ్లుగా ఐటీ రంగంలో డెవోప్స్‌ ఒక పదం స్థాయి నుంచి పరిశ్రమగా మారింది. స్టార్టప్స్‌ మొదలుకుని ఉన్నతశ్రేణి కంపెనీల వరకూ చాలా సంస్థలు దీన్ని వినియోగిస్తూ ఉండటంతో సంబంధిత నిపుణులకు గిరాకీ పెరిగింది.


 ఈ అంశంపై అవగాహన పెంచుకోవడం కొత్తగా సాఫ్ట్‌వేర్‌ కెరియర్‌ను ఎంచుకునేవారికే కాదు, ఇప్పటికే పనిచేస్తున్న వారికీ ఎంతగానో ఉపకరిస్తుంది. అసలు ఇదేంటో పూర్తి వివరాలు చూద్దాం...

ప్రతి పరిశ్రమలోనూ పనులు జరిగేందుకు ఓ పద్ధతి, అనుసరించేందుకు పాలసీ, నియమాలు, నిబంధనలు, పని విభజన వంటివి ఉంటాయి. ఇప్పటివరకూ సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీ కూడా అలాగే సంప్రదాయ పద్ధతుల్లో పనిచేస్తూ వచ్చింది. అయితే అందులో కొన్ని నివారించాల్సిన లోపాలు కనిపించాయి. ముఖ్యంగా ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న పోటీని తట్టుకునేందుకు క్లయింట్లకు వేగంగా సేవలు అందించాల్సి వచ్చింది... అదుగో, ఆ అవసరానికి తగ్గట్టు తెరపైకి వచ్చిన విధానమే డెవోప్స్‌ (DevOps).

( సోర్స్‌ కోడ్‌ను మెయింటెయిన్‌ చేయడం, సర్వీస్‌లను అందించడం, సర్వర్‌లో అవసరమైన ప్యాకేజ్‌లను ఇన్‌స్టాల్‌ చేయడం, ఆటోమేషన్‌ వర్క్స్, బ్యాకప్స్, సెక్యూరిటీ సెటప్, రిలీజెస్, డిప్లాయ్‌మెంట్‌ యాక్టివిటీస్‌ను దీని ద్వారా నిర్వహించవచ్చు.

ఏమిటిది?

డెవలప్‌మెంట్‌ (Development), ఆపరేషన్స్‌ (Operations) పదాల కలయికకు సూక్ష్మరూపం- డెవోప్స్‌. ఒక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడంలో ఈ రెండు విభాగాలదీ కీలకపాత్ర. వీటిని సమన్వయపరిస్తే మరింత వేగంగా, సులభంగా, లోపాలు లేకుండా ఉత్పాదకతను పెంచవచ్చనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ విధానంలో కోడ్‌ను రాసి టెస్ట్‌ చేసే డెవలప్‌మెంట్‌ టీమ్, తర్వాత పనులు చూసే అడ్మిన్స్, నెట్‌వర్క్‌ టీమ్స్, డీబీఏ, సెక్యూరిటీ ఇంజినీర్‌ అందరూ సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు క్వాలిటీ ఎస్యూరెన్స్, సెక్యూరిటీ టీమ్‌లు కూడా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా సమయం ఆదా అవుతుంది. కోడ్‌ ఒక విభాగం నుంచి మరో విభాగానికి వెళ్లే క్రమంలో జాప్యం జరగకుండా... ప్రణాళిక రచించడం, కోడ్‌ రాయడం, పరీక్షించడం, విడుదల, ఆపరేట్‌ చేయడం, ఎలా పనిచేస్తుందో గమనించడం... ఇలా నిరంతరాయంగా పని జరుగుతూనే ఉంటుంది. అందుకే దీన్ని ఇన్ఫినిటీ లూప్‌ (అనంతం) గుర్తులో చెబుతుంటారు. ఈ బృందాలు గతంలో మాన్యువల్‌గా చేసే పనులను ఆటోమేట్‌ చేస్తాయి. టెక్నాలజీ, టూల్స్‌ ఉపయోగించడం ద్వారా వేగంగా పని పూర్తయ్యేలా చూస్తాయి.


కోర్సులు

ఇందులో ప్రతి టూల్‌నూ ప్రత్యేకంగా నేర్చుకునేలా వివిధ కోర్సులున్నాయి. డెవోప్స్‌ కల్చర్‌ అండ్‌ మైండ్‌సెట్, కంప్లీట్‌ క్యూబర్‌నెట్స్‌ కోర్స్, ప్రాక్టీసెస్‌- ప్రిన్సిపల్స్, డాకర్‌ సర్టిఫికేషన్, ఏడబ్ల్యూఎస్‌ సర్టిఫైడ్‌ డెవోప్స్‌ ఇంజినీర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆటోమెటేషన్‌ విత్‌ టెర్రాఫోమ్‌ లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, ఐబీఎం లాంటి కంపెనీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లాసులు సైతం తీసుకునే వీలుంది.


ఉపయోగాలేంటి?

ఈ విధానం ప్రధాన ఉద్దేశం వేగం. పనుల్లో జాప్యాన్ని తగ్గించడం ద్వారా క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా, పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. వ్యాపారాన్ని విస్తృతం చేసుకునే అవకాశం దొరుకుతుంది. సర్వీస్‌ విడుదలను వేగవంతం చేయడం ద్వారా కొత్త ఫీచర్లను సృష్టించడం, బగ్స్‌ను పరిష్కరించడం లాంటి పనులు చకచకా జరిగిపోతాయి. ఏదైనా ఒక బృందం వద్ద ప్రాజెక్ట్‌ ఎక్కువ రోజులు ఆగిపోకుండా సమన్వయం చేసుకునే అవకాశం దొరుకుతుంది. కలిసి పనిచేయడం ద్వారా కోడ్‌ రాయడం, దాన్ని రన్‌ చేసే సమయంలో ఏ సమస్య వచ్చినా సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. డెవోప్స్‌లో ఆటోమేటెడ్‌ కంప్లైన్స్‌ పాలసీలు, కంట్రోల్స్, కాన్ఫిగరేషన్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్స్‌ను ఉపయోగించి కట్టుదిట్టమైన భద్రతతో పనిచేసే వీలుంది.


ఆరు నెలల్లో...

డెవోప్స్‌ను వివిధ స్థాయుల్లో నేర్చుకోవచ్చు. ఇందులో లైనెక్స్, గిట్, మేవెన్, టామ్‌కాట్, జెన్‌కిన్స్, ఏన్స్‌బిల్, డాకర్, క్యూబర్‌నెట్స్, షెల్‌ స్క్రిప్ట్స్‌ వంటి టూల్స్‌ ఉన్నాయి. ప్రతిదాన్నీ విడివిడిగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ముందు ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. నెట్‌వర్కింగ్, అప్లికేషన్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇది కొత్తవారికే కాకుండా ఇప్పటికే పనిచేస్తున్న టెస్టర్స్, డెవలపర్స్, సిస్టం అడ్మిన్స్, ప్రాజెక్ట్‌ మేనేజర్స్‌ వంటివారు తమ కెరియర్‌లో మరింత ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. దీన్ని నేర్చుకునేందుకు ప్రత్యేకమైన అర్హతలేమీ అవసరం లేదు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయి, ఐటీలో ఆసక్తి ఉన్నవారెవరైనా కోర్సులో చేరొచ్చు. కనీస అవగాహన ఏర్పడేందుకు నాలుగైదు వారాల వ్యవధిగల సర్టిఫికేషన్‌ కోర్సులు ఉపయోగపడతాయి. ఆరు నెలల కోర్సులు పూర్తిచేసినట్లయితే క్షుణ్నంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో వివిధ ఇన్‌స్టిట్యూట్లు ఈ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో కోర్సెరా, యుడెమీ, ఎడ్యురేకా లాంటి సంస్థల ద్వారా నేర్చుకోవచ్చు.
 

ఎందుకీ ప్రాముఖ్యం?

ఇంటర్నెట్, సాఫ్ట్‌వేర్‌ ఇప్పుడు ప్రతి వ్యాపారంలోనూ భాగమైపోయాయి. రకరకాలైన డివైజ్‌లలో కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి వినియోగదారులకు నేరుగా సేవలు అందిస్తున్నాయి. అందువల్ల ప్రస్తుత పోటీ ప్రపంచంలో మెరుగ్గా, వేగవంతంగా సేవలు అందించడం చాలా ముఖ్యమైన అంశం. దానికి తక్కువ సమయంలో ప్రభావవంతంగా పనిచేసే నిపుణులు, పద్ధతులు అవసరం. అందుకే డెవోప్స్‌పై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. డేటా సైన్స్, మెషిన్‌ లెర్నింగ్‌ మాదిరిగానే దీనికీ ఆదరణ పెరుగుతోంది. 

విభిన్న అవకాశాలు..

డెవోప్స్‌ పద్ధతిని ఆకళింపు చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ప్రస్తుతం అధిక లాభాలు గడిస్తున్నాయి. ఈ విధానాన్ని అసుసరిస్తున్న సంస్థల్లో కోడ్‌ విఫలమయ్యే ముప్పు 50శాతం వరకూ తగ్గుతున్నట్లు తేలింది. ఇటీవల డెవోప్స్‌ ఉద్యోగాల్లో దాదాపు 75శాతం పెరుగుదల కనిపించినట్లు ప్రముఖ సంస్థ ఇన్‌డీడ్‌ పేర్కొంది. అలాగే లింక్డిన్‌లో కనిపించే ప్రొఫైల్స్‌లో డెవోప్స్‌ నైపుణ్యం ఉన్నట్లు పేర్కొనేవారు 50శాతం పెరిగారు. ఒరాకిల్, యాక్సెంచర్, టెక్‌ మహీంద్రా, టీసీఎస్, ఐబీఎం, విప్రో లాంటి సంస్థల్లో డెవోప్స్‌ నిపుణులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటివీ ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీని ద్వారా డెవోప్స్‌ ఆర్కిటెక్ట్, ఇంజినీర్, ఆటోమెటేషన్‌ ఇంజినీర్, రిలీజ్‌ మేనేజర్‌ వంటి పోస్టుల్లో కొలువుదీరొచ్చు. ఇండియాలో ఈ నిపుణులకు వార్షిక వేతనం ఆరున్నర లక్షల రూపాయల నుంచి మొదలవుతోంది.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ 20,000 కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు

‣ అవుతారా.. టాబ్లూ డెవ‌ల‌ప‌ర్‌!

‣ ఇంజినీర్ల‌కు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాలు

‣ ఆంగ్ల‌భాష ప్రావీణ్య ప‌రీక్ష ఏది ప్ర‌యోజ‌న‌క‌రం!

‣ పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు

Posted Date : 23-09-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌