• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అవుతారా.. టాబ్లూ డెవ‌ల‌ప‌ర్‌!

అర్హ‌త‌లు, అవ‌కాశాల వివ‌రాలు

జయరాజ్‌ ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. కొద్దికాలంలోనే దాన్ని బాగా విస్తరించాడు. అనేక ఉత్పత్తులు తయారుచేసి, అమ్మకాలు కొనసాగించి అధిక లాభాలు అందుకున్నాడు. అంతలోనే తన వ్యాపారంలో ఒడుదొడుకులు ప్రారంభమయ్యాయి. ఏ ఉత్పత్తి ఎక్కడ ఎంత అమ్మాలో, ఏ సీజన్‌లో ఏది ఎక్కువ తయారు చేయాలో తెలియక వ్యవస్థ కాస్త గాడితప్పింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు.. తన వద్దనున్న సమాచారాన్ని మొత్తం విశ్లేషించి తర్వాత ఏం చేయాలో ఆలోచన రేకెత్తించాలి. ఆ పని సమర్థంగా చేస్తుంది... టాబ్లూ!


టాబ్లూను 2003లో ప్రారంభించారు. చార్టులు, గ్రాఫ్‌లు ఇతర డయాగ్రమ్స్‌ను ఉపయోగించి డేటాను ప్రభావవంతంగా విశ్లేషించడం, అర్థమయ్యేలా చెప్పడం దీని ప్రధాన ఉద్దేశం. ఒక్కసారి డ్రాగ్, డ్రాప్‌ చేయడం ద్వారా మొత్తం డేటాను సెకన్ల వ్యవధిలో విశ్లేషించేలా దీన్ని తయారుచేశారు. ఈ సమాచారాన్ని స్ప్రెడ్‌ షీట్, డేటాబేస్, బిగ్‌ డేటా... ఇలా ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. డేటావేర్‌ హౌసెస్, క్లౌడ్‌ డేటా... ఇలా అన్నింటితోనూ టాబ్లూ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానమయ్యే అవకాశం ఉంది.


ఒకటి కంటే ఎక్కువ సోర్సుల నుంచి సమాచారాన్ని తీసుకుని, జతచేసే ఆప్షన్‌ సైతం అందుబాటులో ఉంది. మొత్తం డేటాను ఒకేసారి సులభమైన ఇంటర్‌ఫేస్‌లో చూసేలా దీన్ని తయారుచేశారు. విజువల్‌ అనాలిసిస్‌లో టాబ్లూ ముఖ్యపాత్ర పోషిస్తోంది.


ఏ సమాచారాన్ని అయినా చూడగానే అర్థమయ్యేలా చెప్పడం చాలా ముఖ్యం. బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌లో డేటా విజువలైజేషన్‌ ప్రాముఖ్యం తెలిసిన వారు ఎవరికైనా ‘టాబ్లూ’ సాఫ్ట్‌వేర్‌ పరిచయమయ్యే ఉంటుంది. దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ నైపుణ్యాలకు మరింత మెరుగులద్దుకోవచ్చు.


భిన్న వ్యక్తులు, సంస్థల అవసరాలకు తగినవిధంగా ఇందులో టాబ్లూ డెస్క్‌టాప్, పబ్లిక్, ఆన్‌లైన్, సర్వర్, రీడర్‌ అనే వివిధ రకాలున్నాయి. సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉండటం వల్ల దీనికి చాలా రక్షణ కల్పించారు. వ్యక్తులు, సంస్థలు, తాము డేటాను ఎంతమేరకు, ఎవరితో పంచుకోవాలి అనుకుంటే అంతవరకే అది వారికి అందుబాటులో ఉంటుంది. టాబ్లూ రీడర్‌ ద్వారా ఇప్పటికే తయారుచేసి ఉన్న డాష్‌బోర్డ్‌లను చూడవచ్చు.

‣ కోర్సెరా, యుడెమీ వంటి ఆన్‌లైన్‌ సంస్థల్లోనే కాక... టాబ్లూ అధికారిక వెబ్‌సైట్లో వర్చువల్‌ తరగతుల ద్వారా కూడా దీన్ని నేర్చుకోవచ్చు. అనేక సర్టిఫికేషన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే దీన్ని ఎంత బాగా ఉపయోగించడం తెలుసనే దానిపైనే ఉద్యోగాలు రావడం, రాకపోవడం ఆధారపడి ఉంటుంది. పూర్తిస్థాయిలో సాధన చేయడం తప్పనిసరి.


దీన్ని ఉపయోగించడంలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఇందుకు ఎటువంటి ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ కానీ, టెక్నికల్‌ నాలెడ్జ్‌ కానీ అవసరం లేదు. అందువల్లే వ్యాపారం, పరిశోధన, పరిశ్రమల్లో ఈ సాఫ్ట్‌వేర్‌కు ప్రాముఖ్యం ఏర్పడింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఇతర టూల్స్‌తో పోలిస్తే టాబ్లూ చాలా ముందంజలో ఉంది.


అవకాశాలేంటి?


టాబ్లూ డెవలపర్‌లకు ప్రస్తుతం చాలా డిమాండ్‌ ఉంది. అమెజాన్, లింక్డిన్, ఫెరారీ, సిస్కో, డెలాయిట్, వాల్‌మార్ట్‌ వంటి విభిన్న రకాలైన సంస్థలు టాబ్లూ టూల్‌ను ఉపయోగిస్తున్నాయి. ముఖ్యంగా కోడింగ్‌పై ఆసక్తి లేనివారికి ఇది మంచి ప్రత్యామ్నాయ కెరియర్‌. టాబ్లూ అనలిస్ట్, టాబ్లూ బిజినెస్‌ అనలిస్ట్, టాబ్లూ డెవలపర్, టాబ్లూ కన్సల్టెంట్‌ వంటి వివిధ ఉద్యోగాలు అందుకోవచ్చు.


ఈ సాఫ్ట్‌వేర్‌ గురించి నేర్చుకునేందుకు ఎస్‌క్యూఎల్‌ డేటాబేస్, డేటా వేర్‌హౌస్‌ కాన్సెప్టుల గురించి కొంత తెలిసి ఉండాలి. డేటా అనలిటిక్స్, విజువలైజేషన్‌ టూల్స్‌ ఉపయోగించడంపై కనీస అవగాహన అవసరం. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ అర్హతతో దీన్ని నేర్చుకోవచ్చు.  టాబ్లూలో ఎన్నిరకాలైన ప్రొడక్ట్స్, సొల్యూషన్స్‌ ఉన్నాయి.. వాటిని ఎలా ఉపయోగించాలి... ఒక చక్కని డాష్‌బోర్డ్‌ ఎలా తయారుచేయాలనే అంశంపై బాగా శిక్షణ తీసుకుంటే... ఏ స్ట్రీమ్‌ వారైనా ఇందులో రాణించే అవకాశం ఉంది.

Posted Date : 23-09-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌