• facebook
  • whatsapp
  • telegram

ఆంగ్ల‌భాష ప్రావీణ్య ప‌రీక్ష ఏది ప్ర‌యోజ‌న‌క‌రం!

విదేశీ విద్య, ఉద్యోగార్థుల‌కు నిపుణుల సూచ‌న‌లు

విదేశాల్లో విద్య, ఉద్యోగం కోరుకునే వారు ఇంగ్లిష్‌ భాషా ప్రావీణ్య పరీక్ష రాయడం అవసరం. ఇందుకు టీవోఈఎఫ్‌ఎల్, ఐఈఎల్‌టీఎస్‌ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. రెండింటిలో ఏదైనా ఎంచుకుని రాసే అవకాశం ఉంది. ఏ పరీక్ష ఎలా ఉంటుంది... ఏది ఎవరికి నప్పుతుంది... అసలు వీటి గురించి పూర్తి వివరాలేంటో చూద్దామా!

ఐఈఎల్‌టీఎస్‌

ఇది ప్రపంచవ్యాప్తంగా పదివేలకు పైగా సంస్థల్లో చెల్లుబాటు అవుతుంది. యూనివర్సిటీలు, కంపెనీలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల్లో ఈ స్కోరును అంగీకరిస్తున్నారు. ఇది ప్రస్తుతం రెండు ఫార్మాట్లలో అందుబాటులో ఉంది. అవి అకడమిక్, జనరల్‌ ట్రైనింగ్‌. విదేశాల్లో చదువుకోవాలని భావించేవారు అకడమిక్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఉద్యోగాల కోసం, వలస వెళ్లేవారు, గ్రాడ్యుయేషన్‌ కంటే కింది స్థాయిలో చదువుకోవాలి అనుకునేవారు జనరల్‌ ట్రైనింగ్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

 140కు పైగా దేశాల్లో ఐఈఎల్‌టీఎస్‌ (ద ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టమ్‌) రాస్తున్నారు. అందువల్ల ఇందులో కంటెంట్‌ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. అభ్యర్థి ఇంగ్లిష్‌ పరిజ్ఞానం అంచనా వేసేలా వివిధ స్థాయుల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పాస్, ఫెయిల్‌ వంటివేవీ ఉండవు. బ్యాండ్‌ స్కోర్‌ పేరుతో 1 నుంచి 9 వరకూ అభ్యర్థి పరిజ్ఞానానికి రేటింగ్‌ ఇస్తారు.

టీవోఈఎఫ్‌ఎల్‌

ద టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఏ ఫారెన్‌ లాంగ్వేజ్‌ (టీవోఈఎఫ్‌ఎల్‌ - టోఫెల్‌)... భాషను వాడటంలో అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. చాలా యూనివర్సిటీలు ఈ స్కోరును కచ్చితంగా అడుగుతున్నాయి. అకడమిక్‌ ఇంగ్లిష్‌ను చదవడం, రాయడంలో అభ్యర్థుల నైపుణ్యాలకు ఇది పరీక్ష పెడుతుంది. ఇందులో మూడు ఫార్మాట్లు ఉన్నాయి. వీటిలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇంర్నెట్‌ బేస్డ్‌ టెస్ట్‌.

 నాలుగు గంటలపాటు జరిగే ఈ టెస్ట్‌లో ఇంగ్లిష్‌ చదవడం, విని అర్థం చేసుకోగలగడం, మాట్లాడటం, రాయడం వంటి సామర్థ్యాలను అంచనా వేస్తారు. 0 - 120 మధ్య స్కోరు ఇస్తారు.

ముఖ్యమైన తేడా ఏంటి?

టీవోఈఎఫ్‌ఎల్‌కు అమెరికాలో, ఐఈఎల్‌టీఎస్‌కు యూకేలో కొంచెం ఎక్కువ ప్రాధాన్యం. అయితే దాదాపు అన్ని దేశాల్లోని సంస్థలూ ఈ స్కోర్లను అంగీకరిస్తున్నాయి. రెండేళ్లపాటు స్కోర్లు చెల్లుబాటు అవుతాయి. 


పరీక్ష విధానం..

ఐఈఎల్‌టీఎస్‌ అభ్యర్థులకు...

 వినడం - 40 నిమిషాల పరీక్ష ఉంటుంది. ముందుగా రికార్డ్‌ చేసి ఉంచిన నాలుగు సంభాషణలను విని అర్థం చేసుకుని ప్రశ్నలకు జవాబులు రాయాలి.

 చదవడం - ఈ విభాగంలో అకడమిక్‌లో అయితే మూడు పెద్ద పెద్ద పేరాలు, జనరల్‌ పరీక్షలో మూడు చిన్న పేరాలు ఇస్తారు. ఆ పేరాల్లో రేఖాచిత్రాలు, గ్రాఫ్స్‌ వంటివి ఉండొచ్చు. వాటిని చదివి కింద ఇచ్చిన టాస్క్‌లను పూర్తిచేయాలి. సాధారణంగా ఈ పేరాలను ఎక్కువగా వార్తాపత్రికలు, పుస్తకాలు, ఇతర అధికారిక పత్రాల నుంచి తీసుకుంటారు. 

 రాయడం - ఇచ్చిన చిత్రాన్ని వివరించమనడం, వ్యాసం - లేఖలు వంటివి రాయడంపై ప్రశ్నలు ఉంటాయి. 150 పదాల నుంచి 250 పదాల్లోపు జవాబులు ఇవ్వాలి. అభ్యర్థి ఎంత చక్కగా తమ భావాలను ఆంగ్లంలో ప్రకటించగలుగుతున్నారనే విషయాన్ని ఇందులో పరీక్షిస్తారు. 

 మాట్లాడటం - ఇది కాస్త కష్టంగా ఉంటుందనే చెప్పాలి. ఈ విభాగంలో అభ్యర్థి ముఖాముఖి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్న స్లాట్‌ ప్రకారం పరీక్షకు హాజరవ్వాలి. అక్కడి నిపుణులు మనకు తెలిసిన అంశాలపైనే సంభాషిస్తూ ప్రశ్నలు అడుగుతారు. వాటికి సొంత మాటల్లో జవాబులు చెప్పాలి. ఇందులో అభ్యర్థి అభిప్రాయాలకంటే తన భాషానైపుణ్యాల మీదే పరీక్షకులు దృష్టిపెడతారు. తప్పుల్లేకుండా, తడబడకుండా, చక్కటి వేగంతో మాట్లాడిన వారికి మంచి స్కోరు దక్కుతుంది. దాదాపు 10 నుంచి 15 నిమిషాలపాటు ఈ ఇంటర్వ్యూ ఉంటుంది.

టోఫెల్‌ రాసేవారికి...

 వినడం - ఇందులో 3-5 నిమిషాల వ్యవధిలో విని సమాధానాలు రాయగలిగిన పేరాలు 6 ఉంటాయి. వీటిలో ఇద్దరి మధ్య జరిగే సంభాషణలా ఉండే ప్రశ్నలు రెండు ఇస్తారు. 

 చదవడం - ఒక్కొక్కటీ దాదాపు 700 పదాలు కలిగిన పేరాలు మూడు నుంచి ఐదు ఇస్తారు. సాధారణంగా ఇవి అకడమిక్‌ అంశాలపైనే ఉంటాయి. విద్యార్థులు ఈ పేరాలో చర్చించిన ముఖ్యమైన ఆలోచనలు, వివరాలు, వాక్య నిర్మాణం, పదాలు, ఉద్దేశం... దేని గురించైనా అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. 

  రాయడం - ఇందులో రెండు టాస్క్‌లు ఉంటాయి. ఒకటి ఇంటిగ్రేటెడ్‌ టాస్క్, రెండోది ఇండిపెండెంట్‌ టాస్క్‌. మొదటి టాస్క్‌లో అభ్యర్థి ఒక అంశంపై ఇచ్చిన పాసేజ్‌ను చదివి, దాని గురించి ఇచ్చిన ఆడియోను విని జవాబులు రాయాలి. రెండో టాస్క్‌లో ఇచ్చిన అంశంపై ఒక వ్యాసాన్ని రాయాలి. కేవలం ఆలోచనలను రాయడమే కాకుండా, ఒక ఆలోచనకు మద్దతు ఇస్తూ లేదా వ్యతిరేకిస్తూ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరచాలి. 

 మాట్లాడటం - ఈ విభాగంలో అభ్యర్థులు తమ జవాబులను మాటల రూపంలో వ్యక్తపరచాల్సి ఉంటుంది. ఇక్కడా రెండు టాస్క్‌లు ఉంటాయి. మొదటి దాంట్లో ఇచ్చిన పేరాను చదివి, ఆడియోను విని... అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలి. రెండో టాస్క్‌లో ఒక ఆడియో పాఠం విని ప్రశ్నకు సొంత మాటల్లో సమాధానాలు చెప్పాలి.

ఎలా ఎదుర్కోవాలి?

 ఈ పరీక్షల్లో సాధారణ పరీక్షల్లాగా సబ్జెక్ట్‌ చదవాల్సినదేదీ ఉండదనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇందులో కావాల్సినదల్లా ఎంత బాగా ఇంగ్లిష్‌ను ఉపయోగిస్తున్నామనే విషయం మాత్రమే. సమాధానాలు కానీ, అభిప్రాయాలు కానీ తప్పు/ఒప్పు అనేదేదీ ఉండదు. భాష, వ్యాకరణం, ప్రకటన తీరు, పలకడంపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించాలి.

 ఏ విభాగంలోని ప్రశ్నకైనా సరే.. సమాధానం ఇచ్చేటప్పుడు... అడిగిన పాయింట్లు అన్నీ కవర్‌ అయ్యాయా లేదా అనేది గమనించాలి. రాయాల్సి వచ్చినప్పుడు అడిగిన పదాల సంఖ్యలోనే జవాబులు రాయాలి. తక్కువ పదాల్లో చెప్పాలనుకున్న విషయమంతా చెప్పడం కూడా అలవర్చుకోవాల్సిన నైపుణ్యమే. అందువల్ల ఆ సంఖ్య దాటి జవాబులు రాయడం మంచిది కాదు.

  ప్రశ్నలో అడిగిన పదాలను జవాబులో పదే పదే వాడటం సరికాదు. సొంత మాటల్లో చెప్పేందుకు ప్రయత్నించాలి. రాతలో కూడా ఆ పదాలను సంఖ్యలోకి తీసుకోరు.

 పేరాగ్రాఫ్‌లకు జవాబులు ఇచ్చేటప్పుడు ముందు కింద ఇచ్చిన ప్రశ్నలు ఏంటో ఒకసారి చదివేయాలి. ఆ తర్వాత పేరాను గబగబా చూడాలి. అప్పుడు అది ఏ విషయం గురించి చర్చిస్తుందనే సంగతి అర్థమవుతుంది. మళ్లీ ఒకసారి నెమ్మదిగా అర్థం చేసుకుంటూ చదవాలి. ఆ తర్వాత జవాబులు రాసేందుకు ప్రయత్నించాలి. అర్థం కాని పదాల గురించి కంగారు పడకుండా వీలైనంత వరకూ రాయాలనుకున్న విషయాన్ని స్పష్టంగా, చక్కని భాషలో రాసేందుకు ప్రయత్నించాలి.

 మాట్లాడాల్సి వచ్చినప్పుడు విదేశాల యాసతో ప్రయాస పడాల్సిన అవసరం లేదు. స్పష్టంగా పలుకుతూ తడబడకుండా మాట్లాడితే చాలు.

 వీలైనంతగా ఇంగ్లిష్‌ను చదవడం, పద సంపదను పెంచుకోవడం వల్ల ఈ పరీక్షను సమర్థంగా ఎదుర్కోవచ్చు. అభ్యర్థులు పూర్తిగా ఇంగ్లిష్‌ దేశాల వాతావరణంలోకి మారాలి అనుకుంటున్నారు కాబట్టి... దానికి తగినట్టే ఈ టెస్ట్‌ కఠినంగానే ఉంటుంది. ప్రయత్నించిన ప్రతిసారీ ఫీజు చెల్లించాల్సి ఉన్నందున అభ్యర్థులు పూర్తిగా సిద్ధమయ్యాకే పరీక్షకు హాజరుకావడం మంచిది.

 

 

- కృష్ణకుమారి, శిక్షకురాలు 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అవరోధాల సుడిలో మానవాభివృద్ధి

‣ ‘తీస్తా’ ఒప్పందంపై ప్రతిష్టంభన

‣ వాణిజ్య ఒప్పందాలపై ఆచితూచి...

‣ ఆత్మనిర్భరతే భారత్‌ కర్తవ్యం

‣ సరిహద్దు ఉద్రిక్తతలు చల్లారేనా?

Posted Date : 22-09-2022


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం