• facebook
  • whatsapp
  • telegram

సృజ‌నాత్మ‌క‌త‌కు స్వాగ‌తం!

డిజైన్ నిపుణుల‌కు పెరుగుతున్న డిమాండ్‌!

యూసీడ్ ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

కొన్ని ఉపకరణాలు చూడగానే మనసును హత్తుకుంటాయి. ఎలాగైనా కొనాల్సిందే అనిపిస్తాయి. ఆకర్షణీయంగా వాటిని రూపొందించడమే ఇందుకు కారణం. ఆ ఆకర్షణల వెనుక ఎందరో డిజైన్‌ నిపుణుల సృజన దాగి ఉంది. అన్ని రంగాల్లోనూ సుశిక్షితులైన డిజైనర్లకు గిరాకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐఐటీలు, ప్రముఖ సంస్థలెన్నో డిజైన్‌ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో యూజీ కోర్సులకు యూసీడ్, పీజీ కోసం సీడ్‌ రాయాలి. వీటి ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో పూర్తి వివరాలు...

అరచేతిలో ఇమిడిపోయే సెల్‌ ఫోను నుంచి.. ఆకాశమార్గంలో దూసుకుపోయే లోహ విహంగం వరకూ ప్రతి వస్తువుకీ ఒక ఆకారం ఉంటుంది. వస్తువులు, ఉపకరణాలు, వాహనాలు, పనిముట్లు... ఇలా ప్రతి ఒక్కటీ ఆకర్షణీయంగా రూపొందితేనే వాటికి ఆదరణ పెరుగుతుంది. అలాగే సౌకర్యవంతంగా ఉంటేనే మన్ననలు దక్కుతాయి. ఉపయోగించడానికి వీలుగా, కుదిరినంత తక్కువ పరిమాణంలో రూపొంది, ఎక్కువ ప్రయోజనాలు అందిస్తేనే జనబాహుళ్యంలోకి దూసుకుపోతుంది. ఇందుకోసం విశేష పరిజ్ఞానంతోపాటు సృజన ఎంతో కీలకం. ఈ రెండింటిపై ఎంతో కొంత పట్టు ఉన్నవారు డిజైన్‌ కోర్సుల్లో చేరి తమ ప్రతిభను విస్తరించుకోవచ్చు. 

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో యూజీ స్థాయిలో ఈ చదువులు మొదలవుతాయి. ఆ తర్వాత ఆసక్తి ఉంటే పీజీలో స్పెషలైజేషన్‌ దిశగా వెళ్లవచ్చు. అనంతరం పీహెచ్‌డీ కోర్సులతో అత్యున్నత స్థాయిని అందుకోవచ్చు. డిజైన్‌ కోర్సుల్లో చేరడానికి దేశంలో ఎన్నో సంస్థలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అయితే వాటిలో ముఖ్యమైంది.. ఐఐటీ బాంబే ఆధ్వర్యంలోని యూసీడ్‌. ఇందులో చూపిన ప్రతిభతో ఐఐటీలు, జాతీయ స్థాయిలో మేటి సంస్థల్లో సీటు పొందవచ్చు. దేశవ్యాప్తంగా పలు సంస్థలు ఈ స్కోరుతో అవకాశం కల్పిస్తున్నాయి. 

యూసీడ్‌ (అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌) 

అర్హత: 2022లో ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్‌.. అన్ని గ్రూపులవాళ్లూ అర్హులే. మూడేళ్ల డిప్లొమా, రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులు పూర్తిచేసుకున్న, చదువుతున్నవారికీ అవకాశం ఉంది. ఐఐటీ-గువాహటి కోర్సుల్లో చేరడానికి ఇంటర్‌ ఎంపీసీ తప్పనిసరి. 

వయసు: అక్టోబరు 1, 1998 తర్వాత జన్మించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే అక్టోబరు 1, 1993 తర్వాత జన్మించినప్పటికీ అవకాశం ఉంటుంది.

పరీక్ష ఇలా..

ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో 300 మార్కులకు ఉంటుంది. వ్యవధి మూడు గంటలు. ఇందులో రెండు భాగాలు (ఎ, బి) ఉంటాయి. 

పార్ట్‌-ఎ: ఈ విభాగానికి 240 మార్కులు. వ్యవధి రెండున్నర గంటలు. పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో 3 సెక్షన్లు.

సెక్షన్‌ 1 (న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌): ఈ విభాగానికి 72 మార్కులు. 18 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ఆప్షన్లు ఉండవు. జవాబును నేరుగా ఖాళీపై పూరించాలి. రుణాత్మక మార్కులు లేవు. ఆన్‌లైన్‌ కీబోర్డు ఉపయోగించి సమస్యను సాధించుకోవచ్చు. 

సెక్షన్‌ 2 (మల్టిపుల్‌ సెలెక్ట్‌ ప్రశ్నలు): ఈ విభాగానికీ 72 మార్కులే. మొత్తం 18 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు. వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సరైన జవాబులు ఉండవచ్చు. అభ్యర్థులు సరైన ఆప్షన్లు అన్నీ గుర్తిస్తేనే 4 మార్కులు సొంతమవుతాయి. అలాగే ఒకవేళ సరైన ఆప్షన్లలో కొన్ని గుర్తించి, సరికానివి వదిలేస్తే వాటి ప్రకారం పాక్షిక మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. 

సెక్షన్‌ 3 (మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు): ఈ విభాగానికి 96 మార్కులు. ఇందులో 32 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకూ 4 ఆప్షన్లు. అయితే వీటిలో ఒకటే సరైనది. అందువల్ల ఈ విభాగానికి రుణాత్మక మార్కులున్నాయి. ప్రతి సరైన జవాబుకూ 3 మార్కులు. తప్పు సమాధానానికి 0.71 మార్కులు తగ్గిస్తారు. 

పార్ట్‌-బి: ఈ విభాగానికి 60 మార్కులు. వ్యవధి 30 నిమిషాలు. ఇందులో ఒక ప్రశ్న వస్తుంది. అభ్యర్థి డ్రాయింగ్‌ నైపుణ్యాలను పరిశీలిస్తారు. ప్రశ్న ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌పై డిస్‌ప్లే అవుతుంది. అయితే సమాధానం (డ్రాయింగ్‌) జవాబు పత్రంపై రాయాలి.

ప్రశ్నలడిగే విభాగాలు...

విజువలైజేషన్‌ అండ్‌ స్పేషియల్‌ ఎబిలిటీ, అబ్జర్వేషన్‌ అండ్‌ డిజైన్‌ సెన్సిటివిటీ, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ సోషల్‌ అవేర్‌నెస్, ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, లాంగ్వేజ్‌ అండ్‌ క్రియేటివిటీ, డిజైన్‌ థింకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్, డ్రాయింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షపై అవగాహన, సన్నద్ధతకు పాత ప్రశ్నపత్రాలు ఉపయోగపడతాయి. గత ప్రశ్నపత్రాలు-జవాబులు యూసీడ్‌ వెబ్‌సైట్‌లో ఉంచారు. వాటిని గమనిస్తే ఏం చదవాలి, సాధన ఎలా ఉండాలో తెలుస్తుంది. సృజన, ఆలోచన, తార్కికతలపై ముడిపడిన ప్రశ్నలే ఎక్కువగా ఉంటాయి. 

సంస్థలు, సీట్లు: 

మొత్తం సీట్లు 199. వీటిలో.. ఐఐటీ-బాంబే 37, ఐఐటీ-దిల్లీ 20, ఐఐటీ-గువాహటి 56, ఐఐటీ- హైదరాబాద్‌ 20, ఐఐఐటీడీఎం-జబల్‌పూర్‌లో 66 ఉన్నాయి. ఐఐటీ-బాంబేలో చేరినవాళ్లు బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ అనంతరం మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులో చేరవచ్చు. కోర్సు మూడో సంవత్సరంలో ఈ ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. ఇలా చేరినవారికి బీడిస్‌ + ఎండిస్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్సు ఐదేళ్లలో పూర్తవుతుంది. యూసీడ్‌ స్కోర్‌తో దేశవ్యాప్తంగా పలు ఇతర సంస్థలు సైతం ప్రవేశం కల్పిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్, డీవై పాటిల్‌ యూనివర్సిటీ, దిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, జైన్, జేకేఎల్‌యూ, నిర్మా, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, విట్, లవ్‌ లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, శ్రేష్ఠ, గురుగోవింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ, వరల్డ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డిజైన్, విశ్వనికేతన్, మిట్, యూపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్, సెప్ట్, అనంత్‌ నేషనల్‌ యూనివర్సిటీ ...తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. 

పీజీ, పీహెచ్‌డీల్లోకి... సీడ్‌

డిజైన్‌లో యూజీ పూర్తిచేసుకున్న, చివరి సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులు పీజీ చదవడానికీ, ఆలాగే పీజీవాళ్లు పీహెచ్‌డీలో చేరడానికీ సీడ్‌ దారిచూపుతుంది. ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ-బాంబే, దిల్లీ, గువాహటి, హైదరాబాద్, కాన్పూర్, ఐఐటీడీఎం జబల్‌పూర్‌ల్లో డిజైన్‌ పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ డిజైన్‌ (సీడ్‌) రాయడం తప్పనిసరి.  

సంస్థలు.. కోర్సులు / స్పెషలైజేషన్లు

ఐఐఎస్సీ బెంగళూరు: ఎండిజైన్‌- ప్రొడక్ట్‌ డిజైన్‌ అండ్‌ ఇంజినీరింగ్, పీహెచ్‌డీ- డిజైన్‌

ఐఐటీ బాంబే: ఎండిజైన్‌- ఇండస్ట్రియల్‌ డిజైన్, కమ్యూనికేషన్‌ డిజైన్, యానిమేషన్, ఇంటరాక్షన్‌ డిజైన్, మొబిలిటీ అండ్‌ వెహికల్‌ డిజైన్‌; పీహెచ్‌డీ- డిజైన్‌

ఐఐటీ దిల్లీ: ఎండిజైన్‌- ఇండస్ట్రియల్‌ డిజైన్‌

ఐఐటీ గువాహటి: ఎండిజైన్‌- డిజైన్, పీహెచ్‌డీ- డిజైన్‌

ఐఐటీ హైదరాబాద్‌: ఎండిజైన్‌- విజువల్‌ డిజైన్, పీహెచ్‌డీ- డిజైన్‌

ఐఐటీ కాన్పూర్‌: ఎండిజైన్‌- డిజైన్, పీహెచ్‌డీ- డిజైన్‌

ఐఐఐటీడీఎం జబల్‌పూర్‌: ఎండిజైన్‌- డిజైన్, పీహెచ్‌డీ- డిజైన్‌

ప్రశ్నపత్రం ఇలా 

ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. ఇందులో 2 విభాగాలు ఉన్నాయి. పార్ట్‌- ఎ ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఈ విభాగంలో న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్, మల్టిపుల్‌ సెలక్ట్, మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం వంద మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి ఒక గంట. మొత్తం 41 ప్రశ్నలు వస్తాయి. న్యూమరికల్‌ ప్రశ్నలు 8 ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. ఈ విభాగంలో రుణాత్మక మార్కులు లేవు. మల్టిపుల్‌ సెలెక్ట్‌ ప్రశ్నలు 10 వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. తప్పు సమాధానానికి 0.2 మార్కులు తగ్గిస్తారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ విభాగంలో 23 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. తప్పు సమాధానానికి అర మార్కు చొప్పున తగ్గిస్తారు. పార్ట్‌ ఎలో విజువలైజేషన్‌ అండ్‌ స్పేషియల్‌ ఎబిలిటీ, ఎన్విరాన్‌మెంటల్, సోషల్‌ అవేర్‌నెస్, ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, లాంగ్వేజ్‌ అండ్‌ క్రియేటివిటీ, అబ్జర్వేషన్‌ అండ్‌ డిజైన్‌ సెన్సిటివిటీ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌-బి ప్రశ్నలు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌పై డిస్‌ప్లే అవుతాయి. వీటికి సమాధానాలు (డ్రాయింగ్స్‌) బుక్‌లెట్‌లో రాయాలి. ప్రతి ప్రశ్నకు 20 మార్కుల చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. స్కెచింగ్, క్రియేటివిటీ, ఫామ్‌ సెన్సిటివిటీ, విజువల్‌ సెన్సిటివిటీ, ప్రాబ్లమ్‌ ఐడెంటిఫి   కేషన్‌ విభాగాల్లో ఒక ప్రశ్న చొప్పున ఉంటాయి. వ్యవధి 2 గంటలు. పార్ట్‌-ఎ ను స్క్రీనింగ్‌ టెస్టుగా పరిగణిస్తారు. ఈ పరీక్షలోని ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఎంపికైనవారి పార్ట్‌ బి సమాధానాలు మూల్యాంకనం చేస్తారు. తుది ఎంపికలో పార్ట్‌ ఎకు 25, పార్ట్‌ బికి 75 శాతం వెయిటేజీ లభిస్తుంది. 

అర్హత: గ్రాడ్యుయేట్లు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశం కల్పించే సంస్థల వారీ స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. బీటెక్, బీఆర్క్, డిజైన్, ఇంటీరియర్‌ డిజైన్, బీఎఫ్‌ఏ వీటిలో ఏదైనా నాలుగేళ్ల కోర్సు లేదా జీడీ ఆర్ట్స్‌ డిప్లొమా ప్రోగ్రాం (10+5 విధానంలో) చదివినవారికి అన్ని సంస్థల్లోనూ అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఎన్నిసార్లైనా పరీక్ష రాసుకోవచ్చు. వయసు నిబంధన లేదు. 

ముఖ్యమైన తేదీలు (యూసీడ్, సీడ్‌)

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 21

పరీక్ష తేదీ: జనవరి 22

ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1800. మిగిలిన అందరికీ రూ.3600

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం

వెబ్‌సైట్లు: https://uceedapp.iitb.ac.in/UCEED/home.jsp, https://ceedapp.iitb.ac.in/CEED/home.jsp
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సైన్స్‌తో సైకాలజీ.. ఫిజిక్స్‌తో మ్యూజిక్‌!

‣ విదేశీ విద్యకు కొన్ని నైపుణ్యాలు

‣ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 1,00,000 స్కాలర్‌షిప్‌లు

‣ వేగంగా నేర్చుకోవాలంటే!

Posted Date: 10-10-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌