• facebook
  • whatsapp
  • telegram

ఒకే ఏడాది ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు

విజేత సన్నద్ధత ఎలా సాగింది?

ఒక ప్రభుత్వోద్యోగం సాధించటమే చాలామంది అభ్యర్థులకు కష్టం. కానీ మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన బండారి మౌనిక 2019లో ఒకటీ, రెండూ కాదు, ఏకంగా ఐదు సర్కారీ కొలువులను సాధించారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఐదు కొలువులు ఆమె తలుపు తట్టాయి. ప్రస్తుతం ఖమ్మం జీఎస్‌టీ కార్యాలయంలో ఏసీటీఓగా పనిచేస్తున్న ఆమె విజయ పరంపర వెనకున్న సన్నద్ధత ఎలాంటిది? పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి స్ఫూర్తినిచ్చే ఈ విశేషాలు ఆమె మాటల్లోనే..!  

మా స్వగ్రామం ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్‌. అమ్మానాన్నలు నిరక్షరాస్యులు. వ్యవసాయం చేస్తారు. ఒకటో తరగతి నుంచి పది వరకూ సొంతూళ్లోనే చదువుకున్నా. పదో తరగతిలో మంచి మార్కులు రావటంతో బాసర ట్రిపుల్‌ ఐటీలో ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ (సీఎస్‌ఈ)లో చేరాను. ఇంజినీరింగ్‌ పూర్తవగానే ప్రభుత్వ కొలువు సాధించడమే లక్ష్యంగా పోటీపరీక్షలపై దృష్టి పెట్టా. నిరంతరం సన్నద్ధమవుతూ వచ్చా.  

హైదరాబాద్‌లోని ఆర్‌సీ రెడ్డి సంస్థల్లో గ్రూప్‌-2కు ఆరు నెలల పాటు శిక్షణ తీసుకున్నా. వాళ్లు ఇచ్చిన మెటీరియల్‌తో పాటు తెలుగు అకాడమీ పుస్తకాలను ఎక్కువగా చదివా. వీటితో పాటు కరెంట్‌ అఫైర్స్‌ పరిజ్ఞానం ముఖ్యం. ఈ విషయంలో ’ఈనాడు’ దినపత్రిక నాకెంతో ఉపయోగపడింది. క్రమం తప్పకుండా నిత్యం జాతీయ అంతర్జాతీయ విషయాలతో పాటు ఎడిటోరియల్స్‌ చదివాను. 

పోటీ పరీక్షలంటే మార్కెట్‌లోకి లెక్కలేనన్ని పుస్తకాలు వస్తాయి. కనబడిన పుస్తకాలన్నీ చదివితే చివరకు ఏం చదివింది కూడా గుర్తుండదు. అందువల్ల అవసరమైన స్టాండర్డ్‌ పుస్తకాలు మాత్రమే పరిమిత సంఖ్యలో చదవటం మేలు.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం విడుదలైన ప్రతి ప్రకటనకూ దరఖాస్తు చేశాను. ప్రతి పరీక్షనూ రాయాలని సంకల్పించాను.  

2019 జూన్‌లో పంచాయతీ కార్యదర్శి పోస్టుకు ఎంపికయ్యా. మహిళా విభాగంలో టాపర్‌గా నిలిచా. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని కూర గ్రామంలో కొద్దిరోజులపాటు ఈ ఉద్యోగం చేశా. తర్వాత ఆసిఫాబాద్‌ మండలంలోని అడలో వీఆర్‌ఓగా చేరాను. అనంతరం ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌గా ఎంపికైనా ఆ కొలువులో చేరలేదు. కొద్దిరోజులకే రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాను. ఇలా వరుస కొలువులు సాధిస్తున్న తరుణంలో 2019 అక్టోబరులో గ్రూప్‌-2 పరీక్ష ద్వారా వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ (ఏసీటీఓ) పోస్టుకు ఎంపికయ్యాను. ఖమ్మంలో ఈ ఉద్యోగంలో కొనసాగుతున్నాను.

ఇవీ మౌనిక సాధించిన ఉద్యోగాలు

1. పంచాయతీ కార్యదర్శి  

2. వీఆర్‌ఓ 

3. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌

4. రెవెన్యూలో జూనియర్‌ అసిస్టెంట్‌

5. వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీఓ  

కొత్త అంశాల పఠనం... పాతవాటి అవలోకనం

పోటీ పరీక్షలకు సిద్ధం కావాలంటే కేవలం డిగ్రీ సబ్జెక్టు మాత్రమే సరిపోదు. పదో తరగతి వరకు చరిత్ర, పౌరశాస్త్రం, భూగోళిక వ్యవస్థ, రాజనీతి శాస్త్రం గురించి కొద్దో గొప్పో మాత్రమే తెలుసు. ఇంటర్మీడియట్‌ నుంచి డిగ్రీ వరకు వీటిపై ఎలాంటి అవగాహనా లేదు. పోటీ పరీక్షలకు సిద్ధం కావాల్సిన సమయంలో ఈ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాను. ఇందుకోసం అవసరమైన పుస్తకాలు, మెటీరియల్‌ తెచ్చుకుని సిద్ధమయ్యా.  

ప్రిపరేషన్‌ వ్యూహం గురించి చెప్పాలంటే.. ఒక రోజు ఓ సబ్జెక్టులోని ఒక టాపిక్‌ తీసుకోవాలి. నిన్న చదివిన ఆ టాపిక్‌ను ఈరోజు రివిజన్‌ చేసుకోవాలి. తర్వాతి రోజు గతంలోని రెండు రోజుల టాపిక్‌లను రివిజన్‌ చేసుకోవాలి. ఇలా నిత్యం కొత్త టాపిక్‌లను ఎంచుకోవటంతో పాటు పాత అంశాలను అవలోకనం చేసుకుంటే సబ్జెక్టు బాగా గుర్తుంటుంది. తద్వారా దానిపై పూర్తి పట్టు సాధించవచ్చు. ఇదే ప్రక్రియను కొనసాగిస్తూవుండాలి. ఎక్కువసార్లు రివిజన్‌ చేసుకోవటం ద్వారా చదివిన సబ్జెక్టు ఎక్కువ కాలం గుర్తుంటుంది. నా విజయానికి ఇదే ప్రధాన కారణం!

గ్రూప్‌-2కు తీసుకున్న శిక్షణ నేను పలు ఉద్యోగాలు సాధించేందుకు ఉపకరించింది.

గ్రూప్‌-2లో విజయం సాధించిన తర్వాత గ్రూప్‌-1పై కూడా దృష్టి పెట్టి చదివితే మంచిది.

ఎప్పుడైనా సరే సబ్జెక్టుకు కరెంట్‌ అఫైర్స్‌ను అనుసంధానం చేస్తూ చదవటం ఎంతో ముఖ్యం.

ఏదైనా సంస్థల్లో తీసుకునే శిక్షణ కేవలం మార్గదర్శనం మాత్రమే. దాని వల్లే ఉద్యోగాలు వస్తాయనుకోవటం పొరపాటు. విజయం సాధించటం అనేది మన ప్రిపరేషన్‌పైనే ఆధారపడి ఉంటుంది.

ఒక రోజంతా ఒకటే సబ్జెక్టు చదివితే సహజంగా బోర్‌ కొడుతుంది. అందువల్ల కనీసం మూడు సబ్జెక్టులు చదవటం మంచిది.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పునశ్చరణతో పట్టు... మాక్‌ పరీక్షలతో ధీమా!

‣ ప్రయోజనాలే ప్రమాణం!

‣ మేనేజ్‌మెంట్‌ ప్రవేశాలకు మ్యాట్‌

‣ చదివినవి గుర్తుండాలంటే...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌