• facebook
  • whatsapp
  • telegram

గ్రూప్ 1, 2 సక్సెస్‌కు ముఖ్య సూచనలు

* పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ

* ఏపీపీఎస్‌సీ తాజా ప్రకటనలు

 
గ్రూప్‌-1 సర్వీసుల నోటిఫికేషన్‌ను 81 పోస్టులతో, గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను 897 పోస్టులతో ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఫిబ్రవరి 25, 2024న గ్రూప్‌-2 ప్రిలిమినరీ, మార్చి 17, 2024న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించబోతున్నారు అసలు నోటిఫికేషన్లు వస్తాయా.. రావా? అనే సందిగ్ధతలో అభ్యర్థులు ఉన్న సమయంలో హఠాత్తుగా వీటిని ప్రకటించారు. కేవలం 76 రోజుల్లో గ్రూప్‌-2 పరీక్ష, 97 రోజుల్లో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను ఎదుర్కోవాల్సివస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ పరీక్షల్లో విజయానికి ఉపకరించే మెలకువలు.. ఇవిగో!  


గ్రూప్‌-1, 2లలో ఏదో ఒక పరీక్ష రాసే అభ్యర్థులు సరైన ప్రణాళికతో వెళితే ఈ తక్కువ సమయాన్ని ఉపయోగించుకుని విజయాన్ని సాధించవచ్చు. కానీ రెండు పరీక్షలూ ఎదుర్కోవాలన్న అభ్యర్థులు మాత్రం విపరీతమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1, 2 ప్రిలిమినరీ పరీక్షలను ఎదుర్కొనేందుకు వివిధ రకాల సంభావ్యతలను పరిశీలిద్దాం. 


గ్రూప్‌-1 

* పోస్టుల సంఖ్య స్వల్పంగా ఉన్నందున ప్రిలిమినరీ స్థాయిలో గట్టి పోటీని ఎదుర్కోవాలి. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని బలాలూ బలహీనతలూ అంచనా వేసుకుని సమయ నిర్వహణను మెరుగుపరుచుకోవాలి. రోస్టర్ల వారీ పోస్టుల సంఖ్యను గమనిస్తే పోటీ తీవ్రత స్పష్టమవుతుంది. తద్వారా అభ్యర్థులు ఎవరికి వారు  ఆ పోటీని ఎదుర్కొని మెయిన్స్‌లో ప్రవేశించేందుకు కార్యాచరణ అనుసరించాలి.
* ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లు ఉన్నాయి. సిలబస్‌ కూడా విస్తృతమే. అయినప్పటికీ రెండు పేపర్లలోని సిలబస్‌ విభాగాలను స్కోరింగ్‌- నాన్‌ స్కోరింగ్‌గా విభజించుకొని ముందస్తుగా స్కోరింగ్‌ విభాగాలపై పట్టు సాధించాలి. గత అనుభవాలను బట్టి పేపర్‌ 1లోని పాలిటీ, ప్రాచీన భారతదేశ చరిత్ర, ఆధునిక చరిత్ర, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, భారతదేశ- ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలు, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థలను స్కోరింగ్‌ అంశాలుగా గుర్తించి ప్రణాళిక తయారు చేసుకోవాలి.

* పేపర్‌ 2లో కరెంట్‌ అఫైర్స్‌పై త్వరగా పట్టు సాధించవచ్చు. సంవత్సర కాలాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇప్పటినుంచే పట్టు బిగించాలి.

* పేపర్‌ 2లో మానసిక సామర్థ్యాలు, పరిపాలన, మనోవైజ్ఞానిక అంశాలకు అధిక వెయిటేజి ఉంది. మనోవైజ్ఞానిక సంబంధ అంశాలు చూడగానే క్లిష్టంగా కనిపిస్తాయి కానీ ప్రాక్టికల్‌గా వాటిని అర్థం చేసుకుంటే సులభంగా ప్రశ్నల్ని ఎదుర్కోవచ్చు. అందువల్ల సంబంధిత మెలకువలపై దృష్టి సారించాలి. అదే సందర్భంలో సరైన ప్రాక్టీస్‌ చేస్తే మంచి స్కోర్లు సాధించవచ్చు. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని రోజూ కనీసం రెండు గంటల సమయాన్ని వెచ్చిస్తే తేలిగ్గా స్కోరు పెంచుకోవచ్చు.

* పేపర్‌ 2లోని శాస్త్ర సాంకేతిక అంశాల విషయంలో ప్రధానంగా కరెంట్‌ అఫైర్స్‌ ఆధారిత పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఉండొచ్చు. అదే సందర్భంలో ఆయా విషయాలను అర్థం చేసుకోవడమూ సులభమే. కాబట్టి ముందస్తుగా పట్టు సాధించాల్సిన అంశాల్లో దీన్ని కూడా చేర్చుకోవాలి.

* పైన చెప్పిన అంశాలపై పట్టు సాధించాక మిగతా విభాగాల్లోని వివిధ అంశాలపై కూడా అవగాహన పెంచుకోవచ్చు. ఆబ్జెక్టివ్‌ పరీక్ష కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రాథమిక అవగాహన ద్వారా కూడా మార్కులు సాధించవచ్చు కాబట్టి ఈ వ్యూహాన్ని అనుసరించాలి.

* పేపర్‌ వారీగా అర్హత ప్రమాణాలు నిర్ణయించరు. రెండు పేపర్లలో వచ్చే మొత్తం మార్కుల ఆధారంగా మెయిన్స్‌కి ఎంపిక చేస్తారు. అందువల్ల మీ సామర్థ్యాలూ, పరిజ్ఞానాన్ని బట్టి గరిష్ఠ మార్కులు స్కోరు చేయగలిగే విభాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం మంచిది.

* సీనియర్‌ అభ్యర్థులూ, గత గ్రూప్‌-1 పరీక్షలు రాసినవారూ ప్రిలిమినరీ సన్నద్ధతకు అవసరాన్ని బట్టి సమయానికి కేటాయించుకోవాలి. ఇప్పటినుంచే మెయిన్స్‌పై దృష్టి పెట్టి సిద్ధమవుతూ నమూనా పరీక్షలు వీలైనన్ని రాయాలి. ఇలా మంచి స్కోరు పెంచుకోవచ్చు.

* మొదటిసారి రాస్తున్న అభ్యర్థులు కూడా ప్రిలిమ్స్‌ పరీక్షకు సమయం కేటాయిస్తూనే మెయిన్స్‌లోని ఒకటి రెండు పేపర్లపై కూడా దృష్టి పెడితే తర్వాత మెయిన్స్‌లో రాణించే అవకాశం ఎక్కువ. మెయిన్స్‌లో గరిష్ఠ మార్కులు పొందేందుకు అవగాహన కీలకం. దీర్ఘకాలిక ప్రిపరేషన్‌ ద్వారానే అది మెరుగవుతుంది.


గ్రూప్‌-2


* పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది. లక్షల్లో రాసేవారి నుంచి పోటీని ఎదుర్కొని మెయిన్స్‌కు అర్హత పొందటానికి ఐదు విభాగాలపై గట్టి పట్టునే సాధించాలి. ‘ప్రిలిమినరీ పరీక్షే కదా.. ఎలాగైనా క్వాలిఫై అవుతా’మనే ధీమా ఎంత మాత్రం పనికి రాదు. అలాగే ‘కొన్ని విభాగాలు చదివి ప్రిలిమినరీ గట్టెక్కవచ్చు’ అనే ఆలోచన కూడా మంచిది కాదు. అందువల్ల అన్ని విభాగాలకూ సమ ప్రాధాన్యమిచ్చి ప్రిపేర్‌ అయ్యే వ్యూహమే మెరుగు.

* అన్ని విభాగాలకూ సమప్రాధాన్యం ఇస్తూనే, స్కోరింగ్‌ విభాగాలపై అధిక దృష్టి పెట్టడం సురక్షితమైన సన్నద్ధత. కొద్దిపాటి శ్రమతో సొసైటీ, కరెంట్‌ అఫైర్స్‌లో గరిష్ఠ స్కోర్లు సాధించవచ్చు. గణిత నేపథ్యం ఉన్న అభ్యర్థులు రీజనింగ్, ఇతర మానసిక సామర్థ్యాల్లో ఎక్కువ స్కోరు సాధిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా గణిత నేపథ్యం లేనివారు కనీసం సగటు స్కోరైనా సాధించేందుకు సమయాన్ని కేటాయించుకుని ఎక్కువ సాధన చేయాలి. భారతదేశ చరిత్ర, భౌగోళిక అంశాల్లో ముఖ్యమైన కొన్ని టాపిక్స్‌ని ఎంచుకుని ముందస్తుగా కవర్‌ చేస్తే మంచి మార్కులు సాధించే అవకాశం పెరుగుతుంది.

* భారతదేశ చరిత్ర, భౌగోళిక అంశాలు, సామాజిక వ్యవస్థలో బేసిక్స్‌పై ప్రశ్నలు ఎక్కువ రావొచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొనేందుకు పాఠశాల స్థాయి పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. సమాజం అనే విభాగానికి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాన్ని వినియోగించుకుంటే మంచిది.

* కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి 2023 ఫిబ్రవరి నుంచి కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. గత ప్రశ్నపత్రాల ధోరణిని బట్టి ఏపీపీఎస్సీ ఒక సంవత్సర కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే పరీక్ష తేదీకి ఆరు నెలల ముందు కాలంపై ఎక్కువ ప్రశ్నలు రావొచ్చు.  

* ఫ్రెషర్‌ అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష సిలబస్‌పై పూర్తి పట్టు దొరకకపోతే మెయిన్స్‌కు తయారవటం సమంజసం కాదు. ప్రిలిమినరీ పాస్‌ అయితేనే కదా మెయిన్స్‌ రాసేది! అయితే మెయిన్స్‌ లోని ఇండియన్, ఏపీ ఎకానమీలపై అప్పటికప్పుడు చదివితే  అనుకున్న రీతిలో ఫలితం ఉండకపోవచ్చు. ఆర్థిక అంశాలపై పట్టు సాధించేందుకు ఒకటి రెండు గంటల సమయాన్ని ప్రతిరోజూ ఇప్పటినుంచే కేటాయిస్తే ప్రిలిమ్స్‌ తర్వాత మెయిన్స్‌లో రాణించవచ్చు. 

* దీర్ఘకాలంగా గ్రూప్‌-2 కోసం సిద్ధమవుతున్నవారు ప్రిలిమినరీ పరీక్ష సిలబస్‌తో పాటు మెయిన్స్‌ సిలబస్‌ను కూడా ఇప్పటినుంచే చదువుకోవడం మంచిది.

* చదివిన అంశాలపై ఎంతవరకు సాధన ఉందో అర్థం చేసుకునేందుకు చాప్టర్ల వారీగా, విభాగాల వారీగా పరీక్షలు రాయడం అవసరం. సమయం తక్కువగా ఉందని పుస్తకాలను చదువుతూ పోయి సాధన స్థాయిని అంచనా వేయకపోతే లోపాలను కనిపెట్టలేరు. ఫలితంగా ఆశించిన ఫలితం రాకపోవచ్చు. సమయం తక్కువగానే ఉన్నా ప్రిపరేషన్‌లో అంతర్భాగంగానే పరీక్షలు ప్రాక్టీస్‌ చేయడం తప్పనిసరి.

 
గ్రూప్‌-1, 2 


* గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసేవారికి గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ సులభమని చెప్పవచ్చు. సొసైటీ అనే విభాగం తప్ప మిగతావన్నీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ఉన్నందున ఇబ్బంది ఏమీ ఉండదు. ప్రతిరోజూ అరగంట సమయాన్ని సొసైటీలోని సిలబస్‌ అంశాలకు కేటాయిస్తే సరిపోతుంది. అదే సందర్భంలో గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌కు మాత్రమే ప్రిపేరైన అభ్యర్థులు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను ఎదుర్కోవటం కష్టమైన విషయమే.


* గ్రూప్‌-2 అభ్యర్థులు ‘రాత’ నైపుణ్యాలు, ‘డిస్క్రిప్టివ్‌’ సామర్థ్యాలూ అంచనా వేసుకుని గ్రూపు-1లో నిజంగా రాణించగలమా లేదా అని నిర్ణయించుకోవాలి. ఆపై మాత్రమే గ్రూపు-1పై ఆలోచన పెంచుకోవడం సరైన నిర్ణయం. లేకపోతే రెండింటికీ చెడినట్టు అవుతారు.

 


 


గ్రూప్‌-II -స్క్రీనింగ్ టెస్ట్-సెక్షన్ - ఎ -జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
 

1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు
2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు
3. జనరల్‌ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు
 
4. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర
5. భారత రాజకీయ వ్యవస్థ, పాలన: రాజ్యాంగ సమస్యలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ-గవర్నెన్స్‌ కార్యక్రమాలు
6. ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టితో భారత భూగోళశాస్త్రం
7. విపత్తు నిర్వహణ: విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్టనివారణ ఉపశమన చర్యలు, రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌ సహాయంతో విపత్తు అంచనా
8. సుస్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ
9. తార్కిక వివరణ, విశ్లేషణాత్మక సామర్థ్యాలు, తార్కిక అన్వయం
10. దత్తాంశ విశదీకరణ:   ఎ) దత్తాంశానికి టేబుల్‌ రూపం, బి) దత్తాంశ దృశ్యీకరణ, అన్వయం,    సి) ప్రాథమిక దత్తాంశ విశ్లేషణ (అంకగణితం, మధ్యగణితం, బాహుళకం) 
11. ఆంధ్రప్రదేశ్‌ విభజన, పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, చట్టపరమైన సమస్యలు


సెక్షన్ - బి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారత రాజ్యాంగం


సెక్షన్ - సి భారతదేశ ప్లానింగ్, ఆర్థిక వ్యవస్థ


పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు  నమూనా ప్రశ్నపత్రాలు 

Posted Date : 13-12-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు