• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగంలో ఏవి ప్రధానం?

ఇండియన్‌ పాలిటీ ప్రిపరేషన్‌ విధానం

గ్రూప్స్‌ లాంటి పోటీ పరీక్షల్లో ‘ఇండియన్‌ పాలిటీ’కి ప్రత్యేకత ఉంది. దీనిలో భాగమైన ‘రాజ్యాంగం’ అంశాన్ని కొందరు అభ్యర్థులు కఠినమైందిగా భావిస్తున్నారు. సరైన అవగాహనతో సన్నద్ధమైతే రాజ్యాంగం నుంచి వచ్చే ఎలాంటి ప్రశ్నలనైనా అలవోకగా ఎదుర్కోవచ్చు. అధిక మార్కులను సాధించవచ్చు!

దేశ పరిపాలనను నిర్దిష్ట పద్ధతిలో కొనసాగించేందుకు ఉపకరించే అత్యున్నత శాసనమే రాజ్యాంగం. దీని అర్థ సమాఖ్య, లౌకిక స్వభావంపై దృష్టి సారించాలి. మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించేందుకు రాజ్యాంగ నిర్మాతలు అనుసరించిన మార్గాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల చూపిన విశ్వాసం, దేశ ప్రజల సంక్షేమాన్ని ఆశించిన విధానాలపై అధ్యయనం సాగిస్తే రాజ్యాంగ స్వభావంపై అవగాహన ఏర్పరుచుకోవచ్చు. 

పరిణామం-అభివృద్ధి: భారత రాజ్యాంగ పరిణామ క్రమంపై తప్పనిసరిగా పరీక్షలో ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ భాగం కాస్త కఠినంగా అనిపించినప్పటికీ క్రమ పద్ధతిలో చదివితే అలా అనిపించదు. దీనిలో భాగంగా బీసీ రావత్‌ అనే రాజనీతిజ్ఞుడు పేర్కొన్న భారత రాజ్యాంగ ఆరు రకాల వర్గీకరణ దశలను గుర్తుంచుకోవాలి. 

‘రెగ్యులేటింగ్‌ చట్టం-1773’లోని మౌలికాంశాలపై దృష్టి నిలపాలి. పిట్స్‌ ఇండియా చట్టం-1784లోని అంశాలు, 1793, 1813, 1833, 1853 నాటి చార్టర్‌ చట్టాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ‘భారత ప్రభుత్వ చట్టం-1858’ లోని మౌలికాంశాలూ, 1861, 1892 ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టాలు తెలుసుకోవాలి.  

మింటో-మార్లే సంస్కరణల చట్టం-1909, మాంటేెగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం-1919లోని మాలికాంశాలపై తరచూ ప్రశ్నలు వస్తున్నాయి. భారత రాజ్యాంగానికి జిరాక్స్‌ కాపీగా పేరొందిన ‘భారత ప్రభుత్వ చట్టం-1935'లోని అంశాలను గుర్తుంచుకోవాలి.  

1940 నాటి ‘ఆగస్ట్‌ ప్రతిపాదనలు’, 1942 నాటి క్రిప్స్‌ ప్రతిపాదనలు, 1946 నాటి క్యాబినెట్‌ మిషన్‌/ మంత్రిత్రయ రాయబారంలోని కీలక అంశాలపై అవగాహన ఉండాలి. భారత స్వాతంత్య్ర చట్టం-1947లోని అంశాలపై పట్టు సాధించాలి.

రాజ్యాంగ సభ - నిర్మాణం

భారత రాజ్యాంగ రచనకు రాజ్యాంగసభ ఏర్పడిన విధానం, 1946లో రాజ్యాంగసభకు జరిగిన ఎన్నికలు, వాటి ప్రత్యేకతలు, రాజ్యాంగసభకు ఎన్నికైన ప్రముఖ మహిళలు, స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగసభలో ఉన్న 299 మంది ప్రతినిధులు జరిపిన కృషి, రాజ్యాంగ సభపై ప్రముఖుల వ్యాఖ్యానాలు ముఖ్యమైనవి.  

రాజ్యాంగసభలో వివిధ వర్గాల ప్రతినిధులైన  ప్రముఖుల వివరాలు, రాజ్యాంగ రచనకు రాజ్యాంగ సభ జరిపిన 11 సమావేశాలు, వాటిలోని అంశాలు గ్రహించాలి. రాజ్యాంగసభ ఏర్పాటుచేసిన 22 కమిటీలు, వాటి అధ్యక్షులు, 1947, ఆగస్టు 29న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ ముసాయిదా కమిటీలోని సభ్యులు, ఈ కమిటీ రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంపై జరిగిన చర్చలు, వ్యాఖ్యానాలపై దృష్టి సారించాలి. 

2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయంలో రూపొందించిన రాజ్యాంగాన్ని 1949, నవంబరు 26న ఆమోదించుకున్న తీరు; 1950, జనవరి 26 నుంచి 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్లు, 22 భాగాలతో అమల్లోకి వచ్చిన విధానంపై అవగాహన అవసరం.  

మౌలిక లక్షణాలపై పట్టు 

ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా పేరొందిన భారత రాజ్యాంగానికి అనేక విశిష్ట లక్షణాలున్నాయి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం, సార్వజనీన వయోజన ఓటు హక్కు, దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనం, ఏక పౌరసత్వం, స్వయంప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థ, న్యాయస్థానాలకున్న న్యాయ సమీక్షాధికారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగం ప్రకారం జరిగిన 3 రకాల అధికారాల విభజనలపై దృష్టి కేంద్రీకరించాలి. 

‣ రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటుచేసిన స్వయంప్రతిపత్తి వ్యవస్థలు, జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్న ద్విసభా విధానం, ఆర్టికల్‌ 368 ప్రకారం పార్లమెంటు జరిపే 3 రకాల రాజ్యాంగ సవరణ పద్ధతులపై అవగాహన ఉండాలి. 

ప్రవేశిక

రాజ్యాంగ తాత్విక పునాదుల ఆధారంగా, భారత రాజ్యాంగానికి ‘ఆత్మ’గా అభివర్ణించే ప్రవేశికలోని అంశాలపై పట్టు సాధించాలి. 1946, డిసెంబర్‌ 13న రాజ్యాంగసభలో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రవేశపెట్టిన ఉద్దేశాల తీర్మానం ఆధారంగా ‘రాజ్యాంగ ప్రవేశిక’ రూపొందింది. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా? కాదా? అనే అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అధ్యయనం చేయాలి. రాజ్యాంగ ప్రవేశికను ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించి ప్రవేశికకు చేర్చిన సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాల అర్థ వివరణ, ఆవశ్యకతపై అవగాహన అవసరం. 

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేర్కొన్నట్లు భారత రాజ్యాంగం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగానూ, అసాధారణ పరిస్థితుల్లో ఏకకేంద్రంగానూ అవతరించే విధానంపై అవగాహన ఉండాలి.

పౌరసత్వం

భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని భారతీయులందరికీ ఏకపౌరసత్వాన్ని ప్రతిపాదించడం, పౌరసత్వాన్ని పొందే మార్గాలు, కోల్పోయే మార్గాలు, భారత పౌరసత్వ చట్టం-1955లోని అంశాలు, ఎల్‌.ఎం.సింఘ్వీ కమిషన్‌ సిఫారసుల ఆధారంగా ప్రవాస భారతీయులకు కల్పించే ‘ద్వంద్వ పౌరసత్వం’ (డ్యూయల్‌ సిటిజన్‌షిప్‌) మొదలైన అంశాలపై పట్టు సాధించాలి. 

ప్రాథమిక హక్కులు

పౌరుల సమగ్ర వికాసానికి ఉపకరించే ప్రాథమిక హక్కులు, భారత్‌లో ప్రాథమిక హక్కుల అభివృద్ధి క్రమం, 1947లో రాజ్యాంగ సభ ఏర్పాటుచేసిన ప్రాథమిక హక్కుల ఉపసంఘం సిఫారసులు, రాజ్యాంగం మూడో భాగంలో ఆర్టికల్స్‌ 12 నుంచి 35 మధ్య వివరించిన సమానత్వపు హక్కు, స్వేచ్ఛా స్వాతంత్య్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్య్రపు హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కులపై పూర్తి అవగాహన అవసరం. 

‣ ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్ట్టు, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు జారీచేసే హెబియస్‌ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవారంటో రిట్స్‌ తెలుసుకోవాలి. 

ప్రాథమిక హక్కులకు సంబంధించి 1967 నాటి గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు, 1973 నాటి కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు, 1978 నాటి మేనకాగాంధీ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల్లోని మౌలికాంశాలపై దృష్టి సారించాలి. 

ఆదేశిక సూత్రాలు - సంక్షేమ సాధనాలు 

భారత్‌ను సంక్షేమ రాజ్యంగా రూపొందించే లక్ష్యంతో రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్స్‌ 36 నుంచి 51 మధ్య పేర్కొన్న ఆదేశిక సూత్రాలు/ నిర్దేశిక నియమాల్లోని మౌలికాంశాలు పరీక్ష కోణంలో ముఖ్యం. ఆదేశిక సూత్రాల అమలుకు రూపొందించిన వివిధ చట్టాలు, ఆదేశిక సూత్రాలు- ప్రాథమిక హక్కుల మధ్య వైరుధ్యాలు, ఆదేశిక సూత్రాలపై అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పుల్లోని మౌలికాంశాలు ముఖ్యం. 

ప్రాథమిక విధులు

ప్రాథమిక హక్కులతోపాటు ప్రాథమిక విధులు కూడా అందించే లక్ష్యంతో ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో స్వరణ్‌సింగ్‌ కమిటీ సిఫారుసుల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగం 4వ భాగంలోని 4(ఎ)లో ఆర్టికల్‌ 51 (ఎ) ప్రాథమిక విధులను చేర్చారు. అటల్‌బిహారి వాజ్‌పేయి ప్రభుత్వం ప్రాథమిక విధులపై అధ్యయనం కోసం ఏర్పరిచిన జేఎస్‌ వర్మ కమిటీ, దాని సిఫారసులపై అవగాహన అవసరం. రాజ్యాంగంలోని 11 ప్రాథమిక విధుల్లోని మౌలికాంశాలపై పట్టు సాధించాలి. 
 

*********************************************************************************

 

సెక్షన్-ఎ: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
 

1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు

2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు

3. జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు

4. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా ఆధునిక భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర

5. భారత రాజకీయ వ్యవస్థ, పాలన: రాజ్యాంగ అంశాలు, ప్రభుత్వ విధానాలు, ఆంధ్రప్రదేశ్ను ఆధారంగా చేసుకొని తీసుకున్న సంస్కరణలు, ఈ-గవర్నెన్స్ కార్యక్రమాలు

6. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో ఆర్థికాభివృద్ధి

7. ఆంధ్రప్రదేశ్, భారత ఉపఖండం యొక్క భౌతిక భూగోళశాస్త్రం

8. విపత్తు నిర్వహణ: విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ సహాయంతో విపత్తు అంచనా

9. సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ

10. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ ప్రిటేషన్

11. డేటా అనాలిసిస్: ఎ) టాబ్యులేషన్ ఆఫ్ డేటా బి) విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా సి) బేసిక్ డేటా అనాలిసిస్ (అంకగణితం, మధ్యగణితం, బాహుళకం)

12. ఆంధ్రప్రదేశ్ విభజన, పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైన సమస్యలు(విభజన సమస్యలు)


సెక్షన్-బి: జనరల్ ఇంగ్లిష్, తెలుగు

a) Comprehension

b) Usage and Idioms

c) Vocabulary and Punctuation

d) Logical re-arrangement of sentences

e) Grammar

ఎ) పర్యాయపదాలు, పదజాలం

బి) వ్యాకరణం

సి) తెలుగు పదాలకు ఇంగ్లిష్ అర్థాలు

డి) ఇంగ్లిష్ పదాలకు తెలుగు అర్థాలు

ఇ) పలుకుబడి/ వాడుక, నుడికారం/ జాతీయాలు


ఈ-బుక్స్


పాత ప్రశ్నప‌త్రాలు


నమూనా ప్రశ్నపత్రాలు

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పునశ్చరణతో పట్టు... మాక్‌ పరీక్షలతో ధీమా!

‣ ప్రయోజనాలే ప్రమాణం!

‣ మేనేజ్‌మెంట్‌ ప్రవేశాలకు మ్యాట్‌

‣ చదివినవి గుర్తుండాలంటే...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌