Asked By: విశ్వనాథ్
Ans:
ముందుగా మీరు సప్లయ్ చెయిన్ మేనేజ్‌మెంట్ (ఎస్‌సీఎం) కోర్సును ఎందుకు చదవాలనుకుంటున్నారు.. ఇది చదివాక ఏ రంగంలో, ఏ ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటున్నారు.. అనే విషయాలపై స్పష్టత అవసరం. సాధారణంగా సప్లయ్ చెయిన్ మేనేజ్‌మెంట్ ఎంబీఏలో ఒక స్పెషలైజేషన్‌గా కానీ, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌లో ఒక సబ్జెక్ట్‌గా కానీ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీలు ప్రత్యేకమైన ఎంబీఏ-ఎస్‌సీఎం కోర్సును కూడా అందిస్తున్నాయి. చాలా ప్రైవేటు యూనివర్సిటీలు ఆన్‌లైన్‌లోనూ ఎస్‌సీఎం ఎంబీఏ అందిస్తున్నాయి. మణిపాల్, నార్సీమోన్జి, సింబయాసిస్, లవ్లీ ప్రాఫెషనల్, శివనాడార్, ఎస్‌ఆర్‌ఎం, శాస్త్ర, డీవై పాటిల్, కోనేరు లక్ష్మయ్య, విజ్ఞాన్, జైన్ యూనివర్సిటీలతోపాటు మరికొన్ని యూనివర్సిటీల్లో కూడా ఈ కోర్సు ఎంబీఏ/పీజీ డిప్ల్లొమా ప్రోగ్రామ్‌ల్లో అందుబాటులో ఉంది.
ఫీజు విషయానికొస్తే.. ఒక్కో విద్యా సంస్థలో, ఒక్కో రకంగా ఉంటోంది. మన దేశంలో నాలుగు సెమిస్టర్లతో కూడిన రెండు సంవత్సరాల ఎంబీఏ - సప్లయ్ చెయిన్ మేనేజ్‌మెంట్ కోర్సుకు కనీసం రూ. యాభై వేలు చెల్లించాలి. ఏదైనా యూనివర్సిటీని ఎంచుకునే ముందు.. ఆ యూనివర్సిటీకి, కోర్సుకు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో నిర్ధారించుకోవాలి. అయితే ఎంబీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులను దూరవిద్య ద్వారా కాకుండా రెగ్యులర్‌గా చదివితేనే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: లావణ్య
Ans:
మీరు మహారాష్ట్రలో ఏ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారో చెప్పలేదు. అది ప్రభుత్వ యూనివర్సిటీనా, డీమ్డ్ టుబీ వర్సిటీనా, ప్రైవేటు యూనివర్సిటీనా, ఆ విశ్వవిద్యాలయానికి యూజీసీ గుర్తింపు ఉందా అనే విషయాలు తెలిపివుండాల్సింది. డిగ్రీ కోర్సుకు సంబంధించిన కాలవ్యవధి, రకరకాల డిగ్రీలు, డిగ్రీ ప్రోగ్రామ్‌కు అవసరమైన నిర్దిష్ట క్రెడిట్‌ల సంఖ్యను యూజీసీ గెజెట్ రూపంలో తెలియచేసింది. ఒకవేళ మీరు డిగ్రీ పొందిన యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉండి, దాని మార్గదర్శకాలకు లోబడి మీ డిగ్రీ కోర్సు నిర్వహించివుంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈక్వివలెన్స్ సర్టిఫికెట్ పొందడం కష్టమేమీ కాదు. ఈ సర్టిఫికెట్ భవిష్యత్తులో ఉస్మానియా యూనివర్సిటీలో విద్య, ఉద్యోగావసరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈక్వివలెన్స్ సర్టిఫికెట్‌ను ఇతర ప్రభుత్వ/ ప్రైవేటు ఉద్యోగాల కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: శ్రీనివాస్
Ans:
బీఎస్సీ బయోకెమిస్ట్రీ తరువాత, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేసే అవకాశం ఉంది. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేసినవారికి కార్పొరేట్ హాస్పిటల్స్, బయోటెక్ కంపెనీలు, ఫుడ్ అండ్ బేవరెజెస్ ఇండస్ట్రీలు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఫార్మా, కెమికల్, ఫోరెన్సిక్, హెల్త్ కేర్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే జూనియర్/ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేయవచ్చు. బయోకెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసి, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా/ పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా స్థిరపడవచ్చు. ఎంఎస్సీలో బయోకెమిస్ట్రీ కాకుండా దీనికి అనుబంధంగా ఉన్న మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, సిస్టమ్స్ బయాలజీ, ప్లాంట్ బయాలజీ, యానిమల్ బయాలజీ, బయోమెడికల్, బయో ఫిజిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, టాక్సికాలజీ, ఇమ్యునాలజీ లాంటి సబ్జెక్టులు కూడా చదవొచ్చు. పైన పేర్కొన్న అన్ని కోర్సులకూ ఉద్యోగావకాశాలు బాగుంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎం. నాగరాజు
Ans:
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ కోర్సు చదివినవారికి ఉద్యోగ మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో మాత్రమే ఈ కోర్సు 2017 నుంచి అందుబాటులో ఉంది. మనదేశంలో ఈ ప్రత్యేక కోర్సును తొలిసారిగా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఇది గత రెండు సంవత్సరాలుగా దేశపు టాప్ టెన్ ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ కోర్సుల్లో స్థానం సంపాదిస్తూ ఈ రంగంలో నిపుణుల్ని అందిస్త్తోంది. ఇక్కడ ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ చేయాలంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీ)-2023 రాయాలి.. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 19 ఏప్రిల్, 2023. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాక, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కి కూడా దరఖాస్తు చేయాలి. ప్రవేశపరీక్ష మార్కులకు 60% వెయిటేజీ ఇచ్చి, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలను 40 మార్కులకు నిర్వహించి, ఉమ్మడి ప్రతిభ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ కోర్సు ఇంకా వివిధ ప్రైవేటు యూనివర్సిటీలు/ బిజినెస్ స్కూళ్లలో ఉంది. ఆయా విద్యాసంస్థల వెబ్‌సైట్‌లను సందర్శించి ప్రవేశ విధానాల గురించి తెలుసుకోండి. టీఎస్ ఐసెట్ ద్వారా తెలంగాణా రాష్ట్ర యూనివర్సిటీల్లో/ అనుబంధ కళాశాలల్లో మాత్రమే ఎంబీఏ అడ్మిషన్ పొందవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల్లో/ కళాశాలల్లో ప్రత్యేక ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ కోర్సు అందుబాటులో లేదు. సాధారణ ఎంబీఏలో మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్‌లతో పాటు ఒక స్పెషలైజేషన్‌గా మాత్రమే బిజినెస్ అనలిటిక్స్ సబ్జెక్ట్ అందుబాటులో ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: Anitha
Ans:
Click on the following link and go through the stories, you will get the required information.
https://pratibha.eenadu.net/admissions/index/icet/telangana/2-2-19-410
Asked By: బీవీడీ రమణమూర్తి, విశాఖపట్నం
Ans:
ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ కోర్సుని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో అతితక్కువ యూనివర్సిటీలు మాత్రమే అందిస్తున్నాయి. సాధారణంగా ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చేయాలంటే, డిగ్రీలో స్టాటిస్టిక్స్ చదివి ఉండాలన్న నిబంధన అమల్లో ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ విభాగంలో మాత్రం ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ చేయాలంటే డిగ్రీలో మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి. కాబట్టి, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొ. జి. రాంరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ కోర్సుని ప్రైవేటుగా చేయొచ్చు. భవిష్యత్తులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 పూర్తి స్థాయిలోకి అమల్లోకి వచ్చాక మరిన్ని యూనివర్సిటీలు యూజీ/పీజీ కోర్సుల ప్రవేశాలకు విద్యార్హతలను మరింతగా సడలించే అవకాశం ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: డి.సతీష్
Ans:
ఎంబీఎ మార్కెటింగ్ చేశాక మార్కెటింగ్ రంగంలో ఉద్యోగం పొందాలంటే డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, బ్రాండింగ్, అడ్వర్ట్టైజింగ్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ మేనేజ్‌మెంట్, కస్టమర్ సెంట్రిక్ మార్కెటింగ్, డేటా మైనింగ్, మార్కెటింగ్ అనలిటిక్స్, వెబ్ అనలిటిక్స్, స్ట్రాటజిక్ మార్కెటింగ్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ రీసెర్చ్ లాంటి కోర్సుల్లో మీకు ఆసక్తి ఉన్నవి చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగుపర్చుకోవచ్చు. సాధారణంగా ఎంబీఏ మంచి కళాశాలలో చేస్తే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లోనే ఉద్యోగం వస్తుంది. అలా రానిపక్షంలో, పైన చెప్పిన కోర్సుల్లో కనీసం రెండు చేసే ప్రయత్నం చేయండి. వీటిని ఐఐఎం, మైకా లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి చేస్తే మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయి. అవకాశం ఉంటే, ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ కోసం ప్రయత్నించండి. మీ పనితీరు నచ్చితే, అదే సంస్థలో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: తేజస్వి
Ans:
- ఎంబీఏ తర్వాతŸ పీహెచ్‌డీ చేయాలనే ఆలోచన అభినందనీయం. కానీ, ఎంబీఏ, పీహెచ్‌డీలు అత్యుత్తమ విద్యాసంస్థల్లో చేసినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతర్జాతీయ ర్యాంకుల్లో మెరుగైన స్థానంలో ఉన్న మేనేజ్‌మెంట్ కాలేజీల్లో ఎంబీఏ చేసినవారు విదేశాల్లో నేరుగా పీహెచ్‌డీ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎంబీఏ చదివిన కళాశాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లేనట్లయితే, విదేశాల్లో మరో పీజీ చేసి, పీహెచ్‌డీ చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో పీజీ... ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి, మీరు ఇక్కడే ఏదైనా ఉద్యోగం చేసి, ఆర్థికంగా స్థిరపడ్డాక విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఐరోపా దేశాల్లోని కొన్ని యూనివర్సిటీలు మాత్రం మన పీజీతో కూడా పీహెచ్‌డీ చేసే అవకాశం కల్పిస్తున్నాయి.
సాధారణంగా విదేశాల్లో పీహెచ్‌డీ చేసేవారికి చాలా ఫెలోషిప్‌లు అందుబాటులో ఉంటాయి. కొన్ని ఐఐటీలు, ఐఐఎంలు విదేశీ యూనివర్సిటీలతో కలిసి జాయింట్ పీహెచ్‌డీ చేసే అవకాశాన్నీ కల్పిస్తున్నాయి. అందులో భాగంగా కనీసం రెండు సంవత్సరాలు విదేశీ యూనివర్సిటీలో పరిశోధన చేసుకోవచ్చు. అలా కాకుండా, మనదేశంలోనే ఏదైనా యూనివర్సిటీలో ప్రముఖ ప్రొఫెసర్ పర్యవేక్షణలో కనీసం రెండు నాణ్యమైన పరిశోధన పత్రాలను అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించి, మంచి పరిశోధనాంశంతో విదేశాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసినట్లయితే మరో పీజీ చేయకుండానే, పూర్తి ఫెలోషిప్‌తో పరిశోధన చేయవచ్చు. ఎంబీఏ తరువాత మీరు ఇక్కడే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించవచ్చు. ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం యూజీసీ నిర్వహించే నెట్ పరీక్షలో ఉత్తీర్ణత అవసరం. ప్రైవేటు రంగానికొస్తే- ఎంబీఏలో మీ స్పెషలైజేషన్‌కు అనుగుణమైన కోర్సులు చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: సురేష్
Ans:
బిజినెస్ మేనేజ్‌మెంట్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులను రెగ్యులర్‌గానే చదవాలి. ఒకవేళ రెగ్యులర్‌గా చదవడం కుదరకపోతే ఆన్‌లైన్‌లో చదివే ప్రయత్నం చేయండి. డిస్టెన్స్ మోడ్‌లో సర్టిఫికెట్/డిప్లొమా కోర్సుకు బదులు, ఎంబీఏ చేసే ప్రయత్నం చేయండి. సర్టిఫికెట్/ డిప్లొమా కోర్సుల నాణ్యత- వాటిని అందించే సంస్థల విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు అందించే సర్టిఫికెట్‌లకు మార్కెట్లో ఎక్కువ గుర్తింపు ఉంటుంది. జనరల్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో కంటే, ఏదైనా స్పెషలైజేషన్ లో సర్టిఫికెట్/డిప్లొమా కోర్సు చేస్తే ఎక్కువ ఉపయోగకరం.
మీరు సేల్స్ విభాగంలో పనిచేస్తున్నారు కాబట్టి, సేల్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్, అడ్వర్ట్టైజింగ్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, సోషల్ మీడియా మార్కెటింగ్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, బ్రాండింగ్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ్స మేనేజ్‌మెంట్, రీటెయిలింగ్, ఈ-కామర్స్, సర్వీసెస్ మార్కెటింగ్ లాంటి కోర్సులు చేసినట్లయితే మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగ అనుభవం, ఉద్యోగ మెలకువలతో పాటు మెరుగైన విద్యాసంస్థ నుంచి పొందే సర్టిఫికెట్ సహాయంతో, మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కరియర్ కౌన్సెలర్
Asked By: ఎ. సాయిపవన్
Ans:
మీరు బీఎస్సీ చదివేప్పుడే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ రంగంలో పనిచేయాలని ఆలోచించడం అభినందనీయం. బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీలు రెండూ పరిశోధనకు బాగా అవకాశమున్న రంగాలే. లైఫ్ సైన్సెస్‌లో ముఖ్యమైన విభాగాలే. రెండు కోర్సుల్లో చదివే సిలబస్‌లో సారూప్యం ఉంటుంది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో రెండు నుంచి మూడు సెమిస్టర్లు.. ఈ రెండు కోర్సులవారు ఒకే తరగతి గదిలో కలిసే చదువుతారు. ఈ రెండు విభాగాల్లో పరిశోధనాంశాలు కూడా చాలావరకు ఒకేలా ఉంటాయి. మీకు అమితాసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకొని, ప్రాథ]మికాంశాలు, అప్లికేషన్స్ బాగా నేర్చుకొని మేలైన పరిశోధనలు చేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్