Post your question

 

  Asked By: లోకేష్‌

  Ans:

  హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివినవారికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలనే తొందరలో చాలామంది బోగస్‌ కన్సల్టెన్సీల్లో డబ్బు కట్టి మోసపోతున్నారు. మీరు కన్సల్టెన్సీని సంప్రదించే ముందు కొంత హోమ్‌ వర్క్‌ చేసుకోండి. ముఖ్యంగా ఆ కన్సల్టెన్సీ విశ్వసనీయత పూర్తిగా తెలుసుకోండి. ఒక్కదానిమీదే ఆధారపడకుండా రెండు మూడు కన్సల్టెన్సీలను సంప్రదించి వాటి సమాచారాన్ని తెలుసుకోండి. మీ కళాశాల సీనియర్లు ఎవరైనా దుబాయ్‌లో పనిచేస్తుంటే, వారి ద్వారా అక్కడి ఉద్యోగ మార్కెట్‌ సమాచారాన్ని సేకరించండి. వారు దుబాయ్‌లో ఎలా ఉద్యోగం పొందారో కూడా కనుక్కోండి. వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకొని, సరైన కన్సల్టెన్సీని సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఇంటర్‌నెట్‌లో కూడా కన్సల్టెన్సీల గురించి చాలా సమాచారం అందుబాటులో ఉంది. అది కూడా దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. వీలైనంత వరకు కన్సల్టెన్సీతో సంబంధం లేకుండా అక్కడ ఉద్యోగం పొందే అవకాశాల గురించీ ఆలోచించండి. కన్సల్టెన్సీ ద్వారా విదేశాలకు వెళ్ళడంపై పూర్తి నమ్మకం లేకపోతే, మనదేశంలో ఉన్న అంతర్జాతీయ హోటల్‌లో కొంతకాలం ఉద్యోగం చేసి, బదిలీ ద్వారా దుబాయ్‌ వెళ్లే మార్గం ఉంది. అక్కడ కొంతకాలం పనిచేసి, ఆ తరువాత దుబాయ్‌లో మరో ఉద్యోగం పొందే ప్రయత్నాలు చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: ఎన్‌.రమేష్‌కుమార్‌

  Ans:

  మీరు ఎంఏ పూర్తి చేశారంటే, మీ వయసు కనీసం 23 ఏళ్లు ఉంటుంది. ఇప్పుడు ఐటీఐ చేస్తే, మరో రెండేళ్లు చదవాలి. అంతేకాకుండా, మీకంటే పది సంవత్సరాలు తక్కువ వయసున్నవారితో కలిసి విద్య అభ్యసించాలి. ఐటీఐ చేశాక కూడా ఉద్యోగం రావడం కష్టమయితే, అప్పుడు ఏం చేస్తారు? మీకు ఐటీఐ కోర్సు అంటే ఇష్టమా, ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతోనా? ప్రస్తుతం ప్రతి ఉద్యోగానికీ చాలా పోటీ ఉంది. అందుబాటులో ఉన్న ఉద్యోగాలు వేలల్లో ఉంటే, వాటికి అర్హులయిన వారు లక్షల్లో ఉన్నారు. ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే- అందుబాటులో ఉన్న తక్కువ కొలువుల కోసం పోటీ పడి, మెరుగైన ప్రతిభతో ఉద్యోగం పొందే ప్రయత్నం చేయాలి.
  చాలామంది ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అనే భావనతో ఉంటున్నారు. ముందుగా దీన్నుంచి బయటకు వచ్చి నచ్చిన పని చేస్తూ సంబంధిత రంగంలో ఎదిగే ప్రయత్నం చేయటం ఉత్తమం. ఒకవేళ మీరు ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగం పొందినా, మీ పీజీ చదువుకు తగిన ఉద్యోగం పొందలేక పోయానని బాధ పడవచ్చు. అలా కాకుండా పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పీజీతో కానీ, మీ డిగ్రీ విద్యార్హతతో కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. కేంద్ర, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలతో పాటు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ లాంటి ఉద్యోగాలకోసం ప్రయత్నించండి. బీఈడీ చేసి బోధనరంగంలో ప్రయత్నాలు చేయవచ్చు. బీఈడీ చేసి రాష్ట్ర ప్రభుత్వ డీ… ఎస్సీ కోసం మాత్రమే ఎదురుచూడకుండా నవోదయ, కేంద్రీయ విద్యాలయ లాంటి కేంద్రీయ విద్యాసంస్థల్లోనూ ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఆసక్తి/ అవకాశం ఉంటే జర్నలిజం, లైబ్రరీ సైన్స్, మేనేజ్‌మెంట్, ఎల్‌ఎల్‌బీ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సుల గురించి కూడా ఆలోచించండి. ఇంగ్లిష్‌ భాషపై కొంత పట్టుంటే ఎంఏ ఇంగ్లిష్‌ చదివి బోధన రంగంలో ఉపాధి అవకాశాలు పెంచుకోవచ్చు. మీ పీజీ విద్యార్హతతో స్వచ్ఛంద సేవాసంస్థల్లో, ప్రభుత్వేతర సంస్థల్లో, రిటైలింగ్‌ రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. ఇవన్నీ వీలుకాకపోతే మీరు అనుకున్నట్లుగా, ఐటీఐ చేసి మీరనుకుంటున్న కోర్సులూ.. కొలువుల ప్రయత్నాలు చేయండి. -
  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: వినయ్‌ చెవ్వ

  Ans:

  చాలా కాలంగా ఒక్కో యూనివర్సిటీ ఒక్కో పద్ధతిని అవలంబిస్తూ పీహెచ్‌డీ ప్రవేశాలు చేపడుతున్నాయి. చాలా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జాతీయస్థాయిలో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి, ప్రతిభ కనపర్చినవారికి ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జాతీయ పరిశోధన సంస్థలు యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌ జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ పొందిన విద్యార్థులకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. నెట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌)లో ఉత్తీర్ణత పొందినవారికి కూడా చాలా యూనివర్సిటీలు రాతపరీక్ష నుంచి మినహాయింపు ఇస్తున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం ఎంఫిల్‌ పూర్తి చేసినవారికి కూడా రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంది. అలాగే గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌)లో మంచి పర్సంటైల్‌ పొందినా, రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంది. రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల్లో పైన చెప్పినవాటికి అదనంగా స్టేట్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌ (సెట్‌)లో అర్హత పొందినవారు ఇంటర్వ్యూ ద్వారా పీహెచ్‌డీలో నేరుగా ప్రవేశం పొందే అవకాశం ఉంది. నెట్‌/ సెట్‌లో ఉత్తీర్ణత పొందలేకపోతే, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఆర్‌సెట్‌ (రిసెర్చ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)లో మెరుగైన ర్యాంకు పొంది, ఇంటర్వ్యూ ద్వారా రాష్ట్ర యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశం పొందవచ్చు.
  వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గత నెలలో యూజీసీ పీహెచ్‌డీ ప్రవేశాల్లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా పీహెచ్‌డీ ప్రవేశాలకు నెట్‌ పరీక్షను ప్రాతిపదికగా తీసుకొమ్మని సూచించింది. ఇక నుంచి యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌ నెట్‌లో ఉత్తీర్ణత పొందినవారిని పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మూడు విభాగాలు చేస్తారు. మొదటిది - నెట్‌ - జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌. రెండోది- అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌. మూడోది- ప్రత్యేకంగా పీహెచ్‌డీ ప్రవేశాల కోసం మాత్రమే నిర్దేశించారు. ఈ మూడు విభాగాల్లో దేనిలో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్వ్యూ ద్వారా నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశం పొందవచ్చు. ఈ సూచన పూర్తిస్థాయిలో అమలవ్వడానికి కొంత సమయం పట్టవచ్చు. ఈలోపు మీరు జేఆర్‌ఎఫ్‌/ నెట్‌/ సెట్‌/ ఆర్‌సెట్‌లలో ఉత్తీర్ణత సాధించి స్టేట్‌ యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశానికి ప్రయత్నించవచ్చు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోతే భవిష్యత్తులో పీహెచ్‌డీ ప్రవేశం కష్టం కావచ్చు. ఈ నిబంధనలు అమల్లోకి రాకముందే ఏదైనా స్టేట్‌ యూనివర్సిటీలో ఆర్‌సెట్‌ ద్వారా పీహెచ్‌డీ ప్రవేశం పొందే ప్రయత్నం చేయండి. పీహెచ్‌డీ ప్రవేశం పొందలేకపోతే కేంద్ర, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ పోటీ పరీక్షల్లో, ఇతర ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలకోసం ప్రయత్నించండి. జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపక ఉద్యోగాలకు పీహెచ్‌డీ/ నెట్‌/ సెట్‌ అవసరం లేదు కాబట్టి వాటికి పోటీపడొచ్చు. -
  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: శ్రీహరి

  Ans:

  డిగ్రీ, పీజీలను దూరవిద్య/ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా చదివినా, రెగ్యులర్‌గా చదివినా వాటి విలువల్లో ఎలాంటి మార్పూ ఉండదు. అన్ని రకాల డిగ్రీలను వివిధ యూనివర్సిటీలు యూజీసీ నిబంధనలకు లోబడే జారీ చేస్తాయి. డిగ్రీని దూరవిద్య/ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా చదివిన చాలామంది సివిల్‌ సర్వీసెస్‌, అధ్యాపక ఉద్యోగ పరీక్షలు రాసి ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. సాధారణంగా ఉద్యోగ నోటిఫికేషన్లలో డిగ్రీ/ పీజీ నిర్ధారిత శాతం మార్కులుండాలని మాత్రమే పేర్కొంటారు. డిగ్రీ/ పీజీ రెగ్యులర్‌గానే చదివి ఉండాలని ఉండదు. స్వల్పంగా కొన్ని బోధన/ పరిశోధన ఇంటర్వ్యూల్లో మాత్రం రెగ్యులర్‌ డిగ్రీలకు కొంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల యూజీసీ జారీ చేసిన అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్‌ నిబంధనల ప్రకారం రెగ్యులర్‌/ దూరవిద్య/ ఆన్‌లైన్‌ ద్వారా చదివిన కోర్సుల మధ్య తేడా ఏమీ లేదు. జాతీయ విద్యావిధానం- 2020 పూర్తిస్థాయిలో అమలైనపుడు అన్ని రకాల డిగ్రీలనూ ఒకే విధంగా పరిగణించే అవకాశం ఉంది. బీఈడీ, డీఈడీ లాంటి ఉపాధ్యాయ శిక్షణ కోర్సులను రెగ్యులర్‌గా మాత్రమే చేయాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ నిబంధనలు చెబుతున్నాయి. ఉపాధ్యాయ శిక్షణ కోర్సులను దూరవిద్య ద్వారా చేసే అవకాశం లేదు. అదేవిధంగా ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, ఎల్‌ఎల్‌బీ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను కూడా దూరవిద్యా విధానంలో చేసే అవకాశం లేదు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: prasanth

  Ans:

  ఎంఏ ఎడ్యుకేషన్‌ చదివినవారికి గతంలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత ఉండేది. కాలక్రమేణా  డీఈడీ, బీఈడీ చేసినవారికి మాత్రమే ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత కల్పించారు. ఒడిశా లాంటి కొన్ని రాష్ట్రాల్లో డిగ్రీ స్థాయిలో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులతో పాటు ఎడ్యుకేషన్‌ను కూడా ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు. అలాంటి కళాశాలల్లో ఎంఏ ఎడ్యుకేషన్‌తో పాటు నెట్‌/ సెట్‌/ పీహెచ్‌డీ అర్హతతో డిగ్రీ కళాశాల అధ్యాపకులుగా స్థిరపడవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ స్థాయిలో ఎడ్యుకేషన్‌ కోర్సు అందుబాటులో లేదు. మీకు ఎంఏ ఎడ్యుకేషన్‌తో పాటు, మరో సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ, ఎడ్యుకేషన్‌లో నెట్‌/ సెట్‌ ఉత్తీర్ణత సాధిస్తే, ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో అధ్యాపక ఉద్యోగాలకు అర్హులు అవుతారు.
  ఎంఏ ఎడ్యుకేషన్‌ చదివినవారికి ప్రత్యేకమైన ఉద్యోగావకాశాలు లేవు. దీన్ని మరో పీజీ సబ్జెక్టుగా మాత్రమే పరిగణించి, ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. విద్యా రంగానికి సంబంధించిన స్వచ్ఛంద సేవాసంస్థల్లో కొలువుల కోసం ప్రయత్నించవచ్చు. ఎడ్యుకేషన్‌ టెక్నాలజీలో అదనపు కోర్సులు చేసి ఎడ్యుటెక్‌ కంపెనీల్లోనూ, సైకాలజీలో అదనపు కోర్సులు చేసి విద్యాసంస్థల్లోనూ కౌన్సెలర్‌గా ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. -
  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: డి.రామకృష్ణ

  Ans:

  స్నేహితులు, కౌన్సెలర్లు సలహాలు మాత్రమే ఇవ్వగలరు. చివరి నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. ముందుగా సీనియర్‌ లాయర్‌ దగ్గర కొంతకాలం జూనియర్‌గా పనిచేసి, వృత్తి నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. తర్వాత ప్రాక్టీస్‌ పెట్టాలి. సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టాక, కొంతకాలం వరకు కేసులు ఎక్కువగా రాకపోవచ్చు. లాయర్ల సంఖ్య అధికంగా ఉండటం వల్ల పోటీ కూడా ఎక్కువగానే ఉంది. మీరు లాయర్‌గా స్థిరపడటానికి చాలా సమయం కూడా పట్టవచ్చు. ఉద్యోగం చేస్తే స్థిరమైన ఆదాయం ఉండొచ్చు కానీ, ఉద్యోగం రావడానికి ఎక్కువ సమయం అవసరం అవ్వొచ్చు. మీ దృష్టిలో ఉద్యోగం అంటే న్యాయవ్యవస్థకు సంబంధించిన ఉద్యోగమా, ఇతర ప్రభుత్వ/ ప్రైవేటు ఉద్యోగమా అనేది చెప్పలేదు. ప్రాక్టీస్‌ చేయడమా, ఉద్యోగం చేయడమా అనేది మీ వ్యక్తిగత నిర్ణయం. జీవితంలో ఆర్థిక స్థాయితో పాటు మనసుకు నచ్చిన పని చేయడం కూడా ముఖ్యం. లాయర్‌గా ప్రాక్టీస్‌ చేయాలన్న బలమైన కోరిక ఉంటే, అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. కెరియర్‌లో రిస్క్‌ తీసుకోవడం, ఉద్యోగ భద్రత, పరిమిత జీతం, అపరిమితమైన పేరు ప్రఖ్యాతులు, మెరుగైన ఆదాయం లాంటి వాటిని పరిగణనలోకి తీసుకొని నచ్చిన నిర్ణయం దిశగా అడుగులేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: రమణ

  Ans:

  మీరు బీటెక్‌లో ఏ బ్రాంచి చదివారో, సాఫ్ట్‌వేర్‌లో ఏ ఉద్యోగం చేశారో చెప్పలేదు. ప్రభుత్వ ఉద్యోగం అంటే, ఇంజినీరింగ్‌కు సంబంధించినదా? గ్రూప్స్‌ లాంటిదా? ఏ ప్రభుత్వ కొలువుకు అయినా చాలా పోటీ ఉంటుంది కాబట్టి, ప్రణాళికాబద్ధంగా, పట్టుదలతో సమయపాలనను పాటిస్తూ సన్నద్ధం అవ్వాలి. అప్పుడు సర్కారీ ఉద్యోగం పొందడం కష్టం కాదు. మీ విద్యార్హతతో ఏయే ఉద్యోగాలకు అర్హులు అవుతారో, ఏ ఉద్యోగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఆ తరువాత ఆ ఉద్యోగ పరీక్షకు సంబంధించిన పూర్వ ప్రశ్నపత్రాలను సేకరించండి. ఆ పరీక్షకు నిర్థÄరించిన సిలబస్‌ని చూసి ఎంత సన్నద్ధత అవసరమో అంచనా వేయండి. సిలబస్‌కు సంబంధించిన పాఠ్యపుస్తకాలూ, రిఫరెన్స్‌ పుస్తకాలూ కొనుగోలు చేయండి. ప్రతిరోజూ వార్తా పత్రికల్ని చదువుతూ, అందులోని సంపాదకీయ పేజీలో వచ్చే వ్యాసాల్లోని ముఖ్యాంశాలతో సొంత నోట్స్‌ తయారు చేసుకోండి. కరెంట్‌ అఫైర్స్‌పై కూడా దృష్టి పెట్టండి. సిలబస్‌కి అనుగుణంగా నోట్స్‌ తయారు చేసుకొంటూ, అర్థం చేసుకొని చదవడం అలవాటు చేసుకోండి. ఆ పరీక్షలో విజయం సాధించి ఉద్యోగం చేస్తున్నవారిని సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోండి. అదే విధంగా, ఆ పోటీ పరీక్షకు సన్నద్ధం అవుతున్నవారితో చర్చిస్తూ సన్నద్ధతలో మెలకువలు నేర్చుకోండి. వీలున్నన్ని నమూనా పరీక్షలు రాస్తూ, పోటీ పరీక్ష రాయడంలో మీ వేగాన్ని పెంచుకోండి. చివరిగా, ఆర్థిక వెసులుబాటు ఉంటే, విశ్వసనీయత ఉన్న శిక్షణ సంస్థలో కోచింగ్‌ పొందే విషయాన్ని కూడా పరిగణించండి. వివిధ ఉద్యోగ పోటీ పరీక్షల్లో విజయం పొందినవారి ఇంటర్వ్యూలను చూస్తూ ప్రేరణ పొందుతూ, ప్రభుత్వ కొలువు పొందాలన్న మీ ఆశయం నెరవేర్చుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: దుర్గాదేవి

  Ans:

  సాధారణంగా బీఎస్సీ (బీజడ్‌సీ) చదివినవారికి అగ్రోనమిస్ట్, బయోకెమిస్ట్, బయో ఫిజిసిస్ట్, ఎపిడమాలజిస్ట్, ఫుడ్‌ సైంటిస్ట్, హార్టికల్చరిస్ట్, ఇమ్యునాలజిస్ట్, న్యూట్రిషనిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్‌.. ఇలాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి. మీకు పీజీ చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఏవైనా సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులు చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. హెల్త్‌కేర్‌ రంగంపై ఆసక్తి ఉంటే అనస్థీషియా టెక్నీషియన్, డయాలసిస్‌ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, న్యూరో ఫిజియాలజీ టెక్నీషియన్, ఈఎన్‌టీ టెక్నీషియన్, ల్యాబొరేటరీ సేఫ్టీ, మెడికల్‌ రికార్డ్స్‌ మేనేజ్‌మెంట్, ఆఫ్తల్మాలజీ, డెంటల్‌ హైజీనిస్ట్, డెంటల్‌ మెకానిక్, డెంటల్‌ ఆపరేటింగ్‌ రూమ్‌ అసిస్టెంట్, పల్మనరీ టెక్నీషియన్‌ లాంటి సర్టిఫికెట్‌ కోర్సులు చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. ఫార్మా కంపెనీల్లో కెమిస్ట్‌గా, సేల్స్‌ రిప్రజెంటేటివ్‌గా కూడా పనిచేసే అవకాశాలుంటాయి. కోడింగ్‌పై ఆసక్తి ఉంటే మెడికల్‌ కోడింగ్‌లో శిక్షణ తీసుకొని మెడికల్‌ కోడర్‌గానూ ప్రయత్నాలు చేయవచ్చు. ఇవే కాకుండా- సీక్వెన్సింగ్, క్లినికల్‌ డేటా మేనేజ్‌మెంట్, మాలిక్యులర్‌ బయాలజీ, బయో స్టాటిస్టిక్స్‌ల్లో కూడా సర్టిఫికెట్‌ కోర్సులు చేయవచ్చు. బోధనరంగంపై ఆసక్తి ఉంటే ఉపాధ్యాయ శిక్షణ పొంది టీచర్‌గా స్థిరపడవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,  కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: బి.సునీత

  Ans:

  బీబీఏ చేసి సప్లై చెయిన్‌ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు కాబట్టి, ఆ సబ్జెక్టులో పీజీ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. మనదేశంతో పోలిస్తే విదేశాల్లో సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ను అందించే విద్యాసంస్థలు ఎక్కువ. ఈ రంగంలో ఉద్యోగావకాశాలు కూడా విదేశాల్లోనే అధికం. కాకపోతే, విదేశాల్లో విద్యాభ్యాసానికి చాలా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉద్యోగావకాశాలు తక్కువ కాబట్టి విదేశీ విద్య విషయంలో కొంతకాలం వేచివుండటం మంచిది. ఇక మనదేశంలో ఐఐఎం కోజికొడ్, ఐఐఎం తిరుచ్చి, ఐఐఎం ఉదయ్‌పుర్, ఐఐటీ రూర్కి, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్, మణిపాల్‌ యూనివర్సిటీ, నిక్‌మార్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి విద్యాసంస్థలు సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ/ పీజీ డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తున్నాయి. వీటితోపాటు చాలా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో వివిధ కోర్సులు అందిస్తున్నాయి. ఈ రంగంలో రాణించాలంటే ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం, ప్రాబ్ల్లమ్‌ సాల్వింగ్‌/ డెసిషన్‌ మేకింగ్‌/ టైం మేనేజ్‌మెంట్‌/ కమ్యూనికేషన్‌ మెలకువలు చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: వివేక్‌

  Ans:

  మీరు ఇంటర్మీడియెట్‌ 2014లో అంటే, దాదాపు పదేళ్ల క్రితం పూర్తిచేశారు. పదో తరగతిని బట్టి మీ వయసు అటు ఇటుగా 30 సంవత్సరాలు ఉండొచ్చు. మీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగమా? ప్రైవేటు ఉద్యోగమా అనే విషయంపై స్పష్టత అవసరం. కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ కోర్సుతో ఐటీఐ చేశారు కాబట్టి కంప్యూటర్‌ రంగంలోనే ఉద్యోగ ప్రయత్నాలు చేయడం శ్రేయస్కరం. ముందుగా ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా కానీ, దూరవిద్య ద్వారా కానీ కంప్యూటర్‌ కు సంబంధించిన సబ్జెక్టుతో డిగ్రీ పూర్తి చేయండి. ఈలోగా కొన్ని కంప్యూటర్‌ కోడింగ్, ప్రోగ్రామింగ్‌ కోర్సులు నేర్చుకోండి. డిగ్రీ చదువుతూనే కొంత అనుభవం గడించండి. డిగ్రీ పూర్తయ్యాక ఈ అనుభవంతో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు కనీస విద్యార్హత డిగ్రీ కాబట్టి డిగ్రీని పూర్తిచేయడం చాలా అవసరం. ఇలాచేస్తే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పలు పరీక్షలకు అర్హులవుతారు. అలా కాకుండా మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే బీఈడీ, న్యాయవాది అవ్వాలనుకొంటే ఎల్‌ఎల్‌బీ, జర్నలిస్ట్‌ కావాలంటే జర్నలిజం, లెక్చరర్‌ అవ్వాలనుకొంటే మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌