Asked By: prasanth
Ans:
బీఎడ్/ బీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) రెండూ ముఖ్యమైనవే! దేని ప్రాధాన్యం దానిదే! మీకు ఏ రంగంలో స్థిరపడాలని ఉందో, ఎలాంటి విద్యార్ధులకు బోధించాలని ఉందో దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. బీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) చేసి ఆ రంగంలో స్థిరపడాలంటే ప్రత్యేక అవసరాలున్న విద్యార్ధులపై సహానుభూతి, ప్రేమ చాలా అవసరం. అలా లేని పక్షంలో మీరు కానీ, మీదగ్గర చదువుకొనే పిల్లలు కానీ సంతోషంగా ఉండలేరు. రెగ్యులర్ బీఎడ్ చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా అవకాశాలుంటాయి. బీఎడ్ కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలు చేశాక దీనికి కొంత ఆదరణ తగ్గింది. ప్రభుత్వ పాఠశాలల్లో శాశ్వత నియామకాలు జరగకపోవడం కూడా ఒక కారణం కావొచ్చు. బీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) చేసినవారు స్పెషల్ పాఠశాలల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం- సాధారణ పాఠశాలల్లో కూడా స్పెషల్ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలి. వచ్చే రెండు సంవత్సరాల్లో ఇది పూర్తిగా కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. బీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) చేసినవారి సంఖ్య సాధారణ బీఎడ్ చేసినవారికంటే తక్కువగా ఉండటం వల్ల వీరికి ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్