Post your question

 

  Asked By: జార్జి ముల్లార్‌

  Ans:

  ఇంటర్‌ చదివిన తరువాత మీకున్న చాలా అవకాశాల్లో డిగ్రీ, ఇంజినీరింగ్‌ అనేవి రెండు ముఖ్యమైన మార్గాలు. ఇప్పుడు మీరు తీసుకోబోయే నిర్ణయం మీ భావి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఇలాంటి కెరియర్‌ నిర్ణయం తీసుకోవడానికి ముందు మీ జీవితాశయం ఏమిటి? మీకు ఏ రంగంపై ఆసక్తి ఉంది? గతంలో మీరు రాసిన వార్షిక పరీక్షల్లో ఎన్ని మార్కులు పొందారు? మీ బలాలూ బలహీనతలూ ఏమిటి? మీ ముందున్న అవకాశాలూ, సవాళ్లు ఏమిటి? చదువుకు అయ్యే ఖర్చుకు ఎంత కాలం మీ కుటుంబ సహకారం ఉంటుంది?- ఇలాంటి విషయాలపై అవగాహన పొందాక ఏ కోర్సు చదవాలో నిర్ణయించుకోండి.
  ప్రతి కోర్సుకూ చాలా ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇంజినీరింగ్‌ చదివినవారికి ఉద్యోగం రాకపోవచ్చు; సాధారణ డిగ్రీ చదివినవారు ఐఏఎస్‌ కూడా అవ్వొచ్చు. ఏ కోర్సు చదివినా దాన్ని ఇష్టంతో, ప్రణాళికాబద్ధంగా చదివి, ఆ రంగంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి కావలసిన విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలను అలవర్చుకోవాలి. అప్పుడే అద్భుతమైన భవిష్యత్తు సొంతమవుతుంది. మీకు పరిశోధన రంగంపై ఆసక్తి ఉంటే డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలతో పాటు విదేశాల్లో పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధన చేసి, దేశం గర్వించే శాస్త్రవేత్త అవ్వొచ్చు. అలాకాకుండా డిగ్రీ తరువాత కానీ, పీజీ తరువాత కానీ పోటీ పరీక్షలు రాసి మంచి ఉద్యోగం పొందవచ్చు. ఇంజినీరింగ్‌ విషయానికొస్తే ప్రవేశ పరీక్షలో మంచి ప్రతిభను కనపర్చి, ప్రముఖ విద్యాసంస్థలో ఈ కోర్సుని బాగా చదివితే మంచి వేతనంతో ఉద్యోగం సాధించవచ్చు. ఇంజినీరింగ్‌ రంగంలో పరిశోధనపై ఆసక్తి ఉంటే ఎంటెక్, పీహెచ్‌డీ చేసి, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శాస్త్రవేత్తగా స్థిరపడవచ్చు. డిగ్రీ అర్హత ఉన్న చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు సాధారణ డిగ్రీతో పాటు ఇంజినీరింగ్‌ డిగ్రీ పొందినవారు కూడా అర్హులే. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: జి. అరుణ్‌కుమార్‌

  Ans:

  ఇంటర్‌ సీఈసీ చదివినవారు డిగ్రీలో ఫిజిక్స్‌ చదివే అవకాశం లేదు. డిగ్రీలో ఫిజిక్స్‌ చదవాలంటే ఇంటర్మీడియట్‌లో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్‌లను కచ్చితంగా చదివి ఉండాలి. మీకు ఫిజిక్స్‌ సబ్జెక్టుపై అంతగా ఆసక్తి ఉంటే, మళ్లీ ఇంటర్మీడియట్‌ని మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ప్రైవేటు/ రెగ్యులర్‌గా చదివి డిగ్రీ ఫిజిక్స్‌లో చేరండి.  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, రియర్‌ కౌన్సెలర్‌

  Asked By: జి. అరుణ్‌కుమార్‌

  Ans:

  ఇంటర్మీడియట్‌లో ఆర్ట్స్‌ గ్రూపు చదివినవారు డిగ్రీలో సైన్స్‌ చదివే అవకాశం లేదు కానీ, సైన్స్‌ గ్రూప్‌ చదివినవారు, డిగ్రీలో ఆర్ట్స్‌లో చేరొచ్చు. జాతీయ విద్యావిధానం- 2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక ఈ అవకాశం ఉండొచ్చు. కాకపోతే చదవబోయే సైన్స్‌ కోర్సుకు సంబంధించిన కొన్ని ముందస్తు సబ్జెక్టులు చదివివుండాలనే నిబంధన పెట్టే అవకాశం ఉంది. కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు మాత్రం ఇంటర్మీడియట్‌లో ఆర్ట్స్‌ గ్రూపు చదివినవారికి బీఎస్‌సీ ఇంటీరియర్‌ డిజైన్, బీఎస్‌సీ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, బి. డిజైన్‌ లాంటి కోర్సులు అందిస్తున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: యశ్వంత్, జగిత్యాల

  Ans:

  ఇంటర్‌ తెలుగు మాధ్యమంలో చదివినంత మాత్రాన, డిగ్రీ కూడా తెలుగు మాధ్యమంలోనే చదవవలసిన అవసరం లేదు. ఇంటర్‌ బైపీసీ తర్వాత తెలుగు మీడియంలో చదవాలంటే బీఎస్‌సీలో బీజడ్‌సీని చదవవచ్చు. ఆపై తెలుగు మాధ్యమంలో బీఈడీ చేయవచ్చు. కానీ, సైన్స్‌లో పీజీ చేయాలనుకుంటే మాత్రం ఇంగ్లిష్‌ మాధ్యమంలోనే చదవాల్సి ఉంటుంది. తెలుగు యూనివర్సిటీలో జర్నలిజం కోర్సును తెలుగు మీడియంలోనే  చదవవచ్చు. కానీ డిగ్రీ, పీజీలు ఇంగ్లిష్‌ మాధ్యమంలో చదివినవారు జాతీయ స్థాయిలో నిర్వహించే కొన్ని పోటీ పరీక్షల్లో రాణించడానికి అవకాశం ఉంది. తెలుగు భాషను ప్రేమిస్తూనే, ఇంగ్లిష్‌ భాషలో కూడా ప్రావీణ్యం కోసం ప్రయత్నించండి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: త్యాగరాజు, ఖమ్మం

  Ans:

  అందరికీ హిందీ భాషను నేర్పించడం, సర్టిఫై చెయ్యడం దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉద్దేశం. వివిధ వయసులున్నవారికి వారు చదువుతున్న తరగతులను బట్టి, పరిచయ, ప్రాథమిక, మాధ్యమిక, ప్రవీణ ఉత్తరార్ధ, రాష్ట్ర భాష ప్రవీణ పరీక్షలను ఎన్నో సంవత్సరాలుగా పారదర్శకతతో నిర్వహిస్తున్నారు. ఈ కోర్సులు చేసినవారు హిందీ భాషపై మంచి పట్టు సాధించడంతో పాటు, ఈ భాషా నైపుణ్యం మీద ఆధార పడివుండే ఉద్యోగ అవకాశాలను కూడా పొందగలరు. బీఎడ్, ఎంఎడ్‌లను హిందీ సబ్జెక్టులో చేసి, హిందీ అధ్యాపకులుగా స్థిరపడాలనుకునేవారికి ఈ కోర్సు ఎంతో దోహదపడుతుంది. మీ ప్రశ్న విషయానికి వస్తే.. ప్రవీణ ఉత్తరార్థ, బీఏ హిందీ- అంటే బ్యాచిలర్స్‌ స్థాయితో సమానంగా పరిగణిస్తారు. ఈ కోర్సు పరీక్ష రాయడానికి  మీరు ఏ విద్యార్హతతో ఉన్నా ఫరవాలేదు, కానీ ఈ పరీక్ష ఉత్తీర్ణులైన తరువాత హిందీ ప్రచార సభలో రిజిష్టర్‌ చేసుకొని ఆ సర్టిఫికెట్‌ను అర్హతగా పరిగణించాలంటే.. తప్పనిసరిగా 10+2 లేదా ఇంటర్మీడియట్‌ను పూర్తిచేసి, 17 ఏళ్ల వయసు నిండినవారై ఉండాలి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: Sivaram T

  Ans:

  Yes it is available in our website. Material prepared by experienced faculty.