Post your question

 

  Asked By: ఎ. మహేష్‌ చంద్ర

  Ans:

  మీరు ఒకే సమయంలో పీజీ, బీఈడీ చేస్తున్నాను అన్నారు. యూజీసీ 2022 నిబంధనల ప్రకారం రెండు పీజీలూ, రెండు డిగ్రీలూ ఏకకాలంలో చేయవచ్చు. అందులో ఒకటి రెగ్యులర్‌గా అయితే, మరొకటి డిస్టెన్స్‌/ ఓపెన్‌/ ఆన్‌లైన్‌ పద్ధతిలో చేయవచ్చు. డిగ్రీ, పీజీలు యూజీసీ పరిధిలో ఉంటాయి కాబట్టి రెండు పీజీలూ, రెండు డిగ్రీలూ ఒకేసారి చేయడంలో ఇబ్బంది లేదు. కానీ ఒక డిగ్రీ యూజీసీకి సంబంధించి, మరొకటి ఏదైనా రెగ్యులేటరీ సంస్థ పరిధిలో ఉన్న డిగ్రీ అయితే, ఆ రెండు డిగ్రీలూ చెల్లుబాటు అవుతాయా అనే విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు.
  ఉదాహరణకు ఎంబీబీఎస్‌ చదివే విద్యార్థి, ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి బి.ఎ. చదివే అవకాశం ఉందా? ఎల్‌ఎల్‌బీ చదివే విద్యార్థి అదేసమయంలో ఎంబీఏ కూడా చదవొచ్చా? ఇలాంటి సందేహాలు చాలామందిని వేధిస్తున్నాయి. మీ విషయానికొస్తే- ఎంఏ (తెలుగు) యూజీసీ పరిధిలో ఉంటే, బీఈడీ ప్రోగ్రాం ఎన్‌సీటీఈ పరిధిలో ఉంది. కానీ, ఇటీవల కొన్ని యూనివర్సిటీలు ఏఐసీటీఈ పరిధిలో ఉన్న ఇంజినీరింగ్‌ కోర్సుతో పాటు యూజీసీ పరిధిలో ఉన్న బీబీఏ (ఈ సంవత్సరం నుంచి బీబీఏ కూడా ఏఐసీటీఈ పరిధిలోకి వచ్చింది)లను కలిపి ఒకే సమయంలో చదివే వెసులుబాటు కల్పించారు. ఈ విషయాల్లో స్పష్టత వచ్చేలోగా అవకాశం ఉంటే, బీఈడీ పూర్తిచేశాక మరో యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగు మరోసారి చదివే ప్రయత్నం చేయండి. టెట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం డీఈడీ…/ బీఈడీ చివరి సంవత్సరం చదివేవారు టెట్‌ రాయడానికి అర్హులు. మీరు టెట్‌ క్వాలిఫై అయింది బీఈడీ మొదటి సంవత్సరంలోనా, రెండో సంవత్సరంలోనా అనేది చెప్పలేదు. ఏదైనా కోర్సులో చేరేముందు ఆ కోర్సుతో లభించే ఉద్యోగ నోటిఫికేషన్లను పరిశీలించి, అందులో ఉన్న అర్హతలను బట్టి మీ కెరియర్‌ నిర్ణయాలను తీసుకోండి. చివరిగా- యూజీసీ రెండు కోర్సులు ఏకకాలంలో చేసే వెసులుబాటు కల్పించినా, ప్రొఫెషనల్‌ కోర్సులతో పాటు మరొక కోర్సు చదవకపోవడం వల్ల ప్రొఫెషనల్‌ కోర్సుపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టి, ఆ రంగంలో బాగా రాణించే అవకాశం ఉంది. -
  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: షేక్‌ మెహరజ్‌

  Ans:

  మీకు బీకాం డిగ్రీ, సీఏ ఇంటర్‌తో పాటు, అకౌంటెంట్‌గా పది సంవత్సరాల వృత్తి అనుభవం ఉంది. ఈ అర్హతతో ఐటీ కంపెనీలో అకౌంటెంట్‌గా ఉద్యోగం పొందడం కష్టం కాకపోవచ్చు. ఐటీ కంపెనీలో అకౌంటెంట్‌ ఉద్యోగం చేయాలంటే- ఎంఎస్‌ ఎక్సెల్‌పై మంచి పట్టుతో పాటు, ట్యాలీ లాంటి అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ మెరుగ్గా వాడగలిగే సామర్థ్యం ఉండాలి. సాధారణంగా ఐటీ కంపెనీల్లో అకౌంటింగ్‌ విభాగంలో ఎస్‌క్యూఎల్‌ డేటాబేస్, ఈఆర్‌పీ లాంటి సాఫ్ట్‌వేర్లను వాడుతూ ఉంటారు. మీరు ఐటీ రంగంలో అకౌంటెంట్‌గా రాణించాలంటే పే సర్టిఫికేషన్, కంప్యూటరైజ్డ్‌ అకౌంటింగ్, ఎంఐఎస్, డీబీఎంఎస్‌ లాంటి సర్టిఫికెట్‌ కోర్సులతో పాటు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు కూడా అవసరం. అవకాశం ఉంటే ఎంకాం (కంప్యూటర్స్‌) కోర్సును ఆన్‌లైన్‌/ దూరవిద్య ద్వారా చేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: బి.మణికంఠ మహారాజ్‌

  Ans:

  ఆప్టోమెట్రీలో డిప్లొమా చేసినవారికి భారతీ విద్యాపీఠ్‌- పుణె, డీ.. వై పాటిల్‌ యూనివర్సిటీ- పుణెల్లో, బీఎస్సీ ఆప్టోమెట్రీలో లేటరల్‌ ఎంట్రీ ఉంది. ఇంటర్మీడియట్‌/ ఆప్టోమెట్రీ డిప్లొమా విద్యార్హతతో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సులో నాలుగేళ్ల తర్వాత గ్రాడ్యుయేషన్‌ డిగ్రీతో బయటికి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఎల్‌వీ ప్రసాద్‌ ఐ హాస్పిటల్‌తోపాటు హైదరాబాద్‌లో మరో రెండు ప్రైవేటు యూనివర్సిటీలు ఆప్టోమెట్రీలో డిగ్రీ కోర్సులు అందిస్తున్నాయి. ఈ కోర్సు చదివినవారికి ప్రభుత్వ రంగంతో పోలిస్తే, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రాంతీయ కంటి ఆసుపత్రుల్లో, వైద్య కళాశాలల్లో అతి తక్కువ సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే ఆప్టోమెట్రీలో పీజీ/ పీహెచ్‌డీతో బోధన, పరిశోధన రంగాల్లో స్థిరపడవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

  Asked By: డేవిడ్‌

  Ans:

  ఫిజియోథెరపీ కోర్సు చదవాలంటే మీరు ముందుగా ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తరువాత ఈ కోర్సు నోటిఫికేషన్‌ వచ్చాక దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్మీడియట్‌లో పొందిన మార్కుల ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. మంచి బోధన ఉన్న కళాశాలను ఎంచుకొని, కోర్సును బాగా చదివి మంచి మార్కులతో  ఉత్తీర్ణత పొందాలి. ఆపై స్పోర్ట్స్‌ స్పెషలైజేషన్‌తో మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ కోర్సు చేయాలి. నిమ్స్‌లో ఫిజియోథెరపీ కోర్సులకు ఆ సంస్థ నిర్వహించే ప్రత్యేక ప్రవేశపరీక్ష రాయాలి.
  స్వామి వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ - ఒడిశా, ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌- ముంబై లాంటి జాతీయ విద్యాసంస్థల్లో ఫిజియో థెరపీలో యూజీ/ పీజీ కోర్సు చదవాలంటే, ఆ సంస్థలు నిర్వహించే ప్రత్యేక ప్రవేశపరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనపర్చాలి. మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీలో స్పోర్ట్స్‌ స్పెషలైజేషన్‌ పూర్తిచేసి ఏదైనా స్పోర్ట్స్‌ సెంటర్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా కొంతకాలం పనిచేసి, మంచి నైపుణ్యాలు పొందితే.. మీరే సొంతంగా ఫిజియోథెరపీ కేంద్రం స్థాపించవచ్చు. -
  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: టి.అభిలాష్‌ కుమార్‌

  Ans:

  ఎల్‌ఎల్‌బీ చదువుతూనే వివిధ రకాల సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు చదవడం వల్ల విషయ పరిజ్ఞానాన్ని మెరుగుపర్చుకోవచ్చు. ఎల్‌ఎల్‌బీ చదువుతూనే యుడెమి నుంచి ఎసెన్షియల్‌ ఫౌండేషన్స్‌ ఫర్‌ యాస్పైరింగ్‌ పారాలీగల్స్‌ ఆన్‌లైన్‌ కోర్స్‌ కానీ, లాయిడ్‌ కాలేజ్‌ దిల్లీ నుండి ఆన్‌లైన్‌ డిప్లొమా కోర్స్‌ ఇన్‌ సివిల్‌ లిటిగేషన్‌ స్కిల్స్‌ కోర్సు కానీ చేయొచ్చు. లాసీఖో నుంచి సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ సివిల్‌ లిటిగేషన్‌: ప్రాక్టీస్, ప్రొసీజర్‌ అండ్‌ డ్రాఫ్టింగ్‌ ఆన్‌లైన్‌ కోర్సునూ చేయవచ్చు. దీనివల్ల మీరు భవిష్యత్తులో మంచి లాయర్‌గా రాణించే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉంటే సైబర్‌ లా, ఫోరెన్సిక్‌ లా, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్, మీడియా లాస్, డ్రాఫ్టింగ్‌- నెగోషియేషన్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కాంట్రాక్ట్స్, ఫ్యామిలీ డిస్‌ప్యూట్‌ రిజల్యూషన్, ఏవియేషన్‌ లా అండ్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులను నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా లాంటి నేషనల్‌ యూనివర్సిటీల నుంచి దూరవిద్య ద్వారా చేసే ప్రయత్నం చేయండి. లా డిగ్రీ పూర్తయిన తరువాత ఎవరైనా సీనియర్‌ లాయర్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరి న్యాయవాద వృత్తిలో మెలకువలు నేర్చుకోండి. ఎల్‌ఎల్‌బీ లాంటి వృత్తివిద్యా కోర్సుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు వృత్తి నైపుణ్యాలు చాలా అవసరం. ఈ నైపుణ్యాలు అనుభవంతోనే మెరుగుపడతాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: సిరిచందన

  Ans:

  సాధారణంగా ఆభరణాల డిజైనింగ్‌ కోర్సులో జ్యూలరీ కాంపోనెంట్స్, టూల్స్, బ్రేస్లెట్స్‌ డిజైన్, నెక్లెస్‌ డిజైన్, బీడింగ్‌ టెక్నిక్స్, స్టిచెస్, పర్ల్స్‌ గురించి విపులంగా తెలుసుకొంటారు. యుడెమిలో నగల తయారీలో ఆన్‌లైన్‌ కోర్సు అందుబాటులో ఉంది. ముందుగా ఆ కోర్సు చేసి జ్యూలరీ డిజైన్‌లో ప్రాథమిక అంశాలు తెలుసుకోండి. అందుబాటులో ఉన్న కోర్సుల్లో బేసిక్‌ జ్యూలరీ డిజైనింగ్, కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైనింగ్‌ ఫర్‌ జెమ్స్‌ అండ్‌ జ్యూలరీ, అడ్వాన్స్‌ జ్యూలరీ డిజైనింగ్, కలర్డ్‌ జెమ్‌ స్టోన్‌ ఐడెంటిఫికేషన్, డైమండ్‌ ఐడెంటిఫికేషన్‌ అండ్‌ గ్రేడింగ్, జెమ్స్‌ అండ్‌ జ్యూలరీ మార్కెటింగ్, కాస్ట్యూమ్‌ జ్యూలరీ మేకింగ్‌ లాంటివి ప్రాచుర్యం పొందాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో వివిధ ప్రైవేటు సంస్థలు నగల డిజైనింగ్‌ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో విశ్వసనీయత ఉన్న సంస్థను ఎంచుకొని మీకు నచ్చిన కోర్సులో చేరండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: పెద్దిరెడ్డి

  Ans:

  ఏజీ బీఎస్సీ చదివినవారు అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, అగ్రికల్చర్‌ అనలిస్ట్, అసిస్టెంట్‌ ప్లాంటేషన్‌ మేనేజర్, సీడ్‌ ఆఫీసర్, ఫీల్డ్‌ ఆఫీసర్, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్, ఫుడ్‌ టెక్నాలజిస్ట్, ప్లాంట్‌ బ్రీడర్‌ లాంటి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు, అంతర్జాతీయ/ జాతీయ స్వచ్ఛంద సేవాసంస్థల్లో చాలా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా పరిశోధన సంస్థలు, ఫుడ్‌ టెక్నాలజీ కంపెనీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, విత్తన సంస్థలు, బ్యాంకులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అటవీ శాఖలు, ఫర్టిలైజర్‌ తయారీ సంస్థలు, అగ్రికల్చర్‌ టెక్నాలజీ సంస్థల్లో కొలువులు అందుబాటులో ఉంటాయి.
  ఉన్నత విద్యావకాశాల విషయానికొస్తే - అగ్రికల్చర్, అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ సైన్స్, జెనెటిక్స్, ప్లాంట్‌ పాథాలజీ, అగ్రికల్చర్‌ ఎకనామిక్స్, ప్లాంట్‌ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ల్లో పీజీ చేయొచ్చు. మీకు బోధన, పరిశోధన రంగాలపై ఆసక్తి ఉంటే పీజీ తరువాత పీహెచ్‌డీ కూడా చేసి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/ సైంటిస్ట్‌గా స్థిరపడవచ్చు.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: మహేష్‌

  Ans:

  ఒకే సమయంలో రెండు డిగ్రీలు చదవడానికి యూజీసీ 2022 నుంచి మాత్రమే అనుమతి ఇచ్చింది. అంతకుముందు రెండు డిగ్రీలు ఏక కాలంలో చేసివుంటే, వాటిలో ఒక డిగ్రీ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. మీరు ఒకే సబ్జెక్టుతో రెండు డిగ్రీలు చేయడానికి ఉన్న కారణాలు చెప్పలేదు. ఆ రెండు డిగ్రీలూ ఒకే యూనివర్సిటీ నుంచి చేశారా, వేర్వేరు వర్సిటీల నుంచి చేశారో తెలియదు. యూజీసీ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుంచి చేసిన రెగ్యులర్‌ డిగ్రీకీ, దూరవిద్య డిగ్రీకీ మధ్య తేడా లేదు. ఈ రెండు రకాల డిగ్రీలు చదివినవారు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ‘మీరు డిగ్రీని దూరవిద్య ద్వారా ఎందుకు చేశారు?’ అనే ప్రశ్న ఎదురవుతుంది. మీకు ఏ డిగ్రీలో ఎక్కువ మార్కులు వచ్చాయో, ఆ డిగ్రీని ఉపయోగించుకోండి. ఒకవేళ మీరు రెండు డిగ్రీలూ వేర్వేరు యూనివర్సిటీల నుంచి చేస్తే, మెరుగైన న్యాక్‌ స్కోరు, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకు ఉన్న యూనివర్సిటీ డిగ్రీని ఉపయోగించుకొనే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: సీహెచ్‌.రాజశేఖర్‌

  Ans:

  అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్‌ కోర్సును దూరవిద్య ద్వారా చదవడం కుదరదు. కానీ, మూడు సంవత్సరాల డిప్లొమాతో ఉద్యోగం చేస్తున్నవారు మాత్రం ఈవినింగ్‌ కళాశాల్లో ఇంజినీరింగ్‌ కోర్సు చదవొచ్చు. మీ అమ్మాయి పదో తరగతి/ ఇంటర్మీడియట్‌ తరువాత డిప్లొమా చదివి ఉండకపోతే ఈవినింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ చదివే అవకాశం లేదు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ వారి ఏఎంఐఈ (అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ద ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే ఆ సర్టిఫికెట్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీకి సమానం అవుతుంది. కాకపోతే, ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువ. మీ అమ్మాయిని బీఈ/ బీటెక్‌ మాత్రమే చదివించాలి అనుకొంటే,  బీఎస్సీని మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌లతో పూర్తి చేసి, బిట్స్‌ పిలానీ వారి వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రాం (విల్ప్‌) ద్వారా బీటెక్‌ చేసే వీలుంది. దూరవిద్యలో బీఎస్సీ తరువాత, ఎమ్మెస్సీ( మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌) చేసి బిట్స్‌ విల్ప్‌ ద్వారా ఎంటెక్‌ చేసే అవకాశమూ ఉంది. ప్రస్తుతం తను ఉద్యోగం చేస్తున్న సంస్ధ నుంచి రెండు సంవత్సరాల సెలవు తీసుకొని, తను గతంలో చదివిన ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి మిగిలిన రెండు సంవత్సరాల కోర్సును పూర్తిచేసే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: అమూల్య

  Ans:

  ధ్యానం అనేది యోగాలో ఒక భాగం. వివిధ యోగా రూపాలైన హఠ యోగం, కర్మ యోగం, భక్తి యోగం, రాజయోగాల్లో హఠ యోగాన్ని ఎక్కువగా అభ్యసిస్తారు. ఇందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 భాగాలుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో మూడు విశ్వవిద్యాలయాలు యోగాలో రెగ్యులర్‌ మాస్టర్‌/ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖపట్నం)లో ఎంఏ /పీజీ డిప్లొమా, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (తిరుపతి)లో ఎమ్మెస్సీ /పీజీ డిప్లొమా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (గుంటూరు)లో పీజీ డిప్లొమా (రెగ్యులర్‌/ పార్ట్‌ టైమ్‌) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌