Asked By: జి. లక్ష్మణ్
Ans:
గేట్తో సంబంధం లేకుండా కూడా చాలా ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఈఎస్ఈ (ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్) కు ప్రతి సంవత్సరం యు.పి.ఎస్.సి పరీక్షను నిర్వహిస్తుంది. దేశ రక్షణకు సంబంధించిన ఉద్యోగాల కోసం డి.ఆర్.డి.ఒ. ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహిస్తుంది. త్రివిధ దళాల విషయానికొస్తే- ఇండియన్ నేవీలో యూనివర్సిటీ ఎంట్రీ స్కీం ద్వారా, ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ద్వారా, వైమానిక దళంలో ఏఎఫ్ క్యాట్ ద్వారా ఉద్యోగాలు భర్తీ అవుతాయి. ఇవే కాకుండా భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్, ఇస్రో లాంటి పరిశోధన సంస్థల్లోనూ మెకానికల్ ఇంజినీర్లకు వారి విద్యార్హత ఆధారంగా ఉద్యోగ అవకాశాలున్నాయి.
వైజాగ్ స్టీల్ ప్లాంట్, కోల్ ఇండియా లిమిటెడ్, బీహెచ్ఈఎల్, ఆర్ఐటీఈఎస్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా గేట్తో కాకుండా వారు నిర్వహించే రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఇంజినీరింగ్ పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఏఈఈ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లాంటి పోస్టులను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. రైల్వే శాఖలో మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లాంటి సంస్థలు కూడా గేట్తో సంబంధం లేకుండా వారి ప్రత్యేక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్