Post your question

 

    Asked By: వి.సురేష్, వరంగల్‌

    Ans:

    మీరు ప్రస్తుతం ఏం ఉద్యోగం చేస్తున్నారో చెప్పలేదు. రిటైల్‌ మార్కెటింగ్‌లో డిప్లొమా ఎందుకు చేయాలనుకుంటున్నారు? డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రాంలు.. ఆ రంగంలో అప్పటికే ఉద్యోగం చేస్తున్నవారి పదోన్నతికి ఉపయోగపడతాయి కానీ, కొత్తగా ఉద్యోగం పొందటానికి కాదు. మీ ప్రస్తుత వయసును బట్టి కూడా నిర్ణయించుకోవాలి. మీకు రిటైలింగ్‌ రంగంపై నిజమైన ఆసక్తి ఉందా? ఆ రంగంలో ఉద్యోగాలు ఎక్కువని ఆ వైపు వెళ్లాలనుకొంటున్నారా? మీకు రిటైలింగ్‌పై ఆసక్తి ఉంటే, ముందుగా ఆన్‌లైన్‌లో సంబంధిత కోర్సులు కొన్ని చేసి ఆ రంగంలోని ప్రాథమిక అంశాలపై అవగాహన ఏర్పర్చుకోండి. ఆ తరువాత ఏదైనా ప్రముఖ రిటైలింగ్‌ సంస్థలో ఓ చిన్న ఉద్యోగంలో చేరి కొంత అనుభవం, నైపుణ్యాలు గడించండి. మీకు ఆ రంగంలో ఉద్యోగం నచ్చితే రిటైలింగ్‌లో ఎంబీఏ చేసే ప్రయత్నం చేయండి. ఎంబీఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌ విధానంలో, అత్యుత్తమ విద్యా సంస్థల నుంచి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎ.వేణు

    Ans:

    నటన అంటే చాలా ఇష్టం అన్నారు. కానీ  ఇప్పటివరకు మీరు నటన ఎక్కడైనా నేర్చుకొన్నారా, ఏమైనా సాధన చేశారా? పాఠశాల, కళాశాలల్లో నటించిన అనుభవం ఉందా? కొన్ని శిక్షణ సంస్థలు నటనకు సంబంధించిన ప్రోగ్రాంలో ప్రవేశం కల్పించడానికి నటనలో పూర్వానుభవం కూడా ఉండాలని ఆశిస్తాయి. నటనలో ప్రాథమిక కోర్సులు చేయాలనుకుంటే- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల్లో డిప్లొమా ప్రోగ్రాములు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో వివిధ స్టూడియోల నుంచి కూడా నటనకు సంబంధించిన అనేక స్వల్పకాలిక వర్క్‌షాపులు ఉన్నాయి. అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా, రామానాయుడు ఫిల్మ్‌ స్కూల్, దాదాసాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌స్టడీస్, మధు ఫిలిం ఇన్‌స్ట్టిట్యూట్, మయూఖ మొదలైన సంస్థల్లో ఫిల్మ్‌ యాక్టింగ్‌ కోర్సులు ఉన్నాయి. ఏదైనా నట శిక్షణ సంస్థలో చేరేముందు, ఆ సంస్థ విశ్వసనీయత తెలుసుకోండి. మీకు ఇప్పటికే థియేటర్‌ యాక్టింగ్‌లో కొంత శిక్షణ, అనుభవం ఉంటే నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా, బెంగళూరులో ఒక సంవత్సరం యాక్టింగ్‌ కోర్సు చేయొచ్చు. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా దిల్లీలో మూడేళ్ల ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, పుణేలో రెండేళ్ల యాక్టింగ్‌ కోర్సు ఉంది. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలు థియేటర్‌ ఆర్ట్స్‌లో మాస్టర్స్‌ కోర్సుల్ని అందిస్తున్నాయి. నటనలో రాణించాలంటే.. నైపుణ్యాలతో పాటు అనుభవం, సామర్థ్యం, పరిజ్ఞానం కూడా చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: హరికృష్ణ

    Ans:

    టౌన్‌/ అర్బన్‌ ప్లానింగ్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్ని రెగ్యులర్‌ పద్ధ్దతిలో చదివితేనే వృత్తి నైపుణ్యాలు మెరుగవుతాయి. ఒకవేళ, మీరు ప్రస్తుతం అదే రంగంలో పనిచేస్తూ, విద్యార్హతలు పెంచుకోవాలనుకొంటే కరస్పాండెన్స్‌/ డిస్టెన్స్‌/ ఓపెన్‌/ ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్‌/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ పీజీ కోర్సులు ఉపయోగపడతాయి. సాధారణంగా టౌన్‌ ప్లానింగ్‌లో పీజీ కోర్సులను ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీలు బీఆర్క్‌ చదివినవారికి మాత్రమే రెగ్యులర్‌ పద్దతిలో అందిస్తున్నాయి. అతికొద్ది విద్యాసంస్థలు మాత్రమే టౌన్‌/ అర్బన్‌ ప్లానింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) పీజీ డిప్లొమా ఇన్‌ అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంని  అందిస్తోంది. స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, దిల్లీ.. సిటీ అండ్‌ మెట్రోపాలిటన్‌ ప్లానింగ్‌నూ, ఐఐటీ ఖరగ్‌పూర్‌.. అర్బన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టమ్స్‌లో, ఐఐటీ రూర్కీ.. ఇంట్రడక్షన్‌ టు సర్వీసెస్‌ ప్లానింగ్‌లో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులను ‘స్వయం’ పోర్టల్‌ ద్వారా అందిస్తున్నాయి. ఇవే కాకుండా కొన్ని ప్రైవేటు/ విదేశీ యూనివర్సిటీలు కూడా టౌన్‌/ అర్బన్‌ ప్లానింగ్‌లో ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఆ సంస్థల విశ్వసనీయత పూర్తిగా తెలుసుకొని ప్రవేశం విషయంలో సరైన నిర్ణయం తీసుకోండి. ది గ్లోబల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, నాగాలాండ్‌లో అర్బన్‌ ప్లానింగ్‌లో ఎమ్మెస్సీ ప్రోగ్రాం దూరవిద్య ద్వారా అందుబాటులో ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: బి.చరణ్‌

    Ans:

    మీరు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమాను 88.85 శాతంతో పూర్తిచేసి బీటెక్‌ చేస్తున్నాను అన్నారు. ఇప్పుడు బీటెక్‌ని కూడా కనీసం 70 శాతం మార్కులతో పూర్తి చేయండి. ఆ తరువాత విదేశాల్లో ఎంఎస్‌ చేయడానికి అవసరమైన జీఆర్‌ఈ, టోఫెల్‌/ ఐఈఎల్‌ టీఎస్‌ లాంటి పరీక్షల్లో కూడా మంచి స్కోరు పొందండి. అప్పుడు మీ మొత్తం విద్యార్హతల్లో ఒక్క పదో తరగతిలోనే తక్కువ స్కోరు ఉంటుంది కాబట్టి, మీ ఎంఎస్‌ అడ్మిషన్‌కు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీరు మంచి విదేశీ యూనివర్సిటీ నుంచి మంచి పర్సెంటే జ్‌తో ఎంఎస్‌ పూర్తి చేసి, ఆ కోర్సుకు సంబంధించిన విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు పొందినట్లయితే, మీ ఉద్యోగాన్వేషణలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.
    గతంలో తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతూ, వర్తమానంలో చదువుతున్న కోర్సును అశ్రద్ధ చేస్తూ, భవిష్యత్తుపై నమ్మకాన్ని కోల్పోకండి. విదేశీ యూనివర్సిటీలు, విదేశీ ఉద్యోగ సంస్థలు ఒక అభ్యర్థికి విద్యా, ఉద్యోగావకాశాలు కల్పించేప్పుడు మార్కుల కంటే ఎక్కువగా వ్యక్తిత్వం, ప్రేరణ, భవిష్యత్‌ ప్రణాళికలు, పోటీ పరీక్షలో వచ్చిన స్కోర్లు, రిఫరెన్స్‌ లెటర్స్, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్, ఎక్‌స్ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌.. ఇవన్నీ మూల్యాంకనం చేసి అడ్మిషన్‌/ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. పదో తరగతిలో మీకు తక్కువ మార్కులు వచ్చాయన్నది పక్కన పెట్టి, ఇప్పుడు చదువుతున్న కోర్సుపై శ్రద్ధ పెట్టండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: జేహెచ్‌ఎస్‌.ప్రసాద్‌

    Ans:

    ఇంజినీరింగ్, మెడిసిన్, లా, ఎంబీఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌గా చదివితేనే మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్‌ కోర్సును దూరవిద్య ద్వారా చదవడం కుదరదు. కానీ మీరు ఈవెనింగ్‌ కళాశాలలో మూడు సంవత్సరాల ఇంజినీరింగ్‌ కోర్సును రెగ్యులర్‌గా చదివే అవకాశం ఉంది. కొన్ని యూనివర్సిటీలు మాత్రం సాయంకాలం బదులు శని/ ఆదివారాల్లో తరగతులు నిర్వహిస్తున్నాయి. బిట్స్‌ పిలానీ వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌లో భాగంగా ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ డిగ్రీని ఆన్‌లైన్‌ పద్ధతిలో అందిస్తున్నారు. ఈ డిగ్రీకి యూజీసీ గుర్తింపు ఉంది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఏఎంఐఈ (అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌)/ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్స్‌ ఇంజినీర్స్‌ (ఐఈటీఈ) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే, ఆ సర్టిఫికెట్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీకి సమానం అవుతుంది. కానీ, ఆ రెండు పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువ. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: బి.హరిహర్‌

    Ans:

    ఇంజినీరింగ్‌ చదువుతూనే స్పానిష్‌ భాష నేర్చుకోవాలని అనుకోవడం అభినందనీయం. కనీసం ఒక విదేశీ భాషలో ప్రావీణ్యం సాధిస్తే మీ అంతర్జాతీయ ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. చాలా విదేశీ భాషలను ఆన్‌లైన్‌ ద్వారా ఉచితంగా నేర్చుకొనే అవకాశం ఉంది. స్పానిష్‌ భాషను యుడెమి, కోర్స్‌ ఎరా, ఎడ్‌ఎక్స్‌ల ద్వారా నేర్చుకోవచ్చు. ఇవే కాకుండా ప్రాక్టికల్‌ స్పానిష్‌ ఆన్‌లైన్, డుయో లింగో, మెమ్రైస్, బుసూ, ది ఓపెన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్, ఆన్‌లైన్‌ ఫ్రీ స్పానిష్, బటర్‌ఫ్లై స్పానిష్, ఫ్లూయెంటూ, లోయెక్సన్, ఫ్యూచర్‌ లెర్న్, బాబ్బెల్, అలీసన్, స్టడీ స్పానిష్‌ డాట్‌ కామ్, ఎడ్యూరెవ్, ఎఫ్‌ఎస్‌ఐ స్పానిష్‌ ఇలా ఎన్నో వేదికలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన వెబ్‌సైట్‌ నుంచి స్పానిష్‌ భాషను నేర్చుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: ఎస్‌.మోహన్‌మౌళి

    Ans:

    ఇంజినీరింగ్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌గానే చదవాలి. ఇలాంటి కోర్సుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్‌ నైపుణ్యాలు కూడా చాలా అవసరం. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్‌ కోర్సును దూరవిద్య ద్వారా చదవడం కుదరదు. కానీ, మీరు ఈవినింగ్‌ కళాశాలలో మూడు సంవత్సరాల ఇంజినీరింగ్‌ కోర్సును రెగ్యులర్‌గా చదివే అవకాశం ఉంది. కొన్ని యూనివర్సిటీలు మాత్రం సాయంకాలం బదులు శని/ ఆదివారాల్లో తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ వారి ఏఎంఐఈ (అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ద ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌) / ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్స్‌ ఇంజినీర్స్‌ (ఐఈటీఈ) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే, ఆ సర్టిఫికెట్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీకి సమానం అవుతుంది. కాకపోతే, ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో ఇంజినీరింగ్‌ కోర్సును కూడా ఆన్‌లైన్‌ పద్ధతిలో చదివే అవకాశాలు రావచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌