Post your question

 

    Asked By: రమణ

    Ans:

    మీరు బీటెక్‌లో ఏ బ్రాంచి చదివారో, సాఫ్ట్‌వేర్‌లో ఏ ఉద్యోగం చేశారో చెప్పలేదు. ప్రభుత్వ ఉద్యోగం అంటే, ఇంజినీరింగ్‌కు సంబంధించినదా? గ్రూప్స్‌ లాంటిదా? ఏ ప్రభుత్వ కొలువుకు అయినా చాలా పోటీ ఉంటుంది కాబట్టి, ప్రణాళికాబద్ధంగా, పట్టుదలతో సమయపాలనను పాటిస్తూ సన్నద్ధం అవ్వాలి. అప్పుడు సర్కారీ ఉద్యోగం పొందడం కష్టం కాదు. మీ విద్యార్హతతో ఏయే ఉద్యోగాలకు అర్హులు అవుతారో, ఏ ఉద్యోగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఆ తరువాత ఆ ఉద్యోగ పరీక్షకు సంబంధించిన పూర్వ ప్రశ్నపత్రాలను సేకరించండి. ఆ పరీక్షకు నిర్థÄరించిన సిలబస్‌ని చూసి ఎంత సన్నద్ధత అవసరమో అంచనా వేయండి. సిలబస్‌కు సంబంధించిన పాఠ్యపుస్తకాలూ, రిఫరెన్స్‌ పుస్తకాలూ కొనుగోలు చేయండి. ప్రతిరోజూ వార్తా పత్రికల్ని చదువుతూ, అందులోని సంపాదకీయ పేజీలో వచ్చే వ్యాసాల్లోని ముఖ్యాంశాలతో సొంత నోట్స్‌ తయారు చేసుకోండి. కరెంట్‌ అఫైర్స్‌పై కూడా దృష్టి పెట్టండి. సిలబస్‌కి అనుగుణంగా నోట్స్‌ తయారు చేసుకొంటూ, అర్థం చేసుకొని చదవడం అలవాటు చేసుకోండి. ఆ పరీక్షలో విజయం సాధించి ఉద్యోగం చేస్తున్నవారిని సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోండి. అదే విధంగా, ఆ పోటీ పరీక్షకు సన్నద్ధం అవుతున్నవారితో చర్చిస్తూ సన్నద్ధతలో మెలకువలు నేర్చుకోండి. వీలున్నన్ని నమూనా పరీక్షలు రాస్తూ, పోటీ పరీక్ష రాయడంలో మీ వేగాన్ని పెంచుకోండి. చివరిగా, ఆర్థిక వెసులుబాటు ఉంటే, విశ్వసనీయత ఉన్న శిక్షణ సంస్థలో కోచింగ్‌ పొందే విషయాన్ని కూడా పరిగణించండి. వివిధ ఉద్యోగ పోటీ పరీక్షల్లో విజయం పొందినవారి ఇంటర్వ్యూలను చూస్తూ ప్రేరణ పొందుతూ, ప్రభుత్వ కొలువు పొందాలన్న మీ ఆశయం నెరవేర్చుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: దుర్గాదేవి

    Ans:

    సాధారణంగా బీఎస్సీ (బీజడ్‌సీ) చదివినవారికి అగ్రోనమిస్ట్, బయోకెమిస్ట్, బయో ఫిజిసిస్ట్, ఎపిడమాలజిస్ట్, ఫుడ్‌ సైంటిస్ట్, హార్టికల్చరిస్ట్, ఇమ్యునాలజిస్ట్, న్యూట్రిషనిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్‌.. ఇలాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి. మీకు పీజీ చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఏవైనా సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులు చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. హెల్త్‌కేర్‌ రంగంపై ఆసక్తి ఉంటే అనస్థీషియా టెక్నీషియన్, డయాలసిస్‌ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, న్యూరో ఫిజియాలజీ టెక్నీషియన్, ఈఎన్‌టీ టెక్నీషియన్, ల్యాబొరేటరీ సేఫ్టీ, మెడికల్‌ రికార్డ్స్‌ మేనేజ్‌మెంట్, ఆఫ్తల్మాలజీ, డెంటల్‌ హైజీనిస్ట్, డెంటల్‌ మెకానిక్, డెంటల్‌ ఆపరేటింగ్‌ రూమ్‌ అసిస్టెంట్, పల్మనరీ టెక్నీషియన్‌ లాంటి సర్టిఫికెట్‌ కోర్సులు చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. ఫార్మా కంపెనీల్లో కెమిస్ట్‌గా, సేల్స్‌ రిప్రజెంటేటివ్‌గా కూడా పనిచేసే అవకాశాలుంటాయి. కోడింగ్‌పై ఆసక్తి ఉంటే మెడికల్‌ కోడింగ్‌లో శిక్షణ తీసుకొని మెడికల్‌ కోడర్‌గానూ ప్రయత్నాలు చేయవచ్చు. ఇవే కాకుండా- సీక్వెన్సింగ్, క్లినికల్‌ డేటా మేనేజ్‌మెంట్, మాలిక్యులర్‌ బయాలజీ, బయో స్టాటిస్టిక్స్‌ల్లో కూడా సర్టిఫికెట్‌ కోర్సులు చేయవచ్చు. బోధనరంగంపై ఆసక్తి ఉంటే ఉపాధ్యాయ శిక్షణ పొంది టీచర్‌గా స్థిరపడవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,  కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: బి.సునీత

    Ans:

    బీబీఏ చేసి సప్లై చెయిన్‌ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు కాబట్టి, ఆ సబ్జెక్టులో పీజీ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. మనదేశంతో పోలిస్తే విదేశాల్లో సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ను అందించే విద్యాసంస్థలు ఎక్కువ. ఈ రంగంలో ఉద్యోగావకాశాలు కూడా విదేశాల్లోనే అధికం. కాకపోతే, విదేశాల్లో విద్యాభ్యాసానికి చాలా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉద్యోగావకాశాలు తక్కువ కాబట్టి విదేశీ విద్య విషయంలో కొంతకాలం వేచివుండటం మంచిది. ఇక మనదేశంలో ఐఐఎం కోజికొడ్, ఐఐఎం తిరుచ్చి, ఐఐఎం ఉదయ్‌పుర్, ఐఐటీ రూర్కి, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్, మణిపాల్‌ యూనివర్సిటీ, నిక్‌మార్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి విద్యాసంస్థలు సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ/ పీజీ డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తున్నాయి. వీటితోపాటు చాలా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో వివిధ కోర్సులు అందిస్తున్నాయి. ఈ రంగంలో రాణించాలంటే ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం, ప్రాబ్ల్లమ్‌ సాల్వింగ్‌/ డెసిషన్‌ మేకింగ్‌/ టైం మేనేజ్‌మెంట్‌/ కమ్యూనికేషన్‌ మెలకువలు చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: వివేక్‌

    Ans:

    మీరు ఇంటర్మీడియెట్‌ 2014లో అంటే, దాదాపు పదేళ్ల క్రితం పూర్తిచేశారు. పదో తరగతిని బట్టి మీ వయసు అటు ఇటుగా 30 సంవత్సరాలు ఉండొచ్చు. మీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగమా? ప్రైవేటు ఉద్యోగమా అనే విషయంపై స్పష్టత అవసరం. కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ కోర్సుతో ఐటీఐ చేశారు కాబట్టి కంప్యూటర్‌ రంగంలోనే ఉద్యోగ ప్రయత్నాలు చేయడం శ్రేయస్కరం. ముందుగా ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా కానీ, దూరవిద్య ద్వారా కానీ కంప్యూటర్‌ కు సంబంధించిన సబ్జెక్టుతో డిగ్రీ పూర్తి చేయండి. ఈలోగా కొన్ని కంప్యూటర్‌ కోడింగ్, ప్రోగ్రామింగ్‌ కోర్సులు నేర్చుకోండి. డిగ్రీ చదువుతూనే కొంత అనుభవం గడించండి. డిగ్రీ పూర్తయ్యాక ఈ అనుభవంతో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు కనీస విద్యార్హత డిగ్రీ కాబట్టి డిగ్రీని పూర్తిచేయడం చాలా అవసరం. ఇలాచేస్తే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పలు పరీక్షలకు అర్హులవుతారు. అలా కాకుండా మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే బీఈడీ, న్యాయవాది అవ్వాలనుకొంటే ఎల్‌ఎల్‌బీ, జర్నలిస్ట్‌ కావాలంటే జర్నలిజం, లెక్చరర్‌ అవ్వాలనుకొంటే మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: కరుణ

    Ans:

    ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం.. మేనేజ్‌మెంట్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అవ్వాలంటే- ఎంబీఏలో 60 శాతం మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతతో పాటు రెండు సంవత్సరాల వృత్తి అనుభవం ఉండాలి. కానీ బోధన రంగంలో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల చాలా యూనివర్సిటీలు/ బిజినెస్‌ స్కూల్స్‌ పీహెచ్‌డీ ఉన్నవారినే మేనేజ్‌మెంట్‌ విభాగంలో అధ్యాపకులుగా నియమిస్తున్నాయి. పీహెచ్‌డీతో పాటు అత్యుత్తమ జర్నల్స్‌లో పరిశోధన పత్రాలు ప్రచురించినవారికీ, జాతీయ/ అంతర్జాతీయ సమావేశాల్లో పరిశోధన పత్రాలు సమర్పించిన వారికీ నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది. మేనేజ్‌మెంట్‌ సబ్జెక్టులో యూజీసీ-నెట్‌లో ఉత్తీర్ణత సాధించడం అదనపు అర్హత అవుతుంది. కానీ, చాలా ప్రైవేటు కళాశాలలు ఎంబీఏ విద్యార్హతతోనే బీబీఏ/ ఎంబీఏలో బోధించే అవకాశాలు కల్పిస్తున్నాయి.
    మీకు బోధన రంగంలో స్థిరపడాలన్న ఆలోచన బలంగా ఉంటే.. ముందుగా ఏదైనా యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఫుల్‌ టైమ్‌ పీహెచ్‌డీ చేసి, బిజినెస్‌ స్కూల్‌/ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి ప్రయత్నించండి. ఫుల్‌ టైమ్‌ పీహెచ్‌డీ చేసే అవకాశం లేకపోతే.. ఏదైనా ఎంబీఏ/ బీబీఏ కళాశాలలో లెక్చరర్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరండి. పార్ట్‌ టైం పీహెచ్‌డీ పూర్తి చేసి మెరుగైన విద్యాసంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


     

    Asked By: వంశీ

    Ans:

    ఇంటర్మీడియట్‌ పాసైనవారికి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, నేవీ, పోస్టల్‌ విభాగం, రైల్వేస్, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లలో ఉద్యోగావకాశాలుంటాయి. మీరు స్టెనోగ్రఫీ/ కంప్యూటర్‌/ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికెట్, డిప్లొమా లాంటి కోర్సులు చేసినట్లయితే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. సాధారణంగా ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, పోస్టల్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సార్టింగ్‌ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్, జనరల్‌ డ్యూటీ కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్‌ లోకో పైలట్‌ లాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. వీటి కోసం ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ పరీక్షలు, ఆల్‌ ఇండియా డిఫెన్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ లాంటివి రాయవలసి ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: నీరజ

    Ans:

    సంస్కృత విభాగంలో ఇంటర్మీడియట్‌ స్థాయిలో బోధించడానికి లెక్చరర్‌ అవ్వాలంటే ఎంఏలో కనీసం 55% మార్కులు పొందివుండాలి. డిగ్రీ కళాశాల/ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అవ్వాలంటే- అదనంగా సంస్కృతంలో యూజీసీ నెట్‌/ సెట్‌ ఉత్తీర్ణత కూడా సాధించాలి. నెట్‌/ సెట్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోతే, పీహెచ్‌డీ అయినా చేసి ఉండాలి. యూజీసీ నియమాలు పాటించే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కూడా ఇవే నిబంధనల ప్రకారం నియామకాలు చేపడతారు. ఈ మధ్యనే నెట్‌ పరీక్షలో హిందూ స్టడీస్, ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్‌ అని రెండు కొత్త సబ్జెక్టులను కూడా చేర్చారు. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకాల కోసం ఆయా విభాగాలకు సంబంధించిన శాస్త్ర విషయాల్లో పూర్తి పరిజ్ఞానం ఉండాలి. ప్రభుత్వ కళాశాలల్లో లెక్చరర్‌ అవ్వాలంటే.. సంబంధిత పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వారు నిర్వహించే రాత పరీక్షలో మెరుగైన ప్రతిభ కనపర్చి, ఆ తర్వాత ఇంటర్వ్యూలోనూ విజయం సాధించటం అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: అభిరామ్‌

    Ans:

    మీకు చదరంగ క్రీడాకారుడిగా రాణించాలన్న ఆసక్తి ఉంటే, ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌ వెబ్‌సైట్‌కి  వెళ్ళి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. తర్వాత ఆ వెబ్‌సైట్‌ నుంచి చెస్‌ టోర్నమెంట్‌ల గురించి సమాచారం పొందండి. సంబంధిత రాష్ట్ర చెస్‌ అసోసియేషన్‌ కార్యాలయాన్ని సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోండి. మీరు డిగ్రీ చదువుతున్న కళాశాలలో చదరంగ ఛాంపియన్‌ అయి, యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించే స్థాయికి రావాలి. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను మీ కళాశాల వ్యాయామ అధ్యాపకుడి ద్వారా తెలుసుకోండి. ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంటుల్లో పాల్గొని, అక్కడ కూడా ఛాంపియన్‌ అయి, ముందుగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని రాష్ట్రానికీ, ఆ తరువాత అంతర్జాతీయ పోటీల్లో దేశానికీ ప్రాతినిధ్యం వహించగల్గితే, అప్పుడు ప్రభుత్వ సాయం లభించే అవకాశం ఉంది. మీరు కనీసం జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తే, స్పాన్సర్లు లభించే అవకాశం ఉంటుంది. స్పాన్సర్లు లభిస్తే, కోచ్‌లు కూడా అందుబాటులో ఉంటారు. అంతవరకు, మీరే కోచ్‌ని ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాకే ప్రభుత్వ సాయం అందే అవకాశాలు ఉంటాయి. చదరంగం లాంటి క్రీడలకు స్పాన్సర్లు తక్కువగా ఉంటారు. స్పాన్సర్ల సాయం పొందగలిగే స్థాయికి రావాలంటే కనీసం పది సంవత్సరాలు, ప్రభుత్వ సాయం పొందాలంటే ఆ తర్వాత కనీసం మరో ఐదేళ్లు విజయాలు సాధిస్తూనే ఉండాలి. అందుకోసం నిరంతరంగా, ఓపిగ్గా కృషి చేయాలి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: దీపిక

    Ans:

    ఎంబ్రియాలజిస్టులు పునరుత్పత్తి అంచనాలు, సంతానోత్పత్తి పరిశోధన, సంతానోత్పత్తి పద్ధతుల అధ్యయనంపై దృష్టి పెడతారు. ముఖ్యంగా పిండ సంరక్షణలో నైపుణ్యంతోపాటు పునరుత్పత్తి సమస్యల చికిత్సకు నూతన ఆవిష్కరణలు చేస్తారు. గర్భం దాల్చడంలో ఇబ్బంది ఉన్న రోగులకు కౌన్సెలింగ్, చికిత్సలో వైద్యులతో కలిసి పని చేస్తారు. ఎంబ్రియాలజిస్ట్‌ అవ్వాలంటే క్లినికల్‌ లాబొరేటరీ పద్ధతులపై లోతైన జ్ఞానం, పునరుత్పత్తి శాస్త్రంపై అవగాహన అవసరం. ఈ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు బీఎస్సీలో బయొలాజికల్‌ సైన్స్‌/ బయోకెమిస్ట్రీ/ జెనెటిక్స్‌ చదవాలి. బీఎస్సీ తరువాత ఎంబ్రియాలజిలో సర్టిఫికెట్‌/ డిప్లొమా/ డిగ్రీ చేసే ప్రయత్నం చేయండి. ఈ కోర్సులు అందుబాటులో లేకపోతే ఎమ్మెస్సీలో మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ జెనెటిక్స్‌ లాంటి కోర్సులు చేసి, ఎంబ్రియాలజీ సంబంధిత క్లినికల్‌ ల్యాబ్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసి, ఆ రంగంలో నైపుణ్యాలు పెంపొందించుకోండి. మనదేశంలో ఎంబ్రియాలజీ రంగంలో ఉన్నత విద్యకు అవకాశాలు ఎక్కువగా లేవు. మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ జెనెటిక్స్‌ /యానిమల్‌  బయాలజీ / రిప్రొడక్టివ్‌ బయాలజీల్లో ఎంబ్రియాలజీకి సంబంధించిన అంశాల్లో  పీహెచ్‌డీ, పోస్ట్‌ డాక్టోరల్‌ రిసెర్చ్‌ కోసం విదేశాలకు వెళ్ళవచ్చు. మీకు ఆసక్తి ఉంటే విదేశాల్లోనే పీజీ, పీహెచ్‌డీ చేసే ప్రయత్నం చేయండి. ఎంబ్రియాలజీ కోర్సులు చదివినవారికి సంతాన సాఫల్య కేంద్రాల్లో, క్లినికల్‌ లాబొరేటరీల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కరుణ

    Ans:

    - మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ శిక్షణ పూర్తిచేసినవారికి ప్రభుత్వ వైద్య, ఆరోగ్యశాఖలో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌గా ఉద్యోగావకాశాలుంటాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో, వైద్య, ఆరోగ్యరంగాల్లో పనిచేసే స్వచ్ఛంద సేవాసంస్థల్లో, కమ్యూనిటీ హెల్త్‌ ఆర్గనైజేషన్లలో, వృద్ధాశ్రమాల్లో కొలువుల్లో చేరొచ్చు. మీరు ఒకవేళ డిగ్రీ పూర్తి చేస్తే మాస్టర్స్‌ ఇన్‌ పబ్లిక్‌హెల్త్, ఎంబీఏ- హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్స్‌ ఇన్‌ ఆప్టోమెట్రీ లాంటి కోర్సులు చేసే అవకాశం ఉంది. ఆసక్తి ఉంటే మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, ఫిజియోథెరపీ, కార్డియాలజీ, రేడియాలజీ, హెల్త్‌ సైకాలజీ, ఆడియాలజీ, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ లాంటి వాటిలో సర్టిఫికెట్‌/ డిప్లొమాలు చేయండి. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌  కెరియర్‌ కౌన్సెలర్‌