Post your question

 

  Asked By: prasanth

  Ans:

  ఇటీవలికాలంలో చాలా ఉద్యోగ/ప్రవేశ పరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)గానే నిర్వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాలపాటు పెన్ను, పేపర్‌ పరీక్షలకు అలవాటుపడిన తరానికి మొదటిసారి సీబీటీ రాయడం కొంత కంగారు కలిగించవచ్చు. కానీ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని, మాక్‌ టెస్ట్‌లను కంప్యూటర్‌పై సాధన చేస్తే సీబీటీని సులువుగా రాయవచ్చు. సాధారణ రాత పరీక్షలో అభ్యర్థులు తమకు కేటాయించిన బెంచి/ కుర్చీపై కూర్చొని రైటింగ్‌ ప్యాడ్‌/ టేబుల్‌పై పరీక్ష రాస్తారు. కానీ సీబీటీలో వారికి కేటాయించిన కంప్యూటర్‌ ముందు కూర్చుంటారు. కేటాయించిన ఐడీ…, పాస్‌వర్డ్‌లతో లాగిన్‌ అవ్వాలి. ఆపై తెరపై ఉన్న వివరణాత్మక సూచనలను జాగ్రత్తగా చదవాలి. పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నలు కంప్యూటర్‌ తెర మీద కనిపిస్తాయి. ప్రశ్నను జాగ్రత్తగా చదివి, సరైన సమాధానాన్ని మౌస్‌తో గుర్తించాలి. పరీక్ష అయ్యేవరకు కీబోర్డ్‌ పనిచేయదు. ఒకవేళ మీరు తప్పు సమాధానాన్ని గుర్తించినట్లు భావిస్తే, పరీక్ష పూర్తయ్యేలోపు ఎప్పుడైనా దాన్ని సరిచేసుకోవచ్చు. ఈ  వెసులుబాటు పెన్ను, పేపర్‌ పరీక్షల్లో ఉండదు.  ఏదైనా కంప్యూటర్‌/మౌస్‌ సరిగా పనిచేయకపోతే, ఆ అభ్యర్ధికి వెంటనే మరొక కంప్యూటర్‌/మౌస్‌ను కేటాయిస్తారు. ఈ మార్పిడిలో కోల్పోయిన సమయం సర్వర్‌లో సర్దుబాటు చేస్తారు. రాత పరీక్షలోలాగా మీరు ప్రతిసారీ టైమ్‌ చూసుకొనే పని లేకుండా, మానిటర్‌పై ఇంకా ఎంత  టైమ్‌ మిగిలి ఉందో కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి టైమర్‌ సున్నాను చూపించగానే పరీక్ష పూర్తవుతుంది. మీరు గుర్తించిన సమాధానాలు వాటికవే అప్‌ లోడ్‌ అయిపోతాయి. ప్రత్యేకించి పరీక్షను క్లోజ్‌ చేయాల్సిన అవసరం లేదు. పరీక్ష రాసేప్పుడు సమయంతో పాటు, ఎన్ని ప్రశ్నలు చదివారు, ఎన్ని  సమాధానాలు రాశారు, ఎన్నింటికి సమాధానాలు రాయలేదు, ఎన్ని సమాధానాలను రివ్యూ చేయాలని భావించారు అనే వివరాలు కూడా డిస్‌ ప్లే అవుతాయి. ఒకవేళ పరీక్ష సమయం పూర్తయ్యేలోపు మీరు రివ్యూ చేయాలనుకున్న సమాధానాలను రివ్యూ చేయలేకపోతే, ఆ సమాధానాలను కూడా మూల్యాంకనం చేస్తారు. మీరు పరీక్ష రాసేప్పుడు అవసరమైన కాలిక్యులేషన్స్‌ అన్నింటినీ ఇచ్చిన రఫ్‌షీట్‌లో మాత్రమే చేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత రఫ్‌ షీట్లను తప్పనిసరిగా విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని సీబీటీని ధైర్యంగా రాయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: జి.నిఖిల్‌

  Ans:

  మీరు ఎంబీఏలో హెచ్‌ఆర్‌ చేసినా, సీఏ కూడా చదివారు కాబట్టి అకౌంట్స్‌ రంగంలో పనిచేయడానికి మీకు విద్యార్హత ఉంది. కాకపోతే, రెండు సంవత్సరాల ఉద్యోగానుభవం హ్యూమన్‌ రిసోర్సెస్‌లో ఉండటం, ఆరేళ్లు ఖాళీగా ఉండటం వల్ల ఇప్పుడు అకౌంట్స్‌ రంగంలోకి వెళ్ళడం కొంత ఇబ్బందే కానీ అసాధ్యం మాత్రం కాదు. ముందుగా మీరు అకౌంట్స్‌లో ప్రాథమిక అంశాలను పునశ్చరణ చేసుకొని ఇటీవలికాలంలో ఈ రంగంలో వచ్చిన మార్పులను తెలుసుకోండి. అందుకు అనుగుణంగా అవసరమైన కోర్సులను ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో చేసే ప్రయత్నం చేయండి. అకౌంటింగ్‌తో పాటు కంప్యూటర్‌ వాడకంపై కనీస పరిజ్ఞానం, ఎంఎస్‌ ఎక్సెల్, అకౌంటింగ్‌ సంబంధిత సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన పెంచుకోండి. జీఎస్టీ, ఇన్‌కమ్‌టాక్స్, ఆడిటింగ్‌ ప్రమాణాలపై కూడా పట్టు సాధించాలి. వీటన్నిటితో పాటు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, విశ్లేషణ సామర్ధ్యం, సమకాలీన వ్యాపార అంశాలు అర్థం చేసుకోవడం చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: సంజీవరావు

  Ans:

  ఫార్మకాలజీ అనేది జీవ వ్యవస్థలపై ఔషధాలు ఎలా పనిచేస్తాయి, ఔషధానికి శరీరం ఎలా స్పందిస్తుంది లాంటి విషయాలను అధ్యయనం చేసే శాస్త్రం. రసాయన లక్షణాలు, జీవ ప్రభావాలు, ఔషధాల చికిత్సా ఉపయోగాల గురించి ఈ విభాగం అధ్యయనం చేస్తుంది. ఔషధం, ఫార్మసీ, డెంటిస్ట్రీ, నర్సింగ్, వెటర్నరీ మెడిసిన్‌తో సహా అనేక విభాగాల పరిజ్ఞానం ఫార్మకాలజీ రంగంలో ఉపయోగపడుతుంది.
  ఈ కోర్సు చదివినవారు క్లినికల్‌ స్టడీస్, బయో అనలిటికల్‌ స్టడీస్, టిష్యూ స్టడీస్, బ్లడ్‌ స్టడీస్, ఫార్మకో విజిలెన్స్‌ విభాగాలున్న అన్ని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో, ల్యాబొరేటరీల్లో ఉద్యోగాలతో పాటు పరిశోధన కూడా చేయొచ్చు. బోధనపై ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ చేసి ఆ రంగంలోనూ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. -
  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: ఎస్‌. రవిశంకర్‌

  Ans:

  ఉద్యోగ ప్రపంచంలో వేగంగా వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ఉద్యోగులకు ఎంతో అవసరం. సిక్స్‌ సిగ్మా బ్లాక్‌ బెల్ట్‌ ఒక సంస్థ ఆదాయం పెంచడంలో, ఖర్చు తగ్గించడంలో, నాణ్యతను పెంపొందించడంలో, తక్కువ వనరులతో ఎక్కువ ఉత్పాదకత పెంచడంలో, వినియోగదారులను సంతృప్తిపర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని చేసినవారికి నాయకత్వం, క్వాలిటీ మేనేజ్‌మెంట్, సమస్యా పరిష్కారాల్లో మంచి నైపుణ్యాలు ఉంటాయి. ఈ కోర్సు చేసినవారు ఆపరేషన్స్‌ డైరెక్టర్, సీనియర్‌ బిజినెస్‌ ప్రాసెస్‌ అనలిస్ట్, సీనియర్‌ కంటిన్యువస్‌ ఇంప్రూవ్‌మెంట్‌ లీడర్, సీనియర్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్, కన్సల్టెంట్, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ లాంటి ఉద్యోగాలకు అర్హులు. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, హెల్త్‌ కేర్, మాన్యుఫాక్చరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్‌ రంగాల్లో వీరికి ఉద్యోగావకాశాలు ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: Ahmad

  Ans:

  మీరు ఒక‌టి నుంచి ఏడో త‌ర‌గతి వ‌ర‌కు తెలంగాణ‌లో చ‌దివి ఉంటే టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష‌లు రాసుకోవ‌డానికి స్థానిక‌త వ‌ర్తిస్తుంది. లేదా నాన్‌లోక్ కింద ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

  Asked By: prasanth

  Ans:

  కొత్త భాష నేర్చుకోవాలంటే పదజాలాన్ని పెంచుకోవడం చాలా అవసరం.  సరైన వ్యాకరణ నియమాలు ఎంత అవసరమో, పద సంపద కూడా అంతే ముఖ్యం. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విద్యార్థులు ఈ  విషయంలో వెనకబడుతున్నారు. ఈ  సమస్యను అధిగమించడానికి ఇటీవలికాలంలో చాలా పుస్తకాలు, యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. మెక్‌ గ్రాహిల్‌ ఎసెన్షియల్‌ ఈఎస్‌ఎల్‌ డిక్షనరీ, ఇంగ్లిష్‌ ఒకాబ్యులరీ ఇన్‌ యూజ్‌ సిరీస్, ఆక్స్‌ఫర్డ్‌ పిక్చర్‌ డిక్షనరీ, 504 ఆబ్సల్యూట్లీ ఎసెన్షియల్‌ వర్డ్స్, ఎన్‌టీసీ ఒకాబ్యులరీ బిల్డర్స్, వర్డ్‌ పవర్‌ మేడ్‌ ఈజీ లాంటి పుస్తకాలను చదివి సాధన చేయండి. యాప్‌ల విషయానికొస్తే, BUSUU, MEMRISE, LinGo Play, Quizlet, Alpha bear 2, WordReference, Word of the day  లాంటి వాటిని అనుసరించవచ్చు. వీటితోపాటు memorise.com, Ffluentu.com, ఇఫ్లూ యూనివర్సిటీ వారి English Pro app ల ద్వారా కూడా మీ ఆంగ్ల పదజాలాన్నీ, భాష ఉచ్చారణనూ పెంచుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌