Post your question

 

    Asked By: ఎన్‌ అభిషేక్‌

    Ans:

    బీకాం బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు తరువాత డేటా అనలిస్ట్‌ అవ్వాలన్న మీ నిర్ణయం సరైందే. బీకాం తరువాత, అవకాశం ఉంటే ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు కూడా చదవండి. డేటా అనలిస్ట్‌ అవ్వడానికి సంబంధించిన ప్రాథమిక మెలకువలను మీరు బిజినెస్‌ అనలిటిక్స్‌ డిగ్రీలో చదువుతారు. అవకాశం ఉంటే ఐఐటీ మద్రాస్‌ అందిస్తున్న ఆన్‌లైన్‌ బీఎస్‌సీ డేటా సైన్స్‌ డిగ్రీని కూడా పూర్తి చేయండి. అలా కాకపోతే డిగ్రీ చేస్తూనే, డేటా సైన్స్‌ కోర్సులను ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా చేయండి. డేటా అనలిస్ట్‌ అవ్వాలంటే మేథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్, కోడింగ్‌లపై మంచి పట్టుండాలి. మీరు ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు చదివారు కాబట్టి, ఇంటర్‌ మ్యాథ్స్‌పై పట్టు సాధించండి. బీకాం డిగ్రీతో పాటు డేటా సైన్స్‌లో సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులు చేస్తూ, లైవ్‌ ప్రాజెక్టులు కూడా చేస్తే మీ ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: వి.సాయికృష్ణ

    Ans:

    ఇటీవలి కాలంలో చాలామంది విద్యార్ధులు ఇంటర్‌ తరువాత బీకాం డిగ్రీపై ఆసక్తి చూపుతున్నారు. దానికి ముఖ్య కారణం- కామర్స్‌ చదివినవారికి పెరుగుతున్న ఉద్యోగావకాశాలే! ముందుగా ఉన్నత విద్యావకాశాల విషయానికొస్తే, బీకాం చదివినవారు ఎంకాం, ఎంబీఏ, మాస్టర్‌ ఆఫ్‌ ఫైనాన్సియల్‌ అకౌంటింగ్, చార్టర్డ్‌ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, సర్టిఫైడ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్, మాస్టర్స్‌ ఇన్‌ ఫైనాన్సియల్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్స్‌ ఇన్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్స్‌ ఇన్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్, మాస్టర్స్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ స్టడీస్, మాస్టర్స్‌ ఇన్‌ ఇన్సూరెన్స్‌ స్టడీస్, మాస్టర్స్‌ ఇన్‌ మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్స్‌ ఇన్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ లాంటి చాలా ప్రోగ్రామ్‌లు చేసే అవకాశం ఉంది. వీటితో పాటు లా, పబ్లిక్‌ పాలసీ, టూరిజం, రిటైలింగ్, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్, జర్నలిజం, సైకాలజీ, ఫైనాన్సియల్‌ ఎకనామిక్స్, ఇంగ్లిష్‌/ తెలుగు లిటరేచర్, బిజినెస్‌ అనలిటిక్స్, ఎడ్యుకేషన్‌ లాంటి సబ్జెక్టుల్లో డిగ్రీ/ పీజీ కూడా చేయవచ్చు.
    బీకాం చదివినవారు అకౌంటెంట్, ట్యాక్స్‌ కన్సల్టెంట్, అకౌంట్స్‌ అనలిస్ట్, బిజినెస్‌ అనలిస్ట్, రిస్క్‌ మేనేజర్‌ లాంటి చాలా ఉద్యోగాలకు అర్హులవుతారు. ప్రభుత్వ/ ప్రైవేటు బ్యాంకుల్లో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ఆన్‌లైన్‌ రిటైలింగ్‌ సంస్థల్లో, ఫైనాన్స్‌ సంబంధిత ఐటీ కంపెనీల్లో, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో, ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో వివిధ ఉద్యోగాలకు బీకాం చదివినవారికి అవకాశాలుంటాయి. కామర్స్‌లో పీజీ చేసి, జూనియర్‌/డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా, పీహెచ్‌డీ చేసి యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా స్థిర పడవచ్చు. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: కె.రామకృష్ణ

    Ans:

    ఎంఎల్‌ఐఎస్‌సీ చదివినవారికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో, డిగ్రీ కళాశాలల్లో, యూనివర్సిటీల్లో వివిధ రకాలైన లైబ్రేరియన్‌ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. యూనివర్సిటీల్లో అయితే.. ప్రొఫెషనల్‌ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, లైబ్రరీ అసిస్టెంట్, జూనియర్‌ లైబ్రేరియన్, అసిస్టెంట్‌ లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, లైబ్రేరియన్‌ లాంటి  చాలా ఉద్యోగాలకు మీరు అర్హులవుతారు. వీటితో పాటుగా ఆర్కైవిస్ట్, ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ డైరెక్టర్, రికార్డ్‌ మేనేజర్, డాక్యుమెంటేషన్‌ ఆఫీసర్‌ లాంటి ఉద్యోగాల గురించి కూడా ఆలోచించవచ్చు. బ్యాంకుల్లో, మ్యూజియాల్లో కూడా లైబ్రరీ సైన్స్‌ చదివినవారికి పరిమిత సంఖ్యలో అవకాశాలుంటాయి.
    బోధన రంగంపై ఆసక్తి ఉంటే లైబ్రరీ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసి, అధ్యాపక ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. విదేశాల్లో కూడా దాదాపుగా పైన పేర్కొన్న ఉద్యోగాలన్నీ అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు రంగానికొస్తే - యూనివర్సిటీల్లో, కళాశాలల్లో లైబ్రేరియన్‌ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. లైబ్రరీ సైన్స్‌ చదివినవారికి మీడియా రంగంలోనూ ఉపాధికి వీలుంటుంది. లైబ్రరీ సైన్స్‌ పరిజ్ఞానంతో పాటు, కొంత ఐటీ పరిజ్ఞానం కూడా పెంపొందించుకొంటే ఇన్ఫర్మేషన్‌ అనలిస్ట్, ఇన్ఫర్మేషన్‌ ఆర్కిటెక్ట్‌ లాంటి ఉద్యోగాలకు అర్హులవుతారు.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎం. రాజేష్‌

    Ans:

    ఎమ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) చేసినవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ రకాలైన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు.. కంప్యూటర్‌ ప్రోగ్రామర్, సిస్టమ్స్‌ అనలిస్ట్, సిస్టమ్స్‌ మేనేజర్, సిస్టమ్స్‌ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్‌ ఇంజినీర్, కంప్యూటర్‌ సైంటిస్ట్, టెక్నికల్‌ అసిస్టెంట్, కంప్యూటర్‌ ఆపరేటర్, ఐటీ ఆఫీసర్, ఐటీ కన్సల్టెంట్, కంప్యూటర్‌ అసోసియేట్‌..ఇలాంటివి. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రభుత్వరంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎన్‌ఎండిసీ‡, కోల్‌ ఇండియా, ఎన్టీపీసీ, భారత్‌ పెట్రోలియం, సెయిల్, గెయిల్‌ లాంటి మరెన్నో సంస్థల్లో పైన పేర్కొన్న ఉద్యోగాలున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కూడా ఐటీ కొలువులు ఉంటాయి. ఈ సంస్థలన్నీ ప్రత్యేకమైన ఉద్యోగ నోటిఫికేషన్‌ల ద్వారా నియామకాలు చేపడుతున్నాయి.
    మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే జవహర్‌ నవోదయ/ కేంద్రీయ విద్యాలయ లాంటి సంస్థల్లో కంప్యూటర్‌ టీచర్‌ ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. ఆయా సంస్థల వెబ్‌సైట్‌లను తరచుగా సందర్శిస్తూ ఉద్యోగ ప్రకటన వచ్చినప్పుడు, దరఖాస్తు చేసుకోండి.  అవసరమైన పరీక్ష రాసి ఇంటర్వ్యూ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ప్రయత్నించండి. సాధారణంగా ప్రభుత్వ సంస్థల్లో కంప్యూటర్‌/ఐటీ ఉద్యోగాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఆ తక్కువ ఉద్యోగాలకు ఎమ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) చేసినవారితో పాటు, ఎంసీఏ, బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేసినవారూ దరఖాస్తు చేస్తుండటం వల్ల పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలోపు ప్రైవేటు ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించి ఉద్యోగానుభవాన్ని పొందండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: పి. మధుసూదన్‌రావు

    Ans:

    మీరు 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న కంపెనీ గురించీ, అక్కడ నిర్వహిస్తున్న బాధ్యతల గురించీ చెప్పలేదు. మీరు ఎంబీఏ ఫైనాన్స్, పీజీ డిప్లొమా ఇన్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు ఏ యూనివర్సిటీ నుంచి చేశారో! సాధారణంగా ఉద్యోగం చేస్తూ ఎంబీఏ లాంటి కోర్సులు చేసినవారికి కొత్త కొలువు పొందడంలో వారి గత ఉద్యోగానుభవం చాలా ఉపయోగపడుతుంది. మీరు ప్రస్తుతం పనిచేస్తున్న రంగంలోనే ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఎంబీఏ లాంటి కోర్సుల్లో మార్కులకంటే నైపుణ్యాలు చాలా ముఖ్యం. ఉద్యోగ ప్రయత్నాలపై మీరు ఎంబీఏ డిగ్రీ పొందిన యూనివర్సిటీ విశ్వసనీయత చాలా ప్రభావం చూపుతుంది. ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోండి. ఉద్యోగం చేయాలనుకుంటున్న కంపెనీలో పనిచేస్తున్న సీనియర్‌ ఉద్యోగుల ద్వారా మరిన్ని వివరాలు సేకరించి, దానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోండి. నిరుత్సాహపడకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: శ్రీకీర్తి

    Ans:

    హోటల్‌ మేనేజ్‌మెంట్‌/ టూరిజంలో ఎంబీఏ చేసినవాళ్లు చాలామంది అందుబాటులో ఉన్నప్పటికీ.. నిపుణుల కొరత ఎక్కువగానే ఉంది. ఈ డిగ్రీ చేసినవాళ్లు ట్రావెల్‌ ఏజెంట్, టూర్‌ మేనేజర్, టూర్‌గైడ్, వీసా ఎగ్జిక్యూటివ్, ట్రావెల్‌ కన్సల్టెంట్, హోటల్‌ మేనేజర్, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, హాస్పిటాలిటీ మేనేజర్, సేల్స్‌ మేనేజర్, హౌస్‌కీపింగ్‌ మేనేజర్, గెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ మేనేజర్, ఈవెంట్‌ మేనేజర్, బెవరెజ్‌ మేనేజర్, హాలిడే కన్సల్టెంట్, కేటరింగ్‌ మేనేజర్‌గా ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. ఈ కోర్సు చదివినవారికి హోటల్, హాస్పిటల్, ట్రావెల్‌ ఏజెన్సీలు, విమానయాన సంస్థలు, రిసార్ట్‌ల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఈ సంస్థలు అన్నింటిలో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కూడా ఉన్నాయి. సాధారణంగా హోటల్‌ మేనేజ్‌మెంట్‌/ టూరిజం ఏంబీఏ కోర్సులో భాగంగా ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా అదే సంస్థలో ఉద్యోగం లభించే అవకాశమూ ఉంది. చాలా సంస్థలు ఇంటర్న్‌షిప్‌ చేసేవారికి స్టైపెండ్‌ కూడా ఇస్తున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కె.అరుంధతి

    Ans:

    ఇటీవల డేటా సైన్స్‌ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా చాలా పరిశ్రమలు/ పరిశోధనా సంస్థలు డేటా సైన్స్‌/ అనలిటిక్స్‌కి సంబంధించిన విషయాలపై దృష్టి సారించాయి. ఎంఎస్సీ జువాలజీ చదివిన తర్వాత క్లినికల్‌ ఎస్‌ఏఎస్‌ కోర్సు చేయడం వల్ల మీ ఉద్యోగావకాశాలు మెరుగువుతాయి. ఫార్మా కంపెనీలు, బయోటెక్‌ కంపెనీలు, పరిశోధనా సంస్థల్లో క్లినికల్‌ డేటా అనాలిసిస్‌ కోసం డేటా అనలిస్ట్‌ల అవసరం పెరుగుతోంది. మీరు ఈ కోర్సు చేశాక క్లినికల్‌ డేటా మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, క్లినికల్‌ డేటా అసోసియేట్, క్లినికల్‌ డేటా అనలిస్ట్, క్లినికల్‌ డేటా మేనేజర్‌గా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఈ కోర్సులో చేరేముందు బయో స్టాటిస్టిక్స్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై పట్టు సాధించండి. వీలుంటే ఎంఎస్‌ ఎక్సెల్, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్‌లను కూడా నేర్చుకోండి. - ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌