Post your question

 

    Asked By: కిషోర్‌

    Ans:

    పుట్టగొడుగుల పెంపకంపై మనదేశంలో చాలా విద్యాసంస్థలు ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ శిక్షణను అందిస్తున్నాయి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ టెక్నాలజీ, గ్రేటర్‌ నోయిడా మష్రూమ్‌ కల్టివేషన్‌లో ఆరునెలల సర్టిఫికెట్‌ కోర్సును అందిస్తుంది. ఐసీఏఆర్‌- డైరెక్టొరేట్‌ ఆఫ్‌ మష్రూమ్‌ రీసెర్చ్‌ ఆరు రోజుల శిక్షణను నిర్వహిస్తున్నారు. ఐసీఏఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చరల్‌ రీసెర్చ్, బెంగళూరు మష్రూమ్‌ స్పాన్‌ ప్రొడక్షన్‌ అండ్‌ మష్రూమ్‌ కల్టివేషన్‌లో ఆరు రోజుల ఆన్‌లైన్‌ శిక్షణ ప్రోగ్రాంను అందిస్తుంది. ఇవే కాకుండా, మనదేశంలోని వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలూ పుట్టగొడుగుల పెంపకంపై ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ కోర్సులు నిర్వహిస్తున్నాయి. చాలా సంప్రదాయ యూనివర్సిటీలు/ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కూడా పుట్టగొడుగుల గురించి సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తున్నాయి. యుడెమీ లాంటి ఆన్‌లైన్‌ వేదికల్లోనూ పుట్టగొడుగుల పెంపకంపై చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: అపర్ణ

    Ans:

    విశ్వభారతి యూనివర్సిటీ, శాంతినికేతన్‌లో ఫైన్‌ ఆర్ట్స్‌ డిగ్రీలో డిజైన్‌-సిరామిక్స్‌ అండ్‌ గ్లాస్, డిజైన్‌-టెక్స్‌టైల్, గ్రాఫిక్‌ ఆర్ట్‌ (ప్రింట్‌ మేకింగ్‌), హిస్టరీ ఆఫ్‌ ఆర్ట్, పెయింటింగ్, స్కల్‌ప్చర్‌ స్పెషలైజేషన్లు ఉంటాయి. అక్కడ చదవాలంటే ముందుగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే దేశవ్యాప్త ప్రవేశపరీక్ష రాయాలి. దానిలో మెరుగైన ర్యాంకు సాధించి, విశ్వభారతి యూనివర్సిటీకి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించే ప్రాక్టికల్‌/రిటెన్‌ టెస్ట్, వైవా వోస్‌ పరీక్షకు హాజరు అవ్వాలి.
    ప్రాక్టికల్‌/రిటెన్‌ టెస్ట్‌ రెండు గంటల వ్యవధిలో ఉంటుంది. వైవా వోస్‌ పరీక్షకు వెళ్ళేప్పుడు విద్యార్ధులు గతంలో వేసిన చిత్రాలు/ పెయింటింగ్‌లు/ చెక్కిన శిల్పాలు/ తీసిన డాక్యుమెంటరీలు తీసుకొని వెళ్ళాలి. ఎన్టీఏ పరీక్షలో వచ్చిన మార్కులకు ప్రాక్టికల్‌/రిటెన్‌ టెస్ట్, వైవా వోస్‌ల్లో వచ్చిన మార్కులను కలిపి మెరిట్‌ లిస్ట్‌ తయారుచేసి ప్రవేశాలు చేపడతారు.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: విక్రమ్‌

    Ans:

    క్రీడల కోచ్‌ అవ్వాలంటే వాటిలో ఛాంపియన్‌ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ క్రీడలపై విపరీతమైన ఆసక్తి, కనీసం రెండిట్లో ప్రవేశం, ఈ రంగాన్ని కెరియర్‌గా మార్చుకోవాలనే లక్ష్యం, క్రీడలతోనే జీవితకాలం గడపగలిగే బలమైన కోరిక అవసరం. ఇవన్నీ ఉంటే స్పోర్ట్స్‌ కోచ్‌ అవటం పెద్ద కష్టమేమీ కాదు. నాయకత్వ లక్షణాలు, శారీరక దార్ఢ్యం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, ప్రేరణ సామర్ధ్యం, ఓపిక, సహానుభూతి, బలమైన వ్యక్తిత్వం.. వీటితో పాటు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో సర్టిఫికెట్‌ / డిప్లొమా / గ్రాడ్యుయేషన్‌ / పోస్ట్‌ గ్రాడ్యు యేషన్‌/ పీహెచ్‌డీ ఉన్నట్లైతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. మీరు ఏ క్రీడలో శిక్షకునిగా స్థిరపడాలనుకుంటున్నారో దానిపై స్పష్టత అవసరం. ఆ క్రీడలో పేరుపొందిన కోచ్‌ దగ్గర కొంతకాలం శిక్షణ తీసుకోవాలి. తర్వాత ఏదైనా స్టేడియంలో గానీ, అకాడమీలో గానీ, విద్యాసంస్థలో గానీ కోచ్‌గా కెరియర్‌ ప్రారంభించవచ్చు. ఇటీవల కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలు / సంస్థలు స్పోర్ట్స్‌ కోచింగ్‌లో సర్టిఫికెట్‌ / డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ఆ సంస్థల విశ్వసనీయత గురించి పూర్తిగా తెలుసుకొని కోర్సులో చేరే నిర్ణయాన్ని తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: కె.ప్రియ

    Ans:

    మీరు బోధనపై ఆసక్తితో ఆ రంగంలోకి రావాలి కానీ వేరే ఉద్యోగంపై ఉన్న అసంతృప్తితో కాదు. దానివల్ల మీరూ, మీ దగ్గర చదువుకొనే విద్యార్థులూ సంతృప్తిగా ఉండలేరు. బోధన రంగంలో ప్రభుత్వ కళాశాలల్లో ఉద్యోగావకాశాలు చాలా తక్కువ. ఉన్న ఆ కొద్ది అవకాశాలకూ పోటీ ఎక్కువ. ఇక ప్రైవేటు కళాశాలల విషయానికొస్తే, వేతనాలు ఆకర్షణీయంగా ఉండవు. మీరు హాస్పిటల్లో పనిచేస్తే భవిష్యత్తులో మీ ప్రతిభకు తగ్గ వేతనాలు లభించే అవకాశం ఉంటుంది. కానీ బోధన రంగంలో ప్రతిభకు తగ్గ వేతనాలు, పదోన్నతులు ఆకర్షణీయంగా ఉండవు. ప్రైవేటు కళాశాలల్లో ఎంఎల్‌టీ కోర్సుల్లో అడ్మిషన్ల సమస్య ఉంది. అడ్మిషన్లు ఉన్న కళాశాలల్లో హాజరు సమస్య ఉంది. హాజరు ఉన్నచోట కోర్సుపై ఆసక్తి ఉన్న విద్యార్థులు పరిమిత సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఉద్యోగ సంతృప్తి దొరకడం చాలా కష్టం. మీరు హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు రకరకాల పేషంట్లను చూస్తూ ఉన్నట్టే కళాశాలలో బోధించేప్పుడు రకరకాల మనస్తత్వాలున్న విద్యార్థుల్ని చూస్తారు. భిన్న సామర్థ్యాలుండే విద్యార్థులకు సంతృప్తికరంగా బోధించటం పెద్ద సవాలే. కానీ మీకు బోధన రంగంపై విపరీతమైన ఆసక్తీ, సంబంధిత నైపుణ్యాలూ ఉంటే, బోధన ద్వారా ఎదుటి వారి జీవితాల్ని మార్చాలనే ఆసక్తి బలంగా ఉంటే నిరభ్యంతరంగా ఈ రంగంలో ప్రవేశించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: సాయిప్రకాశ్‌

    Ans:

    సోషియాలజీ, సోషల్‌ వర్క్‌ల్లో రెండు వేర్వేరు పీజీ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. సోషల్‌ వర్క్‌లో పీజీ చేయాలంటే ఎంఎస్‌డబ్ల్యూ (మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌),  సోషియాలజీలో పీజీ చేయాలంటే ఎంఏ సోషియాలజీ చదవాలి. సాధారణంగా సోషియాలజీ ప్రోగ్రామ్‌లో సమాజం, కుటుంబం, వివాహ వ్యవస్థ గురించి ఉంటుంది. సామాజిక సంబంధాలు, సామాజిక ఆలోచనా విధానం, సంస్కృతి, అభివృద్ధి సామాజిక కోణం, కులం, మతం, పట్టణీకరణ, వలసలు, వివాహం, కుటుంబం, సామాజిక పరిశోధన లాంటి అంశాలుంటాయి. ఇక సోషల్‌ వర్క్‌ విషయానికొస్తే- కమ్యూనిటీ వర్క్, చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్, లేబర్‌ వెల్ఫేర్, అంటరానితనం, పునరావాసం, గ్రామీణాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి, కమ్యూనిటీ డెవలప్‌మెంట్, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ లాంటి అంశాలు భాగం. సోషియాలజీలో పీజీ చేసినవారు అధ్యాపకులుగా, పరిశోధకులుగా, సోషల్‌ వర్కర్లుగా స్థిరపడవచ్చు. సోషల్‌ వర్క్‌లో పీజీ చేసినవారు సోషల్‌ వర్కర్, ఫామిలీ కౌన్సెలర్, హాస్పిటల్‌ కౌన్సెలర్, డీఅడిక్షన్‌ కౌన్సెలర్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ హోదాల్లో విధులు నిర్వహించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌  

     

    Asked By: శేషులత

    Ans:

    పదో తరగతి తరువాత మీరు ఇంటర్మీడియట్‌ చదవలేదనేది యధార్థం. దాని గురించి మీరు ఎక్కువగా బాధపడాల్సిన పని లేదు. యూజీసీ నిబంధనల ప్రకారం మీరు కరస్పాండెన్స్‌ సిస్టం ద్వారా డిగ్రీ చదివి ఉంటే, ఇంటర్‌ చదవలేదని కంగారు పడకండి. ఒకవేళ ఇంటర్వ్యూల్లో ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్‌ అడిగితే, నిజాయతీగా ఇంటర్‌ చదవలేదని చెప్పండి. అలా చదవలేకపోవడానికి కారణాలను కూడా ధైర్యంగా చెప్పగలగాలి. ఏ ఇంటర్వ్యూలో అయినా అబద్ధాలు చెప్పకుండా విషయ పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, సానుకూల దృక్పథం ఉన్నవారిని విజయం వరించే అవకాశాలు ఎక్కువ. ఏదైనా ఉద్యోగ ప్రకటనలో ఇంటర్మీడియట్‌ కచ్చితంగా చదివి ఉండాలి అన్న నిబంధన ఉంటే తప్ప, డిగ్రీ/ పీజీ అర్హత ఉన్న అన్ని ఉద్యోగాలకూ మీరు అర్హులే. మీకు ఇంటర్‌ సర్టిఫికెట్‌ లేకపోవడం వల్ల కొంత నష్టం కలుగుతుందని భావిస్తే, మీ నైపుణ్యాలతో, విషయ పరిజ్ఞానంతో, నిజాయతీతో ఇంటర్వ్యూలో మెరుగైన ప్రతిభ చూపండి. మారుతున్న పరిస్థితుల్లో సాప్ట్‌వేర్‌ సంస్థ లైనా, ఇతర ప్రైవేటు నియామక సంస్థలైనా పేపర్‌ సర్టిఫికెట్‌ల కంటే రాత పరీక్షలో, ఇంటర్వ్యూలో అభ్యర్థి చూపే ప్రతిభకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంకా మీకు ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్‌ అవసరం అనుకొంటే, ఓపెన్‌ స్కూలింగ్‌ ద్వారా కానీ, ప్రైవేటుగా కానీ ఇంటర్‌ పూర్తి చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: శార్వాణి

    Ans:

    మీ స్నేహితురాలు మూడు పీజీలు ఏ ఉద్దేశంతో చేసిందో తననే అడిగి తెలుసుకోండి. సాధారణంగా చాలామంది విద్యార్థులు అభిరుచి కోసమో, మెరుగైన ఉపాధి అవకాశాల కోసమో, యూనివర్సిటీ/ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షలు రాయడం కోసమో, ఉద్యోగప్రయత్నాల్లో విఫలమై సొంతూరికి వెళ్లలేకో, స్నేహితుల ప్రోద్బలంతోనో ఒక పీజీ తరువాత మరో పీజీ చదువుతూ ఉంటారు. మీ స్నేహితురాలు ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం చేసింది కాబట్టి ఏదైనా జూనియర్‌/డిగ్రీ కాలేజీలో రెండు భాషలు బోధిస్తూ మెరుగైన వేతనం పొందే అవకాశం ఉంది. ఈ రెండు సబ్జెక్టుల్లో ఉద్యోగావకాశాలు లేకపోతే పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ సబ్జెక్టును కూడా బోధించే అవకాశం ఉంది. ఒకవేళ పీజీ తరువాత పీహెచ్‌డీ చేయాలనుకొంటే, ఈ మూడు సబ్జెక్టుల్లో తనకు నచ్చినదానిలో చేయొచ్చు. కానీ రెండేళ్లలో పూర్తిచేయాల్సిన పీజీని ఆరు సంవత్సరాలు చదవడం వల్ల ఉద్యోగం పొందడం ఆలస్యం కావొచ్చు. బోధన రంగంలో ఉద్యోగ ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ‘మూడు పీజీలు ఎందుకు చేశారు?’ అని అడిగితే సరైన సమాధానం చెప్పడం కొంత కష్టం అవుతుంది.
    డిగ్రీ తరువాత పీజీ చేసినట్లు పీహెచ్‌డీ కోర్సు అందరూ చేయగలిగేది కాదు. పరిశోధనపై చాలా ఇష్టం, సంబంధిత మెలకువలు, బోధన పట్ల ఆసక్తి, కనీసం నాలుగు సంవత్సరాలపాటు మరే ఆలోచనా లేకుండా దీన్నే కొనసాగించగల ఓపిక, అంతర్జాతీయ ప్రమాణాలతో థీసిస్‌/ పరిశోధన పత్రాలను రాయగలిగే నైపుణ్యాలుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. చాలా సందర్భాల్లో పీహెచ్‌డీ చేసినవారు మెరుగైన  ఉద్యోగం పొందలేక 15,000 నుంచి 25,000 రూపాయిల నెల వేతనంతో  జూనియర్‌/డిగ్రీ కళాశాలల్లో అసంతృప్తితో పనిచేస్తున్నారు. కొద్దిమంది మాత్రమే యూనివర్సిటీల్లో/ ప్రయోగశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/ సైంటిస్ట్‌గా దేశ విదేశాల్లో మెరుగైన ఉద్యోగాలు చేస్తున్నారు. బోధన రంగంపై ఆసక్తి ఉంటే పీజీ తరువాత నెట్‌/స్లెట్‌లో ఉత్తీర్ణత సాధించి డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కూడా స్థిరపడొచ్చు. చివరిగా మూడు పీజీలు, పీహెచ్‌డీల్లో ఏది ప్రయోజనకరం అనేది ఆయా విద్యార్ధుల ఆసక్తి, ఆశయాలను బట్టి ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సాయియాదవ్‌

    Ans:

    మీరు రెండు సంవత్సరాల క్రితమే బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేశారు కాబట్టి మీ వయసు దాదాపుగా 23/24 సంవత్సరాలు ఉండొచ్చు. గత రెండు సంవత్సరాలుగా మీరు కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులకు దూరంగా ఉండుంటారు. మరో రెండు సంవత్సరాలు మీరు పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లోనే ఉంటే, కంప్యూటర్‌ సైన్స్‌కు ఇంకా దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఈ రెండేళ్లలో ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోతే ఆ తరువాత మరో రెండేళ్లు ఎంసీఏ చదవాల్సి ఉంటుంది. అప్పుడు మీ వయసు 27/28 సంవత్సరాలు అవ్వొచ్చు. అలా కాకుండా, ఇప్పుడే మీరు ఎంసీఏలో చేరితే ప్రభుత్వ ఉద్యోగాల సన్నద్ధతకు దూరం  అవుతారు.
    నిర్ణయం తీసుకునేముందు కింది విషయాలను పరిగణనలోకి తీసుకోండి. మీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగమా? సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమా? గత రెండేళ్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయి? ప్రభుత్వ ఉద్యోగం సాధించగలనని గట్టి నమ్మకం ఉందా? కంప్యూటర్‌ సైన్స్‌కి సంబంధించిన సబ్జెక్టులపై, ప్రోగ్రామింగ్‌పై మీకెంత పట్టు ఉంది? ఎంసీఏ సీటును ఎన్‌ఐటీ, సెంట్రల్‌ యూనివర్సిటీ లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో పొందగలననే నమ్మకం ఉందా? ఎంసీఏ చదివితే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చే అవకాశాలు అధికం. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండటంవల్ల కొలువు వస్తుందన్న గ్యారంటీ తక్కువ. ఎంసీఏ చదువుతూ, ప్రభుత్వ ఉద్యోగ సన్నద్ధతను కూడా సమన్వయం చేయగల సామర్థ్యం మీకుందా? ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: prasanth

    Ans:

    మీ స్నేహితుడికి బీబీఏతో పాటు పది సంవత్సరాల ఉద్యోగానుభవం ఉంది కాబట్టి ఈఎంబీఏ (ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ) చదవడమే మంచిది. డిస్టెన్స్‌ ఎంబీఏలో చాలామంది విద్యార్థులు ఉద్యోగానుభవం లేకుండా నేరుగా అడ్మిషన్‌ తీసుకొంటారు. చాలా డిస్టెన్స్‌ ఎంబీఏ ప్రోగ్రాంలలో కాంటాక్ట్‌ క్లాసులకు హాజరు అవ్వాల్సిన అవసరం కూడా లేనందున నైపుణ్యాలను నేర్చుకొనే అవకాశం ఉండదు. ఈఎంబీఏ క్లాస్‌ రూంలో అందరూ ఉద్యోగానుభవం ఉన్నవారే ఉండటం వల్ల ఒకరి అనుభవం నుంచి మరొకరు నేర్చుకొనే అవకాశాలు ఎక్కువ. ఈఎంబీఏ ప్రోగ్రాంలో ప్రతి సెమిస్టర్‌లో కొన్ని కాంటాక్ట్‌ క్లాసులు తప్పనిసరి. ప్రొఫెసర్స్‌ నుంచి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈఎంబీఏ బోధనావిధానం కూడా డిస్టెన్స్‌ ఎంబీఏ కంటే భిన్నం. ఈఎంబీఏలో ఎక్కువగా కేస్‌ డిస్కషన్, సెమినార్లు, గేమ్స్, యాక్టివిటీస్‌ల సహాయంతో బోధన ఉంటుంది. థియరీ కంటే మెనేజీరియల్‌/ ప్రాక్టికల్‌ అప్లికేషన్స్‌కు ప్రాముఖ్యం అధికం. ఈఎంబీఏను ప్రముఖ బిజినెస్‌ స్కూల్స్‌ నుంచి చేస్తే ఎక్కువ ప్రయోజనాలుంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: prasanth

    Ans:

    బ్యాంకులో ఫైనాన్స్‌కు సంబంధించిన విభాగాల్లో పనిచేసినట్లయితే మీరు ఎంబీఏలో చదివిన ఫైనాన్స్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న వివిధ రకాల విభాగాలన్నీ పరిశీలించి, వాటిలో ఫైనాన్స్‌ సంబంధిత రంగాలను ఎంచుకొని అందుకు తగిన నైపుణ్యాలను పెంపొందించుకోండి. సాధారణంగా బ్యాంకుల్లో ఫైనాన్స్‌కి సంబంధించి  కార్పొరేట్‌ క్రెడిట్, రిటైల్‌ క్రెడిట్, ట్రెజరీ, ఫారెక్స్, రిస్క్‌ మేనేజ్‌మెంట్, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్‌ బ్యాంకింగ్‌ లాంటి విభాగాలుంటాయి. ఏ విభాగంలో పనిచేస్తే మంచి భవిష్యత్‌ ఉంటుంది అని అడిగారు. మీ దృష్టిలో మంచి భవిష్యత్తు అంటే ఎక్కువ వేతనం పొందడమా? పదోన్నతా? చేసే ఉద్యోగంలో సంతృప్తా? అనే విషయాలపై స్పష్టత అవసరం. మీ దీర్ఘకాలిక, స్వల్పకాలిక ఆశయాలను దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌