Post your question

 

    Asked By: ఆర్‌.శ్యామ్‌సుందర్‌

    Ans:

    మీరు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన తరువాత యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధం అవ్వాలని ఉందన్నారు. మీ దృష్టిలో యూపీఎస్సీ పరీక్ష అంటే సివిల్సా, ఇంజినీరింగ్‌ సర్వీసా అనేది చెప్పలేదు. పీయూసీ చదివేప్పుడే భవిష్యత్తు కెరియర్‌ గురించి ఆలోచించడం, యూపీఎస్సీ పరీక్ష లాంటి అత్యున్నత లక్ష్యాన్ని ఎంచుకోవడం అభినందనీయం! అయితే, మీరు ఇప్పుడు చదువుతున్న పీయూసీపై శ్రద్ధ పెట్టి, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని, ఇంజినీరింగ్‌ కోర్సును ఉత్తమ విద్యా సంస్థ నుంచి చదివే ప్రయత్నం చేయండి. ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం నుంచి యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధత మొదలు పెట్టండి.
    యూపీఎస్సీ పరీక్షలకూ, బోర్డ్‌/ యూనివర్సిటీ పరీక్షలకూ చాలా తేడా ఉంటుంది. బోర్డ్‌/ యూనివర్సిటీ పరీక్షల్లో ప్రశ్నల్ని నేరుగా ఇస్తే, యూపీఎస్సీలో అప్లికేషన్‌పై ఎక్కువగా అడుగుతారు. యూపీఎస్సీ సిలబస్‌లో జనరల్‌ స్టడీస్, కరెంట్‌ అఫైర్స్‌లు కూడా భాగం. కాబట్టి, ఇంజినీరింగ్‌ పుస్తకాలతో పాటు వార్తా పత్రికలను చదవడం మీ రోజు వారి జీవితంలో భాగం చేసుకోండి. యూపీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నలు ఆలోచనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా, సృజనాత్మకంగా, సమస్య- పరిష్కార పద్ధతుల్లో ఉంటాయి. మీరు పరీక్షలకు చదివేప్పుడు బట్టీ పట్టి చదవడం కాకుండా, అర్థం చేసుకొని, సొంతంగా నోట్సు రాసుకుంటూ చదవాలి. అప్పుడే విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. యూపీఎస్సీ పరీక్షలో రాణించాలన్న బలమైన ఆశయం ఉండి, ప్రణాళికయుతంగా కొన్ని సంవత్సరాల పాటు కృషి చేస్తే, మీ కలను నెరవేర్చుకోవడం అసాధ్యం కాదు. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: పి.కార్తీక్‌

    Ans:

    సివిల్స్‌ రాయడానికి జనరల్‌ కేటగిరికి చెందినవారికి 32 సంవత్సరాలు నిండేవరకు గరిష్ఠంగా 6 అవకాశాలు, ఓబీసీ కేటగిరికి చెందినవారికి 35 ఏళ్లు నిండేవరకు 9 అవకాశాలు, ఎస్సీ/ఎస్టీ కేటగిరి వారికి 37 ఏళ్లు నిండేవరకు అపరిమిత అవకాశాలుంటాయి. అదేవిధంగా జనరల్‌/ ఓబిసీ‡/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీల దివ్యాంగులకు 42 సంవత్సరాలు నిండేవరకు 9 అవకాశాలు, ఎస్సీ/ఎస్టీ కేటగిరి దివ్యాంగులకు 42 సంవత్సరాలు నిండేవరకు అపరిమిత అవకాశాలుంటాయి. ముందుగా, పై వాటిలో మీ కేటగిరికి ఎన్ని అవకాశాలున్నాయో తెలుసుకోండి. మీరు సివిల్స్‌ నిర్ణయాన్ని 28వ ఏట తీసుకున్నారు కాబట్టి, ఇప్పటినుంచి కనీసం నాలుగేళ్లు.. అంటే 32 సంవత్సరాలు నిండే వరకు మరో ఆలోచన లేకుండా, సివిల్స్‌ సన్నద్ధత మీదే దృష్టి పెట్టాలి. సివిల్స్‌లో కొన్ని వందల ఉద్యోగాలకు లక్షల మంది దరఖాస్తు చేస్తారు. కాబట్టి, పోటీ చాలా ఎక్కువ.
    సివిల్స్‌ రాయాలనే నిర్ణయం తీసుకొనేముందు..
    1) మీకు సివిల్స్‌ తప్ప మరే ఉద్యోమూ చేయలేనంత బలమైన ఇష్టం ఉందా?
    2) వచ్చే నాలుగేళ్ల పాటు మీ ఆర్థిక అవసరాలు ఎలా తీర్చుకుంటారు?
    3) ఒకవేళ సివిల్స్‌ సాధించడంలో విఫలమైతే మీముందు ఏ ప్రత్యామ్నాయాలున్నాయి?
    4) జయాపజయాలతో సంబంధం లేకుండా సివిల్స్‌ లక్ష్యంతో కొన్నేళ్లపాటు ప్రయాణించగల ఓపిక ఉందా?
    5) కొన్ని సంవత్సరాలపాటు రోజుకు కనీసం 15 గంటలు చదవగలిగే సామర్థ్యం మీకుందా?. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోండి.
    సివిల్స్‌ పరీక్షలో విజయం సాధించడమనేది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. అతి కొంతమంది మాత్రమే మొదటి ప్రయత్నంలో విజయం సాధిస్తే, మరికొంతమంది రెండు/మూడు/నాలుగో ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారు. చాలామంది అభ్యర్థులు తమకు అర్హత ఉన్న అవకాశాలన్నీ పూర్తయినా విజయం సాధించలేకపోతున్నారు. కానీ సివిల్స్‌కు సన్నద్ధమైనవారు ఇది కాకపోయినా ఇతర పోటీ పరీక్షల్లో విజయ సాధించి మెరుగైన ఉద్యోగాలు పొందగల్గుతున్నారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎం.రత్నకిశోర్‌

    Ans:

    సివిల్స్‌ లాంటి పరీక్షల్లో పోటీ ఎక్కువ ఉంటుంది. అందుకే చాలామంది తల్లిదండ్రులు మీ నాన్నగారిలాగే ఆలోచిస్తూ సివిల్స్‌ సన్నద్ధతతో పాటు, మరేదైనా ప్రొఫెషనల్‌ కోర్సు చదివితే, భవిష్యత్తులో ఇబ్బంది ఉండదని ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీరు భవిష్యత్తులో మంచి న్యాయవాదిగా స్థిరపడాలంటే బీఎల్‌ కోర్సు కూడా బాగా చదవాలి. ప్రస్తుతం మీముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
    1) సివిల్స్‌కి మాత్రమే సన్నద్ధం అవ్వడం. ఒకవేళ దీనిలో నెగ్గకపోతే డిగ్రీ విద్యార్హతతో పోటీ పరీక్షలు రాసి మరేదైనా ప్రభుత్వ ఉద్యోగం పొందడం. మీకు ఆసక్తి ఉంటే అప్పుడు కూడా బీఎల్‌ చదవొచ్చు.
    2) బీఎల్‌ పూర్తిచేసి సివిల్స్‌కు ప్రిపేర్‌ అవ్వడం. ఒకవేళ సివిల్స్‌లో విజయం సాధించలేకపోతే న్యాయవాదిగా స్థిరపడవచ్చు.
    3) సివిల్స్‌ సన్నద్ధత + బీఎల్‌ చదవడం. అయితే రెండింటినీ సమన్వయం చేస్తూ ఒత్తిడికి గురవ్వకుండా, ప్రణాళికాబద్ధంగా చదవకపోతే ఈ రెండింటిలో మీరు దేనికీ న్యాయం చేయలేకపోవచ్చు

    . - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: పి.శ్యామ్‌

    Ans:

    ఐఏఎస్‌ అవ్వాలంటే యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపాలి. సివిల్స్‌ లాంటి పరీక్షకు.. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే సన్నద్ధం అయితే ఫలితాలు బాగుంటాయి. ముందుగా యూపీఎస్సీ వెబ్‌సైట్‌ని సందర్శించి సివిల్‌ సర్వీసెస్‌కు సంబంధించిన సిలబస్, పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి ఈ పరీక్షపై అవగాహన ఏర్పరుచుకోండి. సిలబస్‌ ఆధారంగా ప్రామాణిక పుస్తకాలను సమకూర్చుకోండి. క్రమం తప్పకుండా దినపత్రికల్ని చదవండి. సంపాదకీయ పేజీలో వచ్చే వ్యాసాలను తప్పకుండా చదవండి. ఇప్పటికే ఈ పరీక్షకు సన్నద్ధం అయ్యేవారి సలహాలూ, సూచనలను స్వీకరించండి. సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉన్న సివిల్స్‌ విజేతల ఇంటర్వ్యూలను చూస్తూ ప్రేరణ పొందండి. కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, విషయ విశ్లేషణా సామర్థ్యాలను కూడా పెంపొందించుకోండి. సీశాట్‌ పరీక్ష కోసం ఇప్పటినుంచే సన్నద్ధంకండి. మెయిన్స్‌ పరీక్షకు రాయబోయే ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ను ముందే ఎంచుకోండి. రోజుకు ఎన్ని గంటలు చదవాలనుకుంటున్నారో.. అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ని సిద్ధం చేసుకోండి. చదివిన విషయాల్ని వీలున్నప్పుడల్లా పునశ్చరణ చేస్తూ ఉండండి. వీలైనన్ని మాక్‌ టెస్ట్‌లు రాయండి. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు నేరుగా దొరకవు. ప్రాథమిక అంశాలపై గట్టిపట్టు ఉండి, నిరంతరం చదివే అలవాటు ఉన్నవారు ఈ ప్రశ్నలకు సులువుగా సమాధానాలు రాయగలరు. ముఖ్యంగా మెయిన్స్‌ పరీక్షలో రాయవలసిన దీర్ఘ వ్యాసాలపై అవగాహన పెంచుకుని, అవి రాయడానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోండి. పైన చెప్పిన విషయాలన్నింటినీ పాటిస్తూ.. ఐఏఎస్‌ అవ్వాలన్న మీ కలను నిజం చేసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: లావణ్య

    Ans:

    ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు. చాలామంది తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నదే! ఈ సమస్యకు పరిష్కారం చెప్పడం తేలికే కానీ, దాని అమలులో చాలా ఇబ్బందులున్నాయి. మీ అబ్బాయి డిగ్రీ చదివి, సివిల్స్‌కు సన్నద్ధం అవుతున్నాడంటే, అతడికి కనీసం 22 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ వయసు పిల్లల్ని నియంత్రించాలి అనుకోవడమే అసలు సమస్య. సివిల్స్‌ సన్నద్ధత అనేది అతని ఆశయమా? మీ ఆశయమా? ఒకవేళ, అది అతని ఆశయమే అయితే ఒకసారి మాట్లాడి చూడండి. చాలా సందర్భాల్లో సమస్య పరిష్కారం కాకపోగా జటిలం అయ్యే అవకాశాలూ ఉంటాయి కాబట్టి, తెగేవరకు లాగకుండా జాగ్రత్తగా మాట్లాడండి. అలా మాట్లాడటంలో మీకేమైనా ఇబ్బంది ఉంటే, మీ బంధువుల్లో మీ అబ్బాయికి బాగా నచ్చినవారితో మాట్లాడించండి. అలా కూడా కుదరని పక్షంలో, మీ అబ్బాయి స్నేహితులు ఎవరైనా ఉంటే, వారితో మాట్లాడించండి, లేదా మీ అబ్బాయికి నచ్చిన ఉపాధ్యాయులతో లేదా అధ్యాపకులతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. చివరి ప్రయత్నంగా ఎవరైనా కౌన్సెలర్‌ దగ్గరకు తీసుకు వెళ్ళండి. వీటన్నింటికి ముందు మీ అబ్బాయికి సివిల్స్‌ పరీక్ష రాయడానికి అవసరమైన ప్రేరణ ఉందో, లేదో నిర్ధÄరించుకోండి. అందుకోసం, ఇప్పటికే సివిల్స్‌లో ర్యాంకు సాధించినవారితో మాట్లాడించి చూడండి.
    ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలు ఉద్యోగం చేయడం లేదని చెప్పడం ఇష్టం లేక, సివిల్స్‌ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నామని చెబుతున్నారు. పైన చెప్పిన వాటిలో మీ అబ్బాయి సమస్యకు ఏది సరైన పరిష్కారమో మీరే నిర్థరించుకోండి. రాత్రులు సోషల్‌ మీడియాలో ఉండటం, వీడియో గేమ్స్‌ ఆడటం, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం, వారాంతాల్లో సినిమాలు చూడటం.. ఈతరం పిల్లల్లో దాదాపుగా సహజం అయిపోయింది. ముఖ్యంగా 2000 సంవత్సరానికి అటూ, ఇటుగా పుట్టిన పిల్లల్లో చాలామంది ఇలానే ఉన్నారు. మీ అబ్బాయిని ప్రత్యేకంగా చూడకండి. ఈ తరం పిల్లల్లో ఉన్న మరో ముఖ్యమైన లక్షణం ఏంటంటే- వారికి నచ్చినదాన్ని సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు. ఇష్టం లేకపోతే, లక్షల రూపాయల ఉద్యోగాన్ని కూడా మరో ఆలోచన లేకుండా వదిలివేయగలరు.
    మీ అబ్బాయి భవిష్యత్తు గురించి ఎక్కువగా దిగులు పడకండి. చివరిగా- సివిల్స్‌ పరీక్షకు ఎన్ని గంటలు చదవాలి అనే ప్రామాణికాలు ఏమీ ఉండవు. ఎంతసేపు చదవాలి అనేది, మీ  అబ్బాయి మేధా సామర్థ్యం, ఎంచుకొన్న ఆప్షనల్, జ్ఞాపకశక్తి, విశ్లేషణ శక్తి, ప్రేరణ లాంటి చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది పిల్లలు ఎక్కువసేపు చదవకపోయినా సంగ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. మరికొంతమందికి ఎంతసేపు చదివినా అర్థం కాకపోవచ్చు. మీ అబ్బాయి ఏ రకానికి చెందినవాడో తెలుసుకోండి. సివిల్స్‌ కోచింగ్‌లో నిపుణులైన వారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: రిషి

    Ans:

    ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడేవారు నాలుగు రకాలుగా ఉన్నారు.
    1) డిగ్రీ పూర్తిచేసి పూర్తికాలం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు.
    2) డిగ్రీ తరువాత ఏదైనా యూనివర్సిటీలో పీజీలో చేరి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు.
    3) ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు.
    4) మీలాగా ప్రైవేటు కొలువు చేస్తూ సర్కారీ నౌకరీకి ప్రయత్నాలు చేసేవారు. వీరిలో మొదటి రకానికి చెందినవారిలో విజయం సాధించేవారు ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉండటం గమనిస్తూనే ఉన్నాం.
    మీ ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే- కనీసం ఆరు నెలలు మీ ఉద్యోగానికి సెలవు పెట్టి పూర్తికాలం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. అలా వీలుకాని పక్షంలో వారానికి కనీసం మూడురోజులు, రోజుకు కనీసం 12 గంటల సమయం కేటాయించి చదువుకోండి. ఇటీవలి కాలంలో పోటీ పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నల సరళి పూర్తిగా మారిపోయింది. బట్టీ పట్టి రాసే ప్రశ్నల కంటే, విశ్లేషణ అవసరమైన ఆలోచనాత్మక ప్రశ్నలు ఎక్కువగా ఇస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించే తెలివితేటలు, వేగం చాలా అవసరం. కొన్ని ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో తప్పు సమాధానాలకు రుణాత్మక మార్కులు కూడా ఉంటున్నాయి. అంటే పూర్తిగా సమాధానం తెలియని ప్రశ్నలకు ఏదో ఒక జవాబు గుర్తిస్తే నష్టం. కోచింగ్‌ సంస్థలు ఇచ్చే జవాబులను మూస పద్ధతిలో రాసేవారికంటే.. వివిధ రకాల పుస్తకాలనూ, వార్తా పత్రికలనూ చదువుతూ, సొంతంగా నోట్సు తయారుచేసుకుని రాసినవారికే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. వీలున్నన్ని నమూనా పరీక్షలను రాస్తూ మీ సన్నద్ధతను మెరుగుపర్చుకొంటూ ప్రభుత్వ ఉద్యోగ కలను నెరవేర్చుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: మోహన్‌రెడ్డి

    Ans:

    యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీస్‌ పరీక్ష (ఈఎస్‌ఈ) మూడు దశల్లో ఉంటుంది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన విద్యార్హతలు ఉన్నవారు పరీక్షకు దరఖాస్తు చేశాక ప్రిలిమినరీ రాయాలి. ప్రిలిమ్స్‌లో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్, సంబంధిత ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో రెండు ఆబ్జెక్టివ్‌ పేపర్లు మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్దతిలో ఉంటాయి. తప్పు సమాధానాలకు 0.33 చొప్పున రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రిలిమినరీలో సాధించిన ప్రతిభ ఆధారంగా ఆ సంవత్సరంలో ఉన్న ఖాళీల సంఖ్యకు ఆరు నుంచి ఏడు రెట్ల సంఖ్యలో అభ్యర్ధులను మెయిన్స్‌ రాయడానికి అవకాశం కల్పిస్తారు. మెయిన్స్‌ పరీక్షలో ఎంచుకున్న ఇంజినీరింగ్‌ సబ్జెక్ట్‌లో రెండు పేపర్లు వ్యాసరూపంలో రాయాలి. మెయిన్స్‌ పరీక్ష ప్రతిభ ఆధారంగా, ఆ సంవత్సరంలో ఉన్న ఖాళీల సంఖ్యకు రెండు రెట్ల సంఖ్యలో ఇంటర్వ్యూకి అర్హత కల్పిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కులన్నింటినీ కలిపి మెరిట్‌ లిస్ట్‌ తయారు చేస్తారు.
    పరీక్ష సన్నద్ధత విషయానికొస్తే- జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌లో సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన ప్రస్తుత సమస్యలు, లాజికల్‌ రీజనింగ్, అనలిటికల్‌ ఎబిలిటీ, ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్, ఇంజినీరింగ్‌ మ్యాథమెటిక్స్, న్యూమరికల్‌ అనాలిసిస్, డిజైన్, డ్రాయింగ్, భద్రత సూత్రాలు, ఉత్పత్తి, నిర్మాణంలో ప్రమాణాలు, నాణ్యతా పద్ధతులు, నిర్వహణ, సేవలు, ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం, క్షీణత, క్లైమేట్‌ ఛేంజ్, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, మెటీరియల్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీస్‌ ఆధారిత సాధనాలు, నెట్‌వర్కింగ్, ఈ-గవర్నెన్స్, టెక్నాలజీ ఆధారిత విద్య, ఇంజినీరింగ్‌ వృత్తిలో నీతి, విలువలు లాంటి అంశాలు సిలబస్‌లో ఉన్నాయి. పైన పేర్కొన్న అంశాలన్నీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ చదివినవారు ప్రత్యేకమైన శిక్షణ లేకుండానే పరీక్ష రాయగలిగే స్థాయిలో ఉంటాయి. కానీ, ప్రస్తుతం ఇంజినీరింగ్‌ చదువుతున్న చాలామంది గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను, టెస్ట్‌ పేపర్‌ గైడ్‌లను చదివి పరీక్షల్లో ఉత్తీర్ణులవడానికి ప్రయత్నిస్తున్నందున, అన్నిపేపర్‌లకూ ప్రత్యేక శిక్షణ అవసరం అవుతోంది.
    ఈఎస్‌ఈలో మంచి ర్యాంకు సాధించాలంటే ఎంతకాలం పడుతుందనేది వారి సామర్థ్యం, కృషి, పట్టుదలపై ఆధారపడి ఉంటుంది. మొదటి ప్రయత్నంలోనే సర్వీస్‌ సాధించినవారు, చాలా ప్రయత్నాల్లో కూడా సాధించలేనివారూ ఉన్నారు. ఈఎస్‌ఈలో విజయవంతం కావడానికి - మీరు పరీక్ష కోసం ఎంచుకున్న ఇంజినీరింగ్‌ సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై గట్టి పట్టు ఉండాలి. ఇంజినీరింగ్‌  నైపుణ్యాలు, అనువర్తనాలపై చాలా ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతో పాటు వ్యాసరూప ప్రశ్నలూ సమర్థంగా రాయాలి. ప్రామాణిక పాఠ్యపుస్తకాలను చదివి సొంతంగా నోట్సు తయారు చేసుకోండి. గతంలో ఇంజినీరింగ్‌ సర్వీస్‌ పరీక్షలో విజయం సాధించినవారితో మాట్లాడి, మరిన్ని మెలకువలు తెలుసుకోండి, ఈఎస్‌ఈ సాధించాలనే మీ కల నెరవేర్చుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: L.NANAVATHEE

    Ans:

    మీరు తెలుగు అకాడ‌మీ ముద్రించిన ప్రామాణిక పుస్త‌కాల‌ను చ‌ద‌వండి. రోజూ వార్తా పత్రిక‌లు చ‌దివి క‌రెంట్ అఫైర్స్‌నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.