Post your question

 

    Asked By: మోహన్‌రెడ్డి

    Ans:

    యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీస్‌ పరీక్ష (ఈఎస్‌ఈ) మూడు దశల్లో ఉంటుంది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన విద్యార్హతలు ఉన్నవారు పరీక్షకు దరఖాస్తు చేశాక ప్రిలిమినరీ రాయాలి. ప్రిలిమ్స్‌లో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్, సంబంధిత ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో రెండు ఆబ్జెక్టివ్‌ పేపర్లు మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్దతిలో ఉంటాయి. తప్పు సమాధానాలకు 0.33 చొప్పున రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రిలిమినరీలో సాధించిన ప్రతిభ ఆధారంగా ఆ సంవత్సరంలో ఉన్న ఖాళీల సంఖ్యకు ఆరు నుంచి ఏడు రెట్ల సంఖ్యలో అభ్యర్ధులను మెయిన్స్‌ రాయడానికి అవకాశం కల్పిస్తారు. మెయిన్స్‌ పరీక్షలో ఎంచుకున్న ఇంజినీరింగ్‌ సబ్జెక్ట్‌లో రెండు పేపర్లు వ్యాసరూపంలో రాయాలి. మెయిన్స్‌ పరీక్ష ప్రతిభ ఆధారంగా, ఆ సంవత్సరంలో ఉన్న ఖాళీల సంఖ్యకు రెండు రెట్ల సంఖ్యలో ఇంటర్వ్యూకి అర్హత కల్పిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కులన్నింటినీ కలిపి మెరిట్‌ లిస్ట్‌ తయారు చేస్తారు.
    పరీక్ష సన్నద్ధత విషయానికొస్తే- జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌లో సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన ప్రస్తుత సమస్యలు, లాజికల్‌ రీజనింగ్, అనలిటికల్‌ ఎబిలిటీ, ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్, ఇంజినీరింగ్‌ మ్యాథమెటిక్స్, న్యూమరికల్‌ అనాలిసిస్, డిజైన్, డ్రాయింగ్, భద్రత సూత్రాలు, ఉత్పత్తి, నిర్మాణంలో ప్రమాణాలు, నాణ్యతా పద్ధతులు, నిర్వహణ, సేవలు, ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం, క్షీణత, క్లైమేట్‌ ఛేంజ్, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, మెటీరియల్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీస్‌ ఆధారిత సాధనాలు, నెట్‌వర్కింగ్, ఈ-గవర్నెన్స్, టెక్నాలజీ ఆధారిత విద్య, ఇంజినీరింగ్‌ వృత్తిలో నీతి, విలువలు లాంటి అంశాలు సిలబస్‌లో ఉన్నాయి. పైన పేర్కొన్న అంశాలన్నీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ చదివినవారు ప్రత్యేకమైన శిక్షణ లేకుండానే పరీక్ష రాయగలిగే స్థాయిలో ఉంటాయి. కానీ, ప్రస్తుతం ఇంజినీరింగ్‌ చదువుతున్న చాలామంది గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను, టెస్ట్‌ పేపర్‌ గైడ్‌లను చదివి పరీక్షల్లో ఉత్తీర్ణులవడానికి ప్రయత్నిస్తున్నందున, అన్నిపేపర్‌లకూ ప్రత్యేక శిక్షణ అవసరం అవుతోంది.
    ఈఎస్‌ఈలో మంచి ర్యాంకు సాధించాలంటే ఎంతకాలం పడుతుందనేది వారి సామర్థ్యం, కృషి, పట్టుదలపై ఆధారపడి ఉంటుంది. మొదటి ప్రయత్నంలోనే సర్వీస్‌ సాధించినవారు, చాలా ప్రయత్నాల్లో కూడా సాధించలేనివారూ ఉన్నారు. ఈఎస్‌ఈలో విజయవంతం కావడానికి - మీరు పరీక్ష కోసం ఎంచుకున్న ఇంజినీరింగ్‌ సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై గట్టి పట్టు ఉండాలి. ఇంజినీరింగ్‌  నైపుణ్యాలు, అనువర్తనాలపై చాలా ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతో పాటు వ్యాసరూప ప్రశ్నలూ సమర్థంగా రాయాలి. ప్రామాణిక పాఠ్యపుస్తకాలను చదివి సొంతంగా నోట్సు తయారు చేసుకోండి. గతంలో ఇంజినీరింగ్‌ సర్వీస్‌ పరీక్షలో విజయం సాధించినవారితో మాట్లాడి, మరిన్ని మెలకువలు తెలుసుకోండి, ఈఎస్‌ఈ సాధించాలనే మీ కల నెరవేర్చుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: L.NANAVATHEE

    Ans:

    మీరు తెలుగు అకాడ‌మీ ముద్రించిన ప్రామాణిక పుస్త‌కాల‌ను చ‌ద‌వండి. రోజూ వార్తా పత్రిక‌లు చ‌దివి క‌రెంట్ అఫైర్స్‌నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.

    Asked By: సీహెచ్‌. లక్ష్మయ్య

    Ans:

    సాధారణ డిగ్రీ లేదా ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుతూ సివిల్స్‌కు సన్నద్ధం కావచ్చు. సివిల్‌ సర్వీసెస్‌ సాధించాలన్న లక్ష్యం బలంగా ఉంటే ఏ కోర్సులో చేరినప్పటికీ విజయం సాధించవచ్చు. సోషల్‌ సైన్సెస్‌లో డిగ్రీ చేస్తూ సివిల్స్‌కు సన్నద్ధమయితే హిస్టరీ, ఎకానమీ, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫీ, సోషియాలజీ, ఆంత్రొపాలజీ, రూరల్‌ డెవలప్‌మెంట్ లాంటి సబ్జెక్టులపై ప్రాథమిక అవగాహన ఉంటుంది. ఆ తరువాత, మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేస్తే, అదే సబ్జెక్టును ఆప్షనల్‌గా తీసుకొని సివిల్స్‌ పరీక్ష రాయవచ్చు. సాధారణ డిగ్రీకి  బదులుగా, ఇంజినీరింగ్‌ డిగ్రీ చేస్తే ఎకాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలపై అవగాహన వస్తుంది. ఇంజినీరింగ్‌ కోర్సు చదవడం వల్ల లాజికల్‌ థింకింగ్, అనలిటికల్‌ థింకింగ్, ప్రాబ్ల్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఇంజినీరింగ్‌ చేసిన చాలామంది అభ్యర్ధులు సివిల్స్‌లో సోషల్‌ సైన్స్, లిటరేచర్‌ సబ్జెక్టులను ఆప్షనల్‌గా తీసుకొంటున్నారు. ఈ రెండు రకాల డిగ్రీలకూ కొన్ని అనుకూలతలూ, ఇబ్బందులూ ఉన్నాయి. ఒకవేళ సివిల్స్‌ సాధించలేకపోతే, సాధారణ డిగ్రీ చదివినవారికంటే, ఇంజినీరింగ్‌ చదివినవారికి వేరే ఉద్యోగం త్వరగా వచ్చే అవకాశం ఉంది. పత్రికా పఠనంతోపాటు ఎడిటోరియల్‌ పేజీల్లో వచ్చే వ్యాసాలను చదివి సొంతంగా నోట్స్‌ తయారుచేసుకోండి. . - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: బి. సతీశ్‌కుమార్‌

    Ans:

    ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు టెక్నికల్‌ సబ్జెక్టులపై పట్టు ఉన్నప్పటికీ, జనరల్‌ స్టడీస్‌ విషయానికొస్తే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర పోటీ పరీక్షలతో పోలిస్తే, యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌లో ప్రశ్నల స్థాయి కొంత కఠినంగా ఉంటుంది. కానీ, కనీసం రెండు సంవత్సరాలపాటు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయితే ఉత్తీర్ణత కష్టమేమీ కాదు. చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ చదివే సమయంలో ఈఎస్‌ఈలోని చాలా టాపిక్స్‌పై పెద్దగా దృష్టి పెట్టరు. ప్రిలిమినరీలో సమయ నిర్వహణ చాలా ముఖ్యం. సిలబస్‌నూ, పాత ప్రశ్నపత్రాలనూ పరిశీలించి, మీ ప్రస్తుత విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసుకొని సన్నద్ధత మొదలుపెట్టండి. ఇక మెయిన్స్‌ ఇంజినీరింగ్‌లో రాసిన పరీక్షలకు పూర్తి విభిన్నం. ముఖ్యంగా ప్రశ్నలు కాంప్రహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్‌లను పరీక్షించేవిధంగా ఉంటాయి. మీరు ఉద్యోగం చేస్తూనే ఈ పరీక్ష రాయాలనుకొంటున్నారు కాబట్టి, ఉద్యోగాన్నీ, ప్రిపరేషన్‌ సమయాన్నీ సమన్వయం చేసుకొనేలా ప్రణాళికను తయారు చేసుకోండి. వీలుంటే ఒక సంవత్సరం ఉద్యోగానికి సెలవు పెట్టండి. ప్రామాణిక పుస్తకాలనుంచి నోట్స్‌ రాసుకొని, కనీసం రోజుకు 10 గంటలు చదివితే ఐఈఎస్‌ సాధించాలనే మీ కలను సాకారం చేసుకోవచ్చు! - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎస్‌.ప్రమీల

    Ans:

    క్రమం తప్పకుండా వార్తా పత్రికలూ, సంపాదకీయ పేజీలో వచ్చే వ్యాసాలూ చదువుతూ మంచి నోట్స్‌ తయారు చేసుకోండి. కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించిన ప్రామాణిక వార/పక్ష/ మాస పత్రికలను కూడా చదవండి. ఇంటర్‌నెట్‌లో వర్తమానాంశాలను క్రోఢీకరించి అందించే వివిధ వెబ్‌సైట్లను సందర్శించి అక్కడ ఉన్న సమాచారాన్ని మీ నోట్సుతో సరిపోల్చి, నోట్స్‌ మెరుగుపర్చుకోండి. వీటితో పాటుగా ఇండియా ఇయర్‌ బుక్, మనోరమ ఇయర్‌ బుక్, ఎకనమిక్‌ సర్వే, మాతృభూమి ఇయర్‌ బుక్, కురుక్షేత్ర పత్రిక, యోజన, ప్రత్యోగిత దర్పణ్‌ కూడా తప్పకుండా చదవండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సీహెచ్‌. హారిక

    Ans:

    డిగ్రీ తరువాత కనీసం రెండు సంవత్సరాలు పూర్తిగా సివిల్స్‌ పరీక్షకి సన్నద్ధం అయినట్లయితే విజయం సాధించే అవకాశాలు ఎక్కువ. పీజీ చదువుతూ కూడా సివిల్స్‌కి సన్నద్ధం అవ్వొచ్చు. మెయిన్స్‌లో మీరు ఎంచుకోబోయే ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లో పీజీ చేసినట్లయితే, మీ విజయావకాశాలు మెరుగవుతాయి. ఇటీవల ఉన్నత విద్యారంగంలో వస్తున్న సంస్కరణల ఫలితంగా డిగ్రీలో సైన్స్‌ చదివినప్పటికీ పీజీలో సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టులు కూడా చదివే అవకాశం ఉంది. రెండు సంవత్సరాలు పీజీ చేసిన తరువాత సివిల్స్‌కి ప్రయత్నిస్తే, పోటీ పరీక్షల్లో/ ఇంటర్వ్యూలో మెరుగైన ప్రతిభని కనపర్చవచ్చు. ఒకవేళ మీరు సివిల్స్‌ పరీక్షలో నెగ్గలేకపోతే, పీజీ అర్హతతో ఉన్నత విద్య/ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: ఎస్‌. హర్ష

    Ans:

    విద్యుత్‌ శాఖలో ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కి సన్నద్ధం కావడం కొంత కష్టమే! కానీ, సివిల్స్‌పై మీకున్న ఇష్టం ఈ కష్టాన్ని అధిగమించి లక్ష్యాన్ని అందుకొనేలా చేయవచ్చు. ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కి సిద్ధం అవ్వాలంటే కనీసం మూడు సంవత్సరాలపాటు ప్రణాళికాబద్ధంగా చదవాలి. మీరు వేరే ఊళ్లలో ఉంటే.. ముందుగా హైదరాబాద్‌కి బదిలీపై కానీ, డెప్యుటేషన్‌పై కానీ రండి. మీ ఆఫీస్‌ పని సమయం రోజుకి 7 గంటలుంటే రోజుకు 5 గంటల చొప్పున ప్రిపరేషన్‌కి కేటాయించండి. రెండు సంవత్సరాల పాటు సెలవు దొరికే అవకాశం ఉంటే రోజుకు కనీసం 12 గంటల సమయాన్ని సన్నద్ధతకు కేటాయించి మీ ఆశయాన్ని నెరవేర్చుకోవచ్చు.
    ముందుగా యూపీఎస్‌సీ ప్రకటన పూర్తిగా చదివి మీ వయసు, సామాజిక నేపథ్యాలనుబట్టి ఎన్ని అవకాశాలున్నాయో తెలుసుకోండి. అందుకు తగ్గట్లుగా ప్రణాళికల్ని సిద్దం చేసుకోండి. ప్రిలిమ్స్‌ కోసం అవసరమైన మెటీరియల్‌ని సమకూర్చుకోండి. గతంలో సివిల్స్‌ సాధించినవారినీ, ప్రస్తుతం సివిల్స్‌ రాస్తున్నవారినీ సంప్రదించి వారి అనుభవాలు తెలుసుకోండి. యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న సివిల్స్‌ విజేతల విజయగాథలను చూసి, వారి ప్రిపరేషన్‌ పద్ధతుల గురించి అవగాహన పెంచుకోండి. ఆప్షనల్‌ని ఎంచుకొన్నాక అందుకు సంబంధించిన సిలబస్, పాత ప్రశ్నపత్రాల్ని జాగ్రత్తగా పరిశీలించండి. ప్రామాణిక పుస్తకాలను సేకరించండి. మంచి కోచింగ్‌ సెంటర్‌లో కనీసం ఏడాది శిక్షణ తీసుకొనే ప్రయత్నం చేయండి. అలా కుదరని పక్షంలో ఏదైనా ప్రముఖ శిక్షణ సంస్థ నుంచి ఆన్‌లైన్‌ కోచింగ్‌ తీసుకోండి. వార్తాపత్రికలు, జనరల్‌ స్టడీస్, ఆప్టిట్యూడ్‌లకు సంబంధించిన పుస్తకాలను నిరంతరం చదువుతూ, నోట్సు తయారు చేసుకోండి. ఈ సన్నద్ధత, మెయిన్స్‌ పరీక్షలో వ్యాసాలు రాయడానికి బాగా ఉపకరిస్తుంది. ముందే చెప్పినట్లు- కనీసం రెండు, మూడు సంవత్సరాల పాటు గట్టి పట్టుదలతో కృషి చేస్తే, ఐఏఎస్‌ అవ్వాలనే మీ కలను నిజం చేసుకోవడం సాధ్యం అవుతుంది.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌