Post your question

 

  Asked By: జి.అరుణ

  Ans:

  వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) అనేది దేహ్రాదూన్‌లో 1982 వ సంవత్సరంలో స్థాపితమైన స్వయం ప్రతిపత్తి గల విద్యా శిక్షణ సంస్థ. దీనికి భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ పరిధిలో అంతర్జాతీయంగా అత్యున్నత స్థాయిలో గుర్తింపు ఉంది. ఇక్కడ వన్యప్రాణుల సంరక్షణతో పాటుగా బయోడైవర్సిటీ రంగంలో కూడా పరిశోధనలు జరుగుతాయి. ఈ సంస్థ వైల్డ్‌ లైఫ్‌ సైన్సెస్‌లో ఎంఎస్‌సీనీ, హెరిటేజ్‌ కన్సర్వేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌నూ అందిస్తుంది. వీటితో పాటు పీ‡హెచ్‌డీ కోర్సు కూడా అందుబాటులో ఉంది. వైల్డ్‌లైఫ్‌ సైన్సెస్‌లో ఎంఎస్‌సీ కోర్సు చదవాలంటే సైన్స్, మెడికల్, ఇంజినీరింగ్, వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ, అగ్రికల్చర్, సోషల్‌ సైన్సెస్, కంప్యూటర్‌ సైన్స్‌ల్లో ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ చేసివుండాలి. ఇంజినీరింగ్, సోషల్‌ సైన్సెస్, కంప్యూటర్‌ సైన్స్‌ ల్లో డిగ్రీ చేసినవారు హైయర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌లో బయాలజీ చదివి ఉండాలి. ప్రవేశపరీక్ష రాయడానికి డిగ్రీలో కనీసం 50 శాతంతో ఉత్తీర్ణత పొందివుండాలి. రిజర్వేషన్‌ అభ్యర్థులకు 5 శాతం సడలింపు ఉంటుంది. ఈ కోర్సు చదవాలంటే 25 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. రిజర్వేషన్‌ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, వైల్డ్‌ లైఫ్, ఫారెస్ట్‌ విభాగాల్లో పనిచేస్తున్నవారికి 10 సంవత్సరాల సడలింపు ఉంది.
  ఈ అర్హతలున్న అభ్యర్థులు జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌ లో రాయాలి. ఈ పరీక్ష 100 మార్కులకు 2 గంటల వ్యవధిలో జరుగుతుంది. పరీక్షలో మూడు విభాగాలుంటాయి. మొదటి విభాగంలో కరెంట్‌ అఫైర్స్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, కంప్యూటర్‌ స్కిల్స్, క్వాంటిటేటివ్‌ స్కిల్స్‌; రెండో విభాగంలో వైల్డ్‌ లైఫ్, ఫారెస్ట్, ఎన్విరాన్‌మెంట్, కన్జర్వేషన్‌; మూడో విభాగంలో వైల్డ్‌లైఫ్, ఫారెస్ట్, ఎన్విరాన్‌మెంట్, కన్జర్వేషన్‌ల్లో ఒక ఎస్సే ఉంటుంది. మొదటి రెండు విభాగాల్లో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. ప్రవేశపరీక్ష లో పొందిన మార్కుల ఆధారంగా ఇంటర్వూలు నిర్వహిస్తారు. రాత పరీక్షకు 70 శాతం, ఇంటర్వ్యూ కి 30 శాతం వెయిటేజి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో పొందిన మార్కుల ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. సాధారణంగా ప్రవేశ ప్రకటన జనవరి/ ఫిబ్రవరి నెలలో వస్తుంది. అర్హత పరీక్ష, ఇంటర్వూలు మే నెలలో నిర్వహిస్తారు. జూన్‌ నెలలో అడ్మిషన్‌లు పూర్తిచేసి జులైౖలో తరగతులు ప్రారంభిస్తారు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: ఎన్‌. శివప్రియ

  Ans:

  నేరాలు, క్రిమినల్‌ కేసుల దర్యాప్తులో ఫోరెన్సిక్‌ సైన్స్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కోర్సులో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైకాలజీ, సోషియాలజీ సబ్జెక్టుల అంశాలను నేర్పిస్తారు. ఈ కోర్సు ఆసక్తికరంగా కూడా ఉంటుంది. ఫోరెన్సిక్‌ సైన్స్‌లో ఆసక్తి ఉన్నవారికి బ్యాచిలర్స్, మాస్టర్స్‌ స్థాయిలో కోర్సులు ఉన్నాయి, బ్యాచిలర్స్‌ స్థాయిలో బీఎస్‌సీ ఫోరెన్సిక్‌ సైన్స్, బీఎస్‌సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ (ఆనర్స్‌) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సు చదవడానికి 10+2 లేదా ఇంటర్మీడియట్‌ను సైన్స్‌ గ్రూపుతో ఉత్తీర్ణులవ్వడం కనీస అర్హత. మాస్టర్స్‌ స్థాయిలో ఫోరెన్సిక్‌ సైన్స్‌లో ఎం.ఎస్‌.సి. ఫోరెన్సిక్‌ సైన్స్, ఎం.ఎస్‌.సి.ఫోరెన్సిక్‌ సైన్స్‌ అండ్‌ క్రిమినాలజీ¨, ఎం.ఎస్‌.సి.ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ అండ్‌ సైబర్‌ ఫోరెన్సిక్స్‌ లాంటి కోర్సులు ఉన్నాయి. బ్యాచిలర్స్‌ స్థాయిలో బయాలజీకి సంబంధించిన బ్రాంచితో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులు అవ్వడం ఈ కోర్సుకు కనీస అర్హత. చాలా కళాశాలలు ప్రవేశ పరీక్ష లేకుండా మార్కుల మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. మన రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌లు ఆయా విశ్వవిద్యాలయాల ద్వారా జారీ అవుతాయి. బ్యాచిలర్స్‌ స్థాయిలో ఈ కోర్సు చేసిన తరువాత ఉద్యోగావకాశాలు లభించడం కష్టంగా ఉంటే, మాస్టర్స్‌ చెయ్యడం వల్ల కెరియర్‌ను మొదలుపెట్టడం శ్రేయస్కరం. ఫోరెన్సిక్‌ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసినవారికి, ఫోరెన్సిక్‌ సైంటిస్ట్, ప్రైవేటు ఇన్వెస్టిగేటర్స్, డ్రగ్‌ అనలిస్ట్, క్రైం ల్యాబ్‌ అనలిస్ట్, ఫోరెన్సిక్‌ ఆర్కిటెక్ట్, ఫోరెన్సిక్‌ ఇంజినీర్, పోలీస్‌ శాఖ, ఫోరెన్సిక్‌ కన్సల్టెంట్‌ లాంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: శ్రీహర్షిత

  Ans:

  ఒకే సమయంలో ఒక రెగ్యులర్‌ కోర్సు, ఒక దూరవిద్య/ఆన్‌లైన్‌ కోర్సు చదువుకోవడానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) 2020లో ఆమోదం తెలిపింది. దీని ప్రకారం మీరు రెగ్యులర్‌ మోడ్‌లో ఏ కోర్సు చదువుతున్నా కానీ, దూరవిద్య/ఆన్‌లైన్‌ ద్వారా నచ్చిన కోర్సులో చేరే అవకాశం ఉంది. మీరు బీబీఏ డిగ్రీ రెగ్యులర్‌గా చదువుతూ, ఇగ్నో ద్వారా బీఏ డిగ్రీని కూడా పూర్తిచేసుకోవచ్చు. అయితే ఒకే సమయంలో రెండు డిగ్రీలను రెగ్యులర్‌ మోడ్‌లో చదవడం కుదరదు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌