Asked By: జి.నాగలక్ష్మి
Ans:
విదేశాల్లో పరిశోధన చేయాలంటే.. అక్కడి యూనివర్సిటీల్లో పీజీ చేసి ఉండటం శ్రేయస్కరం. ముందుగా పరిశోధనా అంశాన్ని, అందుకు తగిన యూనివర్సిటీని, సరైన గైడ్‌ని ఎంచుకోవాలి. విదేశాల్లో అడ్మిషన్ విధానం, పరిశోధన పద్ధతులు మనకంటే భిన్నంగా ఉంటాయి. అక్కడి పరిస్థితులపై అవగాహన ఏర్పర్చుకోవాలి. కనీసం రెండు పరిశోధనా పత్రాలు మంచి జర్నల్స్‌లో ప్రచురించి ఉంటే, మీ అబ్బాయి పీహెచ్‌డీ అడ్మిషన్ సులువు అవుతుంది. చాలామంది విదేశాల్లో పీజీలో చేరి, రెండో సంవత్సరంలో ఆ పీజీ అడ్మిషన్‌ని పీహెచ్‌డీ అడ్మిషన్‌గా మార్చుకుంటారు. పరిశోధనలో ముఖ్యమైన విషయం - మనం పరిశోధన చేయాలనుకుంటున్నవారి నమ్మకం పొందటం. ఆ నమ్మకం వ్యక్తిగత పరిచయం, ప్రచురించిన పరిశోధనపత్రాల నాణ్యత, పీజీ చదివిన విశ్వవిద్యాలయ అంతర్జాతీయ ర్యాంకింగ్, ఇక్కడి ప్రొఫెసర్లు ఇచ్చే రికమెండేషన్ లెటర్స్ వల్ల వస్తుంది. అవకాశం ఉంటే మీ అబ్బాయిని మనదేశంలోనే ఏదైనా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో మంచి పరిశోధన నేపథ్యం ఉన్న ప్రొఫెసర్ దగ్గర ప్రాజెక్ట్‌లో చేరి, పరిశోధన మెలకువలను నేర్చుకోమని చెప్పండి. నాణ్యమైన పరిశోధనపత్రాలను ప్రచురించి, విదేశాల్లో మంచి యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశం పొందేలా ప్రోత్సహించండి. అలా కుదరని పక్షంలో ప్రముఖ విదేశీ యూనివర్సిటీలో పీజీ చేయమని చెప్పండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: శ్రద్ధ
Ans:
మీరు సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదవాలంటే, ఎన్‌టీఏ నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ-పీజీ) రాయాలి. గత సంవత్సరం నుంచే అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ అడ్మిషన్ల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి ఏప్రిల్/ మే నెలల్లో ఈ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. త్వరలో నోటిఫికేషన్ రావొచ్చు. మీరు తరచుగా cuet.nta.nic.in వెబ్‌సైట్ సందర్శిస్తూ.. ఎంట్రన్స్ సమాచారాన్ని తెలుసుకోండి. ఈ పరీక్షలో మీరు సాధించిన మార్కుల ఆధారంగా పీజీ అడ్మిషన్లు నిర్వహిస్తారు. నమూనా కోసం గత సంవత్సరపు ప్రవేశ పరీక్ష పత్రాన్ని పరిశీలించండి. దేశవ్యాప్తంగా పరీక్ష రాసే అభ్యర్థులతో పోటీ పడాలి కాబట్టి, ఇప్పటినుంచే సన్నద్ధం కండి. గత సంవత్సరంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించినప్పటికీ, ప్రవేశాలను యూనివర్సిటీలు విడివిడిగా నిర్వహించుకున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో కేంద్రీకృత కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్లు నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రవేశ పరీక్షలో మెరుగైన మార్కులు సాధించి, మీకు నచ్చిన యూనివర్సిటీలను ఆప్షన్లుగా పెట్టుకోండి. సాధారణంగా సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశాల్లో రాష్ట్రాల వారీగా రిజర్వేషన్లు ఉండవు. సొంత రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో ప్రవేశానికి కూడా దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన అభ్యర్థులతో సమానంగా పోటీ పడాలి. ఏదైనా కారణం వల్ల, ఈ విద్యా సంవత్సరానికి కేంద్రీకృత కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు నిర్వహించకపోతే... మీకు నచ్చిన యూనివర్సిటీలకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: కావ్య
Ans:
ఓపెన్ యూనివర్సిటీ/ దూరవిద్య ద్వారా చేసే డిగ్రీలకూ రెగ్యులర్‌గా చేసే డిగ్రీలకూ ఎలాంటి తేడా లేదు. రెండు డిగ్రీలనూ యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలే ఇస్తున్నాయి కాబట్టి, రెండింటినీ సమానంగానే గుర్తిస్తారు. ఏ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌లో అయినా యూజీసీ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ అనే అడుగుతారు కానీ, రెగ్యులర్‌గా డిగ్రీ చేసి ఉండాలని పేర్కొనరు. మీరు నిరభ్యంతరంగా ఉన్నత విద్య/ నెట్/ స్లెట్/ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేకమైన సందర్భాల్లో ఓపెన్/ దూరవిద్య ద్వారా డిగ్రీ చేసినవారు అర్హులు కారు అన్న నిబంధన ఉన్నచోట మినహా, మిగతా అన్ని పోటీ పరీక్షలకూ రెగ్యులర్ డిగ్రీ చేసినవారితో సమానంగా మీరూ పోటీపడవచ్చు. సాధారణంగా రెగ్యులర్ డిగ్రీ చేసినవారు రోజూ క్లాసులకు వెళ్లి పాఠాలు విని, విషయ పరిజ్ఞానం పొందుతారు. ఓపెన్ యూనివర్సిటీ విద్యావిధానంలో విద్యార్థి తనకు తానే సబ్జెక్టును నేర్చుకుంటాడు. పోటీ పరీక్షల్లో ఇద్దరూ పోటీ పడినప్పుడు రెగ్యులర్‌గా డిగ్రీ చేసినవారికి కొంత మొగ్గు ఉండే అవకాశం ఉంది. ఈ ఇబ్బందిని అధిగమించాలంటే ఓపెన్ యూనివర్సిటీలో చదివినవారు ఎక్కువ కృషి చేయాలి. ఇలా చదివిన చాలామంది రెగ్యులర్‌గా చదివిన వారితో పోటీపడి, వారికంటే మెరుగైన ప్రతిభని కనపర్చి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన దాఖలాలూ ఉన్నాయి. కాబట్టి ఈ డిగ్రీల సమానార్హత గురించి ఎక్కువగా ఆలోచించి సమయం వృధా చేసుకోకుండా.. నిరభ్యంతరంగా పోటీ పరీక్షలకు సన్నద్ధం కండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: లలిత
Ans:
బీబీఏ తరువాత ఉద్యోగం చేస్తూ మీరు వారాంతపు (ఎగ్జిక్యూటివ్) ఎంబీఏ చదివే అవకాశం ఉంది. దూరవిద్య ద్వారా పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కానీ, వివిధ రాష్ట్ర యూనివర్సిటీల దూరవిద్యా కేంద్రాల ద్వారా కానీ ఎంబీఏ చేయవచ్చు. ఓపెన్ యూనివర్సిటీల్లో చదవాలనుకుంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల గురించి ఆలోచించండి.
మూడు సంవత్సరాల ఉద్యోగానుభవం ఉన్నవారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో వారాంతపు ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చదవొచ్చు. చాలా డీమ్డ్ టు బి యూనివర్సిటీలు, ప్రైవేటు యూనివర్సిటీలు ఉద్యోగస్తుల కోసం వారాంతపు ఎంబీఏ కోర్సును అందిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ/ ప్రైవేటు బిజినెస్ స్కూల్స్, ప్రైవేటు యూనివర్సిటీలు పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ ఎంబీఏ డిగ్రీని కూడా అందిస్తున్నాయి. సాధారణంగా ఈ కోర్సుల్లో ప్రవేశాలను ప్రత్యేక ప్రవేశపరీక్ష/ ఇంటర్వ్యూ/ డిగ్రీలో పొందిన మార్కులు/ ఐసెట్ ర్యాంకు లాంటి పద్ధతుల్లో నిర్వహిస్తారు.
మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్నీ, ఆసక్తినీ బట్టి ఎంబీఏలో స్పెషలైజేషన్ ఎంచుకోండి. ఆసక్తి ఉంటే ఎంఏ/ ఎమ్మెస్సీ సైకాలజీ కూడా చేయొచ్చు. మీరు ఏదైనా కోర్సును ఆన్‌లైన్/ దూరవిద్య ద్వారా చదవాలనుకుంటే ఆయావిద్యా సంస్థలు అందించే కోర్సులకు ప్రభుత్వ/ యూనివర్సిటీ గుర్తింపు ఉందో, లేదో నిర్ధారించుకోండి. గుర్తింపు లేని డిగ్రీలను చేసి మీ విలువైన సమయం, డబ్బు వృథా చేసుకోకండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: సీహెచ్. రవితేజ
Ans:
బీబీఎం డిగ్రీలో మీరు ఏ స్పెషలైజేషన్ చదివారో చెప్పలేదు. మీరు చదివిన స్పెషలైజేషన్, ఏ కంపెనీలో పని చేయాలనుకొంటున్నారో అన్న అంశాలను బట్టి ఎలాంటి సర్టిఫికెట్ కోర్సులు చేయాలో నిర్ణయించుకోండి. మీరు మార్కెటింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ ఉంటే డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, అడ్వర్‌టైజింగ్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, బ్రాండింగ్ మేనేజ్‌మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ ఎనలిటిక్స్, మార్కెటింగ్ రిసెర్చ్‌ల్లో సర్టిఫికెట్ కోర్సులు చేయవచ్చు. ఫైనాన్స్ రంగంలో ఉద్యోగం చేస్తూవుంటే, క్వాంటిటేటివ్ ఫైనాన్స్, ఫిన్ టెక్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, ఫైనాన్సియల్ మార్కెట్స్, కాస్ట్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ ఎనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్‌ల్లో సర్టిఫికెట్ కోర్సులు చేసుకోవచ్చు. హెచ్‌ఆర్ రంగంలో హెచ్‌ఆర్ లీడర్ షిప్, స్ట్రాటజిక్ హెచ్‌ఆర్‌ఎం, టాలెంట్ హెచ్‌ఆర్‌ఎం, రిక్రూట్‌మెంట్ అండ్ ట్రెయినింగ్, హెచ్‌ఆర్ ఎనలిటిక్స్‌ల గురించి కూడా ఆలోచించవచ్చు. ఆపరేషన్స్ రంగానికొస్తే, సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్, సోర్సింగ్, క్వాలిటీ మేనేజ్‌మెంట్, సిక్స్ సిగ్మా, సర్వీస్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, సప్లై చెయిన్ ఎనలిటిక్స్‌ల్లో సర్టిఫికెట్ కోర్సులు చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: కుమార్
Ans:
మీ అబ్బాయి అగ్రికల్చర్ కోర్సును విదేశాల్లో చదివిన తరువాత అక్కడే స్థిరపడతాడా, మనదేశానికి తిరిగివస్తాడా అనే విషయాన్ని బట్టి, ఏ దేశంలో చదవాలనే నిర్ణయం తీసుకోండి. అగ్రికల్చర్‌లో మొదటి డిగ్రీని మనదేశంలో చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పరిశోధనల కోసం విదేశాలకు వెళ్ళడం శ్రేయస్కరం. అగ్రికల్చర్/ హార్టికల్చర్/ లైఫ్ సైన్సెస్ చదివినవారికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువే. మీ అబ్బాయి అగ్రికల్చర్ కోర్సుని చదవాలనుకొనే దేశంలో ఏ స్పెషలైజేషన్‌కి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయో, ఆ స్పెషలైజేషన్‌ను ఎంచుకోవాలి. మరిన్ని ఉద్యోగావకాశాల కోసం అగ్రికల్చర్‌లో లైఫ్ సైన్సెస్ సంబంధిత స్పెషలైజేషన్‌లు కూడా ఎంచుకుని ఆ రంగంలోనూ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు.
యూకేలో కేంబ్రిడ్జ్, నాటింగ్ హామ్, గ్లాస్గో, లివర్ పూల్, బ్రిస్టల్ యూనివర్సిటీలు అగ్రికల్చర్ కోర్సును అందిస్తున్నాయి. కెనడాలో గుల్ఫ్, అల్బెట్రా, బ్రిటిష్ కొలంబియా, మెక్ గిల్, సాస్కట్చెవన్ విశ్వ విద్యాలయాలు, ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్‌బోర్న్, క్వీన్స్ లాండ్, అడిలైడ్, లాత్రోబే యూనివర్శిటీలు ఈ కోర్సు అందిస్తున్నాయి యూఎస్‌లో.. మసాచుసెట్స్, పర్ద్యూ, కార్నెల్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా విశ్వ విద్యాలయాల్లో చదువుకోవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: కె.ప్రసాద్
Ans:
యానిమల్ హజ్బెండరీ రంగంలో విదేశాల్లో పరిశోధన చేయాలనుకోవడం అభినందనీయం. యూకేలో యానిమల్ హజ్బెండరీలో పరిశోధన చేయాలంటే యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్ హామ్, యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బరో, యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్గో, యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టల్‌లను పరిగణించవచ్చు. కెనడాలో వెస్టర్న్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్, అంటారియో వెటర్నరీ కాలేజ్, యూనివర్శిటీ ఆఫ్ గుల్ఫ్, యూనివర్శిటీ ఆఫ్ ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్, యూనివర్శిటీ ఆఫ్ కాల్గెరి, ఆస్ట్రేలియాలో యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ, యూనివర్శిటీ ఆఫ్ మెల్‌బోర్న్, యూనివర్శిటీ ఆఫ్ క్వీన్స్ లాండ్, యూనివర్శిటీ ఆఫ్ అడిలైడ్, చార్లెస్ స్టర్ట్ యూనివర్శిటీల్లో కూడా ఈ రంగంలో పరిశోధనకు అవకాశాలున్నాయి. యూఎస్‌లో యూనివర్శిటీ ఆఫ్ ఆరిజోనా, పర్ద్యూ యూనివర్శిటీ, కెంట్ స్టేట్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్, యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్‌ల్లో కూడా యానిమల్ హజ్బెండరీ పరిశోధన చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: టి.మహేష్
Ans:
దేశవ్యాప్తంగా ఫొటోగ్రఫీలో డిగ్రీ, పీజీ కోర్సులు అతితక్కువ కాలేజీల్లో ఉన్నాయి. ఫొటోగ్రఫీని బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్‌ఏ) డిగ్రీగా చదివే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఫొటోగ్రఫీ కోర్సు జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేెఎన్‌ఏఎఫ్‌ఏయూ) హైదరాబాద్, శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. జేెఎన్‌ఏఎఫ్‌ఏయూ నాలుగేళ్ల బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్), రెండు సంవత్సరాల మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఫొటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్) కోర్సులను అందిస్తోంది. జేెఎన్‌ఏఎఫ్‌ఏయూ బీఎఫ్‌ఏ కోర్సులో ఫొటోగ్రఫీ యాజ్ ఫైన్ ఆర్ట్స్, ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ, ఫోటో జర్నలిజం, ఆడియో విజువల్ కమ్యూనికేషన్, డిజిటల్ ఫొటోగ్రఫీ, కంప్యూటర్ గ్రాఫిక్స్, మల్టీమీడియా, ప్రొఫెషనల్ వీడియోగ్రఫీ లాంటి సబ్జెక్టులుంటాయి.
శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో మూడేళ్ల వ్యవధితో బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ అండ్ డిజిటల్ ఆర్ట్) కోర్సు ఉంది. ఫొటోగ్రఫీ చదివినవారికి ఈకామర్స్ సంస్థలు, న్యూస్ ఏజెన్సీలు, స్టూడియోలు, మ్యాగజైన్‌లు, అడ్వర్టైజింగ్, పరిశోధన సంస్థల్లో అవకాశాలుంటాయి. ఇంకా ఈవెంట్ మేనేజ్‌మెంట్, ప్రొడక్షన్, ఆర్కిటెక్చర్ సంస్థలు, టూరిజం, క్రీడా శిక్షణ సంస్థలు, ఫుడ్ ఇండస్ట్రీలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఫొటోగ్రఫీ పీజీలో రకరకాల స్పెషలైజేషన్లు కూడా ఉంటాయి. మీకు ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్ ఎంచుకొని, ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోవచ్చు.
Asked By: కరుణాకర్
Ans:
గత కొన్ని సంవత్సరాలుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినవారికి ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. మనదేశంలో ఫిట్‌నెస్ పరిశ్రమ, క్రీడా రంగాల్లో నిపుణుల కొరత ఎక్కువగానే ఉంది. విదేశాల్లో స్పోర్ట్స్‌కు సంబంధించిన చాలా ప్రత్యేకమైన కోర్సులున్నాయి. ఆస్ట్రేలియాలో ఫార్మల్ స్పోర్ట్స్ ట్రైనర్ కోర్సుల్ని డీకేన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, గ్రిఫిత్ యూనివర్సిటీ, లా ట్రోబే యూనివర్సిటీ, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ లాండ్ లాంటి ప్రముఖ విద్యా సంస్థలు అందిస్తున్నాయి. కెరియర్ విషయానికొస్తే స్పోర్ట్స్ కోర్సుల్లో శిక్షణ పొందినవారికి ఫిట్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్, పర్సనల్ ట్రైనర్, స్పోర్ట్స్ కోచ్, అవుట్‌డోర్ రిక్రియేషన్ గైడ్, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, రిక్రియేషన్ ఆఫీసర్, లీజర్ సర్వీసెస్ ఆఫీసర్ లాంటి హోదాలతో కొలువులు లభిస్తాయి. ఈ రంగంలో కొంత అనుభవం గడించాక అంతర్జాతీయ ప్రమాణాలతో సొంతంగా ఫిట్‌నెస్ సంస్థనూ ప్రారంభించవచ్చు.
Asked By: వి.పవన్
Ans:
- బీఎస్సీ ఎనస్తీషియా చదివాక ఎంఎస్సీ ఎనస్తీషియా కానీ, ఎనస్తీషియాలో అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు కానీ చేసే అవకాశం ఉంది. మీరు ఉన్నతవిద్యను విదేశాల్లో చేయాలనుకొంటే కనీసం రెండు సంవత్సరాల ఉద్యోగానుభవం పొందాకే, ఆ ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఎనస్తీషియా లాంటి ప్రొఫెషనల్ రంగాల్లో నైపుణ్యాలు చాలా అవసరం. వీటిని కోర్సు చదివే సమయంలో కంటే ఉద్యోగంలోనే ఎక్కువగా నేర్చుకొనే అవకాశం ఉంది. ఎనస్తీషియాలో పీజీ కోర్సులు యూకే, అమెరికా, కెనడా లాంటి దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా కార్డిఫ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ గాల్వే, ది కాలేజ్ ఆఫ్ అనస్తీయాలజిస్ట్స్ ఆఫ్ ఐర్లాండ్, బ్రైటన్ అండ్ ససెక్స్ మెడికల్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్ హామ్, యూనివర్సిటీ ఆఫ్ ఆల్బెట్రా, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ లా క్రోసెల్లో ఎనస్తీషియా కోర్సులున్నాయి. ఈ కోర్సు చేసినవారికి దేశ విదేశాల్లో మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్