Asked By: మాలతి
Ans:
మీ అమ్మాయి ఈ పాటికే తన భవిష్యత్తు గురించి ఓ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు. మీ గ్రామంలో ప్రాక్టీస్ పెట్టించాలనేది మీ నిర్ణయమా? తనదా? నిర్ణయం ఎవరిదయినా, అందులో ఉండే లాభనష్టాలను చర్చించండి. మీ గ్రామంలో ప్రాక్టీస్ చేయడం వల్ల మీ గ్రామస్థులకు మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉంటుంది. కానీ, మీరు హాస్పిటల్‌పై పెట్టిన పెట్టుబడి వెనక్కు రావడానికి చాలా సమయం పట్టవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు కూడా శస్త్రచికిత్సలకోసం దగ్గరలో ఉన్న పట్టణాలకు వెళ్తున్నారు. ఎంబీబీఎస్ చదివిన చాలామంది సాధారణ జబ్బులు, ప్రాథమిక చికిత్సలకే పరిమితమవుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వైద్యశాలలకు పట్టణాలనుంచి స్పెషలిస్ట్ సర్జన్లు వచ్చి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. గ్రామీణ సమాజంలో కూడా ఆరోగ్యం, వైద్యంపై అవగాహన పెరగడం వల్ల రోగులు/ బంధువులు చికిత్సకు వెళ్లేముందు డాక్టర్ల విద్యార్హతల గురించి కూడా వాకబు చేస్తున్నారు. ఒకవేళ మీ అమ్మాయి ఎంబీబీఎస్‌తోనే ప్రాక్టీస్ మొదలుపెడితే పని ఒత్తిడితో ఎప్పటికీ పీజీ చేయలేకపోవచ్చు. ప్రాక్టీస్‌తో నిమిత్తం లేకుండా, ఉన్నత విద్యార్హతలుండటం ఎప్పుడూ శ్రేయస్కరమే! పీజీతోనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే గ్యారంటీ కూడా లేదు. మెడిసిన్ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో సర్టిఫికెట్‌లతో పాటు నైపుణ్యాలు కూడా చాలా అవసరం. మీ అమ్మాయి దీర్ఘకాలిక, స్వల్ప కాలిక ఆశయాలను దృష్టిలోపెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: వీ రెడ్డి, రాజమండ్రి
Ans:
మనదేశంలో చాలా ఆసుపత్రుల్లో, ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య కార్యకర్తల కొరత చాలా ఉంది. ముఖ్యంగా నర్సింగ్ విభాగంలో పనిచెయ్యడానికి ఎంతోమంది అవసరం. ఎంఎస్‌సీ నర్సింగ్.. రెండు సంవత్సరాల పీజీ కోర్సు. దీన్ని పూర్తిచేసినవారికి నర్స్ ఎడ్యుకేటర్, రిజిస్టర్డ్ నర్స్, స్టాఫ్ నర్స్, క్లినికల్ నర్స్ మేనేెజర్ లాంటి ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇవేకాకుండా కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా కొలువులుంటాయి. విదేశాల్లోనూ నర్సులకు చాలా డిమాండ్ ఉంది. హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఎ చేసి హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్‌గా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో మంచి వేతనంతో ఉద్యోగం పొందవచ్చు. నర్సింగ్‌లో పీహెచ్‌డీ కూడా చేయవచ్చు. ప్రజారోగ్య రంగంలో ఆసక్తి ఉంటే ఎంపీహెచ్ కోర్సు చేసే అవకాశం ఉంది. ఇవే కాకుండా న్యూట్రిషన్, సైకాలజీ లాంటి కోర్సులు చదివి ఆయా రంగాల్లోనూ స్థిరపడొచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: జి. యశ్వంత్
Ans:
బీఎస్సీ ఎలక్ట్ట్రానిక్స్ పూర్తిచేశాను. ఏ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు పొందొచ్చు?
మీరు కోడింగ్, పైతాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటా సైన్స్, ఐఓటీ¨, వెబ్ డిజైన్, ఆండ్రాయిడ్ ఆప్ డెవలప్‌మెంట్, పీసీబీ డిజైన్‌లలో శిక్షణ తీసుకొంటే మంచి ఉద్యోగావకాశాలు పొందవచ్చు. ఇవే కాకుండా సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) వారు అందించే మాట్ ల్యాబ్, మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామింగ్, వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, అడ్వాన్స్‌డ్ ఎంబెడెడ్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ డిజిటల్ డిజైన్, డీప్ లెర్నింగ్, సిస్టమ్ వేరిలాగ్, ఎస్‌టీడీ సెల్ డిజైన్, ఐసీ ఫిజికల్ డిజైన్, హెచ్‌డీఎల్ సింథసిస్, మాట్ ల్యాబ్- డీఎస్‌పీ‡, మాట్ ల్యాబ్-ఇమేజ్ ప్రాసెసింగ్, మెకట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ రిపేరింగ్ అండ్ మెయింటెనెన్స్, రోబోటిక్స్ లాంటివాటిలో నచ్చిన కోర్సు చేస్తే మంచి ఉద్యోగాలను పొందవచ్చు. సీ- డాక్ సంస్థ కూడా ఎలక్ట్ట్రానిక్స్ చదివినవారికి కొన్ని సర్టిఫికెట్ కోర్సులు అందిస్త్తోంది. వీటితో పాటు కొన్ని యూనివర్సిటీల్లో పీజీ డిప్లొమా ఇన్ టెలికమ్యూనికేషన్ కోర్సు చేసే అవకాశం ఉంది. - బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: Chaitanya Prakash
Ans:
మనదేశంలో ఎంబీబీఎస్ చదవాలనుకునే వారు టెన్ ప్లస్ టూ విధానంలో ఇంటర్మీడియట్‌ను బయాలజీ ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటుగా ఎన్.టి.ఎ వారు ఏటా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో మంచి ర్యాంకు తెచ్చుకున్నవారికి ఎంబీబీఎస్ చదివే అర్హత ఉంది. ఇక వయసు విషయానికొస్తే నీట్ రాసేవారికి కనీసం 17 నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్), పీడబ్ల్యూడీ) కేటగిరీ వారికి 5 సంవత్సరాల వెసులుబాటు ఉంది. మీ వయసు 24 సంవత్సరాలు కాబట్టి, మీరు జనరల్ కేటగిరీకి చెందిన వారయితే ఒక్క సంవత్సరం, రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందినవారైతే ఇంకో ఆరు సంవత్సరాల పాటు నీట్ రాసే అవకాశముంది. భారత సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి 25 సంవత్సరాలు నిండినవారూ నీట్ రాయవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: M Srinivas
Ans:
బీటెక్ సివిల్ చేసినవారికి ఉద్యోగావకాశాలు బాగా పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సివిల్ ఇంజినీర్ల అవసరం ఎక్కువ. ప్రైవేటు రంగంలో సైట్ ఇంజినీర్‌గా, ప్రాజెక్ట్ ఇంజినీర్‌గా, అసిస్ట్టెంట్ ఇంజినీర్‌గా, క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్‌గా, కన్‌స్ట్రక్షన్ ఇంజినీర్‌గా ఉద్యోగావకాశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే పరీక్షలు రాసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా రహదారులు- భవనాల శాఖ, నీటిపారుదల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, పురపాలక శాఖ, గ్రామీణ నీటి సరఫరా పనుల శాఖల్లో ఉద్యోగాలు పొందవచ్చు.యూపీఎస్‌సీ నిర్వహించే పరీక్షలు రాసి దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రప్రభుత్వ సర్వీసుల్లో చేరవచ్చు. గేట్ పరీక్ష రాసి ప్రభుత్వరంగ సంస్థల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా, ఇంజినీర్ ట్రైనీగా కూడా స్థిరపడవచ్చు.
ఇవన్నీ కాకుండా సొంతంగా కన్సల్టెన్సీ పెట్టుకొని డిజైన్‌లు, డ్రాయింగ్‌లతో పాటు వాల్యుయేషన్ కూడా చేయవచ్చు. కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేసి ఉద్యోగావకాశాల్ని పెంచుకోవచ్చు. అమ్మాయిలకు కూడా సివిల్ ఇంజినీరింగ్ సరైన ఎంపికే. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఉద్యోగం అయినా, ఏ ఇంజినీరింగ్ అయినా అమ్మాయిలందరికీ అర్హత ఉంటుంది. ఆసక్తి ఉంటే నిస్సంకోచంగా అమ్మాయిలూ సివిల్ ఇంజినీరింగ్ ఎంచుకోవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్