Asked By: ఎస్.సురేష్
Ans:
పోటీ పరీక్షల్లో జనరల్ ఇంగ్లిష్ సబ్జెక్టులో మెరుగైన స్కోరు సాధించాలంటే ముందునుంచే ప్రణాళికాబద్ధంగా సిద్దం కావాలి. ఇంగ్లిష్ కూడా మిగతా సబ్జెక్టుల్లాగే కొన్ని సూత్రాలు, నియమాలపై ఆధారపడి ఉంటుంది. ఆ నియమాలనూ, గ్రామర్‌నూ బాగా నేర్చుకొన్నట్లయితే పోటీ పరీక్షలో రాణించడం కష్టమేమీ కాదు. గ్రామర్ తోపాటు ఇంగ్లిష్‌లో పర్యాయ పదాలూ, వ్యతిరేక పదాలను కూడా బాగా నేర్చుకోండి. ఆంగ్ల వార్తా పత్రికలను క్రమం తప్పకుండా చదువుతూ టీవీలో, రేడియోలో ఇంగ్లిషు వార్తలను కూడా వినండి. వీటన్నింటితోపాటు ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లిష్ (ఎస్‌పీ భక్షి), ఇంగ్లిష్ గ్రామర్ అండ్ కంపోజిషన్ (ఎస్‌సీ గుప్త), ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (హరిమోహన్ ప్రసాద్ అండ్ ఉమా సిన్హా), జనరల్ ఇంగ్లిష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ (దిశ ఎక్స్‌పర్ట్స్) లాంటి పుస్తకాలను చదివి, బాగా సాధన చేయండి. వీలున్నన్ని మాక్ టెస్ట్‌లు రాసి పోటీ పరీక్షల్లో మెరుగైన స్కోరు సాధించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎన్. శ్రీకాంత్
Ans:
డిగ్రీ చదువుతూనే/ డిగ్రీ పూర్తి అయిన వెంటనే పోటీ పరీక్షలకు సిద్ధమవడం మంచిదే. ఆర్‌ఆర్‌బీ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తవ్వాలనే నిబంధన ఉంటుంది. కోచింగ్ తీసుకోవడానికైతే నిబంధనలేమీ ఉండవు. మీరు రాయబోయే పోటీపరీక్షలకు డిగ్రీలో నిర్ధారించిన మార్కుల శాతం మీకు ఉన్నట్లయితే నిరభ్యంతరంగా కోచింగ్‌లో చేరండి. ఒక్కో పరీక్షకు ఒక్కో కోచింగ్ తీసుకొనే బదులు, అన్ని పరీక్షలకు ఉపయోగపడే సబ్జెక్టుల్లో ఒకే కోచింగ్ తీసుకోవడం మేలు. సిలబస్‌నూ, పాత ప్రశ్నపత్రాలనూ క్షుణ్ణంగా పరిశీలించి సన్నద్ధత వ్యూహాన్ని తయారు చేసుకొని, పాటించండి. విజయం సాధించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్