Post your question

 

  Asked By: సీహెచ్‌.విజయ్‌శంకర్‌

  Ans:

  మీరు బీఏలో ఏ సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. పీజీలో ఏ సబ్జెక్టు చదవాలనుకొంటున్నారు? ‘లా’ కోర్సులో చేరేది ఎందుకోసం? పది సంవత్సరాల తరువాత మీరు ఏ స్థాయిలో ఉండాలనుకొంటున్నారు? మీ స్వల్పకాలిక/ దీర్ఘకాలిక కెరియర్‌ ఆశయాలేంటి? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకొనే ప్రయత్నాలు చేయండి. మీరు ‘లా’ రెగ్యులర్‌గా చదువుతూ, పీజీ కోర్సును దూరవిద్యలో చేయొచ్చు కానీ, దానివల్ల మీకు ఏం ఉపయోగం అనేది కూడా ఆలోచించండి. ‘లా’ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్లో చేరినప్పుడు వేరేవి చదవకుండా, న్యాయవిద్య మీదే శ్రద్ధ పెడితే విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు పెంపొందే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ మీరు చదవాలనుకొంటున్న పీజీ కోర్సు, భవిష్యత్తులో మీ న్యాయవాద వృత్తికి ఉపయోగమని భావిస్తే పీజీ చేసే ప్రయత్నం చేయండి. చాలామంది న్యాయవాదులు పీజీ చేయకుండానే బీఏ/ బీకాం/ బీఎస్సీతో పాటు ఎల్‌ఎల్‌బీ/ బీఎల్‌ మాత్రమే చదివి న్యాయవాద వృత్తిలో రాణిస్తున్నారని గుర్తించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

   

  Asked By: కృష్ణప్రసాద్‌

  Ans:

  మంచి కెరియర్‌ అంటే.. ఎక్కువ డబ్బూ, పేరూ సంపాదించేది అనే ఆలోచన చాలామందిలో స్థిరపడిపోయింది. టీచర్, డాక్టర్, లాయర్, ఇంజినీర్‌ లాంటి వృత్తి ఉద్యోగాలు చేసేవారికి సేవ మొదటి స్థానంలో, సంతృప్తి రెండో స్థానంలో, డబ్బు చివరి స్థానంలో ఉండాలి. ఇలాంటి వృత్తిలో ఉండేవారు ఎదుటివారి సమస్యలు పరిష్కరిస్తూ, వారి సంతోషానికి కారణమవుతూ కెరియర్‌ కొనసాగిస్తే ఈ రెండూ వచ్చే అవకాశాలుంటాయి.
  సివిల్, క్రిమినల్‌ రెండు రంగాలూ చాలా మంచివే. కానీ, సమాజంలో క్రిమినల్‌ లాయర్‌లకు ఎక్కువ సంపాదన ఉంటుందన్న అపోహ ఉంది. సివిల్‌ లాయర్లుగా పనిచేస్తూ కూడా మంచి పేరు, డబ్బు సంపాదించినవారు ఉన్నారు. అదే సమయంలో క్రిమినల్‌ లాయర్‌గా ఈ రెండూ సంపాదించనివారూ ఉన్నారు. ప్రొఫెషనల్‌ కోర్సులు చదివినవారు కెరియర్లో రాణించాలంటే డిగ్రీ మాత్రమే ఉంటే సరిపోదు. తెలివితేటలు, వ్యక్తిత్వం, విషయ పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు లాంటివి ప్రభావితం చేస్తాయి. న్యాయవాద వృత్తిలో వీటికి అదనంగా నెట్‌ వర్కింగ్‌ స్కిల్స్, సమయస్ఫూర్తి, లాజికల్‌/ అనలిటికల్‌ రీజనింగ్, జ్ఞాపకశక్తి చాలా అవసరం. ఈ వృత్తిలో పేరు అంత త్వరగా రాదు. కొన్నేళ్లపాటు వాదించిన కేసులు, విజయాల శాతం, ఎన్ని క్లిష్టమైన కేసుల్ని విజయవంతంగా వాదించారు, నిజాయతీ, సమగ్రత లాంటి ఎన్నో కెరియర్‌ను ప్రభావితం చేస్తాయి. సివిల్, క్రిమినల్‌.. రెండూ న్యాయవ్యవస్థలో కీలకమైనవి కాబట్టి, మీ ఆసక్తిని బట్టి సరైన నిర్ణయం తీసుకోండి.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: prasanth

  Ans:

  మీరు ప్రస్తుతం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి సెలవు పెట్టి లా డిగ్రీని చదివిన తర్వాత మీరు మళ్లీ ఉద్యోగంలో చేరితే, ఆ డిగ్రీ  మీకెలా ఉపయోగపడుతుంది? ఆ డిగ్రీతో ప్రమోషన్‌ వస్తుందా? అనేవి పరిగణనలోకి తీసుకోండి. ఒకవేళ, మీరు ఉద్యోగానికి రాజీనామా చేసి లాయర్‌గా ప్రాక్టీస్‌ చేస్తే, మొదట్లో కొంతకాలం పాటు ఆర్థికపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అందుకు సంబంధించిన ఆర్థిక ఆసరాను ఏర్పాటు చేసుకున్నాక రాజీనామా చేయండి.
  మీరు లా కోర్సు చదువుతూనే న్యాయవాద వృత్తికి సంబంధించిన పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేయాలనుకుంటున్నారు. కానీ, లా లాంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్ని చదివేటప్పుడు ఆ కోర్సుపై పూర్తి శ్రద్ధ పెడితే విషయ పరిజ్ఞానం బాగా వస్తుంది. ఆర్థిక ఇబ్బందులవల్ల ఉద్యోగం చేయడం తప్పనిసరైతే ఎవరైనా సీ‡నియర్‌ లాయర్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరే ప్రయత్నం చేయండి. ఈ ప్రయాణంలో మీరు వృత్తి మెలకువలు నేర్చుకొంటారు గానీ, ఆశించినంతగా వేతనాలు లభించవు. న్యాయవాద వృత్తిలో రాణించాలంటే విషయ పరిజ్ఞానంతోపాటు నైపుణ్యాలూ చాలా అవసరం. చేయబోయే పార్ట్‌ టైమ్‌ జాబ్‌లో వేతనంతో సంబంధం లేకుండా న్యాయవాద వృత్తిలో మెలకువలు, నైపుణ్యాలు నేర్చుకొనే ప్రయత్నం చేయండి.
  చివరిగా, మీ నిర్ణయం సరైనదేనా అనేది న్యాయవాద వృత్తిపై మీకున్న ఆసక్తి, మీ సామర్థ్యంపై మీకున్న నమ్మకం, కమ్యూనికేషన్, నెట్‌ వర్క్‌ నైపుణ్యాలు, క్లిష్ట సమస్యల్ని పరిష్కరించగల నేర్పు, మీ కుటుంబ ఆర్ధిక పరిస్థితులు లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. -
  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

  Asked By: prasanth

  Ans:

  బీఎల్‌ చేసినవారు కనీసం మూడు సంవత్సరాల లా ప్రాక్టీస్‌తో సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) నియామక పరీక్ష రాయడానికి అర్హత ఉంటుంది. ఒకవేళ మూడేళ్ల లా ప్రాక్టీస్‌ అనుభవం లేకపోతే రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ వచ్చేనాటికి బీఎల్‌ అయి కనీసం మూడేళ్లు పూర్తి అవ్వడంతో పాటు, బీఎల్‌లో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 55%) మార్కులు పొందాలి. న్యాయవాదిగా నమోదై, మూడేళ్ల అనుభవం లేనివారు కూడా ఫ్రెష్‌ లా గ్రాడ్యుయేట్స్‌ కేటగిరీ కింద అర్హులే. న్యాయవాదిగా అనుభవం ఉన్నవారందరూ బార్‌ అసోసియేషన్‌ నుంచి పొందిన ప్రాక్టీస్‌ సర్టిఫికెట్‌ను రుజువుగా సమర్పించాలి.
  సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉన్నవారికి 23- 35 సంవత్సరాల (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 సంవత్సరాలు) వయసు, న్యాయవాదిగా పనిచేసిన అనుభవం లేనివారికి 23- 26 సంవత్సరాల (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 31 సంవత్సరాలు) వయసు ఉండాలి. సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) రాత పరీక్షకు అర్హత సాధించాలంటే రెండు గంటల వ్యవధిలో 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతో 100 మార్కులకు నిర్వహించే స్క్రీనింగ్‌ పరీక్ష రాయాలి. ఈ పరీక్షలో కనీసం 40% మార్కులు సాధించినవారినుంచి ప్రకటించిన ఖాళీల సంఖ్యకు 10 రెట్ల సంఖ్యలో అభ్యర్థుÄలను రాత పరీక్షకు అనుమతిస్తారు. స్క్రీనింగ్‌ పరీక్ష లో పొందిన మార్కులకు చివరి ఎంపికలో వెయిటేజి ఉండదు. రాత పరీక్ష మూడు పేపర్లు
  (సివిల్‌ లాస్, క్రిమినల్‌ లాస్, ఇంగ్లిష్‌)గా, ఒక్కో పేపర్‌ను మూడు గంటల వ్యవధిలో, 100 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ పరీక్షను క్వాలిఫైయింగ్‌ పరీక్ష గానే గుర్తించి, మొదటి రెండు పేపర్లలో 200 మార్కులకు అభ్యర్ధులు పొందిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని, ఇంటర్వ్యూ (వైవా వోస్‌)కి షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. సివిల్‌ లాస్, క్రిమినల్‌ లాస్‌.. రెండు పేపర్లలో కనీసం 60% మార్కులు (ఎస్సీ, ఎస్టీలకు 50%) పొందినవారి నుంచి 1: 3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటుంది. మొత్తం 230 మార్కుల్లో అభ్యర్ధులు పొందిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. -
  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: బి.అశోక్, గోదూర్, జగిత్యాల జిల్లా

  Ans:

  బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం ఎల్‌ఎల్‌బీ కోర్సును రెగ్యులర్‌గానే చదవాలి. దూరవిద్య ద్వారా చదవడానికి అవకాశం లేదు. ఒకవేళ మీరు లాసెట్‌ రాసి ఏదైనా న్యాయ కళాశాలల్లో ప్రవేశం పొందినా, మీరు రెగ్యులర్‌గా తరగతులకు హాజరు కావాలి. మీరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నందున కళాశాలకు ప్రతిరోజూ వెళ్ళడం సాధ్యం కాదు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నత చదువులు చదవాలంటే ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వాలి. కాబట్టి మీరు ఉద్యోగం చేస్తూ ఈ కోర్సు చదవడం కష్టమే. అవకాశం ఉంటే మూడేళ్లు సెలవుపై వెళ్లడానికి మీ ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని ఎల్‌ఎల్‌బీ చదవవచ్చు. అలా కుదరకపోతే పదవీ విరమణ తరువాత మీ కల నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: శ్రీహరి

  Ans:

  ఎల్‌ఎల్‌బీ తరువాత లాయర్‌ కాకుండా లీగల్‌ అడ్వైజర్, లీగల్‌ కన్సల్టెంట్, లీగల్‌ అనలిస్ట్, మీడియేటర్, ఆర్బిట్రేటర్, లా ఆఫీసర్, లైజన్‌ ఆఫీసర్, లీగల్‌ కౌన్సెలర్, కాంట్రాక్ట్‌ అడ్వైజర్, లేబర్‌ రిలేషన్స్‌ ఆఫీసర్, వెల్ఫేర్‌ ఆఫీసర్, లీగల్‌ జర్నలిస్ట్, కాంప్లియెన్స్‌ ఆఫీసర్, లీగల్‌ పబ్లిషర్, జ్యుడీషియల్‌ ఎగ్జిక్యూటివ్‌ హోదాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎల్‌ఎల్‌ఎం/ పీహెచ్‌డీ చేస్తే ఆధ్యాపకులుగా, ట్రైనర్స్‌గా కూడా స్థిరపడవచ్చు. ఎల్‌ఎల్‌బీ తరువాత ఎంబీఏ/ జర్నలిజం/ సైకాలజీ/ సోషల్‌ వర్క్‌/ హ్యూమన్‌ రైట్స్‌/ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాంటి కోర్సులు చేస్తే మరిన్ని ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: ఎన్‌.పూర్ణచంద్రరావు

  Ans:

  ఎల్‌ఎల్‌బీ కోర్సును దూరవిద్యలో చదివే అవకాశం లేదు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఎల్‌ఎల్‌బీ కోర్సును రెగ్యులర్‌ పద్ధతిలోనే చదవాల్సివుంటుంది. ఏ నకిలీ విద్యాసంస్థ అయినా న్యాయవిద్యను దూరవిద్య విధానంలో అందిస్తామని చెబితే నమ్మి మోసపోకండి. మెడిసిన్, ఇంజినీరింగ్, ఎల్‌ఎల్‌బీ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను వేటినీ దూరవిద్యలో అందించరు. ఒకవేళ ఎవరైనా అలాంటి కోర్సుల్లో చేరితే, ఆ కోర్సులకు ప్రభుత్వ గుర్తింపు ఉండదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: ఎం. అజయ్‌కుమార్‌

  Ans:

  -  కనీసం మూడు సంవత్సరాల వ్యవధి గల ఏ డిగ్రీ పూర్తి చేసినవారైనా, మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సు చదవొచ్చు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. ఈ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ప్రైవేటు న్యాయ కళాశాలలూ ఈ కోర్సును అందిస్తున్నాయి. ప్రవేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీఎస్‌ లాసెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్‌ తర్వాత ఐదేళ్ల లా కోర్సును నల్సార్‌ యూనివర్సిటీ అందిస్తోంది. నల్సార్‌లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే క్లాట్‌ ప్రవేశపరీక్ష రాయవలసి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ, యూనివర్సిటీ అనుబంధ ప్రైవేటు న్యాయ కళాశాలలు కూడా ఐదేళ్ల లా కోర్సు అందిస్తున్నాయి. ఈ కోర్సులో ప్రవేశానికి టీఎస్‌ లాసెట్‌ రాయాలి. హైదరాబాద్‌లో ఉన్న కొన్ని డీమ్డ్‌/ ప్రైవేటు యూనివర్సిటీల్లో ఐదేళ్ల లా కోర్సులో చేరటానికి ఏదైనా జాతీయ/ రాష్ట్ర స్థాయి/ సంబంధిత ప్రైవేటు యూనివర్సిటీ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించివుండాలి. 


  ఒకప్పుడు ఎల్‌ఎల్‌బీ చదివినవారికి న్యాయవాద వృత్తిని మినహాయిస్తే పెద్దగా ఉద్యోగావకాశాలు ఉండేవి కావు. కానీ ఇటీవలికాలంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో చాలారకాల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఎల్‌ఎల్‌బీ చదివినవారు లీగల్‌ అసోసియేట్, లా ఆఫీసర్, కార్పొరేట్‌ లాయర్, లీగల్‌ అడ్వైజర్, లీగల్‌ ఎనలిస్ట్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్, మెజిస్ట్రేట్, జ్యుడిషియల్‌ ఆఫీసర్‌ లాంటి ఉద్యోగాలు చేయవచ్చు. మీకు ఆసక్తి ఉంటే ఎల్‌ఎల్‌బీ తర్వాత ఎల్‌ఎల్‌ఎం/ పీహెచ్‌డీ చేసి బోధన రంగంలోనూ స్థిరపడవచ్చు. ఇవన్నీ కాకుండా సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టుకొనే అవకాశం ఎలాగూ ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌