Asked By: ఆర్. దుర్గాప్రసాద్
Ans:
కొంత ఆలస్యం అయినప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించి, ఆ విద్యార్హతలతో మెరుగైన ఉద్యోగాలు సంపాదించడం శ్రేయస్కరం. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాక, ఇంటర్మీడియట్ ఎంపీసీతో చదివి మంచి కళాశాలలో ఇంజినీరింగ్ చదివితే త్వరగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఇంటర్లో బైపీసీ తీసుకొని, నాలుగు సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్ చదివితే వైద్యశాలల్లో నర్సుగా స్థిరపడొచ్చు. ఇంటర్మీడియట్ తరువాత రెండు సంవత్సరాల డీ…ఈడీ చేసి బోధన రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. పదో తరగతి పూర్తి చేసిన తరువాత ఐ.టి.ఐ., పాలిటెక్నిక్ లాంటి కోర్సులున్నాయి. ఐ.టి.ఐ. పూర్తి చెయ్యడానికి రెండు సంవత్సరాలు, పాలిటెక్నిక్ పూర్తి చెయ్యడానికి మూడు సంవత్సరాలు పడుతుంది. త్వరగా ఉద్యోగం పొందాలనుకొంటే, పాలిటెక్నిక్ లేదా ఐ.టి.ఐ. ఎంచుకోవచ్చు. ఒకవేళ ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకొంటే ఇంటర్ లో మీరు తీసుకునే గ్రూపును బట్టి ఉద్యోగావకాశాలు ఆధారపడి ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: కె. భాను
Ans:
అమెజాన్ లాంటి సంస్థల్లో ఉద్యోగం సంపాదించాలంటే, మీ అమ్మాయిని కనీసం డిగ్రీ చదివించండి. బీటెక్ డిగ్రీ చదివితే ఎక్కువ ఉపయోగకరం. బీటెక్ ఏ బ్రాంచ్‌లో చేసినా, ఇంజినీరింగ్ అర్హత ఉన్న ఉద్యోగాలతో పాటు సాధారణ డిగ్రీ అర్హత ఉన్న చాలా ఉద్యోగాలకు కూడా ప్రయత్నించవచ్చు. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లర్నింగ్, డేటా సైన్స్ లాంటి బ్రాంచిలు చదివితే ఎక్కువ ఉద్యోగావకాశాలుంటాయి. డిగ్రీ తరువాత ప్రసిద్ధ విద్యాసంస్థల్లో ఎంబీఏ/ఎంటెక్ చేసినట్లయితే మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయి. ఇంజినీరింగ్ కోర్సులయినా, మేనేజ్మెంట్ కోర్స్ అయినా అత్యుత్తమ జాతీయ విద్యాసంస్థల్లో చదవడం శ్రేయస్కరం. మెరుగైన కెరియర్ కోసం విషయ పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్, ప్రాబ్లెమ్ సాల్వింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు, టీంబిల్డింగ్, టీంవర్కింగ్ స్కిల్స్, సృజనాత్మకత చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎన్. హరిప్రసాద్
Ans:
పదో తరగతి చదివాక ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఎంట్రన్స్ పరీక్ష రాసి ప్రవేశం పొందినట్లయితే, ఇంటర్మీడియట్ ఉచితంగా, వసతిగృహంలో ఉండి చదివే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రత్యేకంగా వసతిగృహాలతో కూడిన జూనియర్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కూడా ఇంటర్ని ఉచితంగా చదవొచ్చు. హాస్టల్‌తో సంబంధం లేకుండా ఇంటర్‌ను ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నామమాత్రపు ఫీజుతో చదువుకోవచ్చు. పద్దెనిమిది సంవత్సరాలు నిండాక ఉద్యోగం కావాలనుకుంటే వొకేషనల్ కోర్సులతో ఇంటర్ చదవొచ్చు. ఉపాధి త్వరగా లభించే అవకాశాలుంటాయి. ఇంటర్మీడియట్ చదివేవారికి వారి సామాజిక, ఆర్థిక నేపథ్యాలను బట్టి ప్రభుత్వ స్టైపెండ్ వచ్చే అవకాశం ఉంది. పద్దెనిమిది ఏళ్లకే ఉద్యోగం కావాలనుకొంటే, పదో తరగతి పూర్తయ్యాక పాలిటెక్నిక్ కోర్సు చదవొచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్