Asked By: జి.అరుణ్‌కుమార్
Ans:
36 ఏళ్ల వయసులో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయాలనుకొంటున్నందుకు అభినందనలు. జర్మనీలో మాస్టర్స్ చేయడానికి వయః పరిమితి లేదు. మీరు ఎంచుకొన్న కోర్సు/ యూనివర్సిటీలకు అవసరమైన పరీక్షలు (జీఆర్ఈ/ జీమ్యాట్/ టోఫెల్/ ఐఈఎల్‌ఈఎస్) రాసి, ఆయా యూనివర్సిటీలు నిర్దేశించిన కనిష్ఠ స్కోర్లను పొందాక దరఖాస్తు చేయాలి. సాధారణంగా జర్మనీలో చాలా పబ్లిక్ యూనివర్సిటీలు డిగ్రీలో కనీసం 70% మార్కులు ఉన్నవారికే పీజీలో ప్రవేశం కల్పిస్తున్నాయి. మీ ఇంజినీరింగ్ ఫస్ట్ క్లాస్ డిగ్రీతో, అతి తక్కువ యూనివర్సిటీల్లో మాత్రమే పీజీ చదవడానికి అర్హులవుతారు. డిగ్రీలో తక్కువ మార్కులు ఉన్నందున పీజీలో ప్రవేశం పొందినా స్కాలర్షిప్/ ఫెలోషిప్ అవకాశాలు తక్కువే. చాలా అంతర్జాతీయ యూనివర్సిటీలు డిగ్రీ/ అర్హత పరీక్షలో పొందిన మార్కులతో పాటు రిఫరెన్స్ లెటర్లు, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, వివరణాత్మక బయోడేటా, ఉద్యోగానుభవం లాంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకొంటాయి. యూనివర్సిటీలో ప్రవేశం లభించిన తరువాత కూడా కొన్ని సందర్భాల్లో వయసు ఎక్కువగా ఉన్నందున వీసా లభించకపోయే అవకాశం ఉంది. కానీ రిస్క్ తీసుకొని ప్రయత్నం చేస్తే మీ కలను నిజం చేసుకోవచ్చు. ఒకవేళ జర్మనీలో చదవడం సాధ్యం కాకపోతే మరేదైనా దేశంలో అయినా పీజీ చేసే ప్రయత్నం చేయండి. ఈ వయసులో మాస్టర్స్ చదవడం సరైన నిర్ణయమేనా అనేది మీ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ బాధ్యతలను బట్టి ఆలోచించండి. పీజీ చదివాక జర్మనీలో స్థిరపడతారా, మరేదైనా దేశానికి వెళ్తారా, మళ్ళీ ఇక్కడికే వస్తారా, ఉద్యోగానికి సెలవు పెట్టి వెళ్తారా, ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్తారా అనే అంశాలతో పాటు, మీ స్వల్పకాలిక/ దీర్ఘకాలిక ఆశయాలను కూడా దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎస్. సురేష్‌తేజ
Ans:
సాధారణంగా రెగ్యులర్‌గా చదివిన డిగ్రీలకూ, ఆన్లైన్ డిగ్రీలకూ సమానమైన హోదానే ఉంటుంది. కాకపోతే ఇంటర్వ్యూల్లో ఆన్లైన్ డిగ్రీలున్నవారితో పోలిస్తే రెగ్యులర్ డిగ్రీలు చదివినవారిపై కొంత సానుకూలత ఉండొచ్చు. దీన్ని అధిగమించాలంటే ఆన్లైన్ డిగ్రీ చదివేవారు, రెగ్యులర్ డిగ్రీ చదివినవారితో సమానంగా విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఎంటెక్/ ఎంఎస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులను రెగ్యులర్‌గా చేస్తేనే ప్రయోజనాలు ఎక్కువ. రెగ్యులర్‌గా చేసే అవకాశం లేకపోతే మాత్రమే ఆన్లైన్ ద్వారా చేయాలి. ఆన్లైన్/దూర విద్య డిగ్రీలు ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్లు పొందడంలో ఉపయోగకరంగా ఉంటాయి.
బిర్లా ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆన్లైన్ ఎంటెక్ కోర్సు చాలాకాలం నుంచి అందుబాటులో ఉంది. ఇండియన్ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ పాట్నా లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉద్యోగుల కోసం ఆన్లైన్ ఎంటెక్ కోర్సులను ప్రారంభించాయి. వీటితో పాటు మరికొన్ని ప్రైవేటు యూనివర్సిటీలూ ఆన్లైన్ ఎంటెక్ కోర్సులను అందిస్తున్నాయి. ఏదైనా కోర్సులో చేరేముందు, ఆ విద్యాసంస్థ వెబ్‌సైట్‌కి వెళ్ళి, మీరు చదవబోయే ఆన్లైన్ కోర్సుకు యూజీసీ/ ఏఐసీటీఈ గుర్తింపు ఉందో లేదో నిర్థారించుకోండి. ఆన్లైన్ కోర్సులను ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి చేస్తేనే ఆ డిగ్రీలకు మంచి గుర్తింపు ఉంటుంది. ఇక చాలా విదేశీ యూనివర్సిటీలు ఆన్లైన్ ఎంఎస్ డిగ్రీలను అందిస్తున్నాయి. మీరు చదవాలనుకొంటున్న విశ్వవిద్యాలయపు అంతర్జాతీయ ర్యాంకింగ్, ట్యూషన్ ఫీజు, విశ్వసనీయత ఆధారంగా సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: జి. శ్రీనివాస్
Ans:
దూరవిద్యలో చేసిన బీటెక్ డిగ్రీలకు ఏఐసీటీఈ/యూజీసీ గుర్తింపు లేదు. అందువల్ల మీ సంస్థ ప్రమోషన్ కోసం మీ డిగ్రీని గుర్తించడం లేదు. ప్రస్తుతం మీ ముందు మూడు అవకాశాలున్నాయి. అందులో మొదటిది.. ఇంజినీరింగ్ కోర్సుకు సమానమైన ఏఎంఐఈని చేయడం. దీనికోసం మీరు ఉద్యోగానికి సెలవు పెట్టవలసిన అవసరం లేదు. రెండోది.. మూడు సంవత్సరాలు ఉద్యోగానికి సెలవు పెట్టి, ఇంజినీరింగ్ కోర్సు రెగ్యులర్‌గా చేయటం. మూడోది.. మీ సంస్థలో బీఎస్సీ/బీఏ కోర్సుల ద్వారా ప్రమోషన్ పొందే వీలుంటే ఆ కోర్సులను దూరవిద్య ద్వారా చదవటానికి ప్రయత్నించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎం.చందు
Ans:
ఒక కోర్సులో చేరి కొంతకాలం చదివి, దాన్ని మధ్యలో వదిలేసి మరో కోర్సులో చేరాలా, వద్దా అనే ఆలోచన చాలామందిని వేధిస్తుంది. ఈ నిర్ణయం తీసుకునేముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోండి. ముందుగా మీరు ఇంజినీరింగ్ కోర్సులో ఎందుకు చేరారు? ఇబ్బంది బ్రాంచితోనా? ఇంజినీరింగ్ కోర్సుతోనా? ఇంజినీరింగ్ కష్టంగా తోచి, సబ్జెక్టుల్లో మంచి మార్కులు పొందలేకపోతున్నారా? ఏమైనా బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా? సమస్య కళాశాల అధ్యాపకులతోనా? సహాధ్యాయుులతోనా? ఈ కోర్సును కొనసాగించడం వల్ల ఉద్యోగావకాశాలు ఉండవని దిగులు పడుతున్నారా? గతంలో తెలుగు మీడియం చదివి ఇప్పుడు ఇంగ్లిష్ మీడియంలోకి మారడం వల్ల భాషా సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? సాధారణ డిగ్రీలో చేరి పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వాలనుకొంటున్నారా?
ఈ ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు తెలియకుండా.. సలహా ఇవ్వడం కష్టమే! ఇలాంటి నిర్ణయాలు తీసుకొనేముందు ఒక్కో అంశంలో ఉన్న లాభ నష్టాలను బేరీజు వేసుకోవాలి.
మీ దీర్ఘకాలిక ఆశయాలు, స్వల్పకాలిక లక్ష్యాలు ఏమిటి? ఇంజినీరింగ్ కోర్సు చదవడం వల్ల వాటిని సాధించలేననే భయమా? పరీక్షల ఒత్తిడి ఎక్కువగా ఉందా? ఈ కోర్సు వదిలేసి డిగ్రీలో చేరాక, దానిపై కూడా ఆసక్తి తగ్గితే, అప్పుడేం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు మీదగ్గర సరైన సమాధానాలున్నాయా? ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయం తీసుకోండి.
ఒక కోర్సును రెండు సంవత్సరాలు చదివి, మరో కోర్సుకి మారడం అనేది చాలా పెద్ద నిర్ణయం. అందుకే తొందరపాటు వద్దు. మీ శ్రేయోభిలాషులతో, అధ్యాపకులతో, కెరియర్ కౌన్సెలర్లతో చర్చించండి. గతంలో ఇంజినీరింగ్/ మెడిసిన్ కోర్సును మధ్యలో వదిలేసి, డిగ్రీ చదివి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అత్యున్నత ఉద్యోగాలు పొందినవారు, డిగ్రీ పూర్తిచేసి చెప్పుకోదగ్గ స్థాయిలో ఉద్యోగం పొందనివారు, డిగ్రీనే పూర్తిచేయనివారూ ఉన్నారు. మీరు ఏ కేటగిరీలో ఉంటారు అనేది మీ కృషి, పట్టుదల, బలమైన ఆశయం, కుటుంబ సభ్యుల సహకారం, ఆర్థిక వనరులు లాంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది.
నా మిత్రుడొకరు ప్రముఖ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో రెండేళ్లు బీటెక్ చదివి, ఆ కోర్సుపై ఆసక్తి లేకపోవడం వల్ల మధ్యలో వదిలేసి, డిగ్రీ, పీజీ పూర్తిచేశారు. థియేటర్‌పై ఉన్న ఆసక్తితో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో డిప్లొమా కోర్సు చదివారు. ప్రస్తుతం ఒక ప్రముఖ యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేస్తూ, థియేటర్ రంగంలో రాణిస్తున్నారు. నూతన జాతీయ విద్యావిధానం - 2020, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, జాతీయ స్థాయిలో క్రెడిట్ల బదిలీ లాంటి విధానాలు అమల్లోకి వస్తే విద్యా సంవత్సరాలు నష్టపోకుండానే, ఒక కోర్సు నుంచి మరో కోర్సుకూ, ఒక విద్యా సంస్థ నుంచి మరో విద్యాసంస్థకూ మారే అవకాశం ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: వాసన్
Ans:
మీరు డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకొని, పట్టు సాధించాలి. మీరు డిగ్రీలో చదివిన సబ్జెక్టులపైనే ఆధారపడితే నేరుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందడం కష్టం. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి బాగా డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోర్సులను నేర్చుకొనే ప్రయత్నం చేయండి. కనీసం ఏడాది పాటు సీ, జావా, ఆర్, పైతాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో పాటు, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, డేటా స్ట్రక్చర్స్, డేటాబేస్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ లాంటి సబ్జెక్టులను ఆన్లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా నేర్చుకోండి. మీకు డిగ్రీలో మార్కుల శాతం ఎక్కువగా లేకపోతే కంప్యూటర్ సైన్స్/ డేటా సైన్స్/ బిజినెస్ అనలిటిక్స్‌ల్లో పీజీ చేసి మంచి మార్కులు పొందటం మేలు. పీజీ కోర్సును క్యాంపస్ రిక్రూట్మెంట్ అవకాశాలున్న విద్యా సంస్థల్లో చదివితే మంచిది. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడాలంటే ప్రోగ్రామింగ్ నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్, లాంగ్వేజ్, ఎనలిటికల్, లాజికల్ స్కిల్స్ చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: prasanth
Ans:
డేటా సైన్స్ కోర్సును యూనివర్సిటీల్లో, కళాశాలల్లో రెగ్యులర్ డిగ్రీ/డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సుగా అందించడం ఈమధ్య కాలంలోనే మొదలైంది. చాలా విద్యాసంస్థల్లో ఈ కోర్సును బోధించడానికి అవసరమైన అధ్యాపకుల కొరత ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం చాలామంది ఈ కోర్సును ఆన్లైన్ పద్ధతిలోనే నేర్చుకొంటున్నారు. ప్రముఖ విద్యాసంస్థలనుంచి ఆన్ లైన్లో పొందే సర్టిఫికెట్లకు విలువ ఎక్కువగానే ఉంటుంది. రెగ్యులర్‌గా చదివినా, ఆన్లైన్లో చదివినా విషయపరిజ్ఞానం, సరైన నైపుణ్యాలు లేనట్లయితే ఆ సర్టిఫికెట్‌కు విలువ ఉండదు. మీకు అవకాశం ఉంటే అత్యుత్తమ విదేశీ యూనివర్సిటీలు, ఐఎస్బీ, ఐఐఎంలు, ఐఐటీల్లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో డేటా సైన్స్/ఎనలిటిక్స్ కోర్సును ఆఫ్‌లైన్/ ఆన్లై న్లో చేసే ప్రయత్నం చేయండి. డేటా సైన్స్/ ఎనలిటిక్స్ రంగాల్లో మెరుగైన ఉద్యోగం పొందాలంటే సర్టిఫికెట్‌తోపాటు అనుభవం కూడా ప్రధానం. మీరు కోర్సు నేర్చుకొంటూనే డేటా సైన్స్/ ఎనలిటిక్స్‌లో రకరకాల ప్రాజెక్టులు చేస్తూ అనుభవం, మెలకువలూ, నైపుణ్యాలను పొందండి: నచ్చిన సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: బిందు
Ans:
మీరు కంప్యూటర్ సైన్స్‌లో కానీ, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో కానీ, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో కానీ ఎంఎస్ చేయవచ్చు. ఇవే కాకుండా, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్కు సంబంధించి లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ లాంటి వాటి గురించీ ఆలోచించవచ్చు. ఇటీవలికాలంలో డేటా సైన్స్ చదివినవారికి ఎక్కువ ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. అందుకని ఆసక్తి ఉంటే డేటా సైన్స్, బిజినెస్ ఎనలిటిక్స్ లాంటి సబ్జెక్టుల్లో ఎంఎస్ చేసే ప్రయత్నం చేయండి. ఇవే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్ టెక్, ఐఓటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటి కోర్సుల్లో కూడా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. మీ అభిరుచి, ఆసక్తి, దీర్ఘకాలిక ఆశయాలను దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: yaragorla
Ans:
According to your interest you have to choose the courses. Hope some of the courses may useful for Mechanical Engineering Students. Whatever you do, do your best.
Mathcad. Mathcad is possibly the one piece of software that is useful to every mechanical engineer, regardless of job function.
・ Computer Aided Design (CAD) Software
・ Finite Element Analysis (FEA) Software
・ Microsoft Excel
・ Visual Basic for Applications (VBA)
・ MATLAB
・ Python
Asked By: డి.బంధ్యానాయక్
Ans:
సాధారణంగా ప్రభుత్వరంగ సంస్థల్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచికి సంబంధించిన ఉద్యోగాలు, ఇతర ఇంజినీరింగ్ బ్రాంచీల ఉద్యోగాలకంటే తక్కువ సంఖ్యలో ఉంటాయి. ప్రముఖ ఐటీ కంపెనీలతో పోలిస్తే ప్రభుత్వరంగ సంస్థల్లో వేతనాలు, ప్రమోషన్లు కూడా తక్కువగానే ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ చదివినవారు నెట్వర్క్ ఇంజినీర్, ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఐటీ టెక్నీషియన్, వెబ్ డెవలపర్, సిస్టమ్స్ ప్రోగ్రామర్, సిస్టమ్స్ అనలిస్ట్, సిస్టమ్స్ మేనేజర్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, డేటాబేస్ మేనేజర్, అప్లికేషన్ డెవలపర్, హార్డ్‌వేర్ ఇంజినీర్, సాఫ్ట్వేర్ డెవలపర్ లాంటి ఉద్యోగాలు చేయవచ్చు. బీహెచ్ఈఎల్, బీఈఎల్, ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్, ఈసీ‡ఐఎల్, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డీఆర్డిఓ, ఐఓసీ‡ఎల్, బీఎస్ఎన్ఎల్, సెయిల్, సి-డాక్, ఇస్రో, ఇండియన్ రైల్వేస్, బ్యాంకులు, యూనివర్సిటీలు, పోలీస్ డిపార్ట్‌మెంట్‌ల్లో కంప్యూటర్ సైన్స్ చదివినవారికి ఉద్యోగావకాశాలుంటాయి. మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే పాలిటెక్నిక్ కాలేజీల్లో, కేంద్రీయ విద్యాలయాల్లో, నవోదయ పాఠశాలల్లో కూడా ప్రయత్నించవచ్చు. ఐటీ కంపెనీలతో పాటు రిలయన్స్, టాటా, ఆదిత్య బిర్లా, ఎల్ అండ్ టీ, ఐటీసీ, హిందుస్తాన్ యూనిలివర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్కెట్, మింత్రా, స్నాప్ డీల్, పేటీఎం, ఇండియామార్ట్, ఈబే, బుక్ మై షో, మేక్ మై ట్రిప్, ఎయిర్టెల్, బజాజ్ లాంటి కార్పొరేట్ సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్