Post your question

 

    Asked By: అశోక్‌

    Ans:

    బీఎస్సీ (బీజడ్‌సీ) చదివినవారు వైద్య/ ఆరోగ్య రంగానికి సంబంధించి పీజీలో బయోకెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్‌ సైన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, న్యూట్రిషన్, పబ్లిక్‌ హెల్త్, మాలిక్యులర్‌ బయాలజీ, లైఫ్‌ సైన్సెస్, హ్యూమన్‌ జెనెటిక్స్, బయో థెరప్యూటిక్స్, బయో మాలిక్యులర్‌ ఫిజిక్స్, జీనోమ్‌ టెక్నాలజీ, మెడికల్‌ బయోటెక్నాలజీ, సిస్టమ్స్‌ బయాలజీ, టిష్యూ సైన్స్‌ లాంటి కోర్సులు చేయవచ్చు. మీకు మేనేజ్‌మెంట్‌ రంగంపై ఆసక్తి ఉంటే ఎంబీఏ హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్, హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సుల గురించి ఆలోచించవచ్చు. ఇవేకాకుండా అడ్వాన్స్‌డ్‌ కోర్సులైన స్టెమ్‌ సెల్‌ టెక్నాలజీ, ట్రాన్‌స్లేషనల్‌ ఇమ్యునాలజీ, ట్రాన్‌స్లేషనల్‌ న్యూరోసైన్స్, క్లినికల్‌ వైరాలజీ లాంటి కోర్సులు కూడా చదివే అవకాశం ఉంది. మీ ఆసక్తిని బట్టి ఏది చదవాలో నిర్ణయించుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎ.సాయిపవన్‌

    Ans:

    మైక్రో బయాలజీ ప్రోగ్రాంలో సూక్ష్మ జీవుల గురించి విపులంగా చదువుతారు. ఫంగీ, బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఆల్గే లాంటివి. మైక్రో బయాలజీలో వైరాలజీ, బ్యాక్టీరియాలజీ, మైకాలజీ, ప్రోటో జువాలజీ, పారాసైటాలజీ లాంటి స్పెషలైజేషన్‌లు ఉంటాయి. మీరు ఎమ్మెస్సీ మైక్రోబయాలజీలో చదివిన స్పెషలైజేషన్‌ ఆధారంగా ఏ రంగంలో ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకొని, అవసరమైన నైపుణ్యాలు పెంచుకోండి. మైక్రోబయాలజీ చదివినవారికి ఫార్మా, బయోటెక్నాలజీ రంగాలతో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్, హెల్త్‌ కేర్, బయోమెడికల్‌ రంగాల్లోనూ ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఫార్మా, బయోటెక్‌.. రెండు రంగాల్లో మైక్రో బయాలజిస్ట్‌గా ఉద్యోగం పొందవచ్చు. ప్రస్తుతం ఫార్మా, బయోటెక్‌ పరిశ్రమలు రెండూ హెల్త్‌కేర్‌ రంగంతో పాటు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయి. మీ ఆసక్తిని బట్టి దేనిలో స్థిరపడాలో నిర్ణయించుకొని ఆ రంగాన్ని ఎంచుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: హరిచందన

    Ans:

    సాధారణంగా మెడికల్‌ కోడింగ్‌ రంగంలో ప్రవేశించాలంటే, డిగ్రీలో లైఫ్‌ సైన్సెస్‌/ హెల్త్‌కేర్‌ సబ్జెక్టులు చదివి ఉండి, వివిధ వ్యాధులూ, వాటి చికిత్సల గురించీ, మానవ శరీరపు పనితీరు గురించీ ప్రాథమిక అవగాహన ఉండాలి. మీరు డిగ్రీలో చదివిన లైఫ్‌ సైన్సెస్‌ సబ్జెక్టుతోపాటు మెడికల్‌ కోడింగ్‌ శిక్షణతో మెడికల్‌ కోడింగ్‌ రంగంలో ప్రవేశించడానికి అర్హత లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ అదనపు అర్హత అవుతుంది. మరికొన్ని సందర్భాల్లో ఈ అదనపు విద్యార్హత ఉద్యోగం పొందడంలో ప్రతిబంధకం కూడా అవ్వొచ్చు.
    మెడికల్‌ కోడింగ్‌ కోర్సులో వైద్య రికార్డులను జాగ్రత్తగా చదివి సరైన కోడ్స్‌ ఇవ్వడం, వివిధ వ్యాధుల చికిత్సా విధానాలు, మానవ శరీరం పనితీరు, డేటాను సరిగా విశ్లేషించి కావాల్సిన సమాచారాన్ని అందించడం ఉంటాయి. ఫండమెంటల్స్‌ ఆఫ్‌ మెడికల్‌ టెర్మినాలజీ, అనాటమీ స్ట్రక్చర్, కాంప్రహెన్సివ్‌ మెడికల్‌ టెర్మినాలజీ, మెడికల్‌ ఎథిక్స్, కోడింగ్‌ మాన్యువల్స్‌పై పూర్తి అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణ పూర్తయ్యాక మెడికల్‌ కోడర్‌గా, మెడికల్‌ రికార్డ్స్‌ టెక్నీషియన్‌గా, మెడికల్‌ రికార్డ్స్‌ కోఆర్డినేటర్‌గా, కోడింగ్‌ స్పెషలిస్ట్‌గా, కోడింగ్‌ ఎడ్యుకేటర్‌గా, కోడింగ్‌ ఆడిటర్‌గా ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చదివినవారికి డ్రగ్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్‌ రిసెర్చ్‌ సంస్థలు, బయోటెక్‌ కంపెనీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలు, బయో ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీలు, వ్యవసాయ రంగం, క్లినికల్‌ రీసెర్చ్‌ సంస్థలు, ఎన్విరాన్మెంటల్‌ కంట్రోల్‌ సంస్థలు, బోధన - పరిశోధనా రంగాల్లో ఉద్యోగాలుంటాయి. మీరు ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, మెడికల్‌ కోడింగ్‌లను రెండింటినీ కలిపి కానీ, విడివిడిగా ఉపయోగించుకొని కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎల్‌.సమ్మయ్య నాయక్‌

    Ans:

    సాధారణంగా ఏదైనా యూనివర్సిటీలో ఒక కోర్సులో చేరినప్పుడు ఆ కోర్సు పూర్తిచేయడానికి కనిష్ఠ, గరిష్ఠ కాల పరిమితులు ఆ సంస్థ  నియమ నిబంధనల ప్రకారం నిర్దేశించివుంటాయి. ఉదాహరణకు ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం లాంటి పీజీ కోర్సులను కనిష్టంగా రెండు సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తి చేయాలి. ఇక గరిష్ఠ వ్యవధి విషయానికొస్తే-  ఒక్కో యూనివర్సిటీ ఒక్కో కాల పరిమితిని నిర్ణయిస్తోంది. చాలా యూనివర్సిటీలు పీజీ కోర్సుకు గరిష్ఠ పరిమితిని నాలుగు సంవత్సరాలుగా, కొన్ని యూనివర్సిటీలు మాత్రం ఐదు సంవత్సరాలుగా నిర్ణయించాయి.
    మీ విషయానికొస్తే- ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యలో రెండు సంవత్సరాల పీజీ కోర్సును గరిష్ఠంగా ఐదు సంవత్సరాల్లో పూర్తిచేయాలి. మీరు ఎమ్మెస్సీ కెమిస్ట్రీ 2007లో చేరారు కాబట్టి, 2012లోగా కోర్సును పూర్తి చేసి ఉండవలసింది. చాలా యూనివర్సిటీలు కోర్సులో చేరిన సంవత్సరంతో సంబంధం లేకుండా మానవతా దృక్పథంతో బ్యాక్‌లాగ్‌ పేపర్లను రాయడానికి అప్పుడప్పుడూ ఒకే ఒక్క అవకాశాన్ని ఇస్తూ ఉంటాయి. ఆ అవకాశం కోసం వేచి చూడండి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం విద్యార్థి వ్యక్తిగత దరఖాస్తును ఆధారం చేసుకొని, సహేతుకమైన కారణాలుంటే ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. మీరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం సంచాలకులను సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: మనోహర్‌బాబు

    Ans:

    జర్నలిజం కోర్సు విదేశాల్లో చాలా యూనివర్సిటీల్లో ఉంది. వీటిలో యూనివర్సిటీ ఆఫ్‌ ఆమ్‌స్టర్‌డామ్, యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా, ది లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌- ఆస్టిన్, నాన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా, యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ - మాడిసన్, మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ, న్యూయార్క్‌ యూనివర్సిటీ ముఖ్యమైనవి. ఇవే కాకుండా- ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, హాంకాంగ్‌ల్లో కూడా ప్రముఖ విశ్వవిద్యాలయాలు జర్నలిజం కోర్సును అందిస్తున్నాయి. ఉద్యోగావకాశాల విషయానికొస్తే జర్నలిజం చదివినవారు జర్నలిస్ట్, కంటెంట్‌ క్రియేటర్, రేడియో జాకీ, పబ్లిక్‌ రిలేషన్స్‌ ప్రొఫెషనల్, కాలమిస్ట్, ఎడిటర్, క్రిటిక్, కాపీ రైటర్, ఫిల్మ్‌ మేకర్‌..ఇలాంటి హోదాల్లో ఉద్యోగాల్లోకి ప్రవేశించవచ్చు. ఇవే కాకుండా బోధన, అడ్వర్‌టైజింగ్, బ్రాడ్‌ కాస్టింగ్‌ అండ్‌ ప్రొడక్షన్‌ రంగాల్లోనూ వివిధ రకాలైన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌