Post your question

 

  Asked By: వి.హర్ష

  Ans:

  బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నారు కాబట్టి ఆ కోర్సుకు సంబంధించిన సబ్జెక్టులో మరో డిగ్రీ చదివితే మీ ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. మీరు ఇంజినీరింగ్‌తో పాటు రెండో డిగ్రీని ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఆ డిగ్రీ మీ కెరియర్‌కు ఏ విధంగా ఉపయోగపడుతుంది? కొన్ని సందర్భాల్లో రెండు విభిన్న సబ్జెక్టుల్లో డిగ్రీలు చేస్తే ప్రాంగణ నియామకాల్లో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఒకవేళ మీకు తెలుగు/ తమిళ భాషపై ఆసక్తి ఉండి దానిపై అధ్యయనం చేయాలనుకుంటే నిరభ్యంతరంగా బీఏ తెలుగు/ తమిళం చదవొచ్చు. కానీ బీఏలో తెలుగు, తమిళ సబ్జెక్టులు ఆన్‌లైన్‌లో అందుబాటులో లేవు. దూరవిద్య/ ఓపెన్‌ యూనివర్సిటీల్లో మాత్రమేఉన్నాయి. మీరు బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో రెండో డిగ్రీ చేయాలనుకుంటే ఐఐటీ మద్రాస్‌ నుంచి ఆన్‌లైన్‌ బీఎస్సీ డేటా సైన్స్‌ చదివే ప్రయత్నం చేయండి. లేదా ఎలాగూ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నారు కాబట్టి మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన కోర్సు చేయాలనుకుంటే బీబీఏ చేయొచ్చు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ బెంగళూరులో ఆన్‌లైన్‌ బీబీఏ (డిజిటల్‌ బిజినెస్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌ షిప్‌) కోర్సు అందుబాటులో ఉంది. బీటెక్‌తో పాటు, ఐఐఎం బెంగళూరు లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ నుంచి బీబీఏ చేయడం వల్ల మీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
  బీటెక్‌ చేస్తూ మరో డిగ్రీ చదివితే ఎలాంటి ఇబ్బందీ లేదు. యూజీసీ నిబంధనల ప్రకారం కూడా రెండు డిగ్రీలు ఒకే సమయంలో చేసే అవకాశం ఉంది. కాకపోతే- ఒకటి రెగ్యులర్‌గానూ, మరొకటి ఆన్‌లైన్‌/ డిస్టెన్స్‌ పద్ధ్దతిలోనూ చేయాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉదయం, మధ్యాహ్నం/ సాయంత్రం షిఫ్ట్‌లో రెండు కళాశాలల నిర్వహిస్తూ ఉంటే ఒకే సమయంలో రెండు రెగ్యులర్‌ కోర్సులు చదివే అవకాశం కూడా ఉంది. మూడేళ్లపాటు రెండు కోర్సులను సమర్థంగా చదవడానికి ప్రేరణ, నిబద్ధత, పట్టుదల చాలా అవసరం. చివరిగా ఒకే సమయంలో రెండు డిగ్రీలు చదవాలంటే టైమ్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు కూడా ముఖ్యం.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: బుజ్జి

  Ans:

  మీరు ఏ సంవత్సరంలో డిగ్రీలో చేరారు? ఎన్నేళ్లు చదివారు? ఏ ఏడాది మానేశారు? డిగ్రీలో ఏ సబ్జెక్టులుు? మీ ప్రస్తుత వయసు, ఇంటర్మీడియట్లో ఏ గ్రూపు... ఇవేమీ చెప్పలేదు. మొదటిగా మీరు డిగ్రీ చదివిన కళాశాలకు వెళ్లి ఇప్పుడు డిగ్రీని పూర్తి చేయడానికి అవకాశం ఉందో లేదో కనుక్కోండి. చాలా యూనివర్సిటీల్లో మూడు సంవత్సరాల డిగ్రీని గరిష్ఠంగా 5 లేదా 6 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. ఒకవేళ యూనివర్సిటీ నిబంధనల ప్రకారం డిగ్రీని పూర్తిచేయవచ్చంటే ఆ డిగ్రీని కొనసాగించండి. అలా వీలు కాకపోతే మళ్లీ డిగ్రీలో చేరి రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లి చదువుకోండి. డీఈడీ విద్యార్హతతో ఏదైనా పాఠశాలలో టీచర్‌గా చేరి, దూరవిద్య/ ఓపెన్‌ యూనివర్శిటీ ద్వారా డిగ్రీ పూర్తిచేసే ప్రయత్నం చేయండి. చివరిగా, ఏదైనా ప్రైవేటు యూనివర్సిటీ లేదా ఓపెన్‌ యూనివర్శిటీ, లేదా రాష్ట్ర యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రాన్ని సంప్రదించి, గతంలో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన సబ్జెక్టుల క్రెడిట్స్‌ని బదిలీ చేసి, ఆ సబ్జెక్టులు మినహా మిగతావి చదివి డిగ్రీ పూర్తిచేసే అవకాశం ఉందేమో తెలుసుకోండి. ఇవేవీ కుదరకపోతే, ఉద్యోగం చేస్తూనే డిగ్రీని ఆన్‌లైన్‌ పద్ధతిలో చదివే  ప్రయత్నం కూడా చేయొచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: పి.శ్యామ్‌

  Ans:

  బ్యాక్‌ లాగ్స్‌ ఉన్నాయన్నారు కానీ, ఎన్ని  సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యారో చెప్పలేదు. మీరు ఇంజినీరింగ్‌ చదువుతున్న కళాశాల ఏ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది? ఒక్కో వర్శిటీలో ప్రమోషన్‌ నియమాలు ఒక్కో రకంగా ఉంటాయి. కొన్ని విశ్వవిద్యాలయాల్లో మూడో సంవత్సరం చదవాలంటే మొదటి సంవత్సరంలో ఉన్న అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నాలుగో సంవత్సరం చదవాలంటే రెండో సంవత్సరంలో ఉన్న అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైవుండాలి. కొన్ని యూనివర్సిటీల్లో మాత్రం ప్రతి సెమిస్టర్‌లో కనీసం 50 శాతం సబ్జెక్టుల్లో పాసైతేనే తరువాతి సెమిస్టర్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బ్యాక్‌లాగ్స్‌పై గరిష్ఠ పరిమితి కూడా ఉంటుంది. మీరు చదువుతున్న కళాశాలకు సంబంధించిన విశ్వవిద్యాలయ నిబంధనలకు లోబడి మీరు ఏడో సెమిస్టర్‌ చదవడానికి అర్హత ఉంటుంది. కానీ బ్యాక్‌లాగ్స్‌ రాయడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
  బ్యాక్‌ లాగ్స్‌ రాసి, ఉత్తీర్ణత పొందితే ఉద్యోగాలు రావనుకోవడం అపోహ మాత్రమే. ఇటీవల ఇంజినీరింగ్‌ డిగ్రీ పొందుతున్నవారిలో దాదాపు సగం మంది విద్యార్థులు కనీసం ఒక సెమిస్టర్‌లో అయినా సప్లిమెంటరీ రాసి ఉత్తీర్ణత సాధించినవారే! కాకపోతే వారిలో చాలామంది బ్యాక్‌లాగ్స్‌ ఉన్నప్పటికీ ఇంజినీరింగ్‌ని నాలుగేళ్లలో పూర్తి చేస్తున్నారు. మీరు కూడా బ్యాక్‌లాగ్స్‌ అన్నింటినీ నాలుగేళ్ల లోపే పూర్తిచేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ అలా కుదరకపోయినా కంగారుపడాల్సిన అవసరం లేదు. అతి కొన్ని ప్రైవేటు సంస్థలు మాత్రమే ఇంజినీరింగ్‌ డిగ్రీని బ్యాక్‌లాగ్స్‌ లేకుండా నాలుగు సంవత్సరాల వ్యవధిలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్న నియమాన్ని పెడుతున్నాయి. చాలా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకూ, ప్రభుత్వ ఉద్యోగాలకూ ఇలాంటి నిబంధన ఏమీ లేదు. కాబట్టి మీరు నిరభ్యంతరంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. మీకు ఆసక్తి ఉంటే బీటెక్‌ తరువాత ఎంబీఏ కానీ, ఎంటెక్‌ కానీ మంచి విద్యాసంస్థలో, ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే బీటెక్‌లో బ్యాక్‌లాగ్స్‌ వల్ల జరిగిన నష్టాన్ని కొంతమేరకు నివారించవచ్చు. గతంలో జరిగిన తప్పిదాల గురించి బాధపడకుండా గుణపాఠాలు నేర్చుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


   

  Asked By: హరీష్‌

  Ans:

  ఇంజనీరింగ్‌ డిప్లొమా తర్వాత బీఏ డిగ్రీ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదు. చాలా సందర్భాల్లో, ఇంజనీరింగ్‌ డిప్లొమాను ఇంటర్మీడియట్‌కు సమానంగానే పరిగణిస్తారు. మీరు డిగ్రీ అర్హత ఉన్న అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకూ అర్హులు అవుతారు. అటవీ శాఖలో కూడా డిగ్రీ అర్హత ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్‌ కోర్సుల్ని దూరవిద్య ద్వారా చదవడం కుదరదు. కానీ ఈవెనింగ్‌ కాలేజీ ద్వారా కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌ పద్ధతిలో చదివే వెసులుబాటు ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడు సంవత్సరాల బీఈ ప్రోగ్రాం ఉంది. ఈ ప్రోగ్రాంను ఆరు సెమిస్టర్లలో అందిస్తారు. ఒక్కో సెమిస్టర్‌కు ట్యూషన్‌ ఫీజు 50 వేల రూపాయలు. దీనిలో ప్రవేశం పొందాలంటే, మూడు సంవత్సరాల ఇంజినీరింగ్‌ డిప్లొమాలో కనీసం 45 శాతం మార్కులు పొందివుండాలి. కనీసం ఒక సంవత్సరం ఉద్యోగానుభవం ఉండి, హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల లోపు దూరంలో ఉన్న సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉండాలి. ప్రస్తుతం ఈ అవకాశం సివిల్, మెకానికల్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఏఐ అండ్‌ ఎంఎల్‌ ప్రోగ్రాంలో ప్రవేశానికి కంప్యూటర్‌ సైన్స్‌ డిప్లొమా చదివినవారు మాత్రమే అర్హులు. ఒకవేళ కంప్యూటర్‌ సైన్స్‌ డిప్లొమా చదివినవారు తగినంతమంది లేకపోతే, ఇతర డిప్లొమాల వారినీ పరిగణిస్తారు. భవిష్యత్తులో ఇతర బ్రాంచీల్లో కూడా ఈ ప్రోగ్రాం అందుబాటులోకి రావచ్చు. బిట్స్‌ పిలానీలో వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రాం ద్వారా ఆన్‌లైన్‌ పద్ధతిలో బీటెక్‌ ప్రోగ్రాం అందుబాటులో ఉంది. దీన్ని యూజీసీ అనుమతించింది. కానీ ఈ నాలుగేళ్ల బీటెక్‌ ప్రోగ్రాం ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్, ఇంజినీరింగ్‌ టెక్నాలజీ, ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌ల్లో మాత్రమే ప్రస్తుతం అందిస్తున్నారు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: ఉపేందర్‌

  Ans:

  కెరియర్‌లో విరామం రావడంతో పాటు వయసు కూడా ఎక్కువ కావడం వల్ల ఉద్యోగావకాశాలు రావడం లేదు అన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారు ఎక్కువమంది అందుబాటులో ఉన్నందున బీసీఏ, బీఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) లాంటి కోర్సులు చదివినవారికి ఉద్యోగావకాశాలు కొంతమేరకు తగ్గాయి. మీకు ప్రోగ్రామింగ్‌ మీద పట్టులేదంటున్నారు కాబట్టి కొత్త కోర్సులు నేర్చుకోవడమూ కొంత కష్టం కావొచ్చు. డేటా సైన్స్, మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన కోర్సులు నేర్చుకుంటే, ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. కంప్యూటర్‌ కోర్సులు కాకుండా మీకు ఏ రంగంపై ఆసక్తి ఉందో తెలుసుకొని దానిలో స్థిరపడే కోర్సులు చదివే ప్రయత్నం చేయండి.
  మేనేజ్‌మెంట్‌ రంగంలో ఆసక్తి అంటే ఎంబీఏ, జర్నలిజం ఇష్టమైతే ఎంఏ జర్నలిజం, బోధన రంగంలో అభిరుచి ఉంటే బీఈడీ, కౌన్సెలింగ్‌పై అభిలాష ఉంటే సైకాలజీ పీజీ, ఇంగ్లిష్‌పై ఆసక్తి ఉంటే ఎంఏ ఇంగ్లిష్, సోషల్‌ సైన్స్‌ ఇష్టమైతే పీజీలో ఎకనామిక్స్, సోషియాలజీ, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, ఆంత్రపాలజీ, హిస్టరీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్‌ పాలసీ‡, రూరల్‌ డెవలప్‌మెంట్, జాగ్రఫీ లాంటివి చదవొచ్చు. నిజమైన ఆసక్తి ఉంటే ఏ వయసులోనైనా చదువుకోవచ్చు. బీసీఏని కంప్యూటర్‌ కోర్సుగా కాకుండా ఒక డిగ్రీ కోర్సుగా భావించి, డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నించండి.
  స్వయం ఉపాధి మార్గాల విషయానికి వస్తే- బీసీఏ చదివారు కాబట్టి, కంప్యూటర్‌ యాక్సెసరీ స్టోర్, కంప్యూటర్‌ సర్వీసింగ్‌ సెంటర్, మొబైల్‌ సర్వీసింగ్‌ సెంటర్, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌లాంటి వాటి గురించి ఆలోచించండి. ఒకవేళ కంప్యూటర్స్‌కు సంబంధం లేని వ్యాపారం చేయాలనుకుంటే చిన్న కిరాణా దుకాణం మొదలు, మిల్క్‌ సెంటర్, హార్డ్‌వేర్‌ స్టోర్స్, స్టేషనరీ స్టోర్స్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎలక్ట్రికల్‌ స్టోర్స్‌ లాంటివీ ఆలోచించవచ్చు. చదివిన చదువుకు తగ్గ ఉపాధి దొరక్కపోతే, మనసుకి నచ్చిన పని చేయాలి. అదికూడా కుదరకపోతే, ఆదాయం ఎక్కువగా వచ్చే ఉపాధిని వెతుక్కోవాలి. మారుతున్న పరిస్థితుల్లో కోర్సుతో సంబంధం లేకుండా నిజాయతీగా ఎలాంటి పని చేయడానికైనా ఇబ్బంది పడకపోతే, మెరుగైన భవిష్యత్తు ఉంటుంది.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: అభిలాష్‌

  Ans:

  చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు అండర్‌ గ్రాడ్యుయేషన్‌ విద్యార్హత సరిపోతుంది. డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదివినప్పటికీ చాలా కేంద్ర/ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాసే అవకాశం ఉంది. బోధన, పరిశోధన, అడ్మినిస్ట్రేషన్‌ లాంటి ప్రత్యేక ఉద్యోగాలకు మాత్రమే  పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ లాంటి ఉన్నత విద్య అవసరం. ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవడం వల్ల పోటీపరీక్షల్లో కచ్చితంగా ఉపయోగం ఉంటుంది. చాలా ఉద్యోగ పోటీ పరీక్షల్లో మెంటల్‌ ఎబిలిటీ, అరిథ్‌మెటిక్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ లాంటి అంశాలు ఉంటాయి. మ్యాథ్స్‌లో శిక్షణ పొందినవారికి, ఇతర సబ్జెక్టులు చదివినవారితో పోలిస్తే, ఈ సెక్షన్లలో ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇంటర్‌లో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్‌ చదివిననవారికి జనరల్‌ స్టడీస్‌లో ఎక్కువ మార్కులు వీలుంటుంది.
  కానీ ఇటీవలి పోటీ పరీక్షా ఫలితాలను విశ్లేషిస్తే- మ్యాథ్స్, ఇంజినీరింగ్‌ చదివినవారు కూడా జనరల్‌ స్టడీస్‌లో మెరుగైన ప్రతిభ కనపరుస్తున్నారు. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివితే సమస్యా పరిష్కారంలో మెలకువలు పెరుగుతాయి. లాజికల్‌ రీజనింగ్‌కు సంబంధించిన అంశాలు కూడా బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవడం వల్ల కంప్యూటర్‌ సైన్స్,  స్టాటిస్టిక్స్‌ లాంటి సబ్జెక్టులు చదవడానికి అర్హత ఉంటుంది. గణితంపై పట్టు ఉంటే పోటీ పరీక్షలతో పాటు, విదేశాల్లో విద్య అభ్యసించడానికి అవసరమైన జీఆర్‌ఈ, జీమ్యాట్‌ లాంటి పరీక్షల్లో కూడా రాణించవచ్చు. -
  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌
   

  Asked By: prasanth

  Ans:

  మీకు ఇంటర్మీడియట్‌లో 85 శాతం మార్కులు వచ్చాయి కాబట్టి బీకాంలో అడ్మిషన్‌ తీసుకొని, చార్టెడ్‌ అకౌంటెన్సీ చేయవచ్చు. లేకపోతే బీకాంలో బిజినెస్‌ అనలిటిక్స్, కంప్యూటర్‌కు సంబంధించిన స్పెషలైజేషన్స్‌ ఎంచుకోవచ్చు. బీబీఏలో జనరల్, బ్యాంకింగ్, రిటైలింగ్, సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్‌ బిజినెస్, ఈ-కామర్స్, టూరిజం, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి స్పెషలైజేషన్స్‌ కూడా చదవొచ్చు. ఆసక్తి ఉంటే బీఏలో ఇంగ్లిష్‌ లిటరేచర్, సైకాలజీ, జర్నలిజం, ఎకనమిక్స్‌ లాంటి సబ్జెక్టుల గురించి కూడా ఆలోచించవచ్చు. ఇవేకాకుండా, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కానీ ఇంటిగ్రేటెడ్‌ బీకామ్‌ ఎల్‌ఎల్‌బీ/ బీబీఏ ఎల్‌ఎల్‌బీ/ బీఏ ఎల్‌ఎల్‌బీ కూడా చదివే అవకాశం ఉంది. పైన చెప్పిన అన్ని ప్రోగ్రామ్స్‌లో ఉద్యోగావకాశాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడైనా ఉద్యోగ ప్రయత్నాల్లో విద్యార్హత పాస్‌పోర్ట్‌ లాంటిది. నైపుణ్యాలు వీసా లాంటివి. నైపుణ్యాలు లేకుండా ఉద్యోగం పొందడం కష్టం. మీరు ఏ డిగ్రీ చదివినా, ఎంఎస్‌ ఎక్సెల్, పైతాన్, స్టాటిస్టిక్స్‌ లాంటి వాటిలో ప్రావీణ్యం ఉంటే, ఉద్యోగా వకాశాలు మెరుగవుతాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: prasanth

  Ans:

  ప్రతి డిగ్రీ పూర్తి చేయడానికి నిర్దిష్ట కాల వ్యవధి ఉంటుంది. యూజీసీ నిబంధనల ప్రకారం- మూడు సంవత్సరాల డిగ్రీని గరిష్ఠంగా ఐదు సంవత్సరాల వ్యవధిలో పూర్తిచేయాలి. కొన్ని యూనివర్శిటీలు కాలపరిమితి విషయంలో కొంత ఉదాసీనంగా ఉంటున్నాయి. మీరు బీఎస్సీ చదివిన యూనివర్శిటీలో గరిష్ఠ వ్యవధి గురించి తెలుసుకోండి. ఒకవేళ పరీక్షలు రాయడానికి వెసులుబాటు ఉన్నా, మీరు 2016లో బీఎస్సీ చివరి సంవత్సరం కాలేజీకి వెళ్లనందున డిగ్రీ పరీక్షలు రాయడం కుదరదు. బీఎస్సీలో ప్రాక్టికల్స్‌ కూడా ఉంటాయి. అందుకని కళాశాలకు వెళ్లడం తప్పనిసరి. మీరు చెబుతున్న పది సబ్జెక్టులు ఫైనల్‌ ఇయర్‌తో కలిపా? మొదటి రెండు సంవత్సరాలకు సంబంధించినవా? ఇప్పుడు మీరు పది సబ్జెక్టులు రాసినా, అన్నింటిలో ఉత్తీర్ణత సాధించడం చాలా కష్టం కాబట్టి, బీఏ పరీక్షలు రాయడం ఉపయోగకరం. మీరు బీఏ డిగ్రీని అయినా మూడు సంవత్సరాల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. ఆసక్తి ఉంటే మీ యూనివర్సిటీ నిబంధనలు అనుమతిస్తే, బీఎస్సీ పూర్తికి ప్రయత్నం చేయవచ్చు. మూడు సంవత్సరాల బీఎస్సీ డిగ్రీని సుదీర్ఘ వ్యవధిలో పూర్తి చేయడం వల్ల ఆ డిగ్రీతో ఉద్యోగం పొందడం కూడా కష్టమవుతుంది. ఉద్యోగం పొందడానికి డిగ్రీ సర్టిఫికెట్‌ అర్హత మాత్రమే. మేటి కొలువులు దక్కాలంటే విద్యార్హతతో పాటు విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు కూడా చాలా ముఖ్యం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: - పి.వైష్ణవి

  Ans:

  ఇంటర్‌ తరువాత ఇంజనీరింగ్‌ కాకుండా చాలా రకాల ప్రోగ్రామ్స్‌ చదివే అవకాశం ఉంది. మీరు ఇంటర్‌లో ఎంపీసీ చదివారు కాబట్టి, డిగ్రీలో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో బీఎస్సీ చదవొచ్చు. మ్యాథ్స్‌తో పాటు ఫిజిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఎకనామిక్స్‌ /స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ జియాలజీ లాంటి కాంబినేషన్లు చదవొచ్చు. ఇవే కాకుండా బీఎస్సీలో డేటా సైన్స్‌లో చేరే అవకాశం ఉంది. మీకు బిజినెస్‌ రంగంపై ఆసక్తి ఉంటే బీబీఏ, బీకాం, జర్నలిజం, టూరిజం లాంటి ప్రోగ్రామ్స్‌ చదవొచ్చు. న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉంటే ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీలో చేరొచ్చు. యూపీఎస్సీ పరీక్షలో లా సబ్జెక్టును కూడా ఒక ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు. సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగానికి ఏ డిగ్రీ చదివినా అర్హులు అవుతారు. కానీ మీరు సివిల్స్‌ పరీక్షలో భవిష్యత్తులో ఎంచుకోబోయే ఆప్షనల్‌ సబ్జెక్టును దృష్టిలో పెట్టుకొని డిగ్రీలో ఆ సబ్జెక్టు చదివే ప్రయత్నం చేయవచ్చు. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, ఆంత్రొపాలజీ, సోషియాలజీ, సైకాలజీ, జియాలజీ, తెలుగు సాహిత్యం, ఇంగ్లిష్, సంస్కృత సాహిత్యం లాంటి వాటి గురించి కూడా ఆలోచించవచ్చు. రాష్ట్రస్థాయి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలకూ డిగ్రీ విద్యార్హత సరిపోతుంది. వీటితో పాటు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్, బ్యాంకింగ్‌ లాంటి పలు ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్హతతో పోటీపడి విజయం సాధించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: - కె.కార్తీక్‌

  Ans:

  డీఎస్సీ నోటిఫికేషన్‌ రాలేదని బీటెక్‌ చదవడం, బీటెక్‌తో ఉద్యోగం రాలేదని బీఈడీ చేయడం, టీచర్‌ ఉద్యోగం రాలేదని ఎంటెక్‌ చేయడం.. ఇవన్నీ మీకు మంచి కెరియర్‌ని ఇవ్వవు. మీకు ఏ రంగంలో ఆసక్తి ఉంది? ఏ ఉద్యోగం చేస్తే మానసిక/ ఉద్యోగ సంతృప్తి ఉంటుంది? మీకు ఏ రంగంలో నైపుణ్యాలు ఉన్నాయి? మీ దీర్ఘకాలిక/ స్వల్పకాలిక ఆశయాలు ఏమిటి? వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
  మీ ప్రశ్నకొస్తే- మీరు రెండో సెమిస్టర్‌కు ఫీజు కట్టలేదు కాబట్టి, రెండో సెమిస్టర్‌ చదవలేరు. రెండో సెమిస్టర్‌ చదవకుండా మూడో సెమిస్టర్‌/ రెండో సంవత్సరం చదవడం కుదరదు. మీరు బీటెక్‌ మొదటి సంవత్సరంలో ఎన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు అయ్యారనేది రెండో సెమిస్టర్‌లోకి ప్రమోట్‌ అవుతారా? లేదా? అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. మీరు మొదటి సెమిస్టర్‌ మళ్ళీ చదవాలా? నేరుగా వచ్చే సంవత్సరం మీ జూనియర్స్‌తో రెండో సెమిస్టర్‌లోకి ప్రవేశం పొందవచ్చా? అనేది అడ్మిషన్‌ తీసుకొన్న యూనివర్సిటీ నిబంధనలకు లోబడి ఉంటుంది. యూనివర్సిటీ అధికారులను సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌