Asked By: రాథోడ్ నవీన్
Ans:
గణితంపై ఆసక్తి ఉంది కాబట్టి గణితాన్ని కొనసాగించే కోర్సులగురించి ఆలోచించండి. పదో తరగతి తరువాత డిప్లొమా చేయడం వల్ల మ్యాథ్స్ సబ్జెక్టును అంతగా నేర్చుకొనే అవకాశం ఉండదు. ఇంటర్ (ఎంపీసీ) చదివిస్తూ ఎన్ఐటీ/ఐఐటీలో ఇంజినీరింగ్ కోసం జేఈఈ మెయిన్స్/అడ్వాన్స్డ్ పరీక్షలు రాయించండి. అలా కానీ పక్షంలో ఎంసెట్‌లో మంచి ర్యాంకు ద్వారా ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో సీటు కోసం ప్రయత్నించండి. ఒకవేళ తనకు ఇంజినీరింగ్ మీద ఆసక్తి లేకపోతే ఇంటర్ ఎంపీసీ తర్వాత బీఎస్సీలో మ్యాథ్స్‌తో పాటు ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ ఎలక్ట్రానిక్స్/ స్టాటిస్టిక్స్/ కంప్యూటర్ సైన్స్ / జియాలజీ/ డేటా సైన్స్ లాంటి సబ్జెక్టుల్లో నచ్చిన సబ్జెక్టులను ఎంచుకొని డిగ్రీ చేయొచ్చు. ఆపై మ్యాథ్స్‌లో పీజీ చేయటం మంచిది. బీఎస్సీపై ఆసక్తి లేకపోతే బీఏలో మ్యాథ్స్‌తో పాట ఎకనామిక్స్ /స్టాటిస్టిక్స్/ కంప్యూటర్ సైన్స్ లాంటి సబ్జెక్టులతోనూ డిగ్రీ చేయొచ్చు. అప్పుడు కూడా మ్యాథ్స్‌లో పీజీ చేసే అవకాశం ఉంది. ఆసక్తి ఉంటే ఆ తరువాత మ్యాథ్స్‌లో పీహెచ్డీ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా సీఏ లాంటి కోర్సుల్లో ఆసక్తి ఉంటే ఇంటర్లో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ చదివి.. బీకాం చేస్తూ సీఏ కూడా చేసే వీలుంటుంది. ఇటీవల అమల్లోకి వచ్చిన నూతన జాతీయ విద్యావిధానం-2020 ద్వారా మ్యాథ్స్‌లో నాలుగు సంవత్సరాల ఆనర్స్ డిగ్రీని చేయొచ్చు. ఇంటర్ తరువాత చాలామంది ఇంజినీరింగ్ కోర్సులకు వెళ్ళడం వల్ల మ్యాథ్స్ సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉన్నవారి సంఖ్య తక్కువగా ఉంది. మీ సోదరికి మ్యాథ్స్ ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలని ఉంటే బీఎస్సీ/ బీటెక్ తరువాత బీఈడీ చేసి, ఆ రంగంలోనూ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఆర్. దుర్గాప్రసాద్
Ans:
కొంత ఆలస్యం అయినప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించి, ఆ విద్యార్హతలతో మెరుగైన ఉద్యోగాలు సంపాదించడం శ్రేయస్కరం. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాక, ఇంటర్మీడియట్ ఎంపీసీతో చదివి మంచి కళాశాలలో ఇంజినీరింగ్ చదివితే త్వరగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఇంటర్లో బైపీసీ తీసుకొని, నాలుగు సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్ చదివితే వైద్యశాలల్లో నర్సుగా స్థిరపడొచ్చు. ఇంటర్మీడియట్ తరువాత రెండు సంవత్సరాల డీ…ఈడీ చేసి బోధన రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. పదో తరగతి పూర్తి చేసిన తరువాత ఐ.టి.ఐ., పాలిటెక్నిక్ లాంటి కోర్సులున్నాయి. ఐ.టి.ఐ. పూర్తి చెయ్యడానికి రెండు సంవత్సరాలు, పాలిటెక్నిక్ పూర్తి చెయ్యడానికి మూడు సంవత్సరాలు పడుతుంది. త్వరగా ఉద్యోగం పొందాలనుకొంటే, పాలిటెక్నిక్ లేదా ఐ.టి.ఐ. ఎంచుకోవచ్చు. ఒకవేళ ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకొంటే ఇంటర్ లో మీరు తీసుకునే గ్రూపును బట్టి ఉద్యోగావకాశాలు ఆధారపడి ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎన్. హరిప్రసాద్
Ans:
పదో తరగతి చదివాక ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఎంట్రన్స్ పరీక్ష రాసి ప్రవేశం పొందినట్లయితే, ఇంటర్మీడియట్ ఉచితంగా, వసతిగృహంలో ఉండి చదివే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రత్యేకంగా వసతిగృహాలతో కూడిన జూనియర్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కూడా ఇంటర్ని ఉచితంగా చదవొచ్చు. హాస్టల్‌తో సంబంధం లేకుండా ఇంటర్‌ను ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నామమాత్రపు ఫీజుతో చదువుకోవచ్చు. పద్దెనిమిది సంవత్సరాలు నిండాక ఉద్యోగం కావాలనుకుంటే వొకేషనల్ కోర్సులతో ఇంటర్ చదవొచ్చు. ఉపాధి త్వరగా లభించే అవకాశాలుంటాయి. ఇంటర్మీడియట్ చదివేవారికి వారి సామాజిక, ఆర్థిక నేపథ్యాలను బట్టి ప్రభుత్వ స్టైపెండ్ వచ్చే అవకాశం ఉంది. పద్దెనిమిది ఏళ్లకే ఉద్యోగం కావాలనుకొంటే, పదో తరగతి పూర్తయ్యాక పాలిటెక్నిక్ కోర్సు చదవొచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: BALIVADA DURGA PRASAD
Ans:
ఏదైనా ఒక రసాయన మూలకాన్ని తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించుకుంటూ పోతే ఆ మూలకం తన రసాయన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండగలిగిన అతి చిన్న ముక్కని అణువు (atom) అని అని నిర్వచించవచ్చు. (smallest recognized division of a chemical element). అంటే అణువు అనేది రసాయన మూలకాలను నిర్వచించే పదార్థం యొక్క అతి చిన్న యూనిట్. ప్రతి ఘన, ద్రవ, వాయు, మరియు ప్లాస్మా అనేవి తటస్థ లేదా అయనీకరణ పొందిన అణువుల సమూహాలు. అణువులు చాలా చిన్నవి: అణువుల యొక్క పరిమాణాన్ని పికొమీటర్లలో (పికోమీటరు = 10−12 మీటరు) కొలుస్తారు.
పరమాణువు అంటే అణువు కంటే చిన్న కణం. పరమాణువు కణాలకు కొన్ని ఉదాహరణలు: ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు.
atom అనే ఇంగ్లిష్ మాటని తెలుగులో అణువు అంటారు. అప్పుడు అణువు కంటే చిన్న కణాలు పరమాణువులు అవుతాయి. atomని కొందరు తెలుగులో మాత్రం అణువు అని, కొందరు పరమాణువు అని వేరు వేరు పదాలు వాడడం వల్ల ఇబ్బంది వస్తోంది. దీనితో అణువు అంటే ఏమిటి? పరమాణువు అంటే ఏమిటి? అన్న సందేహం అందరికీ కలుగుతోంది.
మనం రోజూ వార్తా పత్రికలలో చూసే "అణు శక్తి కేంద్రం," "అణు బాంబు," అణ్వస్త్ర ప్రయోగం" వంటి పేర్లే వింటున్నాము కాని పరమాణు శక్తి, పరమాణు బాంబు, పరమాణు అస్త్రం వంటి పదబంధాలు వినడం లేదు కదా. కాబట్టి atom అన్న మాటకి అణువు అన్నదే సమానార్థకం.
అలాగని "పరమాణువు"ని వదిలేయాల్సిన పనిలేదు. ఎలక్ట్రాన్లను, ప్రోటాన్లను, నూట్రాన్లను కలగలిపి పరమాణువులు అనొచ్చు