• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చదవాలని అనిపించట్లేదా?

చదవాల్సినవి ఎన్నో ఉంటాయి... మూడ్‌ ఉండదు. పరీక్షలు ముంచుకొస్తున్నా చేత్తో పుస్తకం పట్టుకోవడానికి మూడ్‌ రాదు. ఓపక్క ఇంట్లోవాళ్లు కోప్పడుతున్నా.. సమయం వృథా అవుతున్నా.. అదేంటో మూడ్‌ మాత్రం రాను రానంటుంది. ఇలాంటివాళ్లలో మీరూ ఉన్నారా.. అయితే ఇది మీకోసమే. దీన్ని చదవడానికి కూడా మూడ్‌ లేదనొద్దు ప్లీజ్‌...

రోజూ మీరు లేచే సమయం కంటే అరగంట ముందే నిద్రలేచి చూడండి. ఆరుబయటకు వెళ్లి చల్లగాలిని ఆస్వాదిస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దాంతో హాయిగా చదువుకోవడానికీ మనసు సిద్ధమవుతుంది.  అంతే కాదు, మిగతా రోజులకంటే సమయం మిగలడంతో.. ఎప్పటినుంచో వాయిదా వేస్తోన్న అంశాలనూ ఉత్సాహంగా చదివేస్తారు. 

చదువుకునే ప్రదేశాన్ని వీలైనంత పరిశుభ్రంగా పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. పుస్తకాలూ, ఇతర వస్తువులూ చిందరవందరగా పడి ఉంటే మనసు కూడా గందరగోళంగా ఉంటుంది. చుట్టూ ఉండే పరిసరాలు చక్కగా ఉంటే చూడ్డానికే కాదు.. మనసుకూ హాయిగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో గంటకొద్దీ కూర్చుని చదివినా విసుగు అనిపించదు. 

మీ భావోద్వేగాలు, ఆలోచనలు, అభిప్రాయాలు... వీటిని అందరితోనూ పంచుకోలేరు. కాబట్టి డైరీలో వాటిని రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలా రాసుకునేవాటిలో మీకు కోపం, సంతోషం, బాధ కలిగించిన సంఘటనలు ఏమైనా ఉండొచ్చు. రోజూ నిర్ణీత సమయంలో డైరీ రాసుకోవడం అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. ఆ సమయానికల్లా మనసులోని అలజడులకు అక్షరరూపం కల్పించి అదనపు బరువును దించుకుని హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు కూడా.  

బాగా ఒత్తిడిగా, చిరాగ్గా అనిపించినప్పుడు చదవాల్సిన అంశాలను, పరీక్షలను గుర్తుచేసుకోకుండా ఆరుబయట కాసేపు నడిచి చూడండి. దీంతో మనసు కాస్త కుదుటపడి ఆ తర్వాత చదవాల్సిన అంశాల మీద దృష్టి పెట్టగలుగుతారు. 

ఆందోళనను తగ్గించి.. మూడ్‌ను ఉన్నపళంగా పెంచే అత్యుత్తమ సాధనం.. సంగీతం. కాసేపు మీకిష్టమైన పాటలను వినండి. పాడే అలవాటు ఉంటే మీరూ వంతపాడి చూడండి. క్షణాల్లో మూడ్‌ బాగై హాయిగా చదవడానికి కూర్చుంటారు. 

ఘాటైన మసాలాలతో చేసిన ఆహారాన్ని తినడం వల్ల కూడా మూడ్‌ మాటిమాటికీ మారిపోతుంటుంది. కోపం, అసహనం అకారణంగా పెరిగిపోతుంటాయి. అలా కాకూడదంటే సీజన్‌లో దొరికే పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. 

రోజును ఉల్లాసంగా, ఉత్సాహంగా మొదలుపెట్టాలంటే తగినంత నిద్ర అవసరం. శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర ఎంతగానో తోడ్పడుతుంది. నిర్ణీత సమయానికి నిద్రపోవడం, ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటు చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.


‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-05-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌