• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మార్పు అనివార్యం!

 

 

కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగంలో చేరినవారు ఏకకాలంలో ఎన్నో వైవిధ్యభరితమైన లక్ష్యాలపై పని చేయాల్సి ఉంటుంది. ఎదురయ్యే సమస్యను బట్టి ఆలోచనా తీరు, మానసిక స్థాయి సవరించుకోవలసి ఉంటుంది. ఇందుకు కొత్త ఆలోచనా పద్ధతులు, కొత్త వాతావరణంలో సులభంగా ఒదిగిపోయే లక్షణాలు అలవాటు చేసుకోవాలి. మార్పు సహజమనీ, అనివార్యమనీ గ్రహించి దాన్ని స్వాగతించగలగాలి!

 

ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడం, సమస్యలను విజయవంతంగా పరిష్కరించడం.. ఇవి కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేయాలనుకున్నవారికి అవసరమయ్యే లక్షణాల్లో కొన్ని. వస్తువులు ఉత్పత్తి చేసే సంస్థయినా, సేవలను అందించే సంస్థయినా నిర్దిష్ట విధులను సక్రమంగా నిర్వహించడం ఉద్యోగుల బాధ్యత.

 

యాజమాన్యాలు తమ సంస్థలకు అవసరమయ్యే ఉద్యోగుల ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల వ్యక్తిగత విలువలు, వృత్తి నెపుణ్యాలతో పాటు వారిలో అంతర్లీనంగా ఉన్న ఇతర లక్షణాలను పరిశీలిస్తారు. ఇటువంటివాటిలో వివిధ సందర్భాల్లో సులభంగా తనను తాను మార్చుకోగలగటం, కొత్త పని పద్ధతులను వేగంగా ఆకళించుకోవడం, కార్యాలయ వాతావరణంలో ఒదిగిపోయి పని చేయగలగటం ముఖ్యమైనవి. స్థూలంగా చెప్పాలంటే... మార్పును ఆహ్వానించగలిగిన ఆలోచనా సరళి ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.

 

అభ్యర్థుల స్వభావం ‘ఫ్లెక్సిబుల్‌’గా ఉండాలన్న నిబంధనను రిక్రూటర్లు తమకు కావలసినవారిని ఎంపిక చేసుకునే ప్రక్రియలో స్పష్టంగా విధించరు. అయితే ఎంపికలో వారు అవలంబించే ప్రక్రియలు.. అలాంటి లక్షణాలు, నైపుణ్యాలున్న అభ్యర్థులు ఎంపికయ్యేలా ఉంటాయి.

 

ఎంపికవ్వాలంటే ఏమేం ఉండాలి?

1. మార్పును అంగీకరించే లక్షణం: అభ్యర్థి విద్యార్థి దశ నుంచే మార్పును సమ్మతించే లక్షణాన్ని పెంపొందించుకోవాలి. కొత్త మార్పును అంగీకరించి, దాన్ని ఆశావహ దృక్పథంతో ఆహ్వానించే స్వభావం పెంచుకోవాలి. నూతన అంశాలను గ్రహించి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం అభ్యర్థి నుంచి రిక్రూటర్లు ఆశించే ముఖ్యమైన అంశాలలో ఒకటి. ఉద్యోగార్థులు ఒక దశ నుంచి మరో దశకు పరిణామం చెందేందుకు సహకరించే అంశాలను గుర్తించి, వాటిని నిర్వహించగలిగే సామర్థ్యం పెంపొందించుకోవాలి. ఉదా: సమయపాలన సామర్థ్యం. ఇతర దైనందిన వ్యాపార వ్యవహారాలతో పాటు సవాళ్ళను ఎదుర్కొనేందుకు తన సమయాన్ని ఉపయోగించుకునే తీరు.

2. వనరుల సమర్థ వినియోగం: మార్పులకు అలవాటు పడే క్రమంలో శారీరక, మానసిక ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి. సమతూకం పాటిస్తూ వాటిని నిర్వహించుకురాగలగాలి. వనరులను సమర్థంగా వినియోగించటం తెలియాలి. ఈ సామర్థ్యం వ్యక్తి నాయకత్వ లక్షణాలను సూచిస్తుంది. సంస్థలో ఏ స్థాయి ఉద్యోగికి అయినా ఇది వర్తిస్తుంది. నాయకత్వానికి స్థాయీ భేదం లేదు.

3. పరిధి దాటని భావ ప్రసరణ: భావ ప్రసారం (కమ్యూనికేషన్‌) ఒకానొక ముఖ్యమైన అంశం. ఈ నైపుణ్యాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించాలి. కమ్యూనికేషన్‌ ఎంతవరకు, ఏ మేరకు అవసరమో తెలుసుకోవడం గొప్ప సామర్థ్యం. ఇది అభ్యర్థి మానసిక పరిపక్వతను అనుసరించి ఉంటుంది. నిజానికి అవసరానికి మించిన సమాచార వితరణ సమస్యలకు దారి తీయవచ్చు. అందుకే తగిన పరిమితులపై పట్టు అవసరం.

4. ప్రయోగాలకు ప్రాధాన్యం: కొత్త అంశాలను ఆచరించేందుకు నమ్మకం ఏర్పరచుకోవడం, ఆయా అంశాల్లో చురుకైన పాత్ర పోషించడం ప్రధానం. నూతన ప్రయోగాలకు వెనుకాడని లక్షణం కూడా కీలకమైనది.

5. ప్రవర్తనలో మార్పులు: పని పద్ధతులు, పరిస్థితుల్లో వచ్చే మార్పులను ఆకళింపు చేసుకోవడానికి సిద్ధపడేలా ఉండాలి. ప్రవర్తనలో అందుకు అవసరమైన మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉండటం, అవసరం మేరకు పని సంస్కృతిని మార్చుకోగలగటం ముఖ్యమే.

 

అవకాశాలను అందిపుచ్చుకోవడం, ‘ఏ పనినైనా చేయగల’నన్న ధీమా, ఆశావహ దృక్పథం అవసరం.

మార్పును ఆహ్వానించగల మానసిక స్థితితో, మనో వైఖరితో ఉండాలి.

నిరంతరం చలన శీలంగా ఉంటూ ఆ తత్వాన్ని పనిలో, ప్రవర్తనలో ప్రదర్శించాలి.

 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రపంచస్థాయి బోధన

‣ రెండు పరీక్షలకూ ఉమ్మడి వ్యూహం!

‣ కేంద్ర కొలువులకు సిద్ధమా?

‣ రక్షణ రంగంలో ఉన్నత ఉద్యోగాలు!

Posted Date : 28-05-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌