• facebook
  • whatsapp
  • telegram

మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రపంచస్థాయి బోధన

హైదరాబాద్‌ ఐఎస్‌బీ ప్రత్యేకతలు, కోర్సుల వివరాలు

 

 

మేనేజ్‌మెంట్‌ విద్యలో మెరికల్లాంటి విద్యార్థులను సానబెట్టి ప్రపంచ సంస్థలకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) అందిస్తోంది. ఇక్కడ కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఆకర్షణీయ వేతనాలతో, వ్యాపార ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తూ, ఉన్నత స్థాయిలో, విశ్వవ్యాప్తంగా రాణిస్తున్నారు. మన దేశంలో మేటి మేనేజ్‌మెంట్‌ విద్యకు ఐఎస్‌బీ చిరునామాగా నిలుస్తోంది. అలాగే ప్రపంచంలోనూ అత్యుత్తమ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ ఆవిర్భవించి నేటితో ఇరవై వసంతాలు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎస్‌బీ ప్రత్యేకతలు, కోర్సుల వివరాలు, ప్రవేశం గురించి తెలుసుకుందాం...

 

ర్యాంకింగ్‌ సంస్థలు ఏవైనప్పటికీ మేనేజ్‌మెంట్‌ విభాగంలో ముందు శ్రేణిలో చోటు దక్కించుకోవడం ఐఎస్‌బీ ప్రత్యేకత. ఈ సంస్థలో బోధిస్తోన్న నిపుణుల నేపథ్యమే ఇందుకు కారణం. వీరంతా ప్రపంచంలో పేరున్న సంస్థల్లో కోర్సులు, పరిశోధనలు పూర్తిచేసుకుని, వివిధ రంగాలు, విభాగాల్లో సేవలు అందించి, ఇక్కడ బోధనలో స్థిరపడ్డారు. వీరంతా స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్లడం వల్లే తక్కువ వ్యవధిలోనే ఐఎస్‌బీ ప్రపంచస్థాయి సంస్థగా ఆవిర్భవించింది. గవర్నింగ్‌ బోర్డు, ఎగ్జిక్యూటివ్‌ బోర్డుల్లో అపార అనుభవం ఉన్న వ్యాపార దిగ్గజ సంస్థల చైర్మన్‌/ సీఈవోలు భాగమయ్యారు. వీరి దిశానిర్దేశంలో ఈ సంస్థ ప్రగతిపథంలో దూసుకుపోతోంది.

 

దేశంలో ప్రథమం...

తాజాగా ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ప్రకటించిన ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ కస్టమ్‌ ప్రోగ్రామ్స్‌ ర్యాంకుల్లో ఐఎస్‌బీ ప్రపంచంలో 32వ స్థానం పొందింది. ఆసియాలో నాలుగో అత్యుత్తమ సంస్థ ఇదే. భారత దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. భిన్న రంగాలు/విభాగాల అవసరాలకు సంబంధించి పలు రకాల కోర్సులు అందించడం ఐఎస్‌బీ ప్రత్యేకత. స్వల్ప కాల వ్యవధితో ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాంలను మిడిల్, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణుల కోసం ఈ సంస్థ అందిస్తోంది. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాంలు, వృత్తి నిపుణులకు పార్ట్‌ టైం పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాంలు, కుటుంబ వ్యాపారాలు నిర్వహిస్తోన్నవారి కోసం అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్, మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాంలు, పరిశోధనలో కొనసాగాలనుకునేవారికి ఫెలో ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎఫ్‌పీఎం), పోస్టు డాక్టోరల్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రాంలు, భిన్న రంగాలకు చెందిన నిపుణుల కోసం అడ్వాన్స్‌డ్‌ కోర్సులు, పలు స్వల్ప వ్యవధి తరగతులను ఈ సంస్థ అందిస్తోంది.

 

యంగ్‌ లీడర్స్‌ ప్రోగ్రాం (వైఎల్‌పీ)

తాజా గ్రాడ్యుయేట్లు, ప్రస్తుతం ఫైనల్‌/ ప్రిఫైనల్‌ కోర్సుల్లో ఉన్నవారు, పని అనుభవం లేనివారి కోసం ఇక్కడ యంగ్‌ లీడర్‌ ప్రోగ్రాం (పీజీపీ డిఫర్డ్‌) అందుబాటులో ఉంది. వీరి ఎంపిక 3 దశల్లో ఉంటుంది. మొదటి దశలో భాగంగా వ్యక్తిగత వివరాలు, నైపుణ్యాలు, ఆసక్తులు పేర్కొంటూ దరఖాస్తు చేసుకోవాలి. వ్యాసాన్నీ రాసి పంపాలి. ఇందులో అర్హత సాధించినవారు రెండో దశలో భాగంగా జీమ్యాట్‌/జీఆర్‌ఈ స్కోరు వివరాలతోపాటు మరో రెండు వ్యాసాలూ రాసి పంపాలి. ఈ దశలోనూ విజయవంతమైనవారిని స్టేజ్‌ 3లో ఇంటర్వ్యూ నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు.
ప్రవేశం: 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ముగిశాయి. 2023-24 విద్యా సంవత్సరానికి ఈ జూన్‌ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. 

 

ఎర్లీ ఎంట్రీ ఆప్షన్‌ (ఈఈఓ పీజీపీ డిఫర్డ్‌)

బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేసుకున్నవారు అర్హులు. జీమ్యాట్‌/జీఆర్‌ఈ స్కోరు తప్పనిసరి. రెండేళ్ల కంటే తక్కువ పని అనుభవం ఉన్నవారు ఈ విధానంలో సీటు పొందవచ్చు. ఇలా అవకాశం వచ్చినవారు రెండేళ్ల అనుభవంతో పీజీపీఎంలో కొనసాగవచ్చు.

 

పీజీపీఎం

ఐఎస్‌బీ హైదరాబాద్, మొహాలి క్యాంపస్‌ల్లో అందిస్తోన్న పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీపీఎం) విశ్వవ్యాప్త గుర్తింపు పొందింది. దీన్ని ఏడాది వ్యవధిలోనే పూర్తి చేసుకోవడం విశిష్టతగా చెప్పుకోవచ్చు. రెండు చోట్లా కలుపుకుని ఏటా సుమారు 930 మందికి ఇందులో చేరే అవకాశం కల్పిస్తున్నారు. వీరిలో మహిళలు సుమారు 38 శాతం మంది ఉండటం విశేషం. ఇంత పెద్దసంఖ్యలో మనదేశంలో మరే సంస్థా అవకాశం కల్పించడం లేదు.

 

పీజీపీ కోర్సులో మూడు విడతల్లో ప్రవేశాలుంటాయి. జీమ్యాట్‌ అయితే సుమారు 700+, జీఆర్‌ఈ అయితే 320+ స్కోర్‌ ఉంటే సీటు ఆశించవచ్చు. అయినప్పటికీ కోర్సులో ప్రవేశానికి ఈ స్కోర్లు మాత్రమే ప్రామాణికం కాదు. ఇతర అంశాలనూ పరిశీలిస్తారు. అందువల్ల ఇంతకంటే కొంచెం తక్కువ స్కోరు ఉన్నా సీటు లభించవచ్చు. ఈ కోర్సులో చేరినవారు అన్నీ కలుపుకుని (ట్యూషన్, పుస్తకాలు, వసతి, భోజనం, ఇతరాలు) సుమారు రూ.40 లక్షలు చెల్లించాలి. మెరిట్‌ విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడినవారికి స్కాలర్‌షిప్‌ అందుతుంది. మిగిలినవారికి రుణ సౌకర్యం కల్పిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా పలు కార్పొరేట్‌ సంస్థలు ఆర్థిక అవసరాలు ఉన్న ఐఎస్‌బీ విద్యార్థులకు తోడ్పాటు అందిస్తున్నాయి. ఇక్కడి పీజీపీ కోర్సు పూర్తిచేసుకున్నవారు భారత్‌లో పని చేసినట్లయితే సగటున రూ.27 లక్షల వార్షిక వేతనం పొందుతున్నారు. విదేశాల్లో అవకాశం వచ్చిన వారికి ఇంతకంటే పెద్ద మొత్తమే దక్కుతోంది. కొంత మంది రూ.కోటికి పైగా వేతనంతో ఉన్నతోద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. వీరిలో పలువురు అంకుర సంస్థల దిశగానూ అడుగులేస్తున్నారు.

 

అర్హత: డిగ్రీ పూర్తిచేసుకుని ఉండాలి. రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి. జీమ్యాట్‌ లేదా జీఆర్‌ఈ స్కోరు అవసరం. డిగ్రీని ఆంగ్ల మాధ్యమంలో చదవనివారైతే టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌/ పీటీఈ స్కోర్‌ ఉండాలి.

 

ఎంపిక విధానం: అకడమిక్‌ సామర్థ్యం పరిశీలిస్తారు. అంటే డిగ్రీ, యూజీ, పీజీ (చదివినట్లయితే) సర్టిఫికెట్‌ కోర్సులు (ఏవైనా చేసుంటే) వీటిలో ప్రతిభను గమనిస్తారు. జీమ్యాట్‌ / జీఆర్‌ఈ స్కోర్‌ చూస్తారు. పనిలో చూపిన ప్రతిభ, సామర్థ్యాలకు కొన్ని క్రెడిట్స్‌ ఉంటాయి. కెరియర్‌లో చూపిన ప్రగతి, నాయకత్వ లక్షణాలకు కొన్ని పాయింట్లు కేటాయిస్తారు. ఆల్‌రౌండ్‌ నైపుణ్యాలు, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీ, సామాజిక సేవ, ప్రత్యేకతలు, భిన్నత్వం, పని అనుభవం... వీటన్నింటికీ కొన్ని క్రెడిట్లు ఇస్తారు.

 

ప్రవేశాలు: 2022-23 విద్యా సంవత్సరానికి పీజీపీ ప్రవేశాలు పూర్తయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి జూన్‌ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. పీజీపీ కోర్సులో చేరడానికి రౌండ్‌-1 ప్రవేశాలకు అర్హతలు, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబరు 4లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి ట్యూషన్‌ ఫీజు మినహాయింపు ఆశించేవారు రౌండ్‌ 1 ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి.

 

పీజీపీఎం కోర్సుకు ఏఏసీఎస్‌బీ, ఈక్యూయూఐఎస్‌ గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద సంస్థలకు మాత్రమే ఈ తరహా గుర్తింపు ఉంది.

 

ఇతర కోర్సులు

పీజీ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ (పీజీపీ ప్రొ)

ఎవరికి: ఫ్యూచర్‌ లీడర్స్‌ కోసం. ఇది ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ సమాన స్థాయి కోర్సు. వారాంతాల్లో తరగతులు నిర్వహిస్తారు.

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు ఐదేళ్ల పని అనుభవం

వ్యవధి: 18 నెలలు

 

పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ (పీజీపీ మ్యాక్స్‌)

ఎవరి కోసం: 10 నుంచి 25 ఏళ్ల వృత్తి నైపుణ్యం ఉన్నవారికి

కోర్సు వ్యవధి: 15 నెలలు

కేంద్రాలు: హైదరాబాద్, మొహాలి

 

పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ ఫ్యామిలీ బిజినెస్‌ (పీజీపీ ఎంఫ్యాబ్‌)

ఎవరి కోసం: తర్వాత తరం ఫ్యామిలీ బిజినెస్‌ యజమానులకు.

అర్హత: కుటుంబం వ్యాపారంలో ఉండాలి. ఏదైనా డిగ్రీ పూర్తిచేయాలి. రెండు మూడేళ్ల పని అనుభవం ఉంటే మంచిది. అయితే తప్పనిసరి కాదు.

వ్యవధి: 15 నెలలు

కేంద్రాలు: హైదరాబాద్, మొహాలి.

 

అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌

బిజినెస్‌ ఎనలిటిక్స్, హెల్త్‌కేర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సప్లై చెయిన్‌ విభాగాల్లో ఈ సంస్థ అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాంలను అందిస్తోంది. వీటిని ఏడాది నుంచి 15 నెలల వ్యవధితో నడుపుతున్నారు. సంబంధిత విభాగాల్లో 2 నుంచి ఐదేళ్లకు పైగా అనుభవం ఉన్నవారు వీటికి అర్హులు. ఈ కోర్సులన్నీ హైదరాబాద్, మొహాలి క్యాంపస్‌ల్లో అందుబాటులో ఉన్నాయి.

 

ఫెలో ప్రోగ్రాంలు

డాక్టొరల్‌ స్టడీస్‌లో భాగంగా ఫెలో ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్, ఎగ్జిక్యూటివ్‌ ఫెలో ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు ఉన్నాయి. అలాగే ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఈ సంస్థ పలు కోర్సులు అందిస్తోంది. వీటిలో వ్యాపార సంస్థల్లోనివారు, ప్రభుత్వరంగ సంస్థలకు చెందినవారు చేరవచ్చు. ప్రత్యేక విభాగాల్లో ఆయా వ్యాపారాలకు అనుగుణంగా స్వల్ప వ్యవధితో ముగిసే కోర్సులనూ ఐఎస్‌బీ అందిస్తోంది.

 

వెబ్‌సైట్‌: https://www.isb.edu/en.html
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రెండు పరీక్షలకూ ఉమ్మడి వ్యూహం!

‣ కేంద్ర కొలువులకు సిద్ధమా?

‣ రక్షణ రంగంలో ఉన్నత ఉద్యోగాలు!

‣ ఇంటర్‌తోనే ఎదురులేని కెరియర్‌!

‣ డిజిటల్‌ గేమింగ్‌కు ఉజ్జ్వల భవిత

‣ గణితంలో గరిష్ఠ మార్కులు

‣ టెన్త్‌తో పోస్టల్‌ ఉద్యోగాలు

Posted Date: 28-05-2022


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌