• facebook
  • whatsapp
  • telegram

మేనేజ్‌మెంట్ సంస్థ‌ల్లో మేటి!

అంతర్జాతీయ ప్రమాణాలతో దూసుకెళ్తున్న ఐఎస్‌బీ

ప్రాంగణ నియామకాల్లో విద్యార్థులకు భారీ ప్యాకేజీలు

ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకుల్లో దేశంలో ప్రథమస్థానం

 

 

ఆహ్లాదకరమైన వాతావరణం.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యాబోధన.. విద్యార్థులకు అవసరమైన ఆధునిక హంగులతో సౌకర్యాలు.. ఉన్నత విద్యనభ్యసించడానికి క్యాంపస్‌లో ఇంతకంటే ఏం కావాలి? ఇలాంటి సదుపాయాలన్నీ హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) సంస్థ‌లో ఉన్నాయి. అందుకే మేనేజ్‌మెంట్ కోర్సులు అందించడంలో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన సంస్థగా ఇది దూసుకెళ్తోంది. ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ) గ్లోబల్ ఎంబీఏ ర్యాంకులను ఇస్తోంది. ఈ ఏడాది ఎఫ్టీ ప్రకటించిన జాబితాలో ఐఎస్‌బీ ప్రపంచంలో 23, ఆసియాలో 5, దేశంలో అగ్ర స్థానాల్లో నిలవడం విశేషం. ఇంతటి అత్యున్నత సంస్థలో ఎలాంటి కోర్సులు ఉంటాయి? అడ్మిషన్లు ఎలా నిర్వహిస్తారో వంటి అంశాలను అభ్యర్థులు తెలుసుకుంటే తమ భ‌విత‌కు తగిన విధంగా ప్ర‌ణాళిక రూపొందించుకోవ‌చ్చు.

 

ఏమిటీ ప్రత్యేకత?

ఉద్యోగానుభవం ఉన్న వారినే పీజీపీ కోర్సుల్లో చేర్చుకోవడం ఐఎస్‌బీ ప్రత్యేకత. దీంతో చెప్పింది వినడం, రాసుకోవడమే కాకుండా విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వం అలవడుతుంది. దేశంలోని వ్యాపార ప్రముఖులను భాగస్వాములను చేయటం, ప్రపంచస్థాయి మేనేజ్‌మెంట్ నిపుణులను తీసుకురావటం, ప్రస్తుత- భవిష్యత్తు వ్యాపార ముఖచిత్రంపై విద్యార్థులకు అవగాహన కల్పించటం వంటి ప్రయోగాలతో ఇతర మేనేజ్‌మెంట్ ‌విద్యా సంస్థలతో పోల్చితే భిన్నమైనదిగా ఐఎస్‌బీ రూపుదిద్దుకుంది. అదే సమయంలో ఆరోగ్యం-సంరక్షణ, ప్రభుత్వ విధానాలు, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, డేటా సైన్స్, ఫైనాన్స్, పరిశోధన.. వంటి విభాగాల్లో ఏర్పాటు చేసిన పరిశోధనా కేంద్రాల వల్ల ప్రత్యేక నైపుణ్యాలు సంతరించుకునే అవకాశం విద్యార్థులకు లభిస్తోంది. అధునాతన సౌకర్యాలు, డిజిటల్ తరగతులు, లైబ్రరీ మొదలైన సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా నాణ్యమైన విద్యను అందించేందుకు ఎంతో అనుభవం కలిగిన బోధనా సిబ్బంది ఉన్నారు. వీటన్నింటి కారణంగానే ఐఎస్‌బీ అంతర్జాతీయ స్థాయి బోధన ప్రమాణాలతో రాణిస్తూ మేటిగా ఎదుగుతోంది. ఆసియాలో ఎగ్జిక్యూటివ్ విద్యను అందించే అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ప్రశంసలు అందుకుంటుంది. ఐఎస్‌బీకి ‘ఐఎస్‌బీ అలుమ్నీ’ పెద్ద అండ. ఇందులో 12,000 మందికి పైగా పూర్వ విద్యార్థులు ఉన్నారు. సిలికాన్ వ్యాలీ నుంచి లండన్, దుబాయ్, సింగపూర్, హాంకాంగ్ ల్లో పనిచేస్తున్న ఎంతో మంది సీఎఫ్ఓలు, సీఎక్స్ఓలు, చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారులు ఐఎస్‌బీ పూర్వవిద్యార్థులే కావడం విశేషం.

 

అసోసియేషన్ ఆఫ్ ఎంబీఏ గుర్తింపు

ఎంబీఏ కోర్సులు అందించే విద్యాసంస్థలకు అసోసియేషన్ ఆఫ్ ఎంబీఏ (ఏఎంబీఏ) అంతర్జాతీయ గుర్తింపు ఇస్తుంది. అది అంత సులువుగా రాదు. ఏఎంబీఏ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఐఎస్‌బీ ఆ ప్రమాణాలను పాటించడం వల్లే ఈ గుర్తింపు పొందింది. ఏఎంబీఏ, ఈఎఫ్ఎండీ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ సిస్టమ్(ఈక్యూయూఐఎస్), అసోసియేషన్ టు అడ్వాన్స్ కాలేజియేట్ స్కూల్స్ ఆఫ్ బిజినెస్ (ఏఏసీఎస్బీ) నుంచి ప్రపంచంలోనే ‘ట్రిపుల్ క్రోన్’ గుర్తింపు సాధించిన వందో బిజినెస్ పాఠశాలగానూ నిలిచింది. ఐఎస్‌బీ క్యాంపస్ హైదరాబాద్‌తోపాటు మొహాలి(చండీగ‌ఢ్)లోనూ ఉంది. 

 

అందిస్తున్న కోర్సులు

ఈ సంస్థ ఏడాది నుంచి 18 నెలల వ్యవధితో 4 పీజీలు, 15 నెలల వ్యవధితో 8 అడ్వాన్స్డ్ మేనేజ్‌మెంట్ ‌కోర్సులు, 2 డాక్టొరల్ కోర్సులు అందిస్తోంది. రెండు రోజుల నుంచి రెండు వారాల్లో ముగిసే 27 ఓపెన్ మేనేజ్‌మెంట్ ‌ప్రోగ్రాములూ ఉన్నాయి. వర్కింగ్ ప్రొఫెషన్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, కుటుంబ వ్యాపారం నిర్వహిస్తోన్న వారి కోసం ఐఎస్‌బీ ప్రత్యేకంగా కోర్సులను నిర్వహిస్తోంది. బిజినెస్ ఎనలిటిక్స్, హెల్త్‌కేర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ ఆపరేషన్స్, పబ్లిక్ పాలసీ విభాగాల్లో అడ్వాన్స్ డ్ మేనేజ్‌మెంట్ ‌ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్స్ కోసం ఆన్‌లైన్ ఓపెన్ ప్రోగ్రామ్‌లు అందిస్తున్నారు. డాక్టొరల్ చదువులపై ఆసక్తి ఉన్నవారు ఫెలో ప్రోగ్రాం, ఎగ్జిక్యూటివ్ ఫెలో ప్రోగ్రామ్‌ల్లో చేరవచ్చు. ఇందులో కోర్సును బట్టి సుమారు రూ.40 లక్షల వరకు ఫీజు ఉంటుంది. 

 

పీజీపీకి భలే డిమాండ్

ఐఎస్‌బీ హైదరాబాద్ క్యాంపస్ 2001 ప్రారంభం కాగా.. ఇక్కడ అందిస్తోన్న పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్‌కోర్సు విశ్వవ్యాప్త గుర్తింపు పొందింది. మన దేశంలో ప్రథమశ్రేణి మేనేజ్‌మెంట్‌ విద్యా సంస్థ ఇదే. ప్రాంగ‌ణ నియామ‌కాల్లో ఐఎస్‌బీ టాప్ రేసులో దూసుకుపోతోంది. విద్యార్థుల సంఖ్య పరంగా చూసుకుంటే ఇక్కడి పీజీపీ కోర్సు ప్రపంచంలో అగ్ర‌శ్రేణిలో ఒకటి. ఈ కోర్సులో చేరుతున్న వారిలో మహిళలు 34 శాతం మంది ఉండడం విశేషం. ఇంత పెద్ద సంఖ్యలో మనదేశంలో మరే సంస్థా వీరికి అవకాశం కల్పించడం లేదు. పీజీపీ కోర్సులో రెండు విడతల్లో ప్రవేశాలు ఉంటాయి. ఒక్కో దఫా 50 శాతం సీట్లు కేటాయిస్తారు. ఈ కోర్సు వ్యవధి 12 నెలలు. దీన్ని హైదరాబాద్, మొహాలీ క్యాంపస్‌లో అందిస్తున్నారు. ఇందులో చేరడానికి కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. రెండు క్యాంపస్‌ల‌లోనూ కలిపి సుమారు 900 మంది విద్యార్థులకు అవకాశం ఉంటుంది. జీమ్యాట్/ జీఆర్ఈ స్కోరు ప్రామాణికం. జీమ్యాట్ అయితే 600, జీఆర్ఈ అయితే 311కు పైగా స్కోరు ఉంటే సీటు ఆశించవచ్చు. ఈ కోర్సులో చేరినవారు అన్నీ కలుపుకొని (ట్యూషన్, పుస్తకాలు, వసతి, భోజనం) సుమారు రూ.38 లక్షలకు పైగా చెల్లించాలి. మెరిట్ విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన వారికి స్కాలర్‌షిప్‌ అందుతుంది. మిగిలిన వారికి రుణ సౌకర్యం కల్పిస్తారు. 

 

రిక్రూట్ చేసుకునే సంస్థలు.. ప్యాకేజీలు

ఐఎస్‌బీలో మేనేజ్‌మెంట్ కోర్సులు చేసే విద్యార్థులకు మంచి డిమాండ్ ఉంది. పెద్ద సంస్థలు ప్రాంగణ నియామకాలు చేపట్టి భారీ ప్యాకేజీలతో ఇక్కడి విద్యార్థులను ఉద్యోగులుగా చేర్చుకుంటున్నాయి. కనీస ప్యాకేజీ ఏడాదికి రూ.50 లక్షల నుంచి మొదలవుతుంది. అప్పటికే వీరు పని చేసే సంస్థలు కూడా కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రమోషన్లతోపాటు వేతనాల పెంపును వర్తింపజేస్తున్నాయి. అందుకే ఐఎస్‌బీలో చేరే వారికి భారీ వేతన ప్యాకేజీలు అందడం ఖాయమనే మాట స్థిరపడిపోయింది. ఐటీసీ లిమిటెడ్, సిరియోన్ ల్యాబ్స్, పీడబ్ల్యూసీ డియోక్, ఇండీజెన్ఇంక్, వాటర్ ఫీల్డ్ అడ్వైజర్స్, ల్యాండ్ మార్క్ గ్రూప్, ఆంబిట్, పోస్ట్మన్, ఏబీ ఇన్ బెవ్, మీడియా.నెట్ తదితర సంస్థలు ఇక్క‌డి విద్యార్థుల‌కు భారీ ప్యాకేజీలు ఆఫ‌ర్ చేసి ఉద్యోగావ‌కాశాలు క‌ల్పిస్తున్నాయి. ఉద్యోగ అనుభవం ఉన్న వారినే ఈ సంస్థ కోర్సుల్లో చేర్పించుకుని మెలకువలు నేర్పిస్తోంది. కాబట్టి ఇక్కడి విద్యార్థులను చేర్చుకోవడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. 

 

 

ఎంపిక విధానం 

అకడమిక్ సామర్థ్యం పరిశీలిస్తారు. అంటే డిగ్రీలో, పీజీ, సర్టిఫికెట్స్ కోర్సుల్లో (చదివినట్లయితే) ప్రతిభను గమనిస్తారు. జీమ్యాట్/ జీఆర్ఈ స్కోరు చూస్తారు. పనిలో ప్రదర్శించిన ప్రతిభ, సామర్థ్యాలకు కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. కెరియర్లో చూపిన ప్రగతి, నాయకత్వ లక్షణాలకు ఇంకొన్ని పాయింట్లు కేటాయిస్తారు. ఆల్ రౌండ్  నైపుణ్యాలు, ఎక్స్ ట్రా కరిక్యులర్ ఆక్టివిటీ, సామాజిక సేవ, ప్రత్యేకతలు, వైవిధ్యం, పని అనుభవం.. వీటన్నింటికీ కొన్ని క్రెడిట్లు ఇస్తారు. 

 

వారి కోసం.. అర్లీ ఎంట్రీ ఆప్షన్

రెండేళ్ల కంటే తక్కువ పని అనుభవం ఉన్న వారికోసం అర్లీ ఎంట్రీ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ విధానంలో సీటు పొందినవారు రెండేళ్ల అనుభవం అనంతరం కోర్సులో చేరే అవకాశం లభిస్తుంది. అలాగే ఆఖరు సంవత్సరం డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థుల కోసం యంగ్ లీడర్‌షిప్ ప్రోగ్రాం నడుపుతున్నారు. వీరు జీఆర్ఈ/జీమ్యాట్ స్కోరుతో ఐఎస్‌బీలో ముందస్తు ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధానంలో ఎంపికైనవారు కోర్సు పూర్తయిన తర్వాత సంస్థలో చేరడానికి అవకాశం కల్పిస్తారు.

 

కొనసాగుతున్న ప్రవేశాలు..

ఐఎస్‌బీలో ప్రవేశాలు మార్చి చివరి వరకు కొనసాగుతాయి. కోర్సును బట్టి ఈ తేదీలు ఖరారు చేశారు. 2021 విద్యా సంవత్సరంలో పీజీపీ కోర్సులో చేరడానికి ప్ర‌వేశాల‌కు గడువు ఉంది. అర్హతలు, ఆసక్తి ఉన్నవారు మార్చి 10లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మేనేజ్‌మెంట్ ఫ‌ర్‌వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోర్సు రౌండ్ ప్ర‌వేశాలకు మార్చి 20 తుది గడువు. అలాగే మేనేజ్‌మెంట్ ఫ‌ర్ ‌సీనియర్ ఎగ్జిక్యూటివ్, మేనేజ్‌మెంట్ ఫ్యామిలీ బిజినెస్ కోర్సుల్లో చేరడానికి రౌండ్-2 ప్రవేశాలకు మార్చి 21 తుది గడువుగా నిర్ణయించారు. 

 

ఇవీ అర్హతలు

2021 విద్యాసంవత్సరంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఏదైనా కోర్సులో చేరాలంటే విద్యార్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. జీమ్యాట్/ జీఆర్ఈ స్కోరు తప్పనిసరి. మార్చి 31, 2021 నాటికి కనీసం రెండేళ్ల పూర్తికాల పని అనుభవం అవసరం. డిగ్రీని ఆంగ్ల మాధ్యమంలో చదవనివారైతే టోఫెల్/ ఐఈఎల్టీఎస్/ పీటీఈ స్కోర్ కలిగి ఉండాలి. 

 

వెబ్‌సైట్: https://www.isb.edu/en.html
 

Posted Date: 05-03-2021


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌