• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తీరదళంలో నావిక్‌....యాంత్రిక్‌!

ఇండియన్‌ కోస్ట్‌గార్డు ఉద్యోగాలకు ప్రకటన విడుదల

పదో తరగతి, ఇంటర్, డిప్లొమా విద్యార్హతలతో భారతీయ తీరదళంలో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్, నావిక్‌ జనరల్‌ డ్యూటీ, యాంత్రిక్‌ పోస్టుల భర్తీకి ఇండియన్‌ కోస్టు గార్డు ప్రకటన వెలువరించింది. ఈ మూడు విభాగాల్లోనూ కలిపి 322 ఖాళీలున్నాయి. రాత, శరీరదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. పరీక్షలో నెగ్గినవారికి శిక్షణ అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు. చిన్న వయసులోనే చెప్పుకోదగ్గ వేతనంతో కెరియర్‌లో స్థిరపడాలనుకునేవారికి ఈ పోస్టులు మంచి అవకాశం! 

ఇండియన్‌ కోస్టు గార్డు ఏడాదికి రెండుసార్లు నావిక్, యాంత్రిక్‌ పోస్టులకు ప్రకటనలు విడుదల చేస్తోంది. తాజా ప్రకటనలో నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచ్‌లో 35 ఖాళీలు ఉన్నాయి. వీటికి పదో తరగతి విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు. అక్టోబరు 1, 2000 - సెప్టెంబరు 30, 2004 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

నావిక్‌ జనరల్‌ డ్యూటీ విభాగంలో 260 ఖాళీలు ఉన్నాయి. వీటికి మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు. వీరు ఆగస్టు 1, 2000 - జులై 31, 2004లోగా జన్మించి ఉండాలి. 

యాంత్రిక్‌ పోస్టులకు ఎలక్ట్రికల్‌ / మెకానికల్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్‌ (రేడియో/పవర్‌) విభాగాల్లో ఎందులోనైనా మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసుకున్నవారు అర్హులు. వీరు ఆగస్టు 1, 2000 - జులై 31, 2004లోగా జన్మించి ఉండాలి. మెకానికల్‌లో 13, ఎలక్ట్రికల్‌ 9, ఎలక్ట్రానిక్స్‌ 5 ఖాళీలు ఉన్నాయి.   

అన్ని పోస్టుల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంది. ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అర్హులు. నాలుగు దశల్లో నిర్వహించే పరీక్షలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ఆన్‌లైన్‌ పరీక్షలు 

అన్ని పోస్టులకూ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉంటాయి. వీటిలో సరైన సమాధానం గుర్తించాలి. రుణాత్మక మార్కులు లేవు. మొత్తం 5 సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఏ పోస్టుకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ సెక్షన్‌-1 అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. ఈ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. 60 మార్కులకు 60 ప్రశ్నలు వస్తాయి. ఇందులో మ్యాథ్స్‌ 20, సైన్స్‌ 10, ఇంగ్లిష్‌ 15, రీజనింగ్‌ 10, జీకే 5 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. 

నావిక్‌ డొమిస్టిక్‌ బ్రాంచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు ఈ ఒక్క సెక్షన్‌ రాసుకుంటే సరిపోతుంది. నావిక్‌ జనరల్‌ డ్యూటీ పోస్టులవాళ్లు సెక్షన్‌ 1తోపాటు అదనంగా సెక్షన్‌ 2 రాయాలి. ఈ పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. 50 ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 30 నిమిషాలు. ఇంటర్‌ సిలబస్‌ నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్‌ ఒక్కో సబ్జెక్టులో 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. యాంత్రిక్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు సెక్షన్‌ 1తోపాటు సెక్షన్‌ 3, 4, 5ల్లో తాము చదివిన బ్రాంచీ ప్రకారం ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్‌ విభాగంవాళ్లు సెక్షన్‌ 3, ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచీవాళ్లు సెక్షన్‌ 4, మెకానికల్‌ డిప్లొమా విద్యార్థులు సెక్షన్‌ 5 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో సెక్షన్‌ 50 మార్కులకు చొప్పున ఉంటుంది. 50 ప్రశ్నలు వస్తాయి. వీటికి వ్యవధి 30 నిమిషాలు. సంబంధిత బ్రాంచీలవారీ డిప్లొమా సిలబస్‌ నుంచే ఈ ప్రశ్నలు అడుగుతారు. 

అభ్యర్థులు ఆయా సెక్షన్లవారీ కనీస మార్కులు సాధించడం తప్పనిసరి. జనరల్‌ విభాగానికి చెందినవారైతే సెక్షన్‌ 1లో 30, మిగిలిన సెక్షన్లలో 20 చొప్పున మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీలు సెక్షన్‌ 1లో 27, మిగిలిన సెక్షన్లలో 17 మార్కులు చొప్పున పొందితే అర్హులుగా పరిగణిస్తారు. ఇలా అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఖాళీలకు అనుగుణంగా స్టేజ్‌ 2కు ఎంపిక చేస్తారు.    

స్టేజ్‌ 2 పరీక్షలు ఒకటి లేదా రెండు రోజుల వ్యవధితో నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. మార్కులు ఉండవు. ఇందులో భాగంగా 7 నిమిషాల్లో 1.6 కి.మీ.దూరం పరుగెత్తాలి. 20 గుంజీలు, 10 పుష్‌అప్స్‌ తీయగలగాలి. అభ్యర్థి ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలత వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. తప్పనిసరి. 

స్టేజ్‌ 3 ఎంపిక స్టేజ్‌ 1, స్టేజ్‌ 2లో చూపిన ప్రతిభ ప్రకారం ఉంటుంది. స్టేజ్‌ 2లో అర్హత సాధించినవారిని స్టేజ్‌ 1 మెరిట్‌తో స్టేజ్‌ 3 కి ఎంపిక చేస్తారు. వీరికి ఐఎన్‌ఎస్‌ చిల్కలో మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హులు తర్వాతి దశకు చేరతారు. స్టేజ్‌ 4లో భాగంగా అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలు పరిశీలించి అన్నీ సరిగా ఉంటే శిక్షణకు తీసుకుంటారు.  

శిక్షణ

నావిక్‌ జనరల్‌ డ్యూటీ, యాంత్రిక్‌ విభాగాలవారికి ప్రాథమిక శిక్షణ ఆగస్టు, నావిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచీలో చేరినవారికి అక్టోబరు నుంచి   ఐఎన్‌ఎస్‌ చిల్కలో ప్రారంభమవుతుంది. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. యాంత్రిక్‌ ఉద్యోగాలకు ఎంపికైనవారికి రూ.29,200 మూలవేతనం చెల్లిస్తారు. దీంతోపాటు రూ.6200 యాంత్రిక్‌ పే ఉంటుంది. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే వీరు సుమారు రూ.50,000 వరకు వేతనంగా పొందవచ్చు. పదోన్నతుల ద్వారా అసిస్టెంట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ హోదా వరకు చేరుకోవచ్చు. నావిక్‌ పోస్టుల్లో చేరినవారికి రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. అన్ని ప్రోత్సాహకాలూ కలుపుకుని వీరు రూ.35 వేలకుపైగా వేతన రూపంలో పొందవచ్చు. భవిష్యత్తులో ప్రధానాధికారి హోదా వరకు చేరుకోవచ్చు. నేవిక్‌ డొమెస్టిక్‌ బ్రాంచీకి ఎంపికైనవారు కుక్, స్టివార్డ్‌ సేవలు అందిస్తారు. నేవిక్‌ జీడీ విభాగంలో చేరినవారు వారికి కేటాయించిన ట్రేడుల్లో విధులు నిర్వర్తించాలి. యాంత్రిక్‌ ఉద్యోగులు షిప్‌ నిర్వహణ, మరమ్మతులు వారి డిప్లొమా బ్రాంచీల ప్రకారం చూసుకుంటారు.     

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 4 ఉదయం 11 నుంచి స్వీకరిస్తారు.

చివరి తేది: జనవరి 14 సాయంత్రం 5 వరకు. 

ఫీజు: రూ.250. ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు. 

పరీక్షలు: స్టేజ్‌ 1 మార్చిలో, స్జేజ్‌ 2 ఏప్రిల్‌/మేలో, స్టేజ్‌ 3 ఆగస్టు/అక్టోబరులో నిర్వహిస్తారు.

స్టేజ్‌ 1 పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్‌. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కాకినాడ.

వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.cdac.in/
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కొత్త సిలబస్‌తో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ - 2023

‣ ఫ్యాషన్‌ ప్రపంచంలోకి.. స్వాగతం!

‣ ఇంజినీరింగ్‌తో పాటు.. ఇవి నేర్చుకోవాలి!

‣ ప్రిపరేషన్‌కు కొన్ని పద్ధతులు!

Posted Date : 22-12-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌