• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Engineering posts: ఇంజినీరింగ్‌ పోస్టులకు ఒకే పరీక్ష!

5 శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి అధికారుల ప్రతిపాదన
సూత్రప్రాయంగా అంగీకరించిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని అన్ని సివిల్‌ ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి ఒకే పరీక్ష నిర్వహించాలని సర్కార్‌ యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 80,039 ఉద్యోగాల భర్తీకి నిర్ణయించిన విషయం తెలిసిందే. నీటిపారుదల, రహదారులు-భవనాలు, పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటిపారుదల, ప్రజారోగ్య శాఖల్లోని ఇంజినీరింగ్‌ పోస్టులు వేల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి సంబంధించి శాఖల వారీగా అనుమతినిస్తూ ఆర్థికశాఖ నుంచి ఎప్పుడు ఉత్తర్వులు వెలువడతాయోనని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. అయిదు శాఖల్లోని ఇంజినీర్ల పోస్టుల భర్తీకి వేర్వేరుగా పరీక్షలు నిర్వహించటం వల్ల సమయం వృథాతోపాటు కొన్ని శాఖల్లో పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో అయిదు శాఖలకూ కలిపి ఒకే పరీక్ష నిర్వహించాలన్న అంశంపై మేధోమథనం చేస్తున్నారు. తద్వారా ఇటు ప్రభుత్వానికి, అటు దరఖాస్తుదారులకు ఉపయుక్తంగా ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. ఉద్యోగాల భర్తీ అంశంపై ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ వివిధ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్‌ పోస్టులపై సమీక్షించారు. ఒకే పరీక్ష నిర్వహించాలన్న అధికారుల ప్రతిపాదనకు సీఎస్‌ సూత్రప్రాయంగా సుముఖత వ్యక్తం చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు మార్చి 19న ‘ఈనాడు’తో చెప్పారు. అయిదు శాఖల్లో కలిపి సుమారు రెండు వేల ఇంజినీరింగ్‌ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అధిక శాతం నీటిపారుదల, రహదారులు-భవనాల శాఖల్లో ఉంటాయని అంచనా.

శాఖ కేటాయింపులో అభ్యర్థులకే వెసులుబాటు!

ఏ శాఖలో ఎన్ని పోస్టులను భర్తీ చేయనుందో ప్రభుత్వం వెల్లడించింది. ప్రధానంగా ఇంజినీరింగ్‌ విభాగాల్లో సాంకేతిక, పరిపాలన విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. పోస్టుల సంఖ్యను ఖరారు చేయాలని సీఎస్‌ ఆదేశించడంతో.. ఖాళీగా ఉన్నవెన్ని? నియామకాలు చేపట్టాల్సినవెన్నో గుర్తించే పనిలో ఆయా శాఖల అధికారులున్నారు. రాత, మౌఖిక పరీక్షల్లో మెరిట్‌ ఆధారంగా శాఖ కేటాయింపు అంశంపై స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని నిర్ణయించారు. మెరిట్‌ ఆధారంగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారానే శాఖను కేటాయించడం ఒక పద్ధతి కాగా, అభ్యర్థులకే వెసులుబాటు ఇవ్వాలన్నది మరో ప్రతిపాదన. ఏ శాఖలో చేరాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ అభ్యర్థులకే ఇవ్వటం మంచిదన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. పబ్లిక్‌ సర్వీసు కమిషనే ప్రాధాన్యాలను ఖరారు చేస్తే ఎదురయ్యే సమస్యలపై అధికారులు అధ్యయనం చేయనున్నారు. ఆర్థికశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడేలోగా ఒకే పరీక్ష నిర్వహణలో సాధ్యాసాధ్యాలు, విధివిధానాలను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఆ తరవాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ముందడుగు వేయాలని అధికారులు యోచిస్తున్నారు.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రిపరేషన్‌కు కొన్ని పద్ధతులు!

‣ ఏ సంవత్సరంలో ఏం చేయాలి?

‣ ఎన్‌హెచ్ఎం, తెలంగాణలో 92 పోస్టులు

‣ పది, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-03-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌