• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఏ సంవత్సరంలో ఏం చేయాలి?

ఇంజినీరింగ్‌ - నాలుగేళ్ల ప్రణాళిక

 

 

బీటెక్‌ చేస్తున్నప్పుడే ఆన్‌లైన్‌లో లభించే మూక్స్‌ కోర్సుల్లో కొన్ని సర్టిఫికెట్‌లను సంపాదించడం మంచిది ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ నాలుగేళ్ల వ్యవధిని గరిష్ఠస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఏ ఏడాది ఏం చేయాలి, ఏవి పాటించాలన్న దానిపై స్పష్టమైన అవగాహన అవసరం. అందుకు తోడ్పడే కథనం ఇది! 

 

1వ సంవత్సరం

ఇంటర్మీడియట్‌లో ఉన్న భౌతిక, గణిత, రసాయన శాస్త్రాలు మళ్లీ చదివినా, వాటిని ఇంజినీరింగ్‌ విద్యకు అనుకూలంగా మలుచుకోవాలి. ఇవి ముందుగానే చదివి ఉండటం వల్ల కొంత అదనపు సమయం లభ్యమవుతుంది. ఈ సమయాన్ని ఆంగ్లభాష, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీలపై కేటాయించి దృష్టి పెట్టాలి. వీటి వల్ల భవిష్యత్తులో ఉద్యోగావకాశాలకూ, పై చదువులకూ ఎంతో మేలవుతుంది. అన్ని బ్రాంచిలవారూ పైతాన్, సి లాంగ్వేజ్, డేటా స్ట్రక్చర్‌లో కొంత అదనపు ప్రావీణం పొందడం పరిశ్రమల అవసరాలు తీర్చడానికి ఎంతైనా అవసరం. సమస్యను అర్థం చేసుకోవడం, దానికి పరిష్కార మార్గం కనుక్కోవడం, ప్రోగ్రామ్‌ రాయడం అంటే సంక్షిప్తంగా ‘కాంపిటేటివ్‌ కోడింగ్‌’ ఎంతైనా అవసరం. ఆంగ్ల భాషపై పట్టు సాధించడానికి రోజువారీ ఆంగ్ల దినపత్రికలు చదవడం, వీలైనంత వరకు తోటివారితో ఆంగ్లంలో సంభాషించడం, వ్యాకరణంపై కొంత పట్టు సాధించడం, బ్రిటిష్‌ ఇంగ్లిష్‌ కౌన్సిల్‌ ద్వారా సర్టిఫైడ్‌ కోర్సులు చేయడం ఎంతైనా ఉపయోగం.

 

2వ సంవత్సరం 

విద్యార్థి ఎంచుకున్న బ్రాంచీకి సంబంధించిన ప్రధాన సబ్జెక్టులు రెండో సంవత్సరంలో మొదలవుతాయి. వాటికి సంబంధించిన ప్రయోగాలు కూడా ఉంటాయి. వీటిపై ఎంతైనా శ్రద్ధ అవసరం. దీని కోసం సీనియర్ల, అధ్యాపకుల మార్గదర్శనం, సారూప్య అభిరుచి ఉన్న సహ విద్యార్థుల సహకారం తీసుకోవాలి. బ్రాంచీకి సంబంధించిన టెక్నికల్‌ కార్యక్రమాల్లోనూ, పేపర్‌ ప్రెజంటేషన్‌ పోటీలలోనూ పాల్గొంటుండాలి. మొదటి సంవత్సరంలో పునాది చేసుకున్న కాంపిటేటివ్‌ కోడింగ్‌ లేదా బ్రాంచీకి సంబంధించిన మరో టెక్నాలజీకి కొనసాగింపు చేయాలి. మూడో సంవత్సరంలో అవకాశం ఉంటే ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్‌మెంట్స్, వివిధ పోటీ పరీక్షలకు ఇప్పుడు పునాది వేసుకోవాలి.

 

3వ సంవత్సరం

ప్రముఖ కంపెనీలు ఉద్యోగ నియామకాలు ఎలా చేసుకుంటాయనే విషయం తెలుసుకుని వాటి నమూనా ప్రశ్నలూ, విషయ సేకరణా చేసుకోవాలి. దీనికి కళాశాలలోని ప్లేస్‌మెంట్‌ విభాగం సహాయం తీసుకుంటే మంచిది. అలాగే కళాశాలలో నిర్వహించే వివిధ అవగాహన సదస్సుల్లో పాల్గొనాలి. సమగ్ర అవగాహనకు సమాచార సేకరణే మూలస్తంభం. 

మూడో సంవత్సంలో బీటెక్‌ సబ్జెక్టులతోపాటు ఉద్యోగ ప్రయత్నాలకూ, పై చదువుల ప్రణాళికకూ ప్రాముఖ్యం ఇస్తూ ముందుకు సాగాలి. ఇంటర్న్‌షిప్‌ ఇచ్చే సంస్థలకు కళాశాల ద్వారాగానీ, లేదా సొంతంగాగానీ దరఖాస్తు చేసుకుని ఇంటర్న్‌షిప్‌ చేస్తే ఆ అనుభం చివరి సంవత్సరంలో చాలా ఉపయోగం. కొన్ని సంస్థలు ఉద్యోగంతో లంకె పెట్టి మూడో సంవత్సరంలో ఇంటర్న్‌షిప్, నాలుగో సంవత్సరంలో ప్రాజెక్టుకి అవకాశం కల్పిస్తాయి. ఇలాంటి వాటిలో సిస్కో, ఇన్ఫోసిస్‌ చెప్పుకోదగినవి. అలాగే మైక్రోసాఫ్ట్, గూగుల్‌ లాంటి సంస్థలు ఇంటర్న్‌షిప్‌లకు అవకాశం ఇస్తాయి. అడోబ్‌ లాంటి సంస్థలైతే 2-3 సంవత్సరాల్లో ఉన్న విద్యార్థులకు కూడా ఇంటర్న్‌షిప్‌ అవకాశం ప్రతిభా పరీక్ష ప్రాతిపదికన కల్పిస్తాయి. మూడో సంవత్సరంలో మినీ ప్రాజెక్ట్‌ ఉంటుంది. ఈ మినీ ప్రాజెక్ట్‌ ఇంటర్న్‌షిప్‌ ద్వారా అయితే బాగుంటుంది. విద్యార్థి మూడో సంవత్సరంలోనే ఇన్ఫీటీక్యూ అనే జాతీయ స్థాయి పరీక్ష ద్వారా ఇన్ఫోసిస్‌; కోడ్‌వీటా, నింజా అనే పరీక్షల ద్వారా టీసీఎస్‌ సంస్థ ప్రతిభా పరీక్షను నిర్వహించి ఉద్యోగ నియామకాలకు అవకాశం ఇస్తాయి. వీటన్నింటికీ అన్ని బ్రాంచీలవారు అర్హులు. ప్రణాళికాబద్ధంగా వీటికి సిద్ధంకావచ్చు. భవిష్యత్తు లక్ష్యానికి కావాల్సిన బలాబలాలు అన్నీ మూడు సంవత్సరాలలోనే సమకూర్చుకోవాలి. ఎందుకంటే నాలుగో సంవత్సరం పూర్తిగా పోటీ పరీక్షలతోనూ, ప్రాజెక్ట్‌తోనూ, ఫినిషింగ్‌ స్కూల్‌ (అంటే మూడు సంవత్సరాల్లో నేర్చుకున్న నైపుణ్యాలకు తుది మెరుగులు)తో బిజీగా ఉంటుంది.

 

4వ సంవత్సరం

మొదటి మూడు సంవత్సరాలు ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటే, బ్యాక్‌లాగ్స్‌ లేకుంటే బీటెక్‌ ఆఖరి సంవత్సరం నల్లేరు మీద బండి నడకే అవుతుంది. ఆడుతూ పాడుతూ మిగిలిన ప్రాజెక్ట్‌ పనులు చేసుకోవచ్చు. కళాశాల సహకారంతో ఇంటర్న్‌శాల లాంటి సంస్థల్లో రిజిస్టర్‌ చేసుకోవాలి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి అనుమతి పొందిన ఈ సంస్థ విద్మార్థులకు పారితోషికంతో కూడిన ఇంటర్న్‌షిప్‌లకు అవకాశం కల్పిస్తుంది. ఇదేకాలంలో వివిధ సంస్థలు ప్రాంగణ, ప్రాంగణేతర డ్రైవ్‌లు నిర్వహిస్తుంటాయి. వీటిలో పాల్గొని ఉద్యోగం తెచ్చుకోవడం నాలుగో సంవత్సరం లక్ష్యంగా ఉండాలి. అలాగే పై చదువులకు వెళ్లాలనుకునేవారు విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవడం, అధ్యాపకుల సిఫార్సు పత్రాలు తెచ్చుకోవడం లాంటి పనులకు సమయం కేటాయించాలి. 

 

కనీస అటెండెన్స్‌

తరగతులకు క్రమం తప్పకుండా హాజరయితే 70 శాతం మార్కులు రావడం చాలా తేలిక. బ్యాక్‌లాగ్స్‌ ఉన్న విద్యార్థులను పరిశీలిస్తే వారిలో ఎక్కువ భాగం క్రమశిక్షణ లోపం వల్ల తరగతులకు సరిగా హాజరుకానివారే ఉంటారు. 

 

స్టడీ మెటీరియల్‌

అధ్యాపకులు చెప్పే విషయాలను అనుసరిస్తే చాలావరకు మంచి మార్కులు వస్తాయి. తరగతి నోట్స్‌ అర్థం చేసుకున్న తర్వాత ఒక మంచి పాఠ్యపుస్తకాన్ని పాఠ్యాంశాలకు అనుగుణంగా ఓసారి చదివితే సబ్జెక్టు మీద పట్టు వస్తుంది. అంతేగానీ పరీక్షకు ఒకరోజు ముందు ‘ఆల్‌ ఇన్‌ వన్‌’ పుస్తకం చదవడం భవిష్యత్తుకు మంచిది కాదు. 

కొన్ని కంపెనీలు మొదటి సంవత్సరంలోనే ఇంటర్న్‌షిప్‌లకు అవకాశాలు ఇస్తాయి. సర్టిఫికేషన్స్‌ కూడా దొరుకుతాయి. వీటివల్ల ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయి. 

 

ట్రెండింగ్‌ కోర్సుల్లో సర్టిఫికేషన్స్‌

బహుళ ప్రాచుర్యం పొందిన మెషిన్‌ లర్నింగ్, డీప్‌ లర్నింగ్, బ్లాక్‌చైన్, సైబర్‌ సెక్యూరిటీ, ఐవోటీ, రోబోటిక్స్‌ లాంటి రంగాల్లో ప్రామాణిక సంస్థల నుంచి సర్టిఫికేషన్‌ చేస్తే మేలు. 

బీటెక్‌ చేస్తున్నప్పుడే ఆన్‌లైన్‌లో లభించే మూక్స్‌ కోర్సుల్లో కొన్ని సర్టిఫికెట్‌లను సంపాదించడం మంచిది. ఐఐటీల ద్వారా అందిస్తోన్న ఎన్‌పీటీఈఎల్‌ కోర్సులు, కోర్స్‌ఎరా, యుడెమి, సింపుల్‌లర్న్‌ల సర్టిఫికేషన్‌లకు ప్రామాణికత ఉంది. ప్రస్తుతం గూగుల్, మైక్రోసాఫ్ట్‌ లాంటి కంపెనీలు కూడా ఉచితంగా టెక్నాలజీల్లో శిక్షణ, సర్టిఫికేషన్స్‌ అందిస్తున్నాయి. 

ఐఐటీ విద్యార్థులు ప్రతి సెమిస్టర్‌లో ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్‌ చేస్తారు. అలా కాకపోయినా సంవత్సరానికి కనీసం ఒకటైనా చేయగలగాలి. వేసవి సెలవులను కళాశాలలో ఉన్న సమయంలో చేయలేని కోర్సులు, ప్రాజెక్టులు చేయడానికి సద్వినియోగం చేసుకోవాలి. 

మంచి స్నేహితుల సహాయంతో చదువుతోపాటు ఆనందంగా ఎలా జీవించాలనేదీ తెలుసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, శారీరకంగా దృఢంగా ఉండటం తప్పనిసరి. తల్లిదండ్రులతో కొంత సమయం వెచ్చించడం, సామాజిక జీవితం అంటే ఏంటో తెలుసుకోవడం అవసరమే. కనీసం ఒక హాబీని ఎంచుకుని దాన్ని అభివృద్ధి చేసుకుంటే.. విద్యార్థి మానసిక ఉల్లాసానికి ఎంతగానో తోడ్పడుతుంది. 

 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇలా మొదలు పెట్టండి ఇంజినీరింగ్‌!

‣ అందరికంటే భిన్నంగా.. మరింత మెరుగ్గా!

‣ జోరుగా ఆన్‌లైన్‌ నియామకాలు

Posted Date : 14-12-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌