• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పక్కా సంసిద్ధత... ప్రేరణ!

సర్కారీ కొలువు సాధ్యం ఇలా

పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే అందరూ చదివే మెటీరియల్‌నే అనుసరిస్తే సరిపోదు. అలా మూసగా రాస్తే మార్కులు రావు. సొంత నోట్సును సిద్ధం చేసుకుని పరీక్ష రాస్తే ఆ సమాధానాలు ఇతరుల సమాధానాల కంటే భిన్నంగా ఉంటాయి. మెరుగైన మార్కులూ లభిస్తాయి. ఇంత ముఖ్యమైన నోట్సు రాసేటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం!

ఒకే విషయాన్ని పదే పదే సొంత నోట్సులో చదువుతారు కాబట్టి జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. పరిశోధనలు దీన్నే తెలియజేశాయి.

పదిసార్లు చదివే కంటే ఒకసారి రాయటం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి. నోట్సు రాసుకోవటం వల్ల ఈ ప్రయోజనమూ ఉంది. 

ఏకాగ్రత బాగా పెరుగుతుంది. 

డిస్క్రిప్టివ్‌ నిపుణతలు ఉన్న పరీక్షల్లో బాగా రాణించవచ్చు. 

పరీక్షకు పకడ్బందీ సంసిద్ధత ఏర్పడుతుంది. ప్రేరణ కూడా కొనసాగుతుంది. 

అనేక పుస్తకాలు చదువుతూ ఉంటే ఏర్పడే సందిగ్ధత తొలగుతుంది. 

బాగా తయారుచేసుకున్న సొంత నోట్సును చూసుకుంటే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

జాగ్రత్తలు

అనేక వనరుల నుంచి సమాచారం స్వీకరిస్తున్నప్పుడు ఏది సరైన వనరో నిర్ణయించుకున్న తర్వాతే దానిపై ఆధారపడి నోట్సు తయారు చేసుకోవాలి.

సూక్ష్మ నోట్స్‌ తయారు చేసుకునేటప్పుడు రాసుకునే సమీకరణాలు, కోట్స్‌ మొదలైనవి సరైన రీతిలో రాసుకోకపోతే వికటించే ప్రమాదం ఉంది. పరీక్షల సమయంలో ఇబ్బందులు పడతారు.

సొంత నోట్సు అయినప్పటికీ పాలిటీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎకానమీ మొదలైన సబ్జెక్టుల్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూవుండే విధానాన్ని అనుసరించాలి. లేకపోతే నోట్సు వల్ల వచ్చే ప్రయోజనాలు పూర్తిస్థాయిలో సమకూరని పరిస్థితి ఏర్పడుతుంది.

చాలామంది అభ్యర్థులు నోట్స్‌ తయారీకి అధిక సమయాన్ని కేటాయిస్తారు. పెంచుకోవలసిన అవగాహన, విశ్లేషణ విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అందువల్ల అసలుకే మోసం రావచ్చు.

నోట్స్‌ని ఏవిధంగా ఉపయోగించాలనే విషయంలో కొందరు తికమక పడతారు. అందుకే అవసరమైన పరిమాణంలో నోట్సు తయారు చేసుకోవాలి.

నోట్సు తయారు చేసుకున్నప్పటికీ దినపత్రికల్లో వచ్చే ఆర్టికల్స్‌ను కూడా ఒక ఫైల్‌లో పేర్చుకుని అవసరమైన సందర్భంలో చదువుకోవడం మేలైన నిర్ణయం. ఆర్టికల్స్‌లో ఉన్న సమాచారం మొత్తం ఎత్తి రాసుకోవాల్సిన అవసరం లేదు.

మొత్తం సమయ ప్రణాళికలో 20 శాతం సమయాన్ని సొంత నోట్సు తయారీకి కేటాయించాలి. మిగతా సమయాన్ని అవగాహన, విశ్లేషణ పెంచుకునేందుకు కేటాయించినప్పుడే సొంత నోట్సు ప్రయోజనం పూర్తిగా సిద్ధిస్తుంది.  

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విదేశీ భాషలు.. విశేష అవకాశాలు!

‣ జ్ఞాపకశక్తి మెరుగుకు కొన్ని ఆసనాలు

Posted Date : 24-11-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌