• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉద్వేగ ప్రజ్ఞ ఉందా మీకు?

కొంతమంది విద్యార్థులూ, ఉద్యోగులూ సహాధ్యాయులతో, సహచరులతో కలిసిమెలిసి పని చేయలేరు. ఇతరుల ఆలోచనలనూ, అభిప్రాయాలనూ అర్థం చేసుకోలేరు. అలాగే తమ అభిప్రాయాలను, నిర్ణయాలను స్వేచ్ఛగా వెల్లడించనూ లేరు. దీనంతటికీ కారణం వారికి ఉద్వేగ ప్రజ్ఞ లేకపోవడమే! 

కొన్ని నైపుణ్యాలను తరగతి గదిలో బోధించరు. అలాగని జీవితంలో వాటితో పనిలేదనుకుంటే పొరపాటే. విద్యార్థి దశలో, ఉద్యోగాన్వేషణలో, ఉద్యోగంలో స్థిరపడిన తర్వాతా వాటితో ఎంతో అవసరం ఉంటుంది. అలాంటి నైపుణ్యాల్లో ఒకటి... భావోద్వేగ ప్రజ్ఞ. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలన్నా, ఎదుటివారి ఆలోచనలను తెలుసుకుని సకాలంలో స్పందించాలన్నా ఈ నైపుణ్యం ఎంతో అవసరం. కొన్ని పద్ధతులను పాటించడం ద్వారా ఈ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు.

తొందరపాటు తగదు 

ఎదురవ్వబోయే పరిణామాల గురించి ముందుగా ఆలోచించకుండా ఆవేశపూరితంగా ప్రతిస్పందించకూడదు. తరగతిలోగానీ, ఉద్యోగం చేసేచోటగానీ మీకు ఇష్టంలేని ఘటన ఏదైనా జరిగినప్పుడు వెంటనే స్పందించకుండా కాస్త నిదానించాలి. ఇలా చేయడం వల్ల ఉద్వేగాన్ని నియంత్రించుకుని కార్యాచరణ ఆలోచించే అవకాశం కలుగుతుంది. వెంటనే స్పందించడం వల్ల ప్రయోజనం లేకపోగా ఫలితాలు ప్రతికూలంగా వచ్చే అవకాశం లేకపోలేదు.  

స్వీయ అవగాహన 

ఉద్వోగ ప్రజ్ఞను సాధించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. మీ భావోద్వేగాలను అర్థం చేసుకోవడంతోపాటు అవి ఇతరుల మీద ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకోవాలి. మీ బలాలు, బలహీనతల గురించి తెలుసుకోవడానికి స్వీయ అవగాహన ఎంతో తోడ్పడుతుంది. దీంతోపాటుగా మీ భావోద్వేగాలను మీరు అర్థంచేసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవడంతోపాటు ఏమైనా స్వీయ లోపాలుంటే సరిదిద్దుకోగలుగుతారు. స్వీయ అవగాహనతో నిర్ణయాలు తీసుకోవడంలోనూ పరిపక్వతను సాధించవచ్చు. పదేపదే పొరపాటు నిర్ణయాలు తీసుకోవడం, వాటి వల్ల ఇబ్బందిపడటం లాంటివి ఎక్కువగా జరగవు. 

నిస్సంకోచంగా.. స్వేచ్ఛగా  

ఆఫీసులో బృందంతో కలిసి పనిచేయాల్సి రావచ్చు. అలాంటప్పుడు మీ అభిప్రాయాలు, ఆలోచనలను ఎలాంటి సంకోచం లేకుండా స్వేచ్ఛగా వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఇతరులకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పాలంటే ఎలాంటి మొహమాటాలకు తావులేకుండా మీ అభిప్రాయాలను తెలియజేయడం ఎంతో అవసరం. అలాగే ఎదుటివారి సలహాలు, సూచనలు, అనుభవాలను శ్రద్ధగా వినాలి. వారు మాట్లాడుతున్నప్పుడు పదేపదే అంతరాయం కలిగించడం, అనవసరంగా ప్రశ్నించడం లాంటివి చేయకూడదు. ఆత్మవిశ్వాసంతో ఉంటూనే అవసరమైనప్పుడు సహానుభూతినీ ప్రదర్శించాలి. 

ప్రతికూల పరిస్థితుల్లోనూ.. 

మీరు పనిచేసే చోటా నిరంతరం మార్పులు జరుగుతూనే ఉంటాయి. కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు ఉన్న టెక్నాలజీ కొంతకాలం తర్వాత ఉండకపోవచ్చు. పనిచేసే విధానంలోనూ మార్పులు చోటుచేసుకోవచ్చు. ఇవన్నీ మీకు అనుకూలంగా ఉండాలని లేదు. అంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ సమర్థంగా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. తగినంత భావోద్వేగ ప్రజ్ఞ ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా సాధ్యమవుతుంది. ఈ నైపుణ్యం ఉన్నవాళ్లు అడ్డంకులను ఎదుర్కొని సానుకూల దృక్పథంతో సత్ఫలితాల కోసం ప్రయత్నిస్తారు. 

నియంత్రణ ఉండాల్సిందే

ప్రవర్తన అనేది సాధ్యమైనంత వరకు భావోద్వేగాల నియంత్రణ మీదే ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి ఒత్తిడి, చిరాకు, భయం, నిరాశానిస్పృహలు, విచారం లాంటి ప్రతికూల భావాలను ఉద్యోగాన్వేషణలో...ఉద్యోగ జీవితంలో ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇలాంటప్పుడు వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఏదైనా సంఘటన ఒత్తిడికి గురిచేసినా దాని నియంత్రణకు కృషిచేయాలి. చేయాల్సిన పనికి ప్రాధాన్యమిస్తూ అనుకూల ఫలితాలకు ప్రయత్నించాలి. 
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉచితంగా బీటెక్‌ నేవీలో ఉద్యోగం!

‣ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రతిష్ఠాత్మక కోర్సులు

‣ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష తుది సన్నద్ధత ఎలా?

‣ నచ్చని సబ్జెక్టుపై మక్కువ పెరగాలంటే?

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-02-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌