• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సమయం ఇలా సద్వినియోగం!

 

 

చదువులో అందరికంటే ముందు ఉండే విద్యార్థికీ.. అతికష్టం మీద పాస్‌ మార్కులు తెచ్చుకునే సగటు విద్యార్థికీ- ఇద్దరికీ ఉండేది ఇరవై నాలుగ్గంటల సమయమే. అందరికీ సమానంగా అందుబాటులో ఉన్న ఆ సమయంలోనే కొందరు సత్ఫలితాలు సాధిస్తున్నారు. మరికొందరు వ్యవధి సరిపోవడంలేదంటూ వాపోతున్నారు. సమయం తగినంత లేక సరిగా పరీక్షలకు సన్నద్ధం కాలేకపోతున్నామనేవారు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు!  

 

పఠనానికీ, సన్నద్ధతకూ, అసైన్‌మెంట్లకూ, ప్రాజెక్టులకూ .. దేనికైనా సరే.. ‘సమయం సరిపోవడం లేద’నే మాట చాలామంది విద్యార్థుల నోట వినిపిస్తూనే ఉంటుంది. అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కొన్ని పద్ధతులను పాటించాలంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దామా...

 

రాసుకోవడం ముఖ్యం

చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. కానీ వాటిని పూర్తిచేయడానికి తక్కువ సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ముందుగా చేయాల్సిన పనులను ఒకచోట రాసుకోవాలి. అంతేకాదు వాటిని ఫలానా సమయంలోగా పూర్తిచేయాలనే గడువునూ పెట్టుకోవాలి. గడువులోగా పనులన్నీ పూర్తిచేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాలి. దీంతో ఎలాంటి ఒత్తిడికీ గురికాకుండా అనుకున్న సమయంలోగా పనులను పూర్తిచేయగలుగుతారు.

 

విభజిస్తే మంచిది

ఇరవై పేజీల రిపోర్ట్‌ రాసి మర్నాడు తీసుకురమ్మని ప్రొఫెసర్‌ చెప్పారనుకోండి...ఎంతో భారంగా అనిపిస్తుంది. అదే ఒకపేజీ రాయమంటే భారం దిగినట్టుగా ఉంటుంది. అలాగే పెద్ద పుస్తకాన్ని చదవాల్సి వచ్చినప్పుడు ఒకేసారి కాకుండా దాన్ని అధ్యాయాలవారీగా విభజించుకోవాలి. రోజుకో అధ్యాయం చొప్పున అర్థంచేసుకుంటూ చదివితే ఫలితం ఉంటుంది.

 

చెక్‌లిస్టు ఉండాలి

తరగతులకు హాజరుకావడం, పాఠ్యాంశాలను చదివే ఒత్తిడిలో చేయాల్సిన ఇతర ముఖ్యమైన పనులను మర్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకే చెక్‌లిస్ట్‌ పెట్టుకుంటే మంచిది. పూర్తయిన పనులను ఎప్పటికప్పుడు టిక్‌ చేసుకుంటే భారం దిగినట్టుగా అనిపిస్తుంది. ఈ పని చేయాలి, ఆ పని చేయాలని మనసులోనే పదేపదే అనుకోవడం వల్ల గందరగోళంగా ఉంటుంది. చెక్‌లిస్టు ఉండటం వల్ల సాఫీగా పనులు పూర్తవుతాయి.

 

అవాంతరాలకు దూరంగా

విద్యార్థులకు సాధారణంగా వివిధ రకాల అవాంతరాలు వస్తూనే ఉంటాయి. వాటిని అధిగమిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో సమయాన్ని వృథాచేయకూడదు. చదువుకునే ప్రదేశంలో సెల్‌ఫోన్‌ లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఒక్కోసారి కుటుంబసభ్యుల సంభాషణలూ ఏకాగ్రతకు భంగం కలిగించవచ్చు. కాబట్టి వారి మాటలేవీ వినిపించకుండా నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి.

 

ఉదయాన్నే లేవడం

అలారం పెట్టుకుని ఉదయాన్నే లేవడాన్ని అలవాటు చేసుకోవాలి. మొదట్లో ఇది కాస్త ఇబ్బందిగానే అనిపించవచ్చుగానీ మెల్లగా అలవాటు అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ఎవరికి వారు తమకోసం కాస్త సమయాన్ని కేటాయించుకునే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో వ్యాయామం చేస్తే రోజంతా చురుగ్గా ఉండగలుగుతారు. ప్రశాంత వాతావరణంలో ఆటంకాలు లేకుండా చదువుకోవడానికీ అవకాశం ఉంటుంది. కొన్ని పాఠ్యాంశాలను ఎన్నిసార్లు చదివినా సరిగా గుర్తుండవు. అలాంటివాటిని ఈ సమయంలో చదివితే సులువుగా అర్థమవుతాయి.

 

ఒక్కసారే వద్దు

సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో అన్ని పనులనూ ఒకేసారి పెట్టుకోకూడదు. దీనివల్ల ఒత్తిడికి గురవుతారు. ఒక పని పూర్తయిన తర్వాత మరో పని మొదలుపెట్టొచ్చు. ఏకధాటిగా చదవకుండా మధ్యలో విరామం తీసుకోవడమూ అవసరమే. గంటసేపు చదివిన తర్వాత పావుగంటపాటు అటూఇటూ తిరగడం లేదా కాస్త విశ్రాంతి తీసుకోవడం లాంటివి చేయాలి. ఆ తర్వాత విసుగు లేకుండా చదవగలుగుతారు.

 

విశ్రాంతి తప్పు కాదు 

బాగా అలసిపోయినట్టుగా అనిపించినప్పుడు శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. ఆ సమయంలో దాని మాట విని విశ్రాంతి తీసుకోవాలి. నిద్రవల్ల సమయం వృథా అవుతుందని భావించకూడదు. తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల మర్నాడు రెట్టింపు ఉత్సాహంతో పనులు చేయగలుగుతారు. 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బ్లాక్‌ టెక్నాలజీలో కొలువుల చెయిన్‌!

‣ IISC: ఐఐఎస్సీలో టెక్నికల్‌ అసిస్టెంట్లు

‣ సివిల్స్‌... గ్రూప్స్‌ ఏది మీ టార్గెట్‌?

‣ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లకు సిద్ధమేనా?

 

 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-02-2022 .

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌