• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సొంతంగా నేర్చుకుంటున్నారా?

జీవితంలోనూ, ఉద్యోగంలోనూ మనకు అవసరమయ్యే నైపుణ్యాలు, విషయాలన్నీ కాలేజీలోనే నేర్పించరు. కొన్ని మనం సొంతంగా సాధన చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాటిని సరిగ్గా నేర్చుకోలేకపోతే చాలా నష్టపోతాం. అందుకే దేన్నయినా సరే సొంతంగా నేర్చుకునేటప్పుడు (సెల్ఫ్‌ లెర్నింగ్‌) కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు నిపుణులు.

ఆసక్తి

దేన్నయినా అభ్యసించేందుకు కుతూహలం తొలిమెట్టు. నేర్చుకోవడానికి చూపించే తపన మనల్ని పూర్తిగా ప్రేరేపిస్తుంది. అందుకే ఆ అంశం పట్ల ఆసక్తి పెంచుకోవాలి. మొత్తంగా ఆ విద్య ఒంటబట్టే వరకూ దాన్ని కొనసాగించగలగాలి. మధ్యలో విసుగ్గా అనిపించినా, వల్లకాదు అనిపించినా... వదిలేయకుండా చివరి వరకూ నేర్చుకునేలా మనకు మనమే ప్రేరణ పొందాలి.

ఎంపిక

నేర్చుకోవాల్సిన విషయానికి సంబంధించిన మెటీరియల్, రిసోర్స్‌లను పక్కాగా, నిర్ణీత సంఖ్యలో మాత్రమే ఎంచుకోవాలి, వాటినే అనుసరించాలి. కనిపించినదల్లా చదివితే ఏదీ పూర్తిగా రాదు. అలాగే ఏది పడితే అది చదివితే ఆ విషయం మనకు పనికిరావొచ్చు, రాకపోవచ్చు, అందులో తప్పులూ ఉండవచ్చు. అందువల్ల నాణ్యమైన మెటీరియల్‌ ఎంపికకు ప్రాధాన్యం ఇవ్వాలి.

లక్ష్యాలు

నేర్చుకునే ప్రక్రియలో వీలైనంత చిన్న చిన్న లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించడం ద్వారా మొత్తం పనిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతాం. లక్ష్యసాధన ఇచ్చే ఆత్మవిశ్వాసంతో మరింత ఉత్సాహంగా నేర్చుకోగలుగుతాం. లక్ష్యం లేని ప్రయత్నం అంతగా ఫలితాలనివ్వదు. అందుకే ఏదో గాల్లో చదివేయకుండా ఒక టార్గెట్‌ అంటూ నిర్దేశించుకుని దాన్ని అందుకునేందుకు ప్రయత్నించాలి.

వినియోగం 

మనం దేన్నయినా ఎంత వరకూ నేర్చుకున్నామో తెలుసుకోవాలంటే ముఖ్యంగా చేయాల్సిన పని దాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించడం. ఉదాహరణకు మీరు టాబ్లూ సాఫ్ట్‌వేర్‌ గురించే నేర్చుకుంటున్నారు అనుకుందాం.. కొంత వరకూ వచ్చాక దాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తేనే మీకు ఏం తెలుసు, ఎంతవరకూ తెలుసనే విషయాన్ని అంచనా వేయొచ్చు. ఎక్కడ వెనుకబడ్డారో తెలుసుకుని తప్పులు సరిదిద్దుకోవచ్చు. ఏ నైపుణ్యానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.

ప్రణాళిక 

‘సమయం ఉన్నప్పుడు చేద్దాంలే’ అన్న భావన వాయిదాకు దారితీస్తుంది. స్థిరమైన ప్రణాళికతో ముందుకెళ్లినప్పుడే నేర్చుకునే ప్రక్రియ ప్రభావవంతంగా మారుతుంది. పక్కాగా టైంటేబుల్‌ వేసుకోవడం, దాన్ని అంతే కచ్చితంగా అమలు చేయడం సెల్ఫ్‌ లెర్నింగ్‌లో చాలా కీలకం.

బృందం 

మీలాగే నేర్చుకోవాలి అనుకుంటున్న వారితో బృందంగా ఏర్పడవచ్చు. అందరూ కలిసి సాధన చేయడం ద్వారా ఒకరి పొరపాట్ల నుంచి మరొకరు పాఠాలు నేర్చుకోవచ్చు. ఆన్‌లైన్‌ లెర్నింగ్‌లో అయితే కమ్యూనిటీలుగా ఏర్పడి ఒకరికి ఒకరు సహాయపడటం ద్వారా అధిక ప్రయోజనాలు పొందవచ్చు.
 

Posted Date : 18-01-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.